సిలికాన్ లోయ సాక్షిగా

లాప్ టాప్ కథ (పార్ట్-1)

ఏప్రిల్ 2014

సిలికాన్ లోయ సాక్షిగా-12

ఆదివారం హడావిడిగా లేపాడు సూర్య ”నిధికి ఇవేళ శాన్ ఫ్రాన్సిస్కో నేచురల్ హిస్టరీ మ్యూజియం చూపిస్తానని ప్రామిస్ చేసేనని చెప్పేనుగా, మర్చిపోయావా?” అంటూ.

బయట చిన్నగా తుంపర పడ్తోంది.

“అబ్బా! ఇవేళెందుకులే, అసలే వర్షం పడ్తోంది కదా” అన్నాను బద్ధకంగా.

“అదేం కుదరదు మమ్మీ” అని నిధి పేచీ మొదలు పెట్టింది. మెజారిటీ వాళ్లది కనుక తప్పని సరిగా లేచాను.

ఇల్లు తాళం వేసి గరాజ్ మూసేసేక, “ఇప్పుడే వస్తానూ” అని కారు దిగి మరలా ఇంట్లోకి పరుగెత్తాడు సూర్య.

“పొద్దుట్నించీ నన్ను హడావిడి చేసి, ఇప్పుడింకా…వెనక్కీ, ముందుకీనా? ఇలా అయితే మనం వెళ్లినట్టే” అన్నాను.

సూర్య తో ఇదే వచ్చిన తంటా. ఎక్కడికి వెళ్దామన్నా, చివరి నిమిషంలో ఇంట్లోకి పరుగెత్తుతాడు ఎప్పుడూ అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను అంటూ.

అయిదు నిమిషాల తర్వాత లాప్ టాప్  తో పరుగెత్తుకొచ్చాడు.

“ఇదేవిటీ లాప్ టాప్ ఎందుకూ, అంతగా పని ఉన్నపుడు ఈ ప్రోగ్రామెందుకట?” అన్నాను విసుగ్గా.

“పనేమీ కాదులే, నా సెల్ ఫోనుకి ఛార్చింగ్ అయ్యిపోతూంది. పైగా ఏదైనా అవసరానికి ఉంటుందిలే.” అన్నాడు.

దారంతా చిన్నగా వర్షం పడ్తూనే ఉంది. కారు అద్దం మీద చినుకులు వెనక్కి ప్రయాణిస్తున్నాయి.

అందమైన వాన ఆకాశానికి, భూమికి మధ్య చినుకుల తెరలాగా. సూర్యుడు లేని మబ్బు ఉదయం లేత బూడిద రంగులో చుట్టూ పరుచుకుని ఉంది.

కారు గోల్డెన్ గేట్ బ్రిడ్జి రోడ్డు లోకి వెళ్లేసరికి బాగా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం.

ఆకాశం ఇంద్ర ధనుస్సు లో రంగులన్నీ తుడిచేసి  ఎరుపు రంగుని అద్దినట్లు గోల్డెన్ గేట్ బ్రిడ్జి దూరం నించి గొప్ప సౌందర్యంతో మెరిసిపోతూ ఉంది.

మ్యూజియం గేట్ దగ్గరికి వెళ్లడానికి ఇంకా బాగా ఆలస్యమైంది. అదే కాంపస్ లో జనం లైన్ల కొద్దీ బారులు తీరి ఉన్నారు.  మ్యూజియం కి ఉన్న అండర్ గ్రౌండ్ పార్కింగ్ “ఫుల్ ” అని బోర్డు వేలాడ దీసేరు అప్పటికే.

పార్కింగ్ కోసం అదే రోడ్డు లో రెండు రౌండ్లు కొట్టినా ఎక్కడా ఖాళీ దొరక లేదు. మ్యూజియంను  ఆనుకుని ఉన్న జాపనీస్ టీ గార్డెన్  లో బస్ పార్కింగ్ అని ఉన్న చోట “తాత్కాలిక పార్కింగు” అని బోర్డు ఉండడం తో అటు తిప్పాడు కారుని.

టిక్కెట్టు అయిదు డాలర్లు తీసుకుని కారుని ముందుకి పోనివ్వమన్నాడు పార్కింగ్ కుర్రాడు. పారలల్ పార్కింగు కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చింది.

సూర్య కారుని ముందుకీ, వెనుకకీ తిప్పుతూ కష్టాలు పడ్తూండగా పార్కింగు కుర్రాడొచ్చి వెనక నుంచి గైడ్ చేస్తూ కాస్త సాయం చేసి పెట్టేడు.

“పార్కింగ్ అబ్బాయి చిల్లర తీసుకు రావడానికి వెళ్లేడు, అందాకా మీరు దిగి మ్యూజియం లోకి నడవండి. వెనకే వస్తాను నేను, ఆ ..అన్నట్లు మ్యూజియం ఎంట్రెన్సు టిక్కెట్లు ప్రింటవుట్లు తెచ్చేవుగా. నా టిక్కెట్టు కాగితం ఇచ్చెళ్లు” అన్నాడు.

నిధి నా చెయ్యి పట్టుకు లాగింది.

చిన్న తుంపర ఇంకాస్త పెద్దదయ్యేట్లు సూచనలు కనిపిస్తుండగా నిధిని పరుగెత్తిస్తూ నేనూ వడిగా ముందుకు నడిచేను.

మ్యూజియం లోకి కాకుండా పక్కనున్న మరొక ఎంట్రెన్సు వైపుకి చాలా మంది జనం నిలబడి ఉన్నారు. ఆ వానలోనూ తడుస్తూ నిలబడ్డ జనాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది.

లైను దాటి వెళ్తూ “ఎందుకిక్కడ నిలబడ్డారు?” అనడిగేను ఒకమ్మాయిని.

“రాత్రికి కాన్సర్టు ఉంది. టిక్కెట్లు ఇప్పుడు లైను లో వెళ్లిన వారికి 75% తగ్గింపుతో వస్తున్నాయి” అంది.

“చూసేవా, ఈ లైను కాన్సర్టుకట. కాన్సర్ట్ లంటే ఇంత పిచ్చి ఉంటుందన్నమాట అమెరికాలో” అన్నాను వెనకే వచ్చిన సూర్యతో.

“అందుకే పార్కింగు కూడా ఖాళీ లేదివాళ” అంటూ “ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? లోపలికి వెళ్లకుండా అనుకున్నాను. నీ ఇంటర్యూలు ఇక్కడా మొదలు పెట్టేవన్నమాట.” అన్నాడు నవ్వుతూ.

అరగంట లో రెండో ఎగ్జిబిట్ హాలు లో ఉండగానే “భోజనాళ వేళైంది మొత్తానికి మనం వచ్చి పడేసరికి, నాకాకలేస్తూంది బాబూ. ” అన్నాను.

“నిధి కూడా అవునన్నట్లు తలూపింది.”

భోజనాలు చేస్తున్నపుడు “లాప్ టాప్ బాగేదీ” అన్నాను కాజువల్ గా.

“కారులోనే వదిలేసాను. అవసరమైతే వెళ్లి తెస్తాలే, ఇక్కడేగా” అన్నాడు.

“బాగ్ బయటికి కనిపించకుండా పెట్టేవా?” అన్నాను.

“అబ్బబ్బా, నువ్వు వచ్చినది మ్యూజియం చూడడానికా, లాప్ టాప్ గురించి ఆలోచించడానికా? బాగ్ సీటు కింద బయటికి కనుపించకుండా భద్రంగా పెట్టేను చాలా” అన్నాడు.

“సాయంత్రం అయిదు గంటలకు మ్యూజియం ఇక మూసేస్తున్నామన్న ఎనౌన్సుమెంటు వచ్చేంత వరకూ చాలా ఆసక్తిగా అన్ని ఎగ్జిబిట్లూ చూస్తూ గడిపేం.

డైనోసార్ ఎగ్ వంటి నమూనాలు నిధి ఇంతింత కళ్లేసుకుని చూసింది.

బయట వాన ఏమీ తగ్గలేదు. ఇంకా తుంపరే.  వాతావరణమూ బాగా చల్లగా ఉంది.

మేం వచ్చినప్పటిలా బయట లైనులేదు.  నిర్మానుష్యమై పోయింది. ఒకరో ఇద్దరో మాతో బాటూ మ్యూజియం లో నించి అంత సేపు ఉండి బయటికి వచ్చినవాళ్లు తప్ప జనం లేరు.

“ఇప్పుడు అన్ని పార్కింగులూ ఖాళీయే కదా మమ్మీ “  అంది నిధి పార్కింగు లాట్ లో మిగిలి ఉన్న మా కారుని,  చుట్టూ ఖాళీలను చూపించి.

“అవునమ్మా” అన్నాను.

“కారు దగ్గిరికి వెళ్లి డోరు తీస్తూ నోరు తెరుచుకుని ఉండిపోయిన సూర్య ని చూస్తూ “ఏమైంది?” అన్నాను కంగారుగా.

కారు వెనక డోరు అద్దం పగల గొట్టి ఉంది. “అయ్యో” అంటూ మొదటగా  సీటు కింద చూసాను.

“ఎవరో కారు అద్దం పగలగొట్టి మరీ బ్యాగు పట్టుకెళ్లిపోయారు” అన్నాడు.

“అనుకున్నంతా అయ్యింది” అన్నాను గొణుగుతున్నట్లు.

అంతలోనే  ”సూర్యా” అని ఏదో చెప్పబోయాను.

నన్ను నిశ్శబ్దం గా ఉండమని సైగ చేసి వెనక సీట్లో అద్దం ముక్కలు పక్కకి తీసి నిశ్శబ్దంగా కూచున్నాడు మ్లానమైన ముఖంతో.

“ఏం చేద్దాం?” అంటూ గొణగడం మాత్రమే వినబడుతూంది.

ఇలాంటి సందర్భం మాకెపుడూ ఎదురు కాలేదు. అయినా నేను క్షణాల్లో తేరుకున్నాను.

నా బుర్ర నిండా ఎన్నో ప్రశ్నలు. అసలెవరు చేసి ఉంటారు? ఇక్కడ బాగ్ ఉండడం ఎవరు చూసి ఉంటారు?

కారు చుట్టూ తిరిగి చూసాను. “కారు అద్దాన్ని ఏదో షార్ప్ ఆబ్జక్టు తో ఒకే గట్టి దెబ్బలో పగలగొట్టి ఉండాలి. అక్కడ బాగ్ ఉన్నట్లు ఎలా తెలిసి ఉంటుంది? వెనక అద్దం దగ్గిరికి రెండు అరచేతులూ ముడిచి చూస్తే తప్ప కనిపించదే.  అలా అబ్జర్వ్ చేయడానికీ, ఇలా పగల గొట్టడానికీ అలవాటు పడిపోయిన వాళ్లు ఇదే పనిగా తిరిగితేనే ఇలాంటివి సాధ్యం.” వేగంగా ఆలోచిస్తున్నాను.

నా హాండ్ బాగులో ఉన్న పార్కింగ్ టిక్కెట్టుని వెతికి తీసాను.

“అవునూ అసలు ఇంత జరుగుతున్నా ఈ టిక్కెట్టు ఇచ్చినవాడు కాపలా లేకుండా ఎక్కడికి పోయాడు?” అన్నాను అప్రయత్నంగా.

(ఇంకా ఉంది)