కవిత్వం

నేనంటే హార్మోనులే!

31-మే-2013

కన్నె మేరి కన్నప్పుడు
కానుకలు పట్టుకొని దైవదూతలు వచ్చారట.
పదమూడేళ్ళకే నా ఆటపాటలు బందు
చేయించిన అమ్మ చెప్పలేదు
ఇంతి చేమంతులు
మగువతనాన్ని మోసుకొచ్చి
నాలో ప్రతిష్టించాయని.
నాటి నుండి నేటి వరకు
కాలచక్రంతో కాపలా కాస్తున్నాయి నాకవి.
కొన్నిసార్లు అలలు లేని నదులలాగా
నాతో సరాగాలాడుతాయి
ఇంకొన్నిసార్లు నడి సంద్రంలో
తెగిపడిన నౌక రెక్కలాగా
అతలాకుతులం చేస్తాయి
నెల మధ్యలో విజృంభించి
నెలసరితో శాంతించే ప్రళయ గోదావరులవి
నా దేహదాహాన్ని, కడుపాకలిని
కనుసన్నలలో ఆడించే మంత్ర గత్తెలవి
వంటి బరువును, చెంప నునుపును
నియంత్రించే మేటి వైద్యురాళ్ళవి.
కంటి మెరుపును, కురుల నలుపును
ప్రజ్వలించే చందమామలవి.
తనువంతా మరులు ఉసికొల్పే
పున్నాగ పూలవి.
నిష్పత్తులు మార్చుకొంటూ
నిలువెల్లా అశాంతి నింపి
వికటాట్టహాసం చేసే కంతిరీ కన్నెలవి.
నా భావోగ్వేదాలను బానిసలు చేసుకొన్న
కర్కశ యజమానులవి.
బతుకంతా భయోత్పాదకం సృష్టించినా
అమ్మతనాన్ని నాకు కమ్మగా అందించి
ముందు బతుకు పండగ చేసుకోమంటున్నాయి.