పైకి కనిపించే కథ ఒకటి. కదిలినట్లు కనిపించకుండా చాప కింద నీరులా సాగే కథ మరొకటి.
పైకి కనిపించే కథలన్నీ మోసాలే.. కనిపించని కథలు మాత్రమే నిజాన్ని చెబుతాయి.
సురేష్ రాసిన ‘ది డెత్ ఫోర్ టోల్డ్’ కథ గురించి చెప్పాలంటే దీని కథనం గురించి చెప్పకుండా వీలుకాదు. కథనమే బలం ఈ కథలో. కథ ముందుకూ వెనక్కూ oscillate అవుతూ నడుస్తుంది.
కథలో పాత్రలు ముఖ్య పాత్రలు మూడూ వేరే వారి సంభాషణలో దొర్లి, సాగేవే. ఈ పాసివ్ నరేటివ్ టెక్నిక్ని ఏమంటారో మరి!
కుటుంబరావు ఒక కథలో అంటాడు. ఈ లోకం లో డబ్బులేనివాడిని డబ్బున్నవాడూ, ఆడదాన్ని మగవాడూ, పిల్లలని పెద్దవాళ్లూ అణిచివేస్తారని. ఇదేగాక మరోరకం అణిచివేత ఉంది. అదేంటో ఈ కథ చదివితే తెలుస్తుంది.
అన్యాయాలు తెలియజేయడానికి గొంతుచించుకోనక్కర్లేదు. అలా అని అన్యాయం మౌనంగా ఉండిపోదు. అన్యాయం నిజాన్ని ఘోషిస్తూనే ఉంటుంది. ఈ కథలోలా !
ప్రతీసారి బయటికి చెప్పే నిజాలు మాత్రమే నిజాలు కాదు. వేరే నిజాలు ఉంటాయి . అవి అందరికీ తెలిసిన నిజాలు. అందరికీ తెలిసి, గుర్తించడానికి ఇష్టపడని నిజాలు. అవి అందరూ ఒప్పుకోరు. గుర్తించరు. గుర్తించదలచుకోరు. మనింట్లో రాత్రి మిగిలిన ఎంగిలి మెతుకులు చెత్తబుట్టలో చేరి ఆ తర్వాత చెత్త ఎత్తుకోవడానికి వచ్చిన మనిషితో వెళ్ళిపోయాక, వాటి పరిస్థితి ఏంటో మనం పట్టించుకోనట్లే, ఈ అన్యాయాలని ఇగ్నోర్ చేసే పధ్ధతి మన దగ్గరుంటే బావుణ్ణు. కానీ చెప్పాగా, నిజం ఘోషిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ లోపలి తలుపు పై టాకటక లాడే చప్పుడు చేసి చికాకు పెడుతూనే ఉంటుంది.
అప్పుడప్పుడు ఇలా.. చిరిగిన చొక్కాల మధ్య మెరిసిన నల్లటి చర్మంలా, ఎవరి తప్పునో ఇంకొకరి ఖాతాలో వేసే పాపంలా ప్రాణాన్ని పెనుగులాటలో పెడుతూంది.
ప్రేమో, మోహమో, వలపో, తెగింపో, ధిక్కారమో, పోరాటమో, పతనమో, విజయమో.. ఏమో.. బండి కింద కుక్క బతుకులయేవి కొన్నైతే, ఆ బ్రతుకుల కోసం బండి చక్రాల క్రింద నలిగే రాతలు మరికొన్ని!
రచయితా? చెప్పను. పద్దెనిమిదేళ్ల క్రితం ఒకసారి చదివిన కథని ఇప్పటికీ మెదడు ఆర్కైవ్స్ లో పదిలపరిచేంత బాగా రాశారు! ఈ కథ- గొంతులో మింగిన చేప ముల్లును వదిలించుకునేందుకు మింగిన అన్నపు ఉండ! ఎన్ని ఆత్మాభిషేకాలు చేసుకున్నా జిడ్డు వదలని సత్యం..
ఇలా కష్టపెట్టిన రచయితను క్షమించకూడదు పాఠకులు.
-అపర్ణ తోట
ది డెత్ ఫోర్ టోల్డ్(కథ)
సురేష్
అతన్ని చంపటానికి వాళ్లు బయలుదేరబోయే ఉదయాన సుందరంకి చీకటితోనే మెలకువ వచ్చింది. బనీను చెమటతో తడిసి చికాకు పెట్టడంతో మంచం మీద నుంచి దిగి కిటికీ దాకా నడిచి వాచీ వంక కళ్లు చికిలించి చూశాడు. నిద్ర మత్తెగిరిపోయింది.
మరికొద్దిసేపట్లో రావలసిన బస్సు కోసం అతను ఆదరాబాదరాగా తయారయి ఆ పసుప్పచ్చ రైల్వేక్వార్టరులోంచి బయటపడ్డాడు.
తెల్లారకట్ట వచ్చిన కలలో అతనికి సీమ తుమ్మ చెట్లూ, జిల్లేడు పొదలూ, ఇంజను షెడ్డూ, పైన కప్పిన తాటాకులూ కన్పించాయి. తనొక్కడే ఆ షెడ్డు బయట మడత మంచం మీద వెల్లకిలా పడి నిద్రబోతున్నట్టు, గాలి రివ్వు రివ్వున వీస్తున్నట్టూ కూడా తెలిసి వచ్చింది.
అతని శరీరం వణికింది- ఆ కల గుర్తొచ్చి.
“వాడికెప్పుడూ అదే కల వస్తున్నట్టు చెప్పాడు” అంది బేబక్క రెండేళ్ల తర్వాత నేనా క్వార్టరుకు వెళ్లి నపుడు. “అంతకు ముందు జనపచేలో ఒక్కడే రాత్రిపూట తిరుగుతున్నట్టు కలొచ్చింది వాడికి. నిద్రలోనే వణికిపోయాడు” అని కూడా అంది.
తెల్లారకట్ట వచ్చే ఆ కలలకి అర్థమేమిటో సుందరంకీ, బేబక్కకీ తెలీలేదు అప్పటికి. ఈసారి తెనాలి పోయినపుడు మస్తాను సాయిబుతో తాయెత్తు కట్టించుకోవాలి అనుకున్నాడు సుందరం బస్టాండువైపు నడుస్తూ. అతనికి తల దిమ్మెక్కింది- సగం నిద్రలో లేచిపోవటంతో. కళ్లు మంట.
అతనా కాలనీ దాటి రైలు క్రాసింగు దగ్గర అప్పుడే తెరిచిన బడ్డీకొట్టులో సిగరెట్టు పెట్టె కొనుక్కొని సనత్ నగర్ బ్రిడ్జి డవునులో చాయ్ఖానాలో దూరి రెండు టీలూ నాలుగు సిగరెట్లూ ఊదేశాడు.
గంట లేటుగా తెనాలి బస్సు వచ్చింది. కొందరు బ్రిడ్జి డవున్లో దిగాక అది ‘భెల్’ వైపు వెళ్లిపోయింది. దిగినవాళ్లని ఆదుర్దాగా సమీపించాడు సుందరం.
ఆమె రాలేదు.
“అదింక రాదని వాడికి అనుమానం వొచ్చింది. వాడికిక కాళ్లూ చేతులూ ఆడలేదు” అంది బేబక్క. “ఎప్పుడూ పదిదాకా మంచం దిగడు. ఆరోజు చీకటితోనే లేచాడు మరి’’ అన్నాడు బేబక్క వాళ్లాయన కూడా- నేను వాళ్ల క్వార్టరుకి వెళ్లినపుడు- ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ.
సుందరం అశాంతిగా వెనుతిరిగి వచ్చేసరికి బేబక్క టీ పెడుతోంది. పిల్లలు కళ్లు నులుముకుంటూ లేచి చూస్తున్నారు. సుందరం బావ ఆఫీసుకి తయారవుతున్నాడు.
“వేణ్ణీళ్లు పెట్టు” వంటింట్లో బేబక్కతో అన్నాడు సుందరం.
“ఎందుకు?’’ బేబక్క.
“తెనాలి పోవాలి.’’
బేబక్క అతన్ని లోతుగా చూసింది. కూడగట్టుకొని ఎలాగో అంది.
“నీకా పిచ్చి వదలదంటరా?’’
సుందరం మొహంలో విసుగూ, చిరాకూ. ‘‘నీళ్లు పెట్టు,’’ అనేసి పోయి మంచమెక్కి కళ్లు మూసుకున్నాడు. ఆమె వంటగదిలో మరుగుతున్న టీనే చూస్తూ నిల్చుండిపోయింది.
అదే మొదటిసారి బేబక్క ఆ విషయం అతన్దగ్గిర ప్రస్తావించటం.
నిజానికి అంతకు ఏడాది క్రితం ఆమె ఒంగోలు పెళ్లికి వచ్చినపుడు మా అమ్మ అనేసిందట కూడా.
“ఒళ్లూ పయీ తెలీదంటే ఏబ్రాసీదానా! వళ్లు పులిసి కాదూ నీ తమ్ముడికి ఏశికాలు. ముండా ముచ్చిన ఏశికాలని.’’ అప్పట్నుంచి మధనపడుతూనే ఉంది. అలాంటి విషయాలు ఊరంతా తెలిశాకే అయినవాళ్లకి తెలీటం. ఆమె మనసు కలతబారింది. సుందరం గురించి కాదు, విమల గురించి.
అందర్లాకాక ఆమెకి విమల మీద సానుభూతి వుంది. పసుప్పచ్చని మొహం, పసిపిల్ల నవ్వు, మెరిసే కళ్లూ.
“ఎలాంటి పిల్ల అది. బంగారంలాంటి గుణం, కానీ…’’ అంది నాతో.
విమల బేబక్కకి చిన్నతనం నుంచీ తెలుసు. బేబక్క పెళ్లికి బెరుకు బెరుగ్గా వచ్చింది. అప్పటికి పెద్దదయ్యి నెలో రెండ్నెల్లో.
“కానెంతగా కల్సిపోయింది’’ గుర్తు తెచ్చుకొంది బేబక్క- నా దగ్గర.
ఆ పెళ్లిరోజు నేనూ విమలని చూశాను. తనే నన్ను విడిది వారింటికి లాక్కుపోయింది. వెనగ్గది కిటికీలోంచి సుందరంకి కాబోయే బావని ఇద్దరం రహస్యంగా చూశాం. గరుకు గరుగ్గా పట్టు పరికిణి, చెమట, పౌడరు కలిసిన వింత పరిమళం. మొహంలో కొత్త వెలుగు. తననే చూస్తూ నుంచున్నాను. అంతకుముందు తనతో ఎర్రకిచ్చెయ్యగారి చావిట్లో వెన్నెల రాత్రుల్లో ఆడుకున్న ఆటలూ, పాటలూ గుర్తొచ్చాయి. ‘ఈ విమల కొత్తగా, గరుగ్గా ఉందేమిటి’ అనుకున్నానా రోజు ఆ చిరుచీకటీ, చెమటా నిండిన గదిలో.
మొన్నెప్పుడో శాంత దగ్గర తెచ్చిన క్యుటిక్యూరా పౌడరు వాడినపుడు గుర్తొచ్చింది- ఆరోజు విమల వెంట వచ్చిన పరిమళం అదేనని, ఇప్పుడా జ్ఞాపకానికి పదిహేనేళ్ల వయసు.
అప్పటికి తనకీ అదే వయసనుకుంటా. తెనాలి జె.ఎమ్.జె లో ఇంటరు ఫస్టియరు. రోజూ మా ఊరి మీదుగా పోయే ఎర్రబస్సులో వెళ్తుండేది కాలేజీకి.
“అదలా పట్నం చదువులు వెలిగిచ్చకపోయినా కథ ఇందాకా రాకపోవును. అందర్లా బుద్ధిగా సంసారం జేసుకొనుండును’’ తలపోసింది బేబక్క స్టవ్వు మీద టిఫిను తయారుచేస్తూ. ఈలోగా సుందరం స్నానం ముగించి వచ్చాడు- తల తుడుచుకుంటూ.
టిఫిను ప్లేట్లో పెట్టి అందిస్తూ అంది.
“నా మాట వినరా…. ఇప్పుడెందుకూ తెనాలీ?’’ అంది బతిమాలుతున్నట్టు.
“ఊ!’’ అని ఉరిమాడు సుందరం. ఆ శబ్దానికి పిల్లలు జడుసుకొన్నారు అవతలి గదిలో. ఆమె బిక్క చచ్చిపోయింది.
చిన్నప్పటి నుంచి అంతే. తనకంటే చిన్నవాడన్న మాటేగానీ పుడుతూనే అక్కమీద స్వారీ చేసేవాడు. అందరికీ వాడంటే గారాబం. సూరయ్య తాతకి మరీ. మనవడేం చేసినా ఆయనకి సంబరమే. వాడి దుడుకుతనం వల్ల, ‘రోజుకో గత్తర ఇంటి మీద కొచ్చినా వాణ్ని చంకమీంచి దించలేదు ముసిలాడు’ అని ఈసడిస్తుంది మా అమ్మ ఇప్పటికీ. కానీ ఆయన చివరి దినాల్లో ‘వాడంతే తల్లీ! దెష్టసానిదాని కొడుకు మనింట్లో పడ్డాడు ’ అనేవాడు బేబక్కతో. ‘‘ముసలాయన తీసుకునే రోజుల్లో వాడి దుడుకుతనం ఆయన మీద కూడా సాగించాడు. అందుకే అలా అనేవాడు ముసలి ’’ అంది బేబక్క నాతో తెనాలి బస్టాండులో- అతన్ని వాళ్లు చంపిన మరి వారం రోజులకి.
ఆరోజు తెనాలి బస్టాండు రద్దీగా ఉంది. అమర్తలూరూ, బుర్రిపాలెం బస్సులాగే చోట బేబక్క నిలబడి ఉంది. అప్పుడే మా ఊరి బస్సు దిగి, ‘‘విజయవాడ పోయి ఐద్రాబాదు బస్సు పట్టుకుందామా, లేపోతే బస్టాండు బయటికిపోయి ప్రయివేటు బస్సట్టుకుందామా అని చూస్తన్నా,’’నంది నాతో.
అప్పుడే సుందరంకీ తనకీ ఆనాటి ఉదయాన తమ క్వార్టరులో జరిగిన సంభాషణ చెప్పింది.
“వద్దంటే వింటాడా దెష్ట. చేసంచీ పట్టుకొని గళ్ళ చొక్కా, తెల్లప్యాంటూ వేసుకొని బయలుదేరాడు- టిఫిను కూడా తినకుండానే. ఆ డ్రస్సు అచొచ్చిందని ఆడికదో భ్రమ,’’ నాకప్పుడు గుర్తొచ్చింది. ఆమె చెప్పిన ఆ డ్రెస్సులో సుందరాన్ని రెండుసార్లు చూశాను.
మొదటిసారి అప్పటికి దాదాపు ఏడాది క్రితం… తెనాలి బోసు రోడ్డు మీద అప్సరా టీ సెంటర్ దగ్గర. ఎప్పుడూ ఉడకబోతగా, తేమగా ఉండే తెనాలి ఆరోజు మరీ జిగటగా, జిడ్డోడుతూ ఉంది. అతుక్కుపోయిన గళ్ల షర్టూ, మెడ కింద ఛాతీ మీద జుట్టూ, అందులో మెరిసే బంగారపు గొలుసుతో డబడబలాడే బుల్లెట్టు బండిమీద దిగాడు సుందరం. నేనూ నాగేంద్ర టీ తాగుతున్నాం రోడ్డు మీద.
“గురూ నీతో పనుంది’’ అన్నాడు సుందరం నాగేంద్రతో- ఇంకో టీకి కేక పెట్టి.
నేనవతలికి పోయి సిగిరెట్టు వెలిగించుకొచ్చేసరికి…
“ఎందుగ్గురూ సాగదీయటం ’’ అంటున్నాడు నాగేంద్ర.
“అందుకే గురూ నీ సలా అడగటం,’’ అన్నాడు సుందరం.
“నీకేం మగనా కొడుకువి. బోర విరుచుకు ఊరి మీదపడి ఊరేగినా ఏంకాదు. తన సంగతి ఆలోచించు’’ అన్నాడు నాగేంద్ర చివాట్లు పెట్టే గొంతుతో.
“అదేగా నా బాధ కూడా వదుల్చుకుందామంటే.’’
“ఏమీ?’’
“మళ్లీ రమ్మని కబురెట్టింది చెవిటిగాడితో. మొన్న రాత్రి పెద్ద గలాటా, నేనొచ్చానని తెలిసింది. చావగొట్టాడు, చెయ్యి…’’
“ఊఁ చెయ్యి’’ నాగేంద్ర ఆదుర్దా.
“విరిగింది.’’
“అబ్బ…’’
“అయినా చూడాలనుందని…’’
“ఓరి నీ…’’
“నాకూ బాదేస్తంది. అందుకే…’’
“ఒద్దు గురూ! ఇంక ఆపెయ్యి. సాగదీయబాకు ’’
“అదే నేనూ… అనుకుంట. ఒక్కసారి చూడాలనుంది కళ్లనిండా. ఇంకేమీ ఒద్దు. కన్పించి పొమ్మని… అంటాంది’’
“ పిచ్చా! వెర్రా!’’ గొంతు పెంచాడు నాగేంద్ర.
“ఎల్లకపోతే బాధపడద్దిరా,’’ సుందరం సిగిరెట్టు వెల్గించి మెడ కింద గీక్కున్నాడు.
“ఎల్తే ఎప్పటకీ బాధే తనకి. పోకు. రానని చెప్పేయ్యి.’’
“బతకలేనంటందిరా నేను లేకపోతే.’’
“నీయమ్మ బతకటం… అవతల గొడ్డులా బాదుతుంటే…’’ చీదరిచ్చాడు నాగేంద్ర.
“కొడతాడుగానీ… ఇష్టమే. మంచోడేనంటదిరా.’’
“మంచాడా?’’
“ఊ! ఆపుకోలేక బాదుతాడుగానీ నాకు తెలుసుగా అతను మంచోడే’’ అన్నాడు సుందరం అతని మంచితనానికి తను భరోసా అన్నట్టు.
“సరే ఈ గొడవాపు. ఇంకపోక, రమ్మంటే రానని చెప్పెయ్యి. నాకు వేరే ఏమీలేదనీ నా మీద ఆశ పెట్టుకోవద్దనీ చెప్పు. నిన్ను చూడాలీ- కళ్ల నిండుగా- ఏంటిదంతా? ఇంతకాలం నీ దగ్గరకొచ్చింది ‘దానికోసమే’ ఇంకేమీ లేదని చెప్పు’’
“అలా చేస్తే పని జరుగుద్దంటావా?’’ కొద్దిగా రిలీఫ్ అయినట్టు అడిగాడు సుందరం.
“నీకు నిజంగా బయటపడాలనుంటే జరుగుద్ది’’
“అమ్మమ్మమ్మ. నాకూ తల వాచిపోతా ఉంది. తనకేగాదు. ఇవతల మా ఇంట్లో కూడా… నాకూ కష్టంగానే ఉంది ఈమధ్య బయటికి పోలేకపోతున్నా- అదివరకట్లా’’
‘‘అదేమరి… నీకే అట్టా ఉంటే తనకెంత…?’’
“అదే. అదే. నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇవాల్టితో ఇక కట్టు. అన్నీ బంద్…’’ అని సుందరం బుల్లెట్టు ఎక్కుతూ అన్నాడు.
కాసేపటికి అది డపడపలాడుతూ బుర్రిపాలెం రోడ్డెక్కి మా ఊరివైపుగా పోయింది. అందాకా ఆగి ఆదుర్దాగా నాగేంద్రని అడిగాను.
“ఎవరి గురించి నాగేంద్ర గాడు చెప్పేది?’’
“తెలీలా? విమల. ఎంకటేశం కొట్టాడంట.’’
నాలో ఏదో విచ్చిగిలినట్టయ్యి అక్కడే స్టాలు ముందు బెంచీ మీద కూలబడ్డాను.
“విమలా? మన… విమలా?’’ అని మాత్రం అనగలిగాను గొణుగుతూ.
“ఇంకెవరయినా ఆశ్చర్యపడకపోను. మీ అమ్మ కూడా విమల అనేతలికి నాకు కాల్లూ చేతులాడలా- ఒంగోలు పెళ్లిలో’’ అంది బేబక్క నాతో, నేను వాళ్ల క్వార్టరుకి వెళ్లినపుడు.
నాగేంద్రతో అదే అన్నాను.
“సుందరంగాడు మనూళ్లో ఏ ఆడదాని గురించి చెప్పినా ఆశ్చర్యం లేదు. కానీ… విమల”
నాగేంద్ర వింతగా నిట్టూర్చాడు.
“నువ్వు యూనివర్శిటీలో చేరాక…’’
“ఎంకటేశం కుదురుగా నదురుగా ఉంటాడు. వేరే అలవాట్లు లేవు. మంచోడే అని అందరూ చివరకు సుందరం కూడా సర్టిఫై చేస్తున్నాడు. విమల మీద అతనికి మా ఇదని అందరికీ తెలుసు. అలాంటిది విమల, ఈ ఆవారాగాడు సుందరంతో… ఎలా?’
అడుగుదామనుకున్నాను. కానీ గొంతు పెగల్లేదు.
నిజానికి అంతకు నెల మునుపు… ఏరోపౌర్ణమికి నారాయణ మా హాస్టలుకి వచ్చినపుడు చూచాయగా అన్నాడు కూడాను. కానీ సుందరంగాడి ‘పవర్’ విమల మీద పంజేయదనీ… ఎవడో అతగాడి పేరు పక్కన విమల పేరు జోడించి ఉంటారనీ అనుకున్నాను.
“ఎప్పుడూ తనేదో తన పనేదో, ఇంటి దగ్గర వంచిన తల స్కూల్లోనే ఎత్తేది. బళ్లో ఎవరూ ఏలెత్తి సూపిచ్చంది తన్నొక్కత్తినే’’ అన్నాడు నారాయణ కూడా. అతను విమలకి స్కూలుమేటు.
బళ్లో ఏడెంది తరగతుల కొచ్చేతలికే ఆడామగా పిల్లల మధ్య బొచ్చెడు గొడవలుండేవి ఆరోజుల్లోనే.
“పెళ్లి కూడా… ఇష్టంగానే చేస్కుంది. వాళ్ల నాన్న సెటిల్ చేశాకే అనుకో’’ అని కూడా అన్నాడు.
వెంకటేశం నాకు పెళ్లికి ముందే తెలుసు. అతన్ది చిన కాకాని. మా శివమూర్తి మావయ్యదీ అదే ఊరు. అతని చురుకుతనం, తెలివితేట్లూ వర్ణించి వర్ణించి చెప్పేవాడు మామయ్య.
“ఒరోరేయ్ పిల్నాకొడక! మీ డిగ్రీలు… ఏదీ… నాలిక్కాదు… అది కూడా గీక్కోటానికి పనికిరావని ఆడికి ముడ్డి మీద గుడ్డ గట్టడం రాని వొయసులోనే తెలుసొరే. చిన కాకాన్నించి కలకత్తాకి నిమ్మకాయలు, తమల పాకులు ఎక్సుపోర్టెవుడురా మొదలెట్టింది. ఆడు. పటమట సెంటర్లో పదిసెంట్లు గొని పచ్చడాబా లేపేనాటికి వాడి వయసెంత? ఎంతా అంట? ఆడు అదొదిలేసి పెద రావూరు టూరింగ్ టాకీసు లీజుకు తీసుకున్నాగ్గానీ మనూరోళ్లకి బల్బెలగలా మరి… కలకత్తావోళ్లు మరో చోట్నించి లోడెత్తుకుంటం మొదలేశారని, ఎంటీవోడు శ్లాబ్ పెట్టేనాటికి ఈడా టాకీసు ఎత్తేసి బుర్రిపాలెం రోడ్లో, అయితానగర్లో రెండు ఈడియోపార్లర్లు పెట్టాడా… అందాకా తెనాలోళ్లకి ఈడియో సిన్మా ఉంటాదని తెలుసా అంట.’’
ఆయన పారవశ్యం అలా సాగిపోయేది మరి. అయితే ఆనాటికి తెనాల్లో వెలిసిన వీడియో పార్లర్లలో పది రూపాయలకే ఒక కూల్‌డ్రింక్ (అప్పటికి గోల్డ్‌స్పాట్ రెండో రెండున్నరో…) తో పాటు బ్లూ ఫిల్ము దర్శనభాగ్యం కలిగేది. చెప్పకోవల్సిందేమంటే అప్పటి పార్లర్లలో ఒకటి- అప్పటి అధికార పార్టీ ప్రముఖుడూ ఇప్పటి ఎమ్మెల్యే అయిన అంకినీడు చౌదరిదీ, రెండవది- అప్పటి కోర్టులో మెజిస్ట్రేట్ గా పంజేసి ఇప్పటికీ ‘చండశాసనపు ముండా కొడుకు’ అన్పించుకుంటున్న రామ్మూర్తి నాయుడుదీ. తరచుగా రైడింగులు మాత్రం వెంకటేశం లాంటివాళ్ల పార్లర్ల మీద జరగటంతో… ఇతనది ఎత్తేసి… కొద్ది కాలానికే… సింగిల్‌నంబర్ లాటరీ ఏజెన్సీ తీసుకున్నాడు. దుగ్గిరాల, విజయవాడా, వైజాగ్ నుంచి కూడా కార్లలో వచ్చి టిక్కెట్లు కొని దివాళా తీసిన జనం గోలకి… ప్రభుత్వం కన్నుపడే లోగానే… అప్పటికే మిగిల్చుకున్న లకారాలతో క్షేమంగా బయటపడి, తెనాల్లో మొదటిగా డిష్ పెట్టి, కేబుల్ టీవీ పెట్టి… స్టార్, ఎమ్‌టీవీ, ఎఫ్ టీవీల రుచి మరిగించాడు… తెనాలి వాసులికి.
అయితే, చిన కాకానిలో ఏదో పెళ్లికి వెళ్లిన విమల తండ్రి అక్కడికొచ్చిన కుర్రాళ్ల మీద ఓ కన్నేసి ఉంచటం, అందర్లోకీ నదురుగా చురుగ్గా తిరుగుతున్న వెంకటేశం ఆయన దృష్టిలో పడటం ఆ తర్వాత రాయబారాలు, పెళ్లిచూపులు, లగ్నాలు.
పెళ్లయిన తర్వాత వెంకటేశం అత్తగారింటికే మకాం మార్చాడు- తెనాలి దగ్గరగా ఉంటుందని. కేబుల్ టీవీకి సైడుగా ఓ కంప్యూటర్ సెంటర్ తెరిచి వేలం వెర్రిగా ఎగబడుతున్న జనం నుంచి తన వంతు తాను పిండి ప్రస్తుతం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని తెనాల్లో మొదటి ‘సైబర్ కేఫ్’కు ఓనరయ్యాడు. ఇంకా పదెకరాల మాగాణి, ఇరవై ఎకరాల మెట్టా ఉంది చేతి కింద.
అంత ముందుచూపు ఉండే ‘జెమ్’ని బేఖాతరని విమల- ఆవారాగా తిరిగే సుందరం వెంట…
ఆరోజు బోసు బొమ్మ సెంటర్లో నాగేంద్రని అడగ లేకపోయిన ప్రశ్నను మరి ఆరేళ్ల తర్వాతగానీ అడగలేకపోయాను. ఆరోజు ఇద్దరం నారాయణగూడా సెంటర్ వైపు నడుస్తున్నాం కోఠీ నుంచి. సాయికిషోర్ థియేటర్ ముందు నిలబెట్టిన ‘ఫైర్’ సినిమా కటౌట్లు చూస్తూ అంటున్నాడు నాగేంద్ర.
“ఈ సినిమాలో ఎవడికీ పట్టని పనివాడి పాత్రే తీసుకో. రోజల్లా గాడిద చాకిరీ చేసి చివరాఖరికి బండి కింద కుక్కలాంటి బతుకులోంచి ఆనందిద్దామని రాత్రిళ్లు వాడు చేసే పనులు… బ్లూఫిల్మ్, మాస్టర్బేట్… సిన్మాలో రెబెల్ గా అగుపించే షబ్నా వాడ్ని ఎడాపెడా కొడుతుంది. అతన్ని ఓ గంధోళీగాడిలా చిత్రించిన దీపా మెహతా అతి తెలివినలా ఉంచు. వాడ్నీ వాడి చేష్టల్నీ చూసి కుర్చీలో ఎగిరెగిరిపడి నవ్వుకునే సూడో మేధావుల్నీ, స్త్రీలనీ ఏమందాం? బహుశా శివసేనకీ, స్త్రీవాదులకీ అక్కర్లేని జీవితం వాడిది. కాగా, వాడి కళ్ల వెనక నీలినీడల్లో… నాకు విమల జాడలే అగుపించాయి’’.
నాకు షాక్ తగిలినట్టయ్యింది.
విమల ‘అవుట్‌లెట్’ గా సుందరాన్ని ఎంచుకుందా? బండి కింద కుక్కలా తయారయిందా తన జీవితం కూడా? నదురుగా చురుగ్గా జెమ్ లా అగుపించే వెంకటేశంతో అంత దుర్భరమయిందా తనకి సంసారం?
“కానీ… కానీ… అసలు సుందరంతో తనని ఊహించటమే కష్టంగా ఉంది… ఇప్పటికీ’’ అన్నాను.
“నువ్వు… కారణాల కోసం వెతుకుతున్నావు. మనిషి చర్యలకీ, ప్రవర్తనకీ… అందరికీ ఆమోదయోగ్య మయ్యే కారణాలు ఉంటాయని నేననుకోను… కాగా… విమల ఎందుకలా… ఎందుకలా… అనే బదులు… తర్వాత ఏం జరిగిందని చూస్తే నీకూ… నీ ఆంథ్రోపాలజీ చదువుకీ పని తగుల్తుంది”
“ఆగాగు… కొంచెం అక్కడ కూచుందాం,’’ అని చిక్కడపల్లి రోడ్డు మీద కన్పించిన ఇరానీ టీ సెంటర్లోకి నడిపించాను నాగేంద్రని. నేను వెనక్కి చారగిలబడి తిరగతోడటం మొదలెట్టాను ‘ఆ తర్వాత’ ఏం జరి గిందని.
నిజానికి తర్వాత ఏం జరగబోతోందని నారాయణని ఎప్పుడో అడిగాను ఓసారి… ఇద్దరం మా ఊరి బయట కల్వర్టు మీద కూర్చున్నపుడు.
“ఏమిటంటున్నావు” అన్నాడు నారాయణ అర్థం కానట్టుగా.
“నిన్న… తెనాల్లో సుందరంగాడు నాగేంద్రతో చెప్తు న్నాడు. విమల చెయ్యి విరిగిందని’’ అన్నాను విషయం లోకి దిగిపోతూ.
“ఊ!’’ అన్నాడు నారాయణ అన్యమనస్కంగా.
“వీడు పోతూనే ఉంటాడా ఇంకా?’’ అన్నాను సుందరంను ఉద్దేశించి.
“ఊ! వీడు పోవటం, అతను కొట్టటం’’
“వాళ్లేమీ ప్రయత్నం చేయలా?’’
“ఎందుకు చేయరు? విమల వాళ్లమ్మ కాపలా అని తెలీకుండా.. అక్కడక్కడే తిరుగుతుంటుంది. వెంకటేశం కూడా కొన్ని పనులు తగ్గించుకుని ఇంటిపట్టునే ఉంటున్నాడు’’
“మరి?’’
“వీలు కుదిరినపుడు చెవిటిగాడితో కబురెడుతుంది”
“ఊహూ! అదికాదు. ఈ గొడవంతా ఎలా భరిస్తోందని?’’
“ఎలా అనేకంటే ఎందుకు అనేది కరెక్టు ప్రశ్నేమో?’’ అన్నాడు నారాయణ. అతని మొహంలో లిప్తపాటు విసుగుతో పాటు విషాదపు ఛాయ.
“అది… అది… తనకే తెలుసు…’’ అని కూడా అన్నాడు. తనకు తనే జవాబుగా.
“ఇదెటు దారి… ఏం జరగబోతోంది?’’ అడిగాను.
సరిగ్గా అప్పుడే మా ముందుగా కండ్రిక డొంకవైపు గేదెలను మళ్లిస్తున్న చెవిటిగాడి వైపే చూస్తూ మాటాడ్లేదు నారాయణ. చెవిటిగాడి…. రెండు పీలికలయిన చొక్కాలోంచి నల్లగా వీపంతా కన్పిస్తోంది. వాడి చంకన తాబేటికాయ. నీళ్లతో సగం తడిసిన అర్ధభాగం మరింత నల్లగా మెరుస్తోంది. బక్కచిక్కిన బొమికలన్నీ మోగించుకొంటూ ‘‘ఎహ్హేనీయమ్మ ’’ అంటున్నాడు పక్క చేలోకి దూకబోతున్న నల్లపడ్డతో.
కాసేపటికి ‘‘ఏమో?’’ అనగలిగాడు నారాయణ. అతని గొంతులో చిత్రంగా వొణుకు.
చిక్కడపల్లిలో నాగేంద్రతో కూర్చున్న రోజుకి ఏడెని మిది నెలల ముందు మా ఊరు వెళ్లినపుడు వెంకటేశం వాళ్లింట్లో పనిచేసే పనిమనిషి నల్లాం (నల్లమ్మ) కూడా కొన్ని వివరాలు చెప్పింది. అప్పటికే చాలాకాలం అయి ఉండటం వల్లనో, లేక ఆ గొడవంతా గుర్తు చేస్కోటానికి ఇష్టం లేకపోబట్టోగానీ… ఆమె మొహం మీద చెప్పరాని ఇబ్బంది. నా వంక కళ్లు చికిలించి చూస్తూ వంగిన నడుముని ఓ రోడ్డువార చెట్టుకి జారేసి,
“ఎందుకు బాబుగోరూ ఈ ఇసయాలన్నీ?’’ అని మాత్రం అడిగింది.
నేను తలొంచుకుని మట్టిలో గీతలు గీస్తున్నాను.
కాసేపటికి నోరు విప్పింది…
“ఓసారి బాబు (వెంకటేశం) బండి వత్తుండగా సుందరం బాబు జనపచెక్కలోకి దూరి పరారయ్యాడు. ఇసయం నాకూ ఎరికలేదు. ఇద్దరూ స్నేహితులేనాయె. బాబు ఇమ్మలమ్మని ప్పేళ్లున కొట్టాడు… గుమ్మంలో నిలబడ్డ మడిసిని గుమ్మంలోనే అట్టుకొని…’’ అనింది.
మెల్లగా మరికొన్ని విషయాలు తెలిశాయి… ఆమె నోటి ద్వారానే.
సుందరం వెంకటేశం ఇంటికి వెళ్లటం… ఇద్దరూ అప్పుడప్పుడూ కోడిమాంసం బీరు సీసాల్తో పొద్దుబుచ్చటం ఎప్పట్నించో ఉంది. వాళ్లూ వీళ్లూ దూరపు బంధువులు కూడా. మెల్లగా గొడవ మొదలయింది మాత్రం విమల కారణంగానే.
కానీ… విషయం బయటికి పొక్కనివ్వలేదు రెండువైపుల వాళ్లూ. చివరిదాకా అంతా నిశ్శబ్దంగానే…
విమలకి పడిన దెబ్బలూ, తన్నులూ, అరుపులూ, కేకలూ, వాళ్ల వీళ్ల కుటుంబాల మధ్య రాజుకున్న పొగ లేని నిప్పు, ద్వేషాలూ, పగలూ అన్నీ నిశ్శబ్దంగానే….
ఆ నిశ్శబ్దానికి పరాకాష్ట… ఓ సాయంకాలం.
అనుకోకుండానో అనుకునో హఠాత్తుగా తెనాలి నుంచి తిరిగొచ్చిన వెంకటేశం… ఇంట్లో విమలతో సుందరం.
ఏం జరిగి ఉంటుంది? ఏం జరగనుంది… ఆ ఇంటి లోపల…?!
లోపలికి వచ్చిన వెంకటేశం వగరుస్తున్నాడు. సుందరం చొక్కా సగం వరకు గుండీలు వదులై వేలాడుతోంది. అతని ఛాతీ మీద జుత్తులోకి నుదురు నుంచి కారిన చెమట చుక్కచుక్కగా పడి మాయమవుతోంది. గోడకి ఆనుకున్న విమల… విహ్వలమయిన చూపుతో ఆ ఇద్దర్నీ చూస్తోంది. చీరకొంగు చేతికి చుట్టుకొని నోటికి అడ్డంగా నొక్కి పెట్టింది.
మగవాళ్లిద్దరూ ఒకరినొకరు నిశ్శబ్దంగా గమనించుకున్నారు చాలాసేపు… ఉక్కగా… ఉడకపోతగా…
ముందు ఎవరు కదిలారో చెప్పటం కష్టం. బహుశా సుందరమే గది బయటకు నడిచే ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదూ అతని ఉద్దేశ్యాన్ని ఊహించి వెంకటేశమే కదిలాడేమో.
సుందరం చొక్కాపట్టుకొని నేలమీదకు గుంజాడు వెంకటేశం. సగందాకా తెరుచుకొని ఉన్న ఆ చొక్క పర్రున చిరిగింది. నేలమీద దేకుతున్న సుందరాన్ని మీదకి వంగి మోచేతుల్తో కుమ్మటం… అతను వెల్లకిలా దొర్లి కాలి సత్తువకొద్దీ తన ఒకప్పటి మిత్రుడిని పొత్తి కడుపులో తన్నటం… వెంకటేశం వెనక్కి వెనక్కిపోయి కుర్చీల మీద అడ్డంగాపడ్డాడు. అవన్నీ చెల్లాచెదురయ్యాయి.
అతను ఎలాగో లేచి నిలబడి సుందరం మీదకి గొప్ప ఆవేశంతో ఉన్మాదంతో ఉరికాడు. ఆత్మరక్షణ కోసం సుందరం, తన శక్తినంతా కేంద్రీకరించి ఎదుర్కొన్నాడు. పావుగంటలోపు ముగిసిన ఆ యుద్ధంలో ఇరువురూ రొప్పుతూ రోజుతూ అలసిపోయారు. అయినా గానీ ఇద్దరూ పెదవులు బిగపట్టి నిశ్శబ్దంగా మూలుగులు సైతం లేకుండా ఆ పోరాటం సాగించారు.
ఎలాగో వీలు చిక్కించుకొని సుందరం బయటకు ఉరికాడు. గుమ్మం దాటేలోగా గుర్తొచ్చింది- తన అవతారం. చొక్కా వేలాడుతూ మోకాళ్లను దాటి నేల మీద జీరాడుతోంది. ఇలాగ్గానీ రోడ్డంటా నడిచి రెండు సందులు దాటి తన ఇంటికి చేరితే….
అతడో క్షణం తటపటాయించి ఏదయితే అది కానిమ్మని బయల్దేరేలోపు… మీదికి ఒక సరికొత్త చొక్కా ఉండలా వచ్చిపడింది. దాన్ని విసిరిన వెంకటేశం లోపల గదిగుమ్మంలో పళ్లు నూరుతూ నిలబడి ఉన్నాడు.
సుందరం తాపీగా చొక్కా విడిచి గోడపక్కన పడేసి వెంకటేశం చొక్కా తొడుక్కుని బయటకు నడిచాడు.
ఈ మొత్తం విషయం నల్లాంకు తప్ప ఎవరికీ తెలీదు ఈనాటి వరకూ… పక్కింటి వాళ్లక్కూడా.
“బాబులిద్దరూ గుబికీ గుబికీమని గుద్దుకున్నారా… నోరెత్తి ఒక్క మాటా ఒకర్నొకరు అనుకోలా… చావుదెబ్బలు తగిల్నా ‘ఆ’ లేదు ‘ఊ’ లేదు. మూగోళ్లయినా మూలిగి చత్తారు ఆ టయంలో. పరువు పోద్దని కామాలు,’’ అని కూడా చెప్పింది నల్లాం.
“పరువు కూడా ఓ కారణమే అనుకో… అంతకంటే ఏంలేవూ… ఓ రకంగా ఆలోచిస్తే ఆడదాన్నీ ఆస్తినీ పోల్చచ్చు. తన ఆస్తి మీద పరాయివాడి చెయ్యి పడిందని వెంకటేశం… పరాయివాడి సొత్తును ఆనందించే సుందరం…’’ అన్నాడు చిక్కడపల్లి టీ సెంటర్లో టీ తాగుతూ నాగేంద్ర.
“వెంకటేశంకి మనసు లేదూ విమల మీద?’’ నివ్వెరబోయాను.
“తప్పకుండా… లేకుంటే ఎప్పుడో తన్ని తగలేసేవాడేమో… మళ్లీ దానికీ పరువు అడ్డమే అనుకో… అయినా ఈ కథలో అన్ని రసాలూ ఉన్నాయి. ముఖ్యంగా బీభత్సరసం,’’ అన్నాడు నాగేంద్ర- మళ్లీ ఇద్దరం ఆర్టీసీ క్రాస్‌రోడ్ వైపు నడుస్తుండగా.
ఎందుకు లేదూ… బీభత్సం… మొత్తానికి ప్రత్యక్ష సాక్షి నారాయణ అంతా చెప్పాడు. అతడి హత్య జరిగిన వారంరోజులకి – సరిగ్గా బేబక్కను తెనాలి బస్టాండ్లో హైదరాబాదు బస్సెక్కిచ్చిన రోజు ఉదయాన…. ఇద్దరం మా ఊరి కండ్రిక డొంకలో నడుస్తుండగా.
“ఆరోజు అడిగావు కాదూ… మనిద్దరం కల్వర్టు మీద కూచున్నప్పుడు, ఏం జరగబోతోంది అని…’’ నారాయణ గొంతు మళ్లీ చిత్రంగా వణికింది- ఆరోజు లాగే.
“ఇక ఎంతకీ ఈ వ్యవహారం ఆగదనీ… ఎక్కడో చోట తెగ్గొట్టాలనీ నిర్ణయించుకొంటున్నారు వెంకటేశం వాళ్లు- వాళ్ల పెదనానలూ, మేనమామలూ, ఇంకా వెంకటేశం బామ్మర్దీ ఆ బలగం.
వెంకటేశం కంటే వాళ్లకే పీకలమొయ్యా ఉంది కోపం సుందరం మీద. నిజానికి వెంకటేశం ఈ గొడవ లన్నిటికీ దూరంగా ఉన్నాడని అంటారు- చివరిదాకా. ‘వాడు ఆడంగి నాకొడుకు,’ అని ఊళ్లో ప్రచారం చేసింది ఎవరో కాదు- స్వయానా విమల తండ్రి.
ఈసారితో సుందరం గాడు సఫా అని వెంకటేశం బామ్మర్ది ఒకళ్లిద్దరితో చెప్పాడు కూడాను. ముఖ్యంగా సుందరం వాళ్ల నాన్న షడ్డకుడితో. అటు వాళ్లు సిద్ధమయ్యారని తెలిశాక ఇటు సుందరం వాళ్లూ సై అన్నారు. వీళ్లకేమయినా తక్కువుందారా? ఉమ్మడివాటా చీలిస్తే సుందరంగాడికొచ్చేదొక్కటే పదిహేనిరవై లకారాలవుద్ది. పులిసి ఉన్నారు నాయాళ్లు. తూకం వేస్తే వెంకటేశం వైపే తగ్గుందేమో. కానీ… ఆడదాని విషయమాయె. వాళ్ళెట్టా వెనక్కి తగ్గుతారు.
అక్కడ్నించీ… అటు వెంకటేశం వాళ్ల సందు నుంచీ పటమట సెంటర్ మీదుగా, ఇటు సుందరం గాడుండే గాంధీబొమ్మ సెంటర్దాకా… గాలి కదిలితే ఒట్టు. ఇదిగో… ఇంకో గంటలో వాళ్లు ఎటాక్ ఇస్తారనీ వీళ్లూ… అంతకుముందే ఎదురుదెబ్బ కొడతారని వాళ్లూ… వాళ్లందరి కంటే మన పేట వాళ్లందరూ ఎదురు చూడ్డమే.
సుందరంగాడు సెంటర్లో బడ్డీకొట్టు కొచ్చినా వాడి పక్క పదిమందికి తగ్గకుండా మన కుర్రనాయాళ్ల కాపలా, వాడి ప్రభ అట్టా వెలిగింది కొన్నిరోజులు.
ఈలోగా విమల చెయ్యి విరగటం… ఒక్కసారయినా కన్పించిపొమ్మని విమల చెవిటిగాడితో కబుర్లు పెట్టడం… వీడు కుదర్దనటం… మరి సుందరంగాడే మనుకున్నాడో… ఉన్నట్టుండి ఊళ్లోంచి మాయం అయ్యాడు. ఇక్కడ చుట్టూ కాపలాతో ఎంతకాలం అనుకున్నాడో… లేక ఇక్కడ కుదర్దు గనక ఇంకెక్కడికయినా విమలని రప్పించుకుందామనుకున్నాడోగానీ… జెండా ఎత్తేశాడు. ఇక్కడ ఉంటే మాత్రం ఎలాగయినా ఏసేసే వాళ్లే. బతికిపోయాడనుకున్నాం. మరి చావుగీత వాడి మొహాన అట్టా అందరికీ కన్పడతా ఉండింది అప్పటికి. వాడు తిన్నగా హైదరాబాదులో బేబక్క ఇంటికి పోయాడని ఒకళిద్దరికి తప్ప బయటికి పొక్కనీయలేదు. పోయే ముందు… విమల్ని ఎలాగయినా హైదరాబాదుకి రమ్మనీ… ఎక్కడ దిగి ఎక్కడికి రావాలో… వివరంగా రాసి చెవిటిగాడి తో చెప్పి పంపాడనీ అంటారు.
ఇందాక చావుగీత… అన్నాను కదూ, అది… నిజంగా నుదిటి మీద చాంతాడులా ఉన్నా… మనం చూళ్లేకపోయాం విమల మొహాన్ని… ఇక అనవసరం అనేసుకుందో… ఎంకటేశాన్ని వదల్లేకపోయిందో… సుందరంని కాదన్లేకపోయిందో… ఇల్లు దాటటం కుదుర్చుకోలేకపోయిందో గానీ… ఆ మధ్యాహ్నం… ఎవరూ లేకుండా చూసి… ఎండ్రిన్ తాగేసింది’’
“విమల శవం లేచేలోపు…’’ ఆగాడు నారాయణ. ఆసరికి ఇద్దరం డొంకలోంచి పల్లపు చేలోకి దిగి నారుమళ్ల కడ్డంగా బురదలోంచి కాళ్లీడ్చుకొంటూ నడుస్తున్నాం. కొంచెం అవతలగా చింతలగట్టు కింద సుందరం వాళ్ల చేను.
అది కాదు నేను చూస్తున్నది.
ఆ చేను మీద గుంపులు గుంపులుగా ఎగురుతున్న రాబందులు. నా గుండెలు అదిరాయి…
నా చెయ్యి నొక్కిపట్టాడు నారాయణ.
“విమల శవం లేచేలోపు… మరొకటి లేవాలనుకున్నారు. ఆరోజు… మనం కల్వర్టు మీద కూచున్నపుడు నేను స్పష్టంగా చూశాను. చావుగీత… చెవిటిగాడి మొహం మీద, నీతో చెప్పలేకపోయాను,’’ అన్నాడు.
“అంటే… అంటే…’’
“అవును’’
మా తలల మీదుగా రాబందువులు రివ్వున ఎగురుతున్నాయి. ఎదురుగా సుందరం చేలో చీలికలయిన చొక్కా కింద పీలికలయిన శరీరం.
నేను చేష్టలుదక్కి చూస్తున్నాను. వారంరోజులుగా ఆ శరీరం అక్కడ ఒంటరిగా… నక్కలూ, రాబందులూ సాక్షిగా… కుళ్లుతూ చివికిపోయి, కనీసం శవాన్నయినా తీసికెళ్లలేని వాడి తండ్రి మీద, అతగాడుండే మాదిగ పల్లెమీద, మా ఊరి మీద అసహ్యమయిన జాలి.
నా మొహం చూసి అన్నాడు నారాయణ.
“వారంగా ఎవరూ ముందుకి రాలా. వాడి తండ్రి ఆ రాత్రే పరారు. ఇంకా తిరిగిరాలా. దహనానికి దిక్కు లేదు. ఇక పోలీసులూ కేసూ… ధూత్ ఉత్తమాట,’’ చీదరించాడు.
నా మనసంతా ఆ శవం దాటి, చేను దాటి, ఊరు దాటి… ప్రవహిస్తోంది.
“ఇంత జరుగుద్దనే… అతన్ని డిసైడ్ చేశారని తెలిసి కూడా నీకు ఆ రాత్రి ఫోన్లో చెప్పలేకపోయాను… కానీ… కానీ… జరగబోయే చావుని… ఆ గీతని… ఎవడూ తప్పించలేడని… మనం గుడ్లప్పగించి చూట్టం తప్ప… అని నీకు చెప్పలేకపోయాను.’’
అప్పటికి ముందే తెలిసిపోయిన చావుని ఆపలేని నిస్సత్తువలో నారాయణ ఇప్పుడు కూలబడ్డాడు నేల మీదకి. అవును. ఆ చావు కంటే ముందే అది తెలిసిపోవటం భయంకరంగా ఉంది. నాకు కడుపు తెర్లుతోంది.
అవును ఆ రాత్రి నాలుగింటికి నారాయణ నుంచి ఫోన్ వచ్చాక నేను హాస్టల్ నుంచి బయటపడి సనత్‌నగర్ కి ఆటో పట్టుకున్నాను. సగం నడక, సగం పరుగు, నేను సనత్‌నగర్ బ్రిడ్జి డవున్లోకి దిగేసరికి ఎదురొచ్చాడు… గళ్ల చొక్కా, తెల్లప్యాంటూ చేసంచితో… సుందరం. అప్పటికి అతన్ని ఆ డ్రస్సులో చూడటం రెండోసారి.
“ఆ ఉదయాన సుందరాన్ని అక్కడే ఆపబట్టి చావుగీత తప్పిపోయిందని ఇందాకా అనుకున్నాను పొరపాటు’’ అన్నాను ఆర్టీసీ క్రాస్‌రోడ్ లో నాగేంద్రతో.
నా మొహంలోకి సందిగ్ధంగా చూశాడు నాగేంద్ర.
“అవును. సుందరంకీ, వెంకటేశంకీ అలాంటి వాళ్లకీ నుదుట్న ఆ గీతలుండవు. అంతకంటే ముఖ్యంగా అవి ఉన్న వాళ్ల చావులు ముందే తెలిసిపోతాయి. సరిగ్గా తేరిపార జూస్తే,’’ అన్నాను.
“అంటే…’’ అన్నాడు నాగేంద్ర.
‘‘ఆ రోజు బోసుబొమ్మ సెంటర్లో సుందరంగాడు నీతో చెపుతున్నపుడే రాశాను ఈ కథంతా…’’ నాగేంద్ర స్తబ్దుడై తన చేతిలో గత ఆరేళ్లుగా చివికిపోయి ఉన్న ఈ పేపర్లు వదిలేశాడు.
అవి పావురాలై ఆర్టీసీ క్రాస్‌రోడ్ అంతటా ఎగర నారంభించాయి రివ్వు రివ్వున.
**** (*) ****
Credits:
మొదటి ముద్రణ: ఆంధ్రజ్యోతి 1999
రెండవ ముద్రణ: కథ-99
ఆర్ట్: అక్బర్
సుందరం చనిపోలేదా చెవిటిగాడే చనిపోయాడా?