కవిత్వం

నేను

ఆగస్ట్ 2017

నేను పుడుతూనే ఆకలికి ఏడుస్తున్నాననుకుంటారు గానీ
ఒక గుప్పెడు నిప్పు కణికలని
గొంతులో నింపుకునే వచ్చాను.

నిశ్శబ్దంగా నిద్ర పోతున్నాననుకుంటారు గానీ
ఊపిరి గాలికి రెపరెపలాడే
థిక్కారపు దేహ పతాకాన్ని నేను.

నా అడుగులతో ఆకాశాన్ని కొలుస్తాను.
నా జ్ఞాన తృష్ణ కి
అనంత విశ్వాన్ని బలిస్తాను.

పశుత్వానికి దగ్గరగా పుట్టి
దైవత్వానికి దూరంగా విసిరివేయబడ్డ
మాంస ఖండాన్ని.

సిథ్థాంతాన్ని.
సిథ్థాంతాల రాథ్థాంతాన్ని.
రాథ్థాంతాల యుథ్థాన్ని.
యుథ్థానికి, యుథ్థానికి మధ్య
నెలకొన్న తాత్కాలిక శాంతి సౌహార్ద్రాన్ని.

మంచి, చెడుల మధ్య
పెనుగులాడే లోలకాన్ని.
ఆలోచనల అల్లకల్లోలాన్ని.
నాదాన్ని.నినాదాన్ని.
వాదాన్ని. మౌన ప్రబోధాన్ని.

బలవంతుడి చుట్టూ తిరిగే
ఉపగ్రహాన్ని. బలహీనుడిని
చుట్టూ తిప్పుకునే మరో గ్రహాన్ని.

నేను ఓంకారాన్ని,
అహంకారాన్ని.
అధికారాన్ని, దర్పాన్ని.
భయంతో బుసలు కొట్టే విష సర్పాన్ని.

శబ్దానికి, శబ్దానికి మధ్య నిశ్శబ్దాన్ని.
నిశ్శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య వాయిద్యాన్ని.
రాజ్యాన్ని. రాజ్యాథికారాన్ని.
రాజ్యాథికార వ్యతిరేక ఆయుధాన్ని.
అవమానానికి పుట్టిన ఇతిహాసాన్ని.

నిత్య అసంతృప్తుడిని.
అరిషడ్వర్గాలకి ఆప్తుడిని.
రాగ ద్వేషాల రాక్షసుడిని.
అప్పుడప్పుడూ గుండె చప్పుడిని.

నేను థన ఇంథన, దైనందిన
జీవిత చలనాన్ని. మహా ప్రళయాన్ని.
చావు తప్పదని తెలిసీ, పోరాడే సైనికుడిని.
నా పూర్వీకుల నిశ్చితాభిప్రాయాల
భారాన్ని మోయటానికి
నియమించబడ్డ జీతగాడిని.

ఆశయాన్ని. సంశయాన్ని.
వివాదాన్ని. ఉన్మాదాన్ని.
శృంఖలాన్ని. విశృంఖలత్వాన్ని.
బానిసత్వాన్ని. అశాశ్వత సత్యాన్ని.
రహస్య రంగస్ఠల నట విరాట్ స్వరూపాన్ని.

ఇంతా చేసి నా పవిత్రమయిన
ఆత్మని హత్య చేయటానికే ఇక్కడికొచ్చానని
తెలుసుకోలేని అల్ప జ్ఞానిని.

వచ్చిన పని మర్చిపోయి, “పిడికెడు మెతుకుల
ముందు తల వంచ”మనే శాపగ్రస్థ జీవనాన్ని.
స్వల్ప కాల విస్ఫోటనాన్ని.

Art Credit: Etch-a-sketch Drawing – Abstract Postmodernist Man by Jonathan Harnisch