కవిత్వం

Noem అను ఒక కథ

జూన్ 2017

1

వాళ్లకు నేనేమీ తేను. బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే ఆకుల మాటున దాగిన పూవుల్లా తటాలున బయటపడి పకాలున నవ్వుతారు. ఆపై చుట్టూ చేరి అల్లుకుంటారు. ఈలోగా ఇంటి ముందు చీకటి తెరలు వాలుతాయి. వాళ్ళ కళ్ళల్లో వెన్నెల్లు వెలుగుతాయి. వెన్నెల్లో వాన జల్లులలో సీతాకోకచిలుకలు ఎగురుతాయి. రెక్కలపై నక్షత్రాలతో పూల పుప్పొడితో ఒక చల్లటి గాలి వీయగా నిదుర అంటిన వాళ్ళ కళ్ళల్లో కథలు మొలుస్తాయి. నేను వాళ్లకు పెద్దగా కథలు ఏమీ చెప్పను. బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే ఇదిగో ఇటువంటి ఒక గాథను వింటారు అల్లుకుపోయి.

2

కనీళ్ళు నెమ్మదిగా మీలా రూపు దిద్దుకుంటున్న సమయంలో, వేడిమి తెరలు కదిలే వేళల్లో, ఒక మానవుడు నిస్సహాయుడై ఈ లోకంలోకీ ఈ కాలంలోకీ విసిరివేయబడ్డాడు. మరప్పుడు అతనికి వయస్సు లేదు, చూపు లేదు. లోకమర్మం, ద్రోహం, బ్రతకనేర్చినతనమూ లేవు. మరి ఏమిటంటే ఆ కాలమంతా డబ్బులేని రాక్షసత్వం. తిండి లేక, ఫ్యాక్టరీలో వడ్లకింద కూరుకుపోయి చనిపోయినంత వింత అతని లోకం. అతని శాపం. తల్లిని అట్లా చూస్తుండ లేకా తండ్రికి చెప్పాలేకా తనకు తాను విడమర్చుకోలేకా, మధుశాలలలోకో స్త్రీలలోకో వెక్కివెక్కి ఏడ్చుకుంటూ, శరీరాన్ని కోసుకుంటూ సాగిన ఒక గతం. స్నేహితుల వద్దా, శత్రువుల వద్దా ఇంత ఎంగిలి పడేందుకు, నానా మాటలు విన్న అగత్యం. ఏమీ లేని తనం. ఇన్ని పదాలని పోగేసుకుని, రాత్రికి ఇంత మంటను రాజేసుకుని, నిప్పులో నుదుటినీ అరచేతులనీ వెచ్చబెట్టుకుంటూ రేపటి దాకా ఎలాగోలాగా బ్రతికిన వైనం. మరి ఇంతా చేస్తే, ఇన్ని యుగాల ఘర్షణ తరువాత కూడా ఇంటికి వెళ్ళలేని ఒక దైన్యం. తండ్రి చనిపోతే, తన ఇంటికి తల్లిని తెచ్చుకుంటే తన భార్య నానా యాగీ చేసి తల్లిని వెళ్లగొట్టే సందర్భం. స్నేహితులే అపరిచితులై ముష్టిఘాతాలై మీద పడి తరిమి తరిమి కొడితే ఇక ఎక్కడి వెళ్ళాలో తెలియక, బ్రతికి ఉండాలో వద్దో అర్థం కాక, మరి చచ్చిపోవడమెలాగో తెలియని గడ్డు కాలం. “అన్నా ఏమిటిది” అని అంటే, “అన్నా నేనూ నీ వలెనేనే” అని చెప్పి, అరచేతుల్లో కనుగుడ్లను చితక కొట్టుకుని విలవిలలాడిన అప్పటి, ఇప్పటి – కరకు కాలమూ, లోకమూ. మరి ఇటువంటి కథను ఇంతకు ముందు చెప్పానా మీకు ఎన్నడైనా?

3

బయట చిక్కగా చీకటి మెల్లగా గాలితో కలిసి రాత్రిని అల్లుతుంటే, మరి పిల్లలు … వాళ్ళే … నేనేదైనా తెస్తానేమోనని ఆశించని పిల్లలు గుండెలపై నిదురోతారు. భుజం తల ఆన్చి మరి నా భార్యేమో ఉగ్గపట్టుకుని కూర్చుంటుంది. గదిలో, ఎక్కడో సాలెపురుగు గూడు అల్లుతున్న నిశబ్దం. మెత్తగా మంచుపొర ఒకటి అద్దంపై పరచుకుంటున్న లేత సవ్వడి. మరి అద్దం సన్నగా చిట్లి పగలవచ్చు, ఏ ఈగోసాలెగూటిలో ఇరుక్కోనూ వచ్చు. గిలేరీలతో కొంతమంది, మరి నువ్వు ప్రేమించే పావురాళ్ళని రాళ్ళతో కొట్టి రాల్చి చంపి తినేందుకు తీసుకువెళ్లనూ వచ్చు. ఏమీ చేయలేక నువ్వు అలా చూస్తూ ఉండిపోనూ వచ్చు.”నిజమేనా అది? నువ్వు చెప్పిన ఆ కథ? అది, నిజంగా నిజమేనా?” అని నా స్త్రీ అడుగుతుంది. నేను నా చేతిని, నిదురలోకి జారి కలవరిస్తున్న పిల్లలవైపు చూపిస్తాను. ఎలా అంటే, నదిని చూపించమని అడిగిన వాళ్లకి నావని చూపించినట్టు. ఇక ఆ తరువాత నాకు తెలియదు, తనకూ తెలియదు. ఎవరి గుండెపై ఎవరు తల ఆన్చి ఎలా నిదురపోయారో, మరి తొలిసారిగా ఆ రాత్రి నిదురలోకి తలారులు రాకుండా, తోటలూ కాకుండా గాఢమైన పొగమంచు ఒకటి మమ్మల్ని ఎలా కమ్మి వేసిందో, తిరిగి మేము ఎప్పటికైనా నిదుర లేచామో లేదో, ఇది నిదురలో జరిగిందో లేక మెలకువలోనో, మరిక ఎప్పటికీ ఎవరికీ తెలియలేదు.

4

తెలియదా మీకు, కొన్నిసార్లు, చాలా చాలాసార్లు పిల్లలే మనలని ఓదారుస్తారనీ, లోపల వెక్కి వెక్కి ఏడ్చి, మనమే వాళ్ళ ఒడిలో దైన్యంగా నిదురోతే, మన తలలపై చేయుంచి, వాళ్ళే అనునయంగా నిమురుతూ ధైర్యం చెబుతారనీ, ఓ చిరునవ్వుతో దీవిస్తారనీ? గాలి తాకి దిశ మారిన ఒక వర్షం, అటుపై గదిలో నిండుగా కురిసింది. వెలిసింది. పచ్చి ఆకుల వాసనా, రాలిన పుల్లలు విరుగుతున్న ఒక మెత్తడి సవ్వడీ అక్కడ. మట్టి పొరల్లోంచి బయటకి వచ్చి తిరిగి లోపలకి వెళ్ళిపోతున్న వానపాములు పిల్లల కనురెప్పలపైన. కొంత మబ్బులు తెరపి ఇచ్చిన కాంతి సంగీతం అతని ముఖంపైన. కురులు అలలు అలలుగా వాళ్ళ ముఖాలపై నుంచి అలల్లా తేలిపోయి, పరదా ఏదో తొలిగి చంద్రబింబాలు బయటపడ్డట్టు ఆ వదనాలని నెమ్మదిగా వేళ్ళ చివర్లతో తాకుతూ అతను అంటాడు: “బ్రతకాలని ఉంది నాకు”.

5

“నాలిక గీసుకున్నట్టు అప్పుడప్పుడూ మనస్సునూ, మనుషులనూ గీక్కోవడం మంచిది. ఈ మనుష్యులు, స్వతహాగా వీళ్ళు వేటగాళ్ళు, హింసక్రీడా వినోదులు. ఏమీ చేయకు, వాళ్ళలో కలవకు. నెత్తురు రుచి మరగకు. ఏమీ లేకపోయినా, నీకు ఏమీ దొరకకపోయినా రా ఈ గోడల మధ్యకు. ఈ గోడలతో ఈ నీడలతో మన బొమికలతో మన నెత్తురుతో మన పిల్లలతో ఒక ఇల్లుని నిర్మించుకుందాం. మరి కొద్దికాలం బ్రతుకుదాం ప్రేమ కోసం కాదు కానీ, నాకోసం నువ్వూ, నీ కోసం నేనూ మన కోసం మనం బ్రతికి ఉందాం. ఊరుకో, అన్నం తింటావా?”

సరిగ్గా అప్పుడు, బయట ఒరిగి ఉన్న ఆ రాళ్ళల్లో నీరు ఊరింది. పాత్రలలాంటి రాళ్ళలోంచి నీళ్ళు త్రాగడమెలాగో తెలిసింది. తాకీ తాకక, ముళ్ళ మధ్య చిక్కుముడులు కాకుండా పూవులా ఉండటమెలాగో అతనికి తెలిసినట్టయ్యింది. ఇళ్ళు విడిచి వెళ్ళక, ఇతరులని వొదిలివేయక, అన్నిటి, అందరి సమక్షంలోనే ఉంటూ నడిచే మరో మార్గమేదో అతనికి తోచింది. తొలిసారిగా తన చేతిని అందుకుని, తనే తాను అని తెలిసి బ్రతుకులో తెరిపి పడటమెలాగో గోచరించింది. జీవితం అరచేతిలో అరచేయి అనీ, అశ్రువుని పెనవేసుకునే మరో అశ్రువు అనీ, ఇతరమే తాను అనీ తానే ఇతరమనీ, ఒకటి లేక మరొకటి మనలేదనీ స్పష్టమయ్యింది. ఏదో ఒక శాంతి వంటిది కూడా తాకింది.

“ఇక నెమ్మదిగా లేచి, కూడపెట్టుకున్న నెత్తురుతో కొన్ని పదాలను వ్రాయి. ఏమీ ఆశించని పదాలని వ్రాయి. ఏమీ ఆశించకుండా వ్రాయి. ఆపై, నీలో ఒక దీపం వెలుగుతుంది, మసి అంటినా దానితో మరో దీపం ఎలా వెలిగించవచ్చో నీకు అర్థం అవుతుంది” అని తను అంటే అతను మీకు ఇలా ఈ కథ ఒకటి చెబుతున్నాడు, కళ్ళల్లో మిమ్మల్ని ఒత్తులుగా చేసుకొని, మీలోనే ఎక్కడో ఒక చోట కూర్చుని. ఇక అంతా విని, ఇదంతా చదివి “అతను ఎవరు?” “ఇదంతా నిజమేనా?” “అది సాధ్యమేనా?” లాంటి ప్రశ్నలు మాత్రం అడగకండి – మరి ఎందుకంటే…

మీ వెనుక, మీ వెనుక నుంచి వచ్చి మీ కళ్ళను కప్పి మిమ్ములని అబ్బురానికి గురి చేసే పసి చేతులు వేచి చూస్తున్నాయి. మీలోనే, మీకు మరోవైపున. మీ కలలకు మరో అంచున, మీ పొత్తిళ్ళలోన. మరి ఎందుకు నవ్వకూడదు మీరు, హాయిగా కాసేపు?

***

Painting: Untitled Corrida- Elaine de Kooning