ప్రత్యేకం

పసుపులేటి మల్లిఖార్జున గారి పక్షులు

డిసెంబర్ 2013

దోవెమ్మట తలవంచుకొని పోతూ ఉంటే, ఎప్పుడో తప్పి పోయిన చిన్ననాటి చెలిమి అదాటుగా వచ్చి చేయి పట్టుకొంటే?! కళ్ళెత్తి చూసిన చూపులో ఎలాంటి విస్మయం గోచరిస్తుందో, అలాంటిదేదో నాలోనూ కనబడి ఉండాలి…. ఈ పుస్తకం దొరకగానే. పసుపులేటి మల్లిఖార్జునరావు గారు రచించిన “పక్షులు” నవల నేను మొదట ఎప్పుడు చదివానో గుర్తుకు రావటం లేదు. ఎన్ని సార్లు చదివానో కూడా గుర్తుకు రావటం లేదు. మా చిన్నప్పుడు ఆంధ్ర జ్యోతిలో నవలా ప్రియదర్శిని పేరు మీద సీరియళ్ళు వచ్చేవి. అవి చించి బైండింగ్ చేయించుకొనే వాళ్ళం. అలా ఈ పుస్తకాన్ని నా ఆరో తరగతిలో మొదట చదివినట్లు గుర్తు.

నా ఊహ వికసించినప్పటి నుండి ఈ కధ నాతోనే ఉంది. ఒక్కో దశలో ఈ పుస్తకంలోని ఒక్కో సంగతి నన్ను ఆలోచింపచేసేది. కధలోని ఒక్కో జీవితం వ్యాకుల పరిచేది. వదలక వెంట ఉండే ఒక నీడలాగా …  బతుకు నిలువునా ఈ కధ నన్ను వెంబడించింది. ఇంతా చేస్తే ఇది నూట అరవై పేజీల చిన్న పుస్తకం.

తెలంగాణాలోని  ఒక పల్లెలో ఈ కధ సాగుతుంది. 1976లో ఈ నవల ప్రచురితం అయింది. నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ఎమర్జెన్సీ కాలం అది. కధా స్థలం ఖమ్మంకి ఆరేడు మైళ్ళ దూరంలో మున్నేరు వడ్డున ఉండే గ్రామం. ఊర్లో సీయార్పి పోలీసులు గుడారాలు వేసుకొని ప్రజలను పీడిస్తుంటారు. అయితే రచయిత ఒక  పాతికేళ్ళ వెనక్కి వెళ్ళి కధ మొదలు పెడతాడు. తెలంగాణా సాయుధ పోరాటం ముగిసిన దశలో అసలు కధ ప్రారంభం అవుతుంది. రజాకార్ల  ఆగడాలు కూడా సమాప్తం అయ్యి…  ఆ ఆనవాళ్ళు మోస్తున్నపల్లె అది. జమిందారి వ్యవస్థ, గడీలు నశిస్తూ కొత్త ఆధిపత్య శక్తులు ఊపిరి పోసుకొంటున్నసంది కాలమది.

గ్రామం లోని నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల ఆట పాటల ఆనందానికి శివయ్య మాష్టారు బడి ప్రారంభించి ఆటంకం కలిగిస్తారు. ఆ ఊళ్ళో ఆ బడి రావటానికి కారకురాలైన జమీందారు కూతురు ఇంద్రాణితో ఈ పిల్లల స్నేహం ప్రారంభం అవుతుంది. ఇంద్రాణి దగ్గర ఎప్పుడూ ఉండే బొమ్మలు, పిప్పరమెంట్లు ఈ పిల్లల ఆకర్షణ అయితే…. తనకు దొరకని వారి స్వేచ్చా జీవితం, తుంటరి పనులు, ప్రకృతితో  వారి స్నేహం ఇంద్రాణికి అపురూపంగా ఉంటాయి.

ఇంద్రాణి పాత్ర పంజరంలో ఉండే మనిషిలోని స్వేచ్చా ప్రియత్వానికి ప్రతీకగా ఉంటుంది. రెక్కలు విప్పుకొని ఎగరాలని, కనుచూపు మేర విస్తరించిన మైదానాల్లో కాలికొద్ది పరిగెత్తాలనే కోరిక ప్రతి మనిషి అంతరంతరాల్లో నిక్షేపం అయి ఉంటుంది. ఆ బాల్య పిపాసను మనిషి ఎంత కాలం తనలో నిలుపుకోగలిగితే అంత సజీవంగా మనుగడ సాగించగలడు. అయితే ఈ సహజానుభూతులు నియంత్రించబడి … కృత్రిమ నియమాల, విలువల చట్రంలో ఇంద్రాణి తన బాల్యాన్నే కోల్పోతుంది. తన జమీందారీ కుటుంబం అందిచగలిగిన భోగభాగ్యాలు, సకల సౌకర్యాలు ఆమెను ఆనందపెట్టలేక పోతాయి. వాళ్ళ నాన్న అంటే భయపడే స్నేహితుల పిరికితనాన్ని అసహ్యించుకొంటుంది. ఆ పరిధి దాటి బయటకు రావాలనే చిన్ననాటి ప్రయత్నంలో తన స్నేహితులు బాధితులు అవటం గమనించి మౌనంగా, నిర్లిప్తంగా మిగిలిపోతుంది కానీ, మళ్ళీ ఛేదించాలనే ప్రయత్నం చేయదు. జమీందారీ వ్యవస్థకుండే నిర్ధయకత్వానికి, కర్కశ కాఠిన్యానికి తలవొగ్గుతుంది. దొరల హోదాకు చిహ్నంగా మిగిలిపోయిన శిధిలమైన గడీ లాగానే ఇంద్రాణి తన శరీరాన్ని, మనసుని ధ్వంసం చేసుకొని అక్కడే మరణిస్తుంది.

పిల్లల స్నేహం ప్రాతిపదికగా ఆషామాషీగా మొదలైనట్లుండే కధ … ఆ పిల్లల బ్రతుకుల్లోనే … ఆ నాటి రాజకీయ సామాజిక చిత్రాన్ని విపులీకరిస్తుంది. రజాకార్ల చేతిలో తండ్రి హతుడు కాగా, వారిచే మానభంగానికి గురైన లత అమ్మ ఈ కధలో మేలైన పాత్ర.  ఆమెను ఊరు ఆదరించి హత్తుకొన్న వైనం … ఆనాటి వారి సామాజిక కష్టానికి ప్రజల సామూహిక తోడ్పాటుని సూచిస్తుంది. ఏమి చదువుకోక పోయినా … కూతురు  తన కాళ్ళ మీద తను నిలబడటానికి శ్రమిస్తుంది  ఆమె. తను ఆశించిన ఎత్తుకు లత చేరుకొనే కాలానికి ఆమె కనుమరుగు అవుతుంది.

బాల్యవివాహం, పందొమ్మిది ఏళ్ళకే ఇద్దరు బిడ్డల తల్లిగా వైధవ్యం … యశులాంటి బాలికలు ఆ నాటి సమాజానికి కొత్త కాదు. అప్పటి దురాచారాల ఉనికికి గుర్తుగా ఈ స్త్రీల నీడలు తరువాత కొంత  కాలం పాటు చాలా ఇళ్ళల్లో విస్తరించి ఉండి కాల క్రమేణా అదృశ్యం అయ్యాయి. చేతివృత్తులకు ఆదరణ లేక సామూహిక ఆత్మహత్య చేసుకొన్న సారె రామయ్యలాంటి  కుటుంబాలు ఇప్పుడు మన చుట్టూ పుట్టగొడుగుల్లాగా పెరిగి దెయ్యాల్లాగా భయపెడుతున్నాయి. అయితే ఈ కధ రచయితలాంటి సున్నిత మనస్కులు కరువైన ఈ కాలంలో… ఈ మరణాలు ప్రభుత్వ లెక్కల్లో స్థానం సంపాదించుకోవటానికి … చచ్చిపోయిన తరువాత కూడా, పోరాటం చేస్తున్నాయి. ఆకలి చావులు, రైతులు ఆత్మ హత్యలు  సానుభూతి స్పర్శను కోల్పోయి చాలా రోజులే అయ్యింది.

శ్మశానానికి వెళ్ళి బూడిద తీసుకొని రావాలనే పిల్లల సవాలును స్వీకరించి, దడుపు జ్వరంతో చనిపోయిన సత్యంను రచయిత కధ చివరి దాకా మర్చిపోడు. మనల్ని ఎప్పటికీ మర్చిపోనివ్వడు. గ్రామ కక్షలకు బలై పోయిన కుటుంబంతో బాటు ఊరు విడిచి వెళ్ళి పోయిన విస్సు మళ్ళీ ఎక్కడో తమకు తారసపడతాడేమోనని మురళి, ప్రసాద్  ఎదురుచూస్తూనే ఉంటారు. అప్పటి దాకా తమతో ఆడీ పాడిన నేస్తాల అగస్మాత్తు కనుమరుగు వారికి కలిగించిన బెంగ, దుఃఖం …. చిన్ననాటి మైత్రిని కోల్పోయిన ప్రతి ఒక్కరు అనుభూతి చెందుతారు.

శివయ్య మాస్టారు ఈ నవలలో కధా నాయకుడని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయ విద్యార్ధికి ఉండే సంబంధాన్ని యాంత్రికంగా కాక జీవితకాల అనుబంధంగా మార్చిన పంతుళ్ళు గతంలో అన్ని దగ్గర్లా ఉండే వాళ్ళు. కేవలం ‘మాష్టారు’ని, ‘టీచర్’ గారిని చూడాలని సొంత ఊరికి వెళ్ళే వాళ్ళను నేనేరుగుదును. శివయ్య మాష్టారు ఈ గౌరవానికి ఇంకొన్ని మెట్టు ఎక్కువ అర్హులు. చదువుని ఉపాధికి వనరుగా గుర్తించి…  గ్రామాలలోని అల్లరి చిల్లరి పిల్లలను ఏరి… బడులకు లాగి…. పరిశ్రమకు వంచి … మనసా వాచా కర్మణా ఉపాధ్యాయులుగా పూర్తి కాలం జీవితాన్ని వెచ్చించిన ఇలాంటి అయ్యవార్లు అక్కడక్కడ కనిపిస్తారు. స్వాతంత్రం వచ్చాక దేశ పునర్నిమాణం కోసం శ్రమించిన మేధావులలో ఈ పంతుళ్ళకే మొదటి స్థానం ఇవ్వాలి. కుటుంబాన్నికూడా పూర్తిగా వృత్తికి అనుసంధించి, చదువుల వాసన తెలియని కుటుంబాల నుండి వచ్చిన మురళి లాంటి పిల్లలకు పితృ మమకారాన్ని కూడా పంచుతాడు. పిల్లల చదువు కోసం ఆయన వేసిన కాలిబాటలు వారిని మెరుగైన జీవితం వైపు నడిపిస్తాయి. తన సిగెరెట్టు అలవాటు పిల్లల్ని తప్పు దారి పట్టిస్తుందని కష్టపడి మానేస్తాడు. ఉద్యోగం ఇప్పించిన దొర బిడ్డ ఇందు చదువు కోసం, భవిష్యత్తు కోసం దొర దగ్గర ఎంత గోజారుతాడో …. ఆ గ్రామం నుండి మొదటి సారిగా బయటికి చదువులకు వెళ్ళిన పేద ఆడపిల్ల లత గురించి చివరికంటా అంతే ఆరాట పడతాడు.

చల్లారి పోయిన తెలంగాణా పోరాటానికి ప్రతినిధిగా గురవయ్య కనిపిస్తాడు ఈ కధలో. సాయుధ పోరాటంలో పొరపాటున కాలు పోగొట్టుకొని మున్నేటి వడ్డున మిగిలి పోయిన గురవయ్యకు భవిష్యత్తు మీద అచంచలమైన నమ్మకం. ఇతడు సమసమాజ స్వాప్నికుడు. నిన్నటి కంటే ఈ రోజు, ఈ రోజు కంటే రేపు బాగుంటుందన్న ఆశావాదం. రోజూ ఏటి గట్టుకు స్నానానికి వచ్చి… తనకు వేపపుల్ల తుంచి ఇచ్చే పిల్లలకు తెలంగాణా పోరాట విలువలను చెబుతాడు. చదువు మనిషి కి వెలుగు చూపిస్తుందని వాళ్ళ వెన్ను నిమురుతాడు. పై చదువులకు ఖమ్మంకు పంపటానికి మురళి తల్లి తండ్రులు వెనకాడితే లత వాళ్ళ అమ్మ దగ్గర బుద్ది తెచ్చుకోమని గడ్డి పెడతాడు.

పిల్లలు బుద్ధి, జ్ఞానం, ప్రవర్తన, పరిశీలన శివయ్య మాష్టారు, గురవయ్యల దగ్గర నేర్చుకొంటే  …. ప్రకృతితో సంబంధం నెరపటం ఎంకడు నేర్పుతాడు. పాఠాలలో ఉండే విషయానికి , భూమి మీద ఉన్న నిజానికి నిలువెత్తు వ్యత్యాసం ఎంకడిగా కనిపిస్తుంది వాళ్ళకు. బెత్తెడు గోచి గుడ్డ తప్ప ఇంకేమి లేని ఎంకడికి … ఆకలికి, ఆవాసానికి ప్రకృతే ఆధరువు. జానెడు పొట్ట నింపుకోవటం కోసం వాడి నిరంతర వెదుకులాట … లేత రెక్కలను పెట్టుబడిగా పెట్టి చేసే వాడి కష్టం… ఎన్నో ప్రశ్నలను వాళ్ళలో రేపుతాయి. వాడి ఆకలికి పాపం, పుణ్యం తెలియవు. కార్తీక దీపాల్లో నూనె, బతకమ్మ లలో రాగి డబ్బులు వాడు సునాయసనంగా కొల్లగొట్టగలడు. వాడి ఆకలికి భయం ఉండదు. కాకులను వెళ్ళగొట్టి తర్పణాలను మహానందంగా తినగలడు. పీతలు, ఎండ్రకాయలు, దుంపల కోసం ఏటి వడ్డున వాడు తవ్విన గుంటలు కడుపాకలి తీరటానికి వాడు వేసికొన్న అచ్చులు. ఆ ఎంకడు బతుకు పోరాటంలో ఓడిపోయి ఆకలి చావు పాలవుతాడు.  కాగితాల్లో, చట్టాల్లో పరిమితం అయిన అభివృద్ధి … అంటుకు పోయిన వాడి పొట్టదాకా చేరక ముందే ఆకలి దెయ్యం వాడిని మింగేస్తుంది.

పౌరోహిత్య కుటుంబంలో పుట్టిన ప్రసాద్ నన్ను అప్పటికీ ఇప్పటికీ ఎక్కువ ఆకర్షించిన పాత్ర. రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే ప్రసాదు చివరికి నక్సలైట్ గా మారతాడు. మురళి, ప్రసాదులను ఒకే లాంటి సామాజిక, ఆర్ధిక వాతావరణం స్పృశించినా దానికి వాళ్ళు ప్రభావితం అయిన తీరు భిన్నంగా ఉంటుంది. మురళి జరుగుతున్నపరిణామాల్ని, మారుతున్న పరిస్థితుల్ని ఒక ప్రేక్షకుడిలాగా గమనిస్తూ విశ్లేషిస్తూ వెళతాడు. అవే పరిణామాలు, పరిస్థితులు ప్రసాదును వేరే సాంద్రతతో  తాకి, ఇంకో రకంగా ప్రేరేపిస్తాయి. ఒక జీవితకాలంలో ఉప్పెనలా వచ్చిన మార్పులను మురళి తట్టుకొని  పెనుమానుగా నిలబడిపోతే, ప్రసాదు కదిలిపోయి కారణాలు వెదుకుతాడు. సమాజం గురించి చెప్పని … గుమాస్తాలను తయారు చేసే చదువుల అవసరాన్ని ప్రశ్నిస్తాడు. ఎంకడి ఆకలి చావు ఇద్దర్నీకుదిపి వేసినా …  ప్రసాదులో రగిలిన కసి అతన్ని ఆయుధం వైపు మరలిస్తుంది. మనుషుల ఇడుములకు, అంతరాలకు వేర్లు వెదుకుతూ వెళతాడు.

విభిన్న వ్యక్తుల మధ్య స్నేహం ప్రాతిపదికగా ఏర్పడ్డ అనుబంధాలు ఈ కధకు ఇంధనాలు. పిల్లల మధ్యనే కాకుండా … గురవయ్య, ఎంకడి మధ్య … లతా వాళ్ళమ్మ, పిల్లల మధ్య … శివయ్య మాష్టారు, ఇందు మధ్య … మానవీయ సువాసనలతో కూడిన  గొప్ప సంబంధాలను స్థాపిస్తాడు రచయిత. ఈ బంధాలు అత్యంత సహజంగా ఉంటాయి. తల్లితండ్రులు కూడా పట్టించుకోని ఎంకడి శవానికి మురళి, ప్రసాద్ దగ్గరుండి అంత్య క్రియలు జరుపటం … వైభవంగా బతికి అనాధలా చనిపోయిన ఇందుకి మురళి తల కొరివి పెట్టటం ఈ బంధాలకు పరాకాష్ట.

ఆరడుగుల అందగాళ్ళు, పడవలాంటి కార్లు సాహిత్యాన్ని ఏలుతున్న డెబ్బై ప్రాంతంలో ఆనాటి సమాజాన్ని ప్రతిబింబించిన గొప్ప సాహిత్యం కూడా వచ్చింది. ఈ నవల తెలంగాణ పల్లెల్లో అప్పటి చారిత్రిక పరిస్థితులను ప్రక్షిప్తం చేసింది. స్వతంత్రం వచ్చిన తరువాత పల్లె జీవితం గురైన ఒడుదుడుకులను చర్చిస్తుంది. ఈ కధ ఎన్నికల పేరుతో ప్రచారానికి వచ్చిన ప్రజాస్వామ్యం డొల్లతనాన్ని ఒక బాల్యపు విభ్రాంతితో పరికిస్తుంది. జమిందారీ ప్రతిష్ట, పరదా పేరుతో సాంప్రదాయ సంకెళ్ళ ఉచ్చులో బిగించి ఊపిరి ఆడనివ్వక చంపేసిన స్త్రీ బతుకును మన ముందు పరుస్తుంది. ఇప్పుడు చదువుతుంటే … ఈ నవల వచ్చి నలభై సంవత్సరాలు అవుతున్నా తెలంగాణా పల్లెల్లోని ప్రజల జీవితాల్లో మౌలికంగా వచ్చిన మార్పు ఏమిటి అనే ప్రశ్నార్ధకాన్ని మన ముందుకు పంపి  ఈ కధ మౌనంగా నిల్చున్నట్లనిపించింది.

పట్టించుకొనే వాళ్ళు లేక  మరుగున పడిన ఇలాంటి ఆణి ముత్యాలను వెలికి తీసి పాఠకులకు అందించాల్సి ఉంది.

*** * ***

పక్షులు – పసుపులేటి మల్లిఖార్జున గారి నవల: