పుస్తక పరిచయం

‘విలియం ఫాక్‌నర్’ నవల ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’

జూలై 2017

క రచయిత జీవితం మీద పదికి పైగా జీవిత చరిత్రలు వచ్చాయంటే ఆ రచయితలో ఎదో విశేషం ఉండి ఉండాలి. ఆనాటి సమాజాన్నీ, అక్కడి జీవితాల్నీ, తన సమకాలీనతనూ అతడు ఓ కొత్త కోణంలో ఆవిష్కరించి ఉండాలి. తన రచనల ద్వారా తన కాలపు సాహిత్య ప్రపంచాన్నే కాక తన తర్వాతి తరాల్నీ ప్రభావితం చేసి ఉండి ఉండాలి.

తన తరం రచయితల కంటే భిన్నంగా ఒక కొత్త శైలితో, శిల్పంతో ఉత్తర అమెరికన్ సాహిత్యం మీద తనదైన ముద్ర వేసిన ఆ రచయిత విలియం ఫాక్‌నర్ (1897–1962).

ఫాక్‌నర్ రచనా ప్రాభవం తన రాష్ట్రాన్నీ, దేశాన్నీ దాటి ఎన్నో వేల మైళ్ళ అవతలి ప్రాంతాల్లోని రచయితల్ని చేరింది. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్, కార్లోస్ ఫ్యూయెంటిస్, ఒనెట్టి వంటి లాటిన్ అమెరికన్ రచయితలు ఆయన నుంచి ప్రేరణ పొందామని వాళ్ళే స్వయంగా చెప్పారు.

ఫాక్‌నర్ రాసిన ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’, ‘యాస్ ఐ లే డైయింగ్’ , ‘లైట్ ఇన్ ఆగస్ట్’ , ‘ది అన్‌వాన్‌క్విష్డ్’ , ‘అబ్సలోం, అబ్సలోం!’ నవలలల్లో మొదటి రెండింటినీ అతడి మాస్టర్ పీసెస్ గా పరిగణిస్తారు.

***

అబద్దాలు చెప్పొద్దనీ, మనసులో ఉన్నదే మాట్లాడమనీ, పొరుగు వాడికి సాయం చెయ్యమనీ, లౌక్యం కూడదనీ, పాపం చెయ్యొద్దనీ ప్రపంచంలోని అనేక మతాలూ , సిద్దాంతాలూ ప్రభోదిస్తాయి. తమ మార్గంలో నడిస్తేనే ముక్తి దొరుకుతుందని కూడా నమ్మిస్తాయి.

ఆ ప్రభోధాలు వినేందుకు ప్రజలు లక్షల , కోట్ల సంఖ్యలో గుమి గూడతారు. చప్పట్లు కొడతారు. ఆయా మతాలకోసం, సిద్దాంతాల కోసం ప్రాణాలు విడుస్తారు. తీస్తారు. కానీ చెప్పినవేవీ ఆచరించరు.

కానీ అబద్దాలు చెప్పని, లౌక్యం తెలీని మనుషులు సమాజంలో మనమధ్యే కొందరుంటారు.

అయితే వారిని సమాజం, చివరికి తమ సొంత కుటుంబం కూడా తమలో కలుపు కోదు. గౌరవించదు. వారిని వీలయినంత దూరంగా తరుముతుంది. చివరకి సమాజంలో అణగారిన వాళ్ళకు కూడా వాళ్ళు మరింత లోకువ.

వాళ్ళకు బుద్ది మాంద్యం ఉందని పైకి మాత్రమే జాలి పడతారు. క్రూరంగా ప్రవర్తిస్తారు.

అలా తన అయిదేళ్ళ వయసులో మనసు ఎదుగుదల ఆగిపోయిన ఒక వ్యక్తి – ముప్పై మూడేళ్ళు వచ్చాక- తన కుటుంబానికి సంబందించిన కథను తన జ్ఞానాజ్ఞానాలననుసరించి తన కోణంలోంచి చెప్తే?

అది సాహిత్య ప్రమంచంలో సంచలనమయితే?

అలాటి కథనాన్ని 1929లోనే నవలగా మలిచి- ఆ నవలను ప్రపంచ వ్యాప్తంగా గత శతాబ్దిలో వచ్చిన వంద ఉత్తమ నవలల్లో ఒకటిగా నిలిపిన రచయిత విలియం ఫాక్నర్. ఆ నవల ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’.

ఉత్తర అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన ధనికులయిన కాంప్సన్ కుటుంబ ఉత్థాన పతనాల కథ ఇది. ఆ ఇంట్లో అందరికంటే చిన్నవాడు బెంజమిన్.

అతడు తన ముప్పై మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక రోజు (సరిగ్గా 1928 ఏప్రిల్ 7 వ తేదీ – అది తన పుట్టిన రోజు) తన చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చుకోవటంతో నవల ప్రారంభమవుతుంది. ఆ జ్ఞాపకాలు అతడికి తన మూడేళ్ళ వయసు నుంచీ అంటే 1898 సంవత్సరం నుంచీ ) మనసులో నిలిచి ఉంటాయి. అతని అన్నలు క్వింటిన్, జేసన్ లు, అతన్ని పట్టించుకొన్న ఒకే ఒక మనిషి అక్క కాండస్ .

చిన్ననాటి ఆటలు, దాగుడు మూతలు. ఓ రోజు కాడీ (కాండస్) పెద్ద చెట్టెక్కి పై అంతస్తులో గుమిగూడిన జనాన్ని చూస్తూ కింద నుంచీ పైకి చూస్తున్న సోదరులకు అమ్మమ్మ చచ్చిపోయిందనీ అందుకే వాళ్ళు వచ్చారన్న రహస్యాన్ని చెప్తుంది. కింద నిలబడి ఉన్న పిల్లల కళ్ళు మాత్రం కాడీ లోదుస్తుల మీద ఉంటాయి. అది అతడి అనేక జ్ఞాపకాల్లో ఒకటి.

ఐదేళ్ళ వయసులో తనకేదో అవటం, క్రమంగా తన పట్ల తల్లి తండ్రుల ప్రవర్తన మారటం, వారికి తను అవమానంగా అయ్యినట్టు తెలిసొస్తుండటం. తనను దూరం పెట్టటం.

అతడి బుద్ది మాంద్యం వల్ల అతడు చెప్పేది తిన్నగా , సహజంగా, పచ్చిగా ఉంటుంది. కానీ అదే బుద్ది మాంద్యం అతడు చెప్పె సంఘటనల క్రమాన్ని చిందర వందర చేస్తుంది. తరచుగా వాటి మధ్య కార్య కారక సంబంధాల్ని తెంపేస్తుంది. కాల చక్రం ముందుకే కాక ఒకేసారి వెనక్కి కూడా తిరుగుతుంది – పెండ్యులంలా మారి.

మొదటి సారి కాడీని చెట్టుమీద చూసిన జ్ఞాపకం వల్ల కాడీ అంటే చెట్టు అని అతడికి తెలుసు. ఆమె చెట్ల వాసన వేస్తుంటుంది. చెట్లు కూడా కాడీ వాసనే వేస్తుంటాయి. ఇంకా ఆమె 1905లో మొదటి సారి వాడిన సెంటు పరిమళం, 1909లో ఆమె ఓ యువకుడి దగ్గర కన్యాత్వాన్ని కోల్పోవటం (?), ఆ తర్వాత ఏడాది 1910లో ఆమె పెళ్ళి. తర్వాత ఆమె ఆ ఇంటికి దూరమవటంతో కాడీ వదిలిన చెప్పుల్ని అతడు దాచుకొన్నాడు. కొన్నాళ్ళకు అవి ఎవరివో అతను మర్చిపోయినా ఆ చెప్పులు మాత్రం గుర్తుండి పోతాయి.

అవేకాక ఇంకా తన గురించి కూడా తనకు కొన్ని తెలుసు. తన అసలు పేరు మౌరీ అయితే అది బెంజీ గా మారటం – అవమాన భారాన్ని తన వాళ్ళు అలా మరిచిపోచూశారు – వాళ్ళ కళ్ళు కప్పి ఎవరి ఇంట్లోనో జొరబడినప్పుడు అక్కడి అమ్మాయి కేకలు పెట్టటంతో తన వృషణాలను తొలగించిన గుర్తు ఇంకా పచ్చిగా వుంది- మనసుపై కూడా.
1910 లో కాడీకి పెళ్ళి అయిన ఏడాదే అన్న క్వింటిన్ ఆత్మహత్య చేసుకోవటంతో అతడు చెప్పే కథనం ఆగుతుంది.

మరొక కథకుడి వైపు మళ్ళుతుంది.

1910 లో ఆత్మహత్య చేసుకొన్న రోజున క్వింటిన్ కి తన కుటుంబాన్ని గురించి వచ్చిన జ్ఞాపకాలతో కథ మరొక కోణంలో తిరిగి ప్రారంభమవుతుంది. తన చిన్నతనం నుంచీ తన ఆత్మహత్య వరకూ జరిగిన అనేక సంఘటనలు అతడికి గుర్తుకొస్తాయి. అతడి హార్వర్డ్ చదువు కోసం వాళ్ళ గోల్ఫ్ కోర్స్ ని అమ్మటంతో కాంప్సన్ కుటుంబ పతనం మొదలవుతుంది. హార్వర్డ్ లో చదివే క్వింటిన్ అక్క కాడీ లో వచ్చిన మార్పుల్ని జీర్ణించుకోలేకపోతాడు. ఆమె నైతిక తప్పిదం మీద తండ్రికి చెప్తే ఆయన పట్టించుకోకపోగా- “అసలు కన్యాత్వం మగవాళ్ళు కనిపెట్టిందే కానీ ప్రకృతి సహజం కాద” ని కొట్టివేస్తాడు. మిసిసిపీ లోని పురాతన సాంప్రదాయ భావాల్ని వంటపట్టించుకొన్న క్వింటిన్ దాన్ని జీర్ణించుకోలేడు. ఫలితం ఆత్మహత్య.

కథ ఇక్కడ మళ్ళీ ఆగి తిరిగి 1928 ఏప్రిల్ 6 న మరొక అన్న జేసన్ చెప్పే కథనంతో ఇంకొక కోణంలో మరల మొదలవుతుంది.

క్వింటిన్ లా కాక జేసన్ వర్తమాన విలువలని అందిపుచ్చుకొంటాడు. అక్క కాడీ గురించి “ఒక్కసారి బిచ్ అయితే అదెప్పటికీ బిచ్. ఇంకేం చెయ్యగలం” అన్నది అతడి మొదటి వాక్యం. అతడు చెప్పే కథనంలో అంతకు ముందు ఎవరికీ తెలీని వళ్ళు గగుర్పొడిచే కొన్ని సంగతులు బయటపడతాయి.

బెంజీకి వృషణాలు తొలగించటం వెనుక కారణం అతడు పెళ్ళి చేసుకొంటే బుద్ది మాంద్యం కలిగిన పిల్లలు తమ వంశంలో మళ్ళీ పుడతారన్న అనుమానం అనీ, క్వింటెన్ నదిలో మునిగి చని పోయాడనీ. ఈలోగా కాడీకి ఒక కూతురు పుడుతుంది- ఆమె పేరు కూడా క్వింటెనే. చిన్న క్వింటిన్ లైంగికత మీద జేసన్ కన్ను వేస్తాడు. కాడీ భర్త నుంచీ విడిపోవటంతో ఆమెని ఇంట్లోంచి తరిమి వేస్తారు. తండ్రి కాంప్సన్ మరణం తర్వాత ఇంటి యజమాని అయిన జేసన్ డబ్బు సంపాదన మీద పడతాడు. చిన్న క్వింటిన్‌కి గార్డియన్ గా ఉండి ఆమెకు కాడీ పంపే డబ్బుని తన జేబులో వేసుకొంటాడు.

ఇక్కడ కథ ఆగి – కాంప్సన్ కుటుంబానికి తరతరాలుగా సేవ చేస్తున్న డిస్లీ అనే నల్ల జాతి స్త్రీ చెప్పే కథనంతో – మరొక మలుపు తిరుతుంది.

జేసన్ (మేనమామ) తనవెంట పడటంతో అతన్నించీ తప్పించుకొనేందుకు చిన్న క్వింటిన్ ఇంట్లోంచి పారి పోతుంది – అతడి దోచుకున్న తన తల్లి డబ్బుని అతడి నుంచీ దొంగిలించి. ఆ డబ్బుకోసం ఆమెను వెతుక్కుంటూ జేసన్ తిరుగుతుంటాడు .

చివరికి ఒక టవున్ హాల్ దగ్గర బెంజీ, జేసన్ లు కలవటంతో , బెంజీ తన అన్నని చూసి పాత రోజులు మళ్ళీ వచ్చాయన్న సంతోషాన్ని పొందటంతో కథ ముగుస్తుంది.

కథ ఇలా కాలంలో ముందుకీ వెనక్కూ జరుగుతూ, కథ చెప్పే వ్యక్తి మారుతూ, ఒకే విషయాన్ని అనేక దృష్టి కోణాలనుంచి చెప్తూ, మానవ సంబంధాల లోని ఉదాత్తతనీ, ఉన్మత్తతనీ , బలాలనూ, బలహీనతలనూ ఓ కొత్త వెలుగులో రచించి కాల్పనిక సాహిత్యానికి గాఢతనూ నవ్యతనూ ఇచ్చిన రచయిత విలియం ఫాక్నర్.

1929లోనే అచ్చయిన ఈ నవలను మొదట ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు ఐదేళ్ళ తర్వాత ఫాక్నర్ రచించిన ఇతర నవలలతో పాటు ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’ సాహిత్య ప్రపంచపు దృష్టికి చేరింది.

ప్రముఖ విమర్శకులెందరో ఈ నవలను మానసిక శాస్త్రం, వినిర్మాణ వాదం, స్త్రీవాదం వంటి అనేక కోణాలలోంచి విశ్లేషించారు. అక్కడ ఫ్రాన్స్‌లో జేమ్‌స్ జాయిస్ లా అమెరికాలో ఫాక్‌నర్ ‘స్ట్రీం ఆఫ్ కాన్షియస్‌నెస్ ‘ శైలిని ప్రతిభావంతంగా చిత్రించాడన్నారు.

ఒక కొత్త శైలికి నాంది పలికి, తనదైన నూతనత్వాన్ని ఇంకా అనేక ఇతర రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన విలియం ఫాక్నర్ కు పులిట్జర్ , నేషనల్ బుక్ అవార్డ్ లతో పాటు 1949లో నోబెల్ బహుమతి వచ్చింది.

**** (*) ****