ఇటువైపు చూడవు నువ్వు. ఎందుకంటే
నూతనమైనది ఏదీ నీకు కనిపించకపోవచ్చు. ఆఖరకు ఒక పదం కూడా ఒక్క ప్రతీక కూడా -
అవే మూసిన తలుపులు. అవే వెలసిన గోడలు. వాటిపై పిచ్చిగీతలు -
నువ్వు చూడవు వాటివైపు. ఎందుకంటే మరి అవి
ఏ పసివేళ్ళూ లేక వడలిపోయిన రంగులో, లేక ఎవరూ లేని రాత్రుళ్లో, రాత్రుళ్ళలో
ఆగిపోయిన శ్వాసలో, నువ్వు లేవని తెలసి ఇక నిన్ను పిలవలేక
స్థాణువై చిట్లిన పెదాలో, తెలియదు ఎవరికీ -
ఎందుకంటే
ఎవరితోనూ మాట్లాడవు అవి – ఎందుకంటే
ఎవరి ముందూ తమ చరిత్రలు విప్పుకోవు అవి. ఎందుకంటే
ఎవరి ముందూ, తమ గాధలు చెప్పుకోవు అవి. ఎందుకంటే
ఎవరి ముందూ, కన్నీళ్లు పెట్టుకోవు అవి. చివరిగా
ఎందుకంటే
నీ అరచేతుల్లోంచి జారిపోయిన గాజు పుష్పాలు అవి
ఏ ప్రదర్శనశాలలోనో ఇమడలేక తప్పిపోయి, దారి తెలియక బిక్కుబిక్కుమనే పిల్లలు అవి
గూళ్ళు రాలిపోయి, గుడ్లు చితికిపోయి అక్కడక్కడే అల్లల్లాడే పిచ్చుకలూ, తల్లులూ అవి -
అంతిమంగా
స్వప్నాలలో, గోడలలోంచి నీడలు తొలుచుకు వచ్చి కమ్ముకునే వేళల్లో
నువ్వు గుర్తుకు వచ్చి, తటాలున లేచి కూర్చుని
దడదడలాడే గుండెతో వణికిపోయే నేను – అవి.
అవును.
వాళ్ళు చెప్పేదే నిజం. సృజనా, నూతనమైనది ఏమీ లేదు. ఎప్పటిలాగే
ఇటువైపు చూడవు నువ్వు !
2. నువ్వు ఉన్నందుకే
అలసిపోయాను.
ఈ రాత్రి – ఆఖరకు దీపం వెలిగించుకునే ఓపిక కూడా లేదు. అప్పటిదాకా వీచి
ప్రాణం పోసిన గాలి నిశ్చలంగా మారినట్టు
చీకటి ఇంత కుదురుగా, కరకుగా చిక్కగా
నుదురుని బలంగా
ఒక రాయికేసి మోదుకున్నట్టు ఉంటుందని తెలిసింది ఈనాడే. సృజనా, సృజనా
తడి ఆరి, ఎండి పగిలిపోయిన పెదాలు.
పగటి నిప్పుల్లో దగ్ధమయిన కనులు
ఏ మాత్రమూ ఆశనివ్వని నక్షత్రాలు
వడలి, వొంగిపోయిన లతలు.
పక్షులు వొదిలివేసిన గూడు. వ్యాపించి జలదరింపజేసే నీడలు. పగిలిన కుండీలు.
ఇక హృదయమొక తెగిన పూలకొమ్మై
అరచేయి అంచున ఆఖరి శ్వాసతో
ఊగిసలాడే ఒక చిన్ని ఎరుపు పూవై
ఈ సమయమై, రెండు అరచేతుల మధ్య ముఖాన్ని కుక్కుకునే ఒంటరితనమై
చివరికి నువ్వై -
సృజనా, అవును
అలసి పోయాను.
ఇదంతా నువ్వు ఉన్నందుకే. ఇదంతా నువ్వు ఉండి
ఇక్కడ లేనందుకే
**** (*) ****
ఒక స్పృహా నిస్పృహల ఊగిసలాట లోంచి
ఒక philosophic mental state లోంచి వెలువడ్డ సృజన;
రెండూ భలే నచ్చాయి.