వ్యాసాలు

చీకటి ప్రపంచ చరిత్రకారుడు – Günter Grass

అక్టోబర్ 2015

నిజ జీవితంలో నిలువుగా ఆరడుగులు పైన, అడ్డంగా నాలుగడుగులు ఉండే గుంటర్ గ్రాస్(Günter Grass) లాంటి రచయిత తను రాసిన ‘ద టిన్ డ్రం’ నవలలోని ప్రధాన పాత్ర అయిన ఆస్కార్ ని మాత్రం మూడు అడుగులు మించి ఎదగకూడని నిర్ణయించుకుని అలాగే ఉండి పోయే వాడిగా చిత్రించటం లోని ఆంతర్యం ఏమై ఉంటుంది. ఎక్కడయినా ఎవరయినా తనని తాను కావాలని కుంచించుకోవటం ఏ సందర్భంలో జరుగుతుంది.? కళ్ళ ముందు కొనసాగుతున్న దారుణమయిన పరిస్థితులను నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప ఎదిరించి పోరాడలేని సగటు మనిషి మానసిక దౌర్భల్యానికి బహుశా ఇది ఒక భౌతిక సంకేతం కావచ్చు. ఒక చెంప దెబ్బ కావచ్చు. ఒక మేలు కొలుపు కావచ్చు. లేదా భయానక గతానికి దాని పరిణామమయిన వర్తమానానికి కనీసం ఒక మూగ సాక్ష్యం గా అయినా మిగిలిపోవాలని తెగించి తీసుకున్న నిర్ణయానికి పరాకాష్ట కూడా కావచ్చు. 1959 లో అచ్చయిన ఈ నవల 20వ శతాబ్దపు మొదటి సగంలో, జర్మనీ చరిత్రతో పాటు రెండవ ప్రపంచ యుధ్ధ పరిణామాలను, దేశాల మధ్య జరిగిన మారణ కాండను, అమానుషత్వాలను కళ్ళకి కట్టి చూపించి, నాజీల దురాగతాలకు జర్మన్ల నైతిక భాత్యతని గుర్తు చేసింది. 1999 లో నోబెల్ బహుమతి పొందిన ఈ నవల అంతకు ముందు 1979 లో అదే పేరుతో జర్మన్ సినిమా గా విడుదలై ఆ సంవత్సరం ఉత్తమ విదేశీ భాషా చిత్రం గా ఆస్కార్ బహుమతి కూడా గెలుచుకుంది.

నవల, సినిమా కూడా కొన్ని వాస్తవ సంఘటనల యదార్ధ చిత్రీకరణల వల్ల తీవ్రమయిన విమర్శలను ఎదుర్కొన్నాయి. అందుకేనేమో చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన గ్రాస్ ‘టిన్ డ్రం’ చిత్ర ప్రదర్శన సందర్భగా ముందుగానే ప్రేక్షకులకి “ఈ సినిమాలో కొన్ని సీన్లు మీకు అతిగా, జుగుప్సాకరంగా అనిపించవచ్చు కానీ అది ఆనాటి జర్మన్ సమాజంలోని వాస్తవం. వాటిని అలాగే చూడండి. అపార్ధం చేసుకోవద్దు.” అని విన్నవించుకోవలసి వచ్చింది. గ్రాస్ తన ఆత్మ కధకి “పీలింగ్ ది ఆనియన్” అని పేరు పెట్టాడు. బహుశా ఆ పుస్తకం చదువుతున్నప్పుడు పాఠకుడి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరగటానికి సూచనగా ఆ పేరు పెట్టి ఉండవచ్చు.

నిజం మాట్లాడటం అంత సులువు కాదు. రాయటమూ అంత సులువు కాదు. రాయగలగటం ఒక శాపం. రచయితగా అవతరించటం ఒక మొక్కకి పువ్వు పూసినంత అందంగా ఏమీ సంభవించదు. అది ఒక నరుడు నరసిం హావతారంగా మారవలసినంత కష్టం. అందులోనూ ఏ ముసుగులూ లేకుండా కేవలం నిజాలు మాత్రమే రాయాలనుకోవటం ఆత్మని, శరీరాన్ని కోత పెట్టుకోగలిగినవాడు మాత్రమే తీసుకునే సాహసోపేత నిర్ణయం. బహుశా రాయటానికి తను పడే యాతన, హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చని పోయే వారు అనుభవించే చిత్రవధ కన్నా ఎక్కువ కాదన్న ఎరుక వల్ల గుంటర్ గ్రాస్ ‘ది టిన్ డ్రం’ లాంటి రచనలు చేయగలిగి ఉండాలి.

సాహిత్యంలో కొన్ని నిజాలని ఆకట్టుకునేలా చెప్పాలంటే, వాటిని మరి కొన్ని అబధ్ధాలతో కలిపి చెప్పాలి. అసలు కధలు అంటేనే అబధ్ధాలని నమ్మేలా చెయ్యటం అంటాడు గుంటర్ గ్రాస్. మనిషి మనసులోని భావాలని భాష సంపూర్ణంగా ప్రకటించలేదు. భావాల ప్రసారానికి నిజానికి భాష ఒక పెద్ద అడ్డంకి. కాని ఆ భాష ఆధారంగానే సృష్టించబడే సాహిత్యంలో సత్యాన్ని మరింత అర్ధవంతం గా మరింత తీక్షణంగా చెప్పాలంటే ఒక కొత్త ప్రక్రియ ఆసరా కావాలి. అదే ‘మ్యాజిక్ రియలిజం’. ఈ మ్యాజిక్ రియలిజం ఉపయోగించి సామాన్య విషయాలకి కల్పన జోడించినా, అసహజత్వానికి తావు లేకుండా అత్యంత ప్రభావవంత రచనలు చేశారు గ్రాస్. ఆస్కార్ గట్టిగా అరిస్తే అద్దాలు పగిలిపోవటం, తనని తాను మళ్ళీ కావాలనుకున్నంత వరకూ మూడు అడుగులు మించి పెరగకుండా నిరోధించుకోగల అతీత శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండటం లాంటి విచిత్రమయిన కల్పనలు దీనికి నిదర్శనం. జర్మన్ చీకటి చరిత్రనీ, ఆ దేశ రాజకీయ, ఆర్ధిక కల్లోల పరిస్థితులను చిత్రించటానికి గుంటర్ గ్రాస్ మ్యాజిక్ రియలిజాన్ని అత్యంత సమర్ధవంతంగా తన నవలలో ఉపయోగించి ఈ ప్రక్రియలో తర్వాత చాలా మంది రచయితలకి ప్రేరణగా నిలిచాడు.

భారత దేశ చరిత్రలో కూడా దేశ విభజన సమయంలో అత్యంత అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఉత్తర భారతం లో జరిగిన ఈ ఘటనల గురించి దక్షిణ భారతీయులం అయిన మనకి తెలిసింది చాలా తక్కువ. కానీ పాకిస్తానీ ఉర్దూ రచయిత ‘సాదత్ హసన్ మంటో’ తన రచనల ద్వారా నిష్పక్షపాతం గా ఇలాంటి ఘటనల మీద వెలుగు ప్రసరింప చేశాడు. మంటొ గానీ గ్రాస్ గానీ కేవలం చెడు గురించే ఎందుకు రాయాలి.? అసలు చెడు గురించి ఎవరయినా ఎందుకు మాట్లాడుకోవాలి.? ఎందుకంటే అది అక్కడ ఉందని గ్రహించటానికీ, తద్వారా దానిని తొలగించటానికీ, ఇక ముందు పునరావృతం కాకుండా జాగ్రత్త పడటానికీ, బాధితులకు న్యాయం చెయ్యటానికీ అలా మాట్లాడుకోవటం నిజంగా చాలా అవసరం కాబట్టి.

గుంటర్ గ్రాస్ లాంటి రచయితల రచనల ద్వారా మనిషి నాగరిక ప్రపంచం లో కూడా ఎంత అనాగరికంగా ప్రవర్తించాడో అర్ధం చేసుకోవచ్చు. మనిషి నుంచి మృగం ఇంకా వేరు కాలేదన్న కఠోర సత్యం తెలుసుకోవచ్చు. మనిషి భౌతికం గా ఎలా ఉన్నా ఆలోచనల పరంగా, మానసికంగా ఇంకా నాగరిక ప్రపంచపు పొలిమేరలలో కూడా ప్రవేశించలేదన్న నిజాన్ని తల ఒంచుకుని ఒప్పుకోవచ్చు. ఇన్ని వేల సంవత్సరాలుగా, ఇప్పటి వరకూ సాటి మనిషినే అర్ధం చెసుకోలేని మనిషి ఇంకా దైవత్వాన్ని ఎప్పటికి అర్ధం చేసుకుంటాడు? ఇలాంటి రచనలు ’ఈ భూమ్మీద ఇంకా చాలా చీకటి మిగిలే ఉంది.’ అని తెలియ చెయ్యటానికి నిదర్శనం. కానీ చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణించాలన్న ప్రయత్నం ఉన్నంత వరకూ గుంటర్ గ్రాస్ లాంటి రచయితలూ మిగిలే ఉంటారు.

**** (*) ****