ప్రత్యేకం

మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ నవలలు – ది ప్రెసిడెంట్ , మెన్ ఆఫ్ మైజ్

ఆగస్ట్ 2017

స్ట్రాడా కాబ్రెరా అంటే తెలీదు. జార్జ్ ఉబికో అంతకంటే తెలీదు.

రోజాస్ పినిల్లా, మాన్యుఎల్ ఓడ్రియా అనే పేర్లే విని ఉండం.

అనస్టస్లో సోమోజా?

రాఫెల్ ట్రుజ్జిలో?

పెరెజ్ జిమినెజ్?

పెడ్రో యుగెన్లో అరంబురు?

కానీ మాజికల్ రియలిజం అంటే విని ఉంటాం. అది లాటిన్ అమెరికాలో పుట్టిందని ఎవరో అనే ఉంటారు. ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ అర్ధం అయిన మత్తులో కొందరూ, అర్ధం కాని భయంతో ఇంకొందరూ చెప్తే అలాటి నవల ఉందని తెలుసుకొనే ఉంటాం.

అయితే తెలీనిదల్లా చరిత్రలో సమస్త ప్రపంచం పైన చెప్పిన నియంతలకు పాదాక్రాంతమైనట్టు కనిపించిన సమయాల్లో కూడా అక్కడి ఒంటరి నిస్సహాయ రచయితలు కొందరు ఏటికి ఎదురీది తమ కలం బలంతో ఆ నియంతల్ని ఢీకొట్టారన్న విషయం. తమ సృజనాత్మక శక్తినే సైన్యంగా మలిచి వాళ్ళు తిరుగుబాటు ప్రకటించారు. అణచివేతలకు, క్రూరశిక్షలకు సిద్దపడి తమ గుండె ధైర్యాన్ని చాటారు.

కాల ప్రవాహంలో కత్తి కన్నా కలం గొప్పదని చరిత్ర నిరూపించింది. ఇతరేతర శక్తులు లేస్తే ఆయా నియంతలు మాత్రం మట్టి కరిచారు. చరిత్ర తన చీకటి కోణాల్లో వాళ్ళని పూడ్చిపెట్టింది, కానీ వాళ్ళు తమ కాళ్ళకింద తొక్కి పెట్టాలనుకున్న ఆ రచయితల్నీ సృజనకారుల్నీ మాత్రం అదే చరిత్ర మనకోసం సాహిత్య రూపంలో పదిలంగా నిలబెట్టి ఉంచింది.

లాటిన్ అమెరికన్ దేశాలకు చెందిన అలాంటి రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.

తన దేశపు పాలక వర్గాలకెదురొడ్డి దేశబహిష్కరణకి గురయ్యి దశాబ్దాల పాటు పరాయినేలమీద తలదాచుకొంటూనే నిషేధాలకు బలవుతూనే తన దేశంకోసం, ప్రజల కోసం, అక్కడి భూమిపుత్రుల కోసం కలం పట్టిన నిలిచి గెలిచిన ప్రజా రచయిత ఆస్ట్రియాస్.

మాజికల్ రియలిజం అన్న పేరే తెలియని కాలంలో ఆస్ట్రియాస్ సృష్టించిన మార్మిక కథన శైలి ‘అలెజో కార్పెంటియర్’, ‘జువాన్ రుల్ఫో’, ‘కోర్తజార్’, ‘మార్క్వెజ్’ , ‘ఇసబెల్ అలెండీ’, ‘పాజ్’ వంటి ప్రపంచ స్థాయి రచయితలకు ప్రేరణగా నిలిచింది.

ఆయన రచించిన ‘ది ప్రెసిడెంట్ ‘, ‘ మెన్ ఆఫ్ మైజ్ ‘ నవలలు రెండూ ప్రపంచ సాహిత్య గమనంలో రెండు మైలురాళ్ళు.

ది ప్రెసిడెంట్ :

ప్రపంచ సాహిత్యంలో నియంతల గురించీ, వారి ఆవిర్భావం, ఎదుగుదల, అణచివేత, నిరంకుశ ప్రవృత్తి, వారి ఉత్థానపతనాల ప్రస్థానాన్ని చిత్రిస్తూ ప్రతిభావంతమైన నవలలు కొన్ని వచ్చాయి. పాశ్చాత్య సాహిత్యంలో ఆ రచనా ధోరణిని ‘డిక్టేటర్ నావెల్’ అని పిలుస్తారు. అలాంటి ‘డిక్టేటర్ నావెల్’ రచనా ధోరణికి లాటిన్ అమెరికన్ సాహిత్యంలో అద్యుడు మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.

‘ది ప్రెసిడెంట్’ మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ పౌరాణిక జానపద శైలిలో రచించాడు. స్వప్నలిపి వంటి భాషతో కళ్ళకు కట్టే మార్మిక దృశ్య సమాహారంతో లాటిన్ అమెరికన్ సాహిత్య చరిత్రలోనే ఓ కొత్త ధోరణికి నాంది పలికాడు.

తన తల్లిని అవమానించటంతో ఒక యాచకుడు ఓ సైనికాధికారిని పొరపాటున చంపటంతో కథ మొదలవుతుంది. నియంత ఆ హత్యను స్వప్రయోజనానికి వాడుకోవాలని ఆ నేరాన్ని తన అసమ్మతి వర్గానికి చెందిన మరొక సైనికాధికారి మీద మోపుతాడు. అంతే కాక అతడు దేశం విడిచి పారిపోయేందుకు అవకాశం ఇస్తాడు. అలా పారిపోయేందుకు సహాయం చెయ్యమని తనకు నమ్మకస్తుడయిన మరొక అధికారిని నియమిస్తాడు. అయితే ఆ నమ్మకస్తుడయిన అధికారి ఆ సైనికాధికారి కూతురి ప్రేమలో పడటంతో కథ అనూహ్యమయిన మలుపు తిరుగుతుంది.

నియంత స్వభావాన్ని చిత్రించటంలో లోతైన చూపును రచయిత ఇక్కడ ప్రదర్శిస్తాడు. ఒక దేశానికో ఒక వ్యక్తికో సంబంధించిన కథగా కాకుండా అనేక మంది నియంతల స్వభావాల్ని వడకట్టి ఒక నియంత పాత్రను సృష్టించాడు. ఒక ప్రత్యేక అంశాన్ని సాధారణీకరించటంలో ఒక స్థానికతను ప్రపంచ పరివ్యాప్తం చేయటంలోనే ప్రతిభా వంతులయిన రచయతల రచనా నైపుణ్యం దాగి ఉంటుంది. అలాంటి ప్రపంచ స్థాయి రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్.

ఈ నవలను 1920లో మొదలుపెట్టి 1933లో పూర్తిచేసినప్పటికీ మరొక పదమూడేళ్ళకు పైగా నిషేదించబడి 1946లో ప్రచురణకు నోచుకొంది. ఈ నవల ప్రేరణతోనే మార్క్వెజ్ ‘ఆటమ్ ఆఫ్ పేట్రియార్క్’, ల్లోసా ‘ఫీస్ట్ ఆఫ్ గోట్’, కార్పెంటియర్ ‘రీజన్స్ ఒఫ్ స్టేట్’ నవలలను రాశారు.

మెన్ ఆఫ్ మైజ్:

అది కలా నిజమా? పౌరాణికమా చరిత్రకమా? వచనమా కవిత్వమా? గతమా వర్తమానమా? కల్పనా వాస్తవమా? జానపదమా సర్రియలిజమా? మౌఖిక కథనమా ఏదీకాని దిగంతాల స్వప్న సంభాషణా?

ఇవన్నీ కల గలిసిన ఓ సరికొత్త శైలిలో లాటిన్ అమెరికన్ సాహిత్యంలోనే అత్యంత క్లిష్టమయిన ఆధునిక మహా కావ్య రచనకు పూనుకొన్నాడు మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్. అదే మెన్ ఆఫ్ మైజ్ నవల.

వేల సంవత్సరాల మాయన్ నాగరికతా ప్రస్థానంలో ఆ మూలవాసుల మార్మిక సంస్కృతి మొక్కజొన్న పంటతో పెనవేసుకుపోయింది. వారి జీవన విధానం 16వ శతాబ్దంలో బయటనుంచీ వచ్చిన లాటిన్ వలసవాదుల దాడితో కకావికలయ్యింది. వారికి మొక్కజొన్న ఒక వ్యాపార వస్తువు తప్ప మరేమీ కాదు. లాభాలు పండించే స్థలాలుగా తప్ప అక్కడి మట్టికి మరే విలువా లేదు. ఆ ఆధునిక వర్తక విలువలతో తలపడిన మూలవాసులకి నాయకత్వం వహిస్తాడు గాస్పర్ లోమ్ అనే నాయకుడు. ఆ క్రమంలో హత్యకు గురయ్యి ఒక జానపద కథా నాయకుడై మరల జీవిస్తాడు. ఆ ఘర్హణల్లో తప్పిపోయిన భార్య కోసం అన్వేషించే క్రమంలో తోడేలుగా మారిపోతాడు నికో అనే మరో కథా నాయకుడు. మూలవాసుల ఆదిమ సౌందర్య ప్రపంచం పెట్టుబడిదారీ పదఘట్టనలకింద ధ్వంసమై వారు పరాజితులై మిగిలిపోతారు.

1949లో అచ్చయిన ఈ నవల ఆ శతాబ్దానికే ప్రశ్నార్ధకమై నిలిచి సమస్త పాశ్చాత్య సాహితీ ప్రపంచాన్నీ కలవరపెట్టింది. మాజికల్ రియలిజం అన్న పేరే తెలియని కాలంలో ఆస్ట్రియాస్ సృష్టించిన ఈ కళాఖండం మరెందరో రచయితలకు ప్రేరణగా నిలిచి లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని పెను మలుపు తిప్పింది.

ఆస్ట్రియాస్ నేపధ్యం:

మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ లాటిన్ అమెరికాలోని గాటిమాలా దేశంలో 1899లో జన్మించాడు. కవిత్వం, నవలలు, నాటక రచనలో ప్రసిద్దుడు. జర్నలిస్టుగా, లాయర్‌గా, డిప్లొమాట్‌గా పనిచేశాడు.

క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే గాటిమాలాలో మాయన్‌ల నాగరికత ఆవిర్భవించి గణిత శాస్త్రం, ఖగోళశాస్త్రం, వ్యవసాయం, ఇతర వైజ్ఞానిక రంగాల్లో ఎంతో వికసించింది. గ్రిగోరియన్ కాలెండర్‌కన్నా ఎంతో ముందే మాయన్లు కాలెండర్‌ను కనిపెట్టారన్నది సమస్త ప్రమంచం గుర్తించింది. 15వ శతాబ్దంలో స్పానిష్ వలసవాదుల దండయాత్రలతో మాయన్ నాగరికతా పతనం ప్రారంభమయి 18 వ శతాబ్దంలో అమెరికాకు చెందిన వ్యాపారుల వలసలతో ఆ భూమి పుత్రులు చివరకు తమ నేలకూ తమ సంస్కృతికీ పరాయివారుగా మిగిలారు.

ఆస్ట్రియాస్ పూర్వీకులు స్పానిష్ నేపధ్యంలోంచి వచ్చినవారే అయినా గాటిమాలా భూమిపుత్రులైన మాయన్ తెగలకు మద్దతుగా నిలిచి అక్కడి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆస్ట్రియాస్ జన్మించిన నాటికి గాటిమాలా దేశం ఎస్ట్రాడా కాబ్రెరా అనే నియంత పాలనలో మగ్గుతోంది. ఆస్ట్రియాస్‌కు ఐదేళ్ళవయసులో ఒక విద్యార్థి తిరుగుబాటు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఆస్ట్రియాస్ తండ్రి తన జడ్జి పదవిని పోగొట్టుకొని దేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి వలస పోవాల్సి వచ్చింది.

అక్కడి ఆదివాసులతో ఆస్ట్రియాస్‌కు ఏర్పడిన అనుబంధం వారు చెప్పిన తమ కథలు గాధలూ అతడి తరువాతి రచనా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. స్కూలు వయసులోనే ఆస్ట్రియాస్ కథలు రాయటం ప్రారంబించాడు. అలాంటి ఒక కథే తరువాత కాలంలో ‘ది ప్రెసిడెంట్’ నవలగా రూపుదిద్దుకుంది.

ఇరవై యేళ్ళ వయసులో అతడు మెడిసిన్, న్యాయవాద విద్యలను అభ్యసించాడు. దేశంలోనే మొదటిసారిగా నేటివ్ ఇండియన్స్ సమస్యల మీద అతడు రాసిన పరిశోధనా పత్రానికి అప్పుడే ప్రతిష్ఠాత్మకమయిన అవార్డ్ లభించింది. యూనివర్సిటీలోనే అతడు అత్యుత్తమ విద్యార్ధిగా నిలిచాడు.

అదే సమయంలో ప్రజల పక్షాన నిలిచిన అక్కడి యూనియనిస్ట్ పార్టీ రాజకీయల్లోనూ చురుకైన పాత్ర పోషించాడు. విద్యార్ధి ఉద్యమాలకు నాయకుడయ్యాడు. అతడు స్థాపించిన యూనివర్సిటీ విద్యార్ధి సంఘం ఆ తర్వాతి కాలంలో నియంతపాలనను తుదముట్టించటంలో ముఖ్య పాత్ర పోషించింది. అప్పటి ఆ రాజకీయ సంఘటనలు కూడా ‘ది ప్రెసిడెంట్’ నవలలో చోటుచేసుకొన్నాయి.

1923లో న్యాయవాద విద్యని ముగించి పై చదువులకోసం అతడు ఫ్రాన్స్ వెళ్ళి పారిస్ యూనివర్సిటీలో ప్రాచీన జాతుల కు సంబంధిన ‘ఎథ్నాలజీ’ శాస్త్రం అభ్యసించాడు. అక్కడి స్వేచ్చా భావనలు , ఉదారవాద సాహిత్యం కళలు, సర్రియలిస్ట్ సాహితీ ధోరణులు అతడిని ఎంతో ప్రభావితం చేశాయి.

ఆ సుదూర దేశంలొ ఉన్నప్పుడే అతడికి తమ ప్రాంతపు మాయన్ల సంస్కృతిపైకి మనసు మళ్ళింది. మాయన్ల ప్రాచీన గ్రంధం ‘పొపోల్ వు’ ని స్పానిష్ లోకి అనువదించాడు. పారిస్‌లో ఉండగానే 1930లో ప్రాచీన జానపద కథన శైలికి అధివాస్తవిక కవితాత్మక ధోరణిని జోడించి ‘లెజెండ్స్ ఆఫ్ గాటిమాలా’ అనే కథలను మొదటిసారిగా రచించి ప్రచురించాడు. అతడి ఈ నూతన శైలికే తర్వాత దశాబ్దాలలో ‘మాజికల్ రియలిజం’ పేరు స్థిరపడింది.

పదేళ్ళ తర్వాత 1933లో పారిస్ నుంచీ స్వదేశం తిరిగివచ్చి జర్నలిస్ట్‌గా స్థిరపడ్డాడు. నియంతల గురించిన ‘ది ప్రెసిడెంట్’ నవలను కూడా అప్పటికే అతడు పూర్తిచేశాడు.

అయితే అప్పటికి అక్కడ జార్జ్ ఉబికో అనే ఇంకో కొత్త నియంత పీఠమెక్కాడు. అంతకు ముందున్న నియంత పాలనలో లాగే ఆస్ట్రియాస్ ఈ నియంత ఆగ్రహానికీ గురయ్యాడు. అలా అతడి ప్రపంచ ప్రఖ్యాత నవల 13 యేళ్ళ పాటు అంటే 1946 వరకూ చీకటిలోనే ఉండిపోయింది. ఆ చీకటి కాలంలో అతడు విస్తారంగా కవిత్వం కూడా రాశాడు.

ఈ లోగా ఆస్ట్రియాస్ 1942లో కాంగ్రేస్‌కి ఎన్నికయ్యి దేశానికి డిప్లొమాట్‌గా నియమించబడ్డాడు. ఆ పదవిలో లాటిన్ అమెరికాలతో పాటు పారిస్ వరకూ పర్యటించాడు.

1946లో ప్రజా ప్రతిఘటనకు జార్జ్ ఉబికో పాలన అంతమయాక అతడి ‘ది ప్రెసిడెంట్’ నవల ప్రచురించబడి సాహిత్య ప్రపంచాన్ని ఆకర్షించింది. మరి కొద్దికాలానికే స్థానిక నేలవాసుల ఆదిమ సంస్కృతికీ వలసవచ్చిన ఆధునికతకీ మధ్య జరిగిన రక్తసిక్త సంఘర్షణా చరిత్రని ‘మెన్ ఆఫ్ మైజ్’ నవలగా మలిచి 1949లో ప్రచురించాడు. ఈ రెండు నవలలలూ అతడికి సాహిత్య ప్రపంచంలో శిఖరాగ్ర స్థాయి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

అక్కడి కొత్త ప్రభుత్వం మళ్ళీ పతనమవటంతో అతడు గాటిమాలా నుంచీ బహిష్కరింపబడి దాదాపు దశాబ్దం పాటు అర్జెంటీనా, చిలీ, స్విట్జర్లండ్ వంటి దేశాల్లో తల దాచుకొన్నాడు.

అనేక నిర్బంధాలూ బహిష్కరణలూ అతడి సృజనాత్మక ప్రతిభను చంపలేకపోయాయి. 1950 నుంచీ 1960 వరకూ ‘స్ట్రాంగ్ విండ్’, ’ గ్రీన్ పోప్’, ‘ఐస్ ఆఫ్ ఇంటర్డ్’ అనే మూడు నవలలను ‘బనానా ట్రయాలజీ’ పేరుతో రచించాడు. ఇంకా వీకెండ్ ఇన్ గాటిమాలా కథలూ, మరొక నవల కూడా. 1963లో గాటిమాలా చరిత్రకు కార్టూన్ల రూపమిస్తూ అతడు ప్రచురించిన ‘ములాటా’ అనే నవల మరొక పెద్ద సంచలనం.

అతడి ప్రగతిశీల భావజాలాన్నీ , నియంతలపై రాజీలేని పోరాటాన్నీ గౌరవిస్తూ 1966లో సోవియట్ యూనియన్ ఆస్ట్రియాస్‌కు లెనిన్ శాంతి బహుమతిని ప్రకటించింది. 1967లో అతడికి నోబెల్ బహుమతి వచ్చింది.

లాటిన్ అమెరికన్ దేశాలనుంచీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నోబెల్ బహుమతి అందుకున్న రచయిత మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ ఒక్కడే. అతడి సాహిత్య కృషి వల్ల ప్రపంచం దృష్టి లాటిన్ అమెరికావైపు మళ్ళటంతో ఆ తర్వాత పాబ్లో నెరూడా, మార్క్వెజ్, ఆక్టోవియా పాజ్, డెరిక్ వాల్కాట్, ల్లోసాల వంటివారిని కూడా నోబెల్ వరించింది.

అనేక వలసల తరువాత తన జీవిత చరమాంకాన్ని స్పెయిన్ దేశంలో గడిపి 1974లో ఆయన మరణించాడు.

**** (*) ****