మెరుపు తీగల వంటి కవులొచ్చిన 1985లలో ఆ కవుల మధ్యకు బిక్కుబిక్కుమంటూ వచ్చి, అతికొద్ది కాలంలో తనదయిన కవిత్వ వాక్యదీపాన్ని సరిదీటుగా వెలిగించిన కవయిత్రి కె.గీత. దయలేని జీవితం విధించిన నిశ్శబ్దాల్ని దాటుకొని, రాయలేనితనాల్ని గట్టెక్కి, ఇప్పుడు మూడో పుస్తకమయి మీతో పలకరిస్తున్న విజయగీతిక గీత.
ఏదైనా ఒక జీవితం కవిత్వం వల్ల సుసంపన్నమవుతుందా? కవిత్వంవల్లే పరిపూర్ణతను పొందుతుందా! కేవలం కవిత్వం రాయడంవల్ల సాంత్వనని పొంది మరి కొందరికి మార్గం చూపించగలదా!!
అవును-కవిత్వానికి ప్రపంచాన్ని తన ప్రేమైక హస్తాల్లోకి తీసుకుని వెన్ను నిమరగల గొప్ప మన:శ్శక్తి ఉంది. అది నిన్ను బతుకు నించి వేరు చేసి జీవింపజేస్తుంది. మరణం అణగద్రొక్క లేని జీవితాన్ని ప్రసాదిస్తుంది. మన చుట్టూ అన్ని బంధాలతో ముడిపడి,అన్ని బంధాలూ తనే అయ్యి శ్వాసగానూ, పులకరింతగానూ, అనుభూతిగానూ అల్లుకుంటుంది. కవిత్వమే జీవితమై, జీవించడమే కవిత్వమై ఆవిష్కరిస్తుంది.
*
నేనెందుకుకవిత్వం రాసేను? మొదటి కవిత ఎలా రాసేను ? ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
మొదటిప్రశ్న కు సమాధానం ఇంకాదొరకలేదు. అయితే మొదటి కవిత”ఓ రోజంతా! “నిజంగానే ఒక వర్షం వచ్చివెలిసిన పొద్దుట పూట బురద సందుల్లోంచినడుచుకుంటూ వెళ్లినపుడుదారిలో నాకు కనబడిన యదార్థసంఘటనల సమాహారం. అయితేఅప్పటికి ఇంటర్మీడియేట్ చదువుతున్న నాకు చిన్నతనం నుంచీమా అమ్మ( కె.వరలక్ష్మి)చదవమని సూచించిన పుస్తకాన్నీ లైబ్రరీ నుంచి తెచ్చుకుని బాగా చదివే అలవాటు ఉండేది. పదోతరగతి లోనేనేను శరత్ సాహిత్యం మొత్తం చదివేను. మొక్కపాటి, కొకు, రాచకొండ, అనేక రష్యన్అనువాదాలు …… దాదాపుపేరు ప్రఖ్యాతులున్న రచయితలపుస్తకాలన్నీ చదివేను. మా ఇంట్లో అమృతంకురిసిన రాత్రి, మహా ప్రస్థానం, గీతాంజలి,కృష్ణ శాస్త్రి కవితలు మొదట చదివేను. ఆతర్వాత లైబ్రరీ నుంచి చదివిన తొలికవిత్వం ఆలూరి బైరాగి కవితలు. చివరికి కొన్నాళ్లకి కేవలం కవిత్వం మాత్రమే ఇష్టం కావడం మొదలైంది. ఇంటికిసాహిత్య పత్రికలన్నీ వస్తూ ఉండేవి. నాకుకవిత్వపిచ్చి ఎంతగా ముదిరిందంటే ఆంధ్ర జ్యోతి “సాహిత్య వేదిక” లో వచ్చే కవితలకోసం వారమంతా ఎదురు చూసి సోమవారం సాయంత్రం ఆ పేజీని కత్తిరించి మా అన్నయ్య పాత బోటనీ రికార్డుపుస్తకం లో వరసగా అతికించేదాన్ని. అప్పుడే అఫ్సర్, చినవీరభద్రుడు, వసీరా, ఆశారాజు, శివారెడ్డి, శిఖామణి… ఇలా అందరి కవితలు, ఒకో కవిత పదేసి సార్లు గుర్తొచ్చినప్పుడల్లా మళ్లీ మళ్లీ కంఠతా పట్టినట్లు చదివేదాన్ని. కవుల గురించి చేరా,కోవెల, ఇతరులు రాసే ప్రతి వ్యాసాన్నీతప్పక చదివేదాన్ని.
ఇలా కవిత్వం చదువుతూ మైమరుస్తూ అనుకోకుండా ఒక రోజు రాసిన కవిత”ఓ రోజంతా!”. మాఅమ్మకు చెప్పకుండానే ‘ఆంధ్రజ్యోతి’కి పోస్టు చేసాను. ఆ పై సోమ వారమే అది ప్రచురితమైంది. ఆ మర్నాటికి అప్పటి ఆ పేజీ ఎడిటర్ అయిన అఫ్సర్ గారి నుంచి ఒక ఉత్తరమూ వచ్చింది. ఆ ఉత్తరాన్ని , నాతొలి కవితని ఇప్పటికీ భద్రంగా దాచేను. ఇది జరిగి సరిగ్గా పాతికేళ్లు అయ్యింది. ఆ ఉత్తరం లో ప్రతి వాక్యం నన్ను బాగా ఉత్తేజితురాల్నిచేసి, తర్వాతి కవితల్ని రాయించింది.
ప్రపంచమంతా చాలా అందంగా కనిపించే ఆ వయసులోనే నాకు ఎవరి కష్టం చూసినా విపరీతంగా దు:ఖపడే సున్నితత్వమూ ఉండేది.అందుకే ఆ తర్వాతి కవితల్లోఎక్కడో జరిగిన రైలు ప్రమాదం గురించి,మా వీథి లో ఉరేసుకునిమరణించిన అమ్మాయి గురించి రాయగలిగేను. ఆ తర్వాత ఆంధ్రభూమిలో” అక్షరం “ప్రారంభమైంది అప్పట్లోనే. కంజిర, సంతకాలు బులెటిన్ లు వస్తూండేవి. నా కవితలు ప్రతీ నెలలో ఎక్కడో ఒక చోట ప్రచురితమవుతూ ఉండేవి.
తొంభై లో “నేను ఋతువునైన వేళ”కవిత రాసేను. ఆ కవిత నేను రాసిన సమయానికి స్త్రీ వాదం ప్రారంభమైంది. చాలాజోరుగా పత్రికల్లో స్త్రీల కవితలు వస్తూండేవి. నన్నుబాధించే సంఘటనల్ని కవిత్వీకరించే గుణం వల్ల ఆకవితని రాయగలిగేను. ఆంధ్రజ్యోతి ఆదివారం లో ఆ కవిత ప్రచురింపబడింది. ఆ కవితతోబాటూ ప్రచురించడానికిఫోటో ఒకటి పంపమని ఘంటశాలనిర్మల దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. ఆ కవిత ఒక టర్నింగ్ పాయింట్.ఆ కవితతో బాటూ నా అడ్రసు ప్రచురించడంవల్ల నాకు రోజూ కట్టలుగాఉత్తరాలు వస్తుండేవి. దాదాపు 250 ఉత్తరాలు వచ్చాయని గుర్తు.
ఎప్పుడూకొత్త వస్తువు తో కవిత్వం రాయడంమొదట్నించీ అలవాటు చేసుకున్నాను. ఇకభావ ప్రకటన -ఎవర్నీ అనుసరించకుండా నాకెలా తోస్తే అలాగే రాసే దాన్ని. ఇకఎంతో సాహిత్యం చదివి ఉన్నందు వల్లభాష వెల్లువలా వచ్చేది. కావలిసిన పదం కోసం నేనెప్పుడూతడుముకొనేదాన్ని కాదు. పల్లెటూళ్లోఉండడం, మా అమ్మా, నేనుతప్ప వేరే ప్రపంచం లేకపోవడంవల్ల నా కవితలు చదివినాకెవరూ సలహాలివ్వలేదు.
*
కవిత్వానికిదాదాపు స్వర్ణ యుగంలో నేను కవిత్వం, ప్రారభించడంఒక గొప్ప స్ఫూర్తిగా ఉండేది.నా కవిత “రైలు బండి రాగం”కంజిర సభలో విన్నప్పట్నించీ
స్మైల్ గారు నాకు పితృతుల్యులయ్యేరు. ఆ తర్వాతఎప్పుడూ ఏ కష్టమొచ్చినా నేనుచెప్పక పోయినా ఎలాగో తెల్సుకుని నన్నుఓదార్చేవారు.
కవిత్వాన్నిప్రారంభించడం ఎలా జరిగినా రాసేస్ఫూర్తిని సంవత్సరాల తరబడి నిలబెట్టుకోవడం చాలాకష్టం. ఒకా నొక దశలోజీవితపు ముళ్ల కంపల్లో చిక్కుకుని సంవత్సరం పాటు కవిత రాయలేదు నేను. అప్పుడో కార్డు వచ్చింది మళ్లీ అఫ్సర్ గార్నించి ఒకే వాక్యం. “గరిట తో బాటూ కలం కూడా తిప్పమని.” ఏదో ఏమరుపాటు లో కొట్టుకుపోతున్న నాకు నిద్రలోంచి మెలకువ వచ్చినట్లైంది ఆ వాక్యం చూసి- అలారాసిన కవిత “పున: ప్రతిష్ట”. ఇకఆ తర్వాత ఎప్పుడూ కవిత్వాన్ని ఆపలేదు నేను. పైగా జీవితంలోకష్టాలన్నీ కవితలుగా మారడం ప్రారంభమయ్యాయి.
క్రమంగా కవిత్వం నాకు ఓదార్పు, బాసట,కంటి తుడుపు అయ్యి క్రమంగా జీవితంగా మారింది.2001 లో నా మొదటి కవితాసంపుటి”ద్రవభాష” నా జీవితం కుదుటపడ్డాక వెయ్యగలిగేను. అందులో నా పన్నెండేళ్ల కవిత్వప్రస్థానం ఉంటుంది. ద్రవభాష ఇప్పుడు చదివినా ఏడుస్తాను నేను. అంత మెలితిప్పేసేబాధలన్నీ కవిత్వం వల్లే దాటూకుని రాగలిగాననిఅనిపిస్తుంది. బాధల్ని వ్యక్తం చేసే క్రమంలో స్త్రీవాదం కొంత బలాన్నిచ్చినా, అనుభూతిప్రధానమైన వస్తువులతో కవిత్వం రాయడం వల్ల నాకవిత్వం స్త్రీ వాదం ఆగిపోయినా ఆగకుండాఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
2006 లో“శీతసుమాలు” ఒక హాయైన పుస్తకం.నాకు నా స్వంత కవిత్వంచదవాలనిపిస్తే శీతసుమాలు చదువుతాను. ఒక గొప్ప ప్రశాంతజీవనం, ప్రేమైక క్షణాలన్నీ అందులో ఉంటాయి. ఇక 2013 జనవరిలో ఆవిష్కరించిన “శతాబ్ది వెన్నెల “ జీవితంలో మరో గొప్ప మలుపుకిప్రతీక. ప్రవాస జీవితపు కొత్త అనుభూతుల, బాధల ఆవిష్కరణఇది.
కవిత్వమే నా మిత్రుడు, ప్రేమికుడు, సహచరుడు….అన్నీ. ఆ వెచ్చని కౌగిలిలోనే నేను నిద్రపోయేదీ, మేల్కొనేదీ.
(నా మొదటి కవిత)
గీతగారు మీకవిత్వం అంటే చాలా ఇష్టం ఇలా ఈరోజు వాకిలి ద్వారా మీపరిచయాన్ని చదివి ఇంకానందించాను
రెండు దశాబ్దాల నా అభిమాన కవయిత్రి గీత గారికి
నమస్తే
నా మాటలు మిమ్ములను చేరుకొంటాయన్న ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
థాంక్యూ
బొల్లోజు బాబా
రేణుక @ మీ వ్యాఖ్య నాకూ చెప్పలేని ఆనందాన్ని కలిగించింది.
బాబా@ థాంక్సండీ- మీ మాటలు ఆలస్యంగా చూసినందుకు క్షంతవ్యురాల్ని-
మీ బ్లాగులో చదవుతుంటానండి,మీ కవితలు ,.మీ పరిచయం మీ మాటల్లో చదవడం బాగుంది,..
అవును-కవిత్వానికి ప్రపంచాన్ని తన ప్రేమైక హస్తాల్లోకి తీసుకుని వెన్ను నిమరగల గొప్ప మన:శ్శక్తి ఉంది. అది నిన్ను బతుకు నించి వేరు చేసి జీవింపజేస్తుంది. మరణం అణగద్రొక్క లేని జీవితాన్ని ప్రసాదిస్తుంది. ….చాల బాగా చెప్పారు గీత గారు. మనల్ని మనం మానవీయ విలువలతో బతికించుకోవడానికి, జీవితం కొడుతున్న దెబ్బల నుంచి స్వాంతన పొందడానికి ,వీలైతే ఈ సమాజాన్ని మార్చడానికి సాహిత్యం అవసరం, అచ్చంగా మీ జీవితం లో లాగే
మొన్న మిమ్మల్ని చూసినప్పుడు మీ వెనుక ఇంత చరిత్ర వుందని అనుకోలేదు గీత గారు ….ఎదో చిన్న అమ్మాయి అనుకొన్నాను పొరబడ్డాను సుమీ …నాకంటే 25 ఏళ్ళు పెద్ద అన్న మాట ..కవిత్వం లో ….కవిత్వమే ఉపిరిగా చేసుకొన్నారు కాబట్టే వీక్షణం నిర్వహించ గలుగు తున్నారు ….చాలా మంచి విషయాలు చెప్పారండి ధన్యవాదాలు గీత గారు
అందరికీ ‘కృతజ్ఞతలు’ అని చెప్పడం చాలా చిన్న మాట- అయినా ఓపిగ్గా వ్యాఖ్యలు రాసినందుకు- మనసారా-
manchi prothsaaahaannichhindi mee ee parichayam … really got inspired thanx andi
K GEETHA MEE PARICHAYAM KAVITVANNI JEEVITAM LOKI AHVANINCHADAM BAGUNDI