ఎక్కడో చీకట్లో ముడుచుకుని ఉంటావు నువ్వు దుప్పట్ల కింద
నుదిటిలో దిగే గాజు ముక్కలతో: బాహువులంత భయం, ఎడారులంత దాహం
అప్పుడు నీకు-
చిన్న సవ్వడులే మృత్యు శబ్ధాలు అయ్యే వేళ అది.
గజిబిజిగా రూపాలు కళ్ళ ముందు మెరిసి, నిను తాకి వెళ్ళిపోయే కాలమది.
ఇక అప్పుడు
అ గదిలోకి, నీ చీకట్లోకి ఎవరో వచ్చి దీపం వెలిగిస్తే, ప్రాణంజలి వంటి ఆ కాంతిలో
నీ నుదిటిపై తను చల్లగా అరచేయి ఉంచితే, తన శ్వాసలోంచి నీ ముఖంపైకి వీస్తుంది
వర్షపు ఆగమన గాలి ఒకటి చెట్లు ఊగే ఆకుల కలకలంతో- ఇక నువ్వు, తన చేతిని
గట్టిగా పుచ్చుకుని, నువ్వు బ్రతికి ఉన్నావని రూడీ చేసుకునేందుకు
తూట్లు తూట్లు పడి, రెండు రోజులుగా ముద్దన్నం మింగుడు పడని వొణికే గొంతుతో
కొద్దిగా సం/దేహంగా అడుగుతావు: “నిజంగా, నువ్వేనా?” అని.
సరిగ్గా అప్పుడు, సరిగ్గా అప్పుడే
రాత్రంతా నువ్వు నెత్తురూ, మధువూ కక్కుకుని విలవిలలాడిన, మబ్బులు
కమ్ముకున్న ఆ గదిలో, చిన్నగా చినుకులూ, తడచిన పచ్చిగడ్డి వాసనా, మరి
రెక్కలు తెగి తూనీగలు రాలిపోయే మెత్తడి సవ్వడీనూ. చాచిన
నీ మునివేళ్ళకి అంటుకునే, చితికిన తన కళ్ళ తడీ. నీ చుట్టూ నిస్సహాయంగా
అల్లుకునే తన చేతుల అలజడీ, కొంత కరుణా కొంత నొప్పీనూ-ఇక
ఆ తరువాత ఆ దినమంతా
నీ హృదయంలో వెలుగుతూనే ఉంటాయి – నిన్ను తమలోకి పొదుపుకున్న-
తల్లి దీపాలైన తన వక్షోజాలు, కొంత శాంతియై కొంత జీవన వాంఛయై
చినుకుల చివరన
వేలాడే కాంతి గింజలై, మట్టి పూలై. ఇక, నీ గది గోడలపై, ఆ వెలుతురూ నీడలలో
గోడలని కరచుకున్న అన్నం మెతుకులలోంచి తెల్లటి పురుగులు రెక్కలు విప్పి
ఎగిరే నీ కాలాంతపు వేళల్లో, ఒక గగుర్పాటుతో
ఒక్కసారిగా నీకు బ్రతకాలనిపించి, మరొక్కసారిగా ఈ లోకాన్ని చూడాలనిపించీ
మృత్యువు తాకిన నీ కళ్ళను కొద్దిగా తుడుచుకుంటూ చెబుతావు కదా
తనకి అప్పుడు:
“మమ్మూ, వొదలకు నన్ను. వొదిలి వెళ్ళకు నన్ను. బ్రతకాలని ఉంది నాకు. ప్లీజ్-”
***
తాంబూలం(కిళ్ళీ) పంటిక్రింద పెట్టగానే దానిలోని వస్తువుల గుబాళింపు నాలికకు తగులుతుంది, కానీ నాలుక ఎర్రదనం కావాలంటే మళ్ళీ, మళ్ళీ నమలాల్సిందే.
ఒక్కోసారి మీ కవిత్వమూ అంతే అనిపిస్తుంది శ్రీకాంత్ గారు
ఏం బాగుందో చెప్పలేనట్లు, చాలా చాలా బాగుందండి.
వేలాడే కాంతి గింజలై, మట్టి పూలై. ఇక, నీ గది గోడలపై, ఆ వెలుతురూ నీడలలో
గోడలని కరచుకున్న అన్నం మెతుకులలోంచి తెల్లటి పురుగులు రెక్కలు విప్పి
ఎగిరే నీ కాలాంతపు వేళల్లో,
మమ్మూ, వొదలకు నన్ను. వొదిలి వెళ్ళకు నన్ను. బ్రతకాలని ఉంది నాకు. ప్లీజ్-”
…..అద్భుతమైన ప్రేమ అనుభవం లోకి వస్తే జీవించాలనే కోరిక సాయంత్రపు నీడలా పెరిగిపోతడి .A srikanth mark of poem