ఒక్కొకటిగా రాలుతున్న ఆకులతో అడవి మొత్తం బోడితలతో దర్శనమిస్తోంది. ఉక్కబోతలో గడ్డకట్టిన నిశ్శబ్దంలో ఒక మూలనుంచీ కనిపించని కోయిలొకటి విచారంగా కూస్తోంది.
మిట్టమధ్యాన్నపు ఎర్రటి ఎండ, పూడుకుపోతున్న చెరువులు, నట్టడివిలో కాలుతున్న జర్తె, బేసిన్ బ్రిడ్జ్ దగ్గర వరుసలు కట్టిన టమేటా బండ్లు, తిరుపతి ఇరానీ హోటల్లో కవిత్వపు చర్చలూ, కబ్బన్ పార్కులో మామిడి పండ్ల అమ్మకం, మానవప్రాణి కనిపించని ఒంటరి రైల్వే స్టేషన్ లో ఏకాకిలా జెండా ఊపుతున్న ష్టేషన్ మాష్టర్, దొంగ కుక్క మెడలో ఇరుక్కున్న మట్టి కుండ, తన మరణం వరకూ ఊరి చెరువును కబ్జా కానీకుండా ఆపిన చీకల సుబ్బమ్మ, అనంత దుఃఖదాయని హొగినేకల్ జలపాతపు ధ్వనీ…
దాదాపు రెండు దశాబ్దాల నుంచీ కనిపించకుండా పోయిన రాయలసీమ కోయిల ‘మహేంద్ర’ ఆ మధ్య దాకా వినిపించి పోయిన పాటలు ఇవన్నీ.
కథ రాయటాన్ని జీవిత వాంఛగా మలుచుకున్న రచయిత మహేంద్ర. లేకపోతే “ఏనుగుల రాజ్యం” అని రాయాలనుకొన్న నవలిక కోసం తలకోన నట్టడివిలో మధ్యలో ఏ రక్షణా లేకుండా కొన్ని రాత్రిళ్ళు గడిపి, దానికి మూల్యంగా తన ప్రాణాన్ని ఎందుకు చెల్లిస్తాడు.
అట్లా అని – అది జీవిత వాంఛ కదా అని – పుంఖాను పుంఖాలుగా కథలు రాసి పాఠకుల్ని చిత్రవధ చేసే ప్రలోభానికీ లోనుకాలేదు. తీరాచూస్తే తన స్మృత్యర్ధం ప్రచురించిన ” కనిపించని కోయిల” సంపుటంలో అన్ని కథలూ కలిపి – ఓ పదిహేను లోపే ఉన్నాయి- 1980 నుంచీ రాసినవి.
అయితేనేం?
ప్రతి సన్నివేశంలో, వాతావరణ చిత్రణలో, కథా సంవిధానంలో తన ముద్ర కనిపిస్తుంది. జాగ్రత్తగా వెతికితే మహేంద్ర ప్రతీ వాక్యాన్ని ఎంచి ఎంచి ఎంతో నిగ్రహంగా రాసినట్టు తెలుస్తుంది. అలాంటి నిగ్రహం, నేర్పూ ఉన్న రచయితలు మనకు అరుదని మాత్రం చెప్పవచ్చు.
అంతకు ముందు మహేంద్ర రాసిన “స్వర్ణ సీమకు స్వాగతం” నవలిక, “పర్వవేలా తరంగాలు ” కవిత్వం సాహిత్యాభిమానులకు గుర్తుండే ఉంటాయి. తన “బేసిన్ బ్రిడ్జ్ దగ్గర, జర్తె, ముసలమ్మ మరణం, ఇంధనం” కథలు కోయిల పాటల్లా శాశ్వతంగా వినిపిస్తూనే ఉంటాయి – మన లోలోపల. ప్రాణం పెట్టి కథ రాయటాన్ని ఒక విలువగా ఏర్పరిచి పోయిన మహేంద్ర గురించి “సితారా తీగె తెగిపోయింది. యవనిక జారిపోయింది” అన్నారు మునిపల్లె రాజు గారు ‘ కనిపించని కోయిల’ కు ముందు మాటగా రాసిన తన ‘స్వప్న రసాయన శాస్త్రం’లో.
“ఈ కథ ఒక సౌందర్య జీవన జలపాతం. జలజలా పొంగిన సంతోషం. అగాధంలోకి దూకుతూ మధ్యలోన శిలగా నిలిచిపోయిన విషాదం. సాధారణ జీవనానంద విషాదాలకు అసాధారణ రసాత్మక వ్యాక్యాక్షర చిత్రణి” అన్నారు వడ్డెర చండీదాస్ మహేంద్ర రాసిన ‘హొగినేకల్’ కథ గురించి.
18-3-1987 ఆంధ్రప్రభ వార పత్రిక నుంచీ ఆ కథ ఈ నెల ‘వాకిలి’ పాఠకులకోసం ప్రత్యేకం.
Story Clipping Credit: www.kathanilayam.com
పాత తరం గొప్ప కథకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ మధురాంతకం రాజారామ్ మాస్టారు గారి అబ్బాయి మధురాంతకం మహేంద్ర గారి ‘హొగినేకల్’ కథను పరిచయం చేసిన సురేష్ గారికి ధన్యవాదాలు. మధురాంతకం మహేంద్ర గారి రచనలు అన్నీ మళ్ళీ పునర్ముద్రణకు నోచుకుని పాఠకులకు అందుబాటులో రావాలని మా కోరిక.
అవును.
ఈ తరం రచయితలకు కూడా తెలీకుండా పోతున్న గొప్ప రచనా శిల్పి మహేంద్ర.
ఆయన రచనల పునర్ముద్రణకు సాహిత్యాభిమానులు పూనుకొంటారని ఆశిద్దాం.