ఆఫీసు నించి వస్తూనే “మనం ఇల్లు కొనుక్కుంటే ఎలా ఉంటుంది” అన్నాడు సూర్య.
నా చెవులని నేను నమ్మలేకపోయాను. నేనేమైనా తప్పు విన్నానేమో అనుకున్నాను.
“ఏవిటీ!” అన్నాను ఆశ్చర్యంగా.
“అవును, మా ఆఫీసులో కొలీగ్స్ ఇళ్లు కొనుక్కుందామనే విషయం మాట్లాడుకుంటున్నారు.” అన్నాడు.
నిన్నా మొన్నటి వరకు నేను చెవునిల్లుకట్టుకుని పోరినా వినని పెద్దమనిషి ఇవేళ ఆఫీసులో కొలీగ్స్ చెపితే వింటాడన్నమాట.
“అయితే ఏంటట?” ముభావంగా అన్నాను.
“వాళ్ల సంభాషణలో ఇల్లు కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం అని అందరూ తేల్చారు. పైగా అందరి దగ్గరా కాస్త డబ్బులున్నాయి కదా ఇప్పుడు!” అన్నాడు.
నేనింకా అర్థం కానట్టు చూస్తుండగా-
“అలా చూడకు. మొన్న మా కంపెనీని మరో పెద్ద కంపెనీ కొనుక్కుందని చెప్పేగా” అని
“అలా వేరే వాళ్లకు అమ్మడం వల్ల ఎంప్లాయీస్ షేరు ధర పెరగడమూ, అమ్ముడవడమూ…” అంటూ మొహంలో ఆనందం వెలిగి పోతుండగా “అన్నట్లు ఇండియాలో నీ ప్లాటు అమ్మకుండానే ఇప్పుడు ఆ 5% డౌన్ పేమెంటు కట్టెయ్యొచ్చు, కొత్త కంపెనీ వాళ్లు జీతం పెంచుతున్నారు గనుక మార్టిగేజీ కట్టొచ్చు మనం” అన్నాడు.
లోపల్లోపల సంతోషంగా అనిపిస్తూన్నా పైకి కనిపించనివ్వకుండా “అయితే ఇల్లు వెతకమంటావు” అన్నాను.
కానీ ఒక క్లాజు “నువ్వు చూసే ప్రతీ ఇల్లు చూడడానికి నన్ను రమ్మనకూడదు. ముందు నువ్వు చూసి లాస్టు స్టెప్ వరకూ వచ్చేక నేనూ వస్తానన్నమాట.” అన్నాడు.
జెస్సికా బాధ గుర్తుకు వచ్చింది నాకు. కానీ క్లాజులకి ఒప్పుకోకపోతే ఎక్కడ మనసు మార్చుకుంటాడోనని తలూపాను.
తలూపడమేమిటి, వెంటనే కాగితం, పెన్ను తెచ్చాను.
“మొదట మనకో ఇళ్ల ఏజెంటు కావాలి” అని రాసేడు.
వెంటనే “ఆన్ లైను లో చూసేను, ఈ ఇళ్ల ఏజంటు వాళ్లు బయ్యరు బోనస్ కూడా ఇస్తారట. ఇదిగో ఈ చుట్టుపక్కల స్కూళ్లు బాలేవు, అదిగో ఆ ఊర్లో చవకగా ఉన్నాయి.” అని చక చకా చెప్పడం మొదలుపెట్టాను.
నా వైపు ఒక పక్క ప్రశంసా పూర్వకంగా చూస్తూనే, సమాచారం బానే సంపాదించేవు కానీ, నిజంగా వాళ్లు బోనస్ ఎవరికైనా ఇచ్చేరంటావా?” అన్నాడు ఇంకా మొదట చెప్పిన “ఏజంటు” గురించే ఆలోచిస్తూ.
“ఇలా ప్రతీ స్టెప్పు లోనూ సందేహ పడితే పనులు జరగవు. అవన్నీ నేను జాగ్రత్తగా చూసే నీకు చెప్పేను. అయినా ఇది అమెరికా. ఆన్ లైను లో ఒకటి అనౌన్స్ చేసి, తీరా పనయ్యాక ఇంకో మాట చెప్పి ఫ్రాడ్ చెయ్యడం కుదరదిక్కడ.” అన్నాను.
***
ఇక మర్నాటి నించీ ఇల్లు వెతికే పనిలో పడ్డాను. ముందుగా ఆన్ లైను ఏజన్సీ తో “ఇళ్ల టూరు” బుక్ చేసేను.
“ఇళ్ల టూరు” అంటే వాళ్ల సైటు లో అమ్మకానికి ఉన్న ఇళ్ల లో చూడాలనుకున్న 5,6 ఇళ్ల జాబితాని మనం తయారు చేసుకుని వాటిని వాళ్ల ఏజంటు సహాయంతో చూడడమన్న మాట. ఇలా ఇళ్లు దగ్గరుండి చూపించడానికి 2,3 గంటల వ్యవధి పడుతుంది. అందులో ఏవైనా నచ్చితే ఇంటి సెల్లరు తాలూకు ఏజంటుతో వీళ్లు మన తరఫున అప్లికేషను పెట్టించడమూ, మాట్లాడడమూ మొదలైనవన్నీ చేస్తారు.
మొదటి వారం సూర్య కూడా వచ్చేడు. ఆ రోజు చూసిన 6 ఇళ్ల లో నాకు 2 నచ్చాయి. కానీ ఒక్కదానికి మాత్రమే అప్లికేషను పెట్టాలి గనుక కారు దిగే ముందు ఏజంటు అడిగినప్పుడు ఒక ఇంటికి ప్రొసీడ్ అవుదామని చెప్పేం. ఇంటికి వెళ్లీ వెళ్లగానే ఈ-మెయిల్ వచ్చి ఉంది. అది బిడ్ చేయడానికి అప్లికేషను. నిజానికి ఇంటి ఖరీదు మా బడ్జెట్ కంటే ఎక్కువే. అయినా లైను లో చాలా మంది బయ్యర్లు ఉన్నారని ఏజంటు చెప్పింది. మొదటి బిడ్ కదా అని ఒక అయిదు వేలు ఎక్ స్ట్రా కి బిడ్ చేసేం.
“ఇంత తక్కువకి ఖచ్చితంగా రాదు, మరేవైనా పెంచుతారా?” అని అడిగింది ఏజంటు.
మరో మూడ్రోజుల్లో “ఆ ఇల్లు మనం వేసిన బిడ్డు కంటే మరెవరికో నలభై అయిదు వేలు ఎక్కువకి అమ్ముడయ్యింది. మరలా మరో టూరు బుక్ చేసుకోండి” అని చెప్పింది.
ఇలా వారాంతాల్లో ఇళ్లు చూడడం ఒక బిడ్డు వెయ్యడం, మాకు రాలేదన్న వార్త తెల్సుకోవడం, మరలా అన్వేషణ.
ఇక వారాంతమొకటే అయితే సరిపోదని వారం మధ్యలో కూడా చూడడం మొదలెట్టాను. ఇలా వారం మధ్యలో చూపించేవి అందరికీ చూపించే ఓపెన్ హౌసులు కాదు.
కాబట్టి ఏజంట్లు తాళాలు అడిగి పుచ్చుకుని మన కోసమే ప్రత్యేకించి చూపెడతారన్న మాట.
అలా 6 వారాలు గడిచాయి.
ప్రతీ వారం ఇది మనిల్లనుకోవడం, అది మనది కాకుండా పోవడం తో ఇల్లు కొనడానికి ఈ తతంగమేమిట్రా అని విసుగు పుట్టడం మొదలైంది మాకు.
కానీ మొదట్నించీ నాకు పట్టు వదలని విక్రమార్కురాలినని పేరు.
కాబట్టి ఆఫకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను.
ఒక శుభ ముహూర్తాన ఆ వారాంతంలో వేసిన ఒక బిడ్ మాకు వచ్చిందని ఏజంటు ఫోను చేసింది.
అయితే మాతో పాటూ మరెవరో అదే రేటు తో బరిలో ఉండడం వల్ల మేం ఇంకాస్త రేటు పెంచితే మాకు తర్వాతి స్టెప్పుకి వెళ్లే అవకాశం ఉంటుందని కబురు.
మేం ఆలోచనలో పడ్డాం. సర్లే అయిదో పదో అనుకోవడానికి పదులూ, వందలూ కాదు కదా, వేలు. పైగా డాలర్లు.
నేను ధైర్యంగా మరో “అయిదు పెంచుతామని” ఫోను చెయ్యమన్నాను.
“కాదు అవతలి వాడు పాతిక” అన్నాడని మరలా ఫోను.
“పదికి మించేది లేదని మేం”
“ఇరవైకి తగ్గేది లేదని” అవతలివాడు.
మధ్యలో మా ఏజంటుకి మేం, వాళ్ల ఏజంటుకి వాళ్లు చెప్తూ ఉన్నాం.
ఇంత జరుగుతూ ఉన్నా అసలు ఎవరు అమ్ముతున్నారో, ఎవరు కొనుక్కుంటున్నారో ఏజంట్లకి తప్ప మా ఇరు పార్టీలకూ
తెలీదు.
“సై అంటే, సై అనడానికి ఇదేమైనా కూరగాయల బేరమా? వదిలేద్దాం.” అన్నాడు సూర్య.
అన్నీ బావున్న ఇల్లు అంతవరకూ వచ్చి వదిలెయ్యడం నాకు ఇష్టం లేదు.
అలాగని మరో పాతిక అనడానికీ కుదిరేట్లు లేదు.
మరో అయిదు పెంచాం. అది పదయ్యింది. అవతలి వాడు మహా ఘటికుడు. అస్సలు తగ్గడం లేదు.
పదీ పెరిగి మొత్తానికి మేమే కాంప్రమైజ్ కావాల్సొచ్చింది.
ఇలా రేటు ఒక కొలిక్కి వచ్చేక, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు “డిస్ క్లోజర్స్ పాకేజీ” పేరుతో ఈ మెయిల్ వచ్చేయి.
అప్రూవల్సే కాక, ఆ ఇన్సెపెక్షనూ, ఈ ఇన్సెపెక్షనూ… అంటూ దాదాపు ఇరవై, ముప్ఫై వరకూ డాక్యుమెంట్లున్నాయి.
“సాయంత్రానికల్లా అన్నీ చదివేసి అందులో మనకు పనికొచ్చేవేమిటో, మనం ఏం చెయ్యాలో చెప్పు.” అని ఆర్డరేసాడు.
తగుదునమ్మా అని గొప్ప తెలివైనదానిలా పనులు చెయ్యడం అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదని ఇల్లు కొనే విషయం లో బాగా అర్థమైంది నాకు.
డాక్యుమెంట్లు అన్నీ ఓపిగ్గా చదివినా కొన్ని అర్థమయ్యాయి. కొన్ని అర్థం కాలేదు.
అందులో టెర్మయిట్ ఇన్స్ పెక్షన్ లాంటివి సెల్లరు లేటెస్టుగా చేయించినా మరలా మేమూ చేయించాలని చెప్పింది ఏజంటు.
ఆ ఇన్స్ పెక్షన్ బుక్ చేసే బాధ్యత నా మీద పడింది.
ఇక కాస్త తెలివిగా ఆలోచించాలి డబ్బులు ఖర్చయినా అని నిర్ణయానికి వచ్చాను.
ఆ బాధ్యత ని ఏజంటుకి అప్పగించి కేవలం డబ్బులిచ్చే బాధ్యత మాత్రం తీసుకున్నాను.
కానీ ఇన్స్ పెక్షను జరిగేటప్పుడు దగ్గరుండమని ఏజంటు చెప్పడం వల్ల ఆ డ్యూటీ మరలా నాకే పడింది.
నిధిని స్కూలుకి పంపించి, ఉదయానే వచ్చి సాయంత్రం దాకా ఇలా ఇన్స్ పెక్షన్స్ అని గడపడం మొదలైంది.
బాంకు లోను వగైరా అన్నీ ఏజంటే సజెస్ట్ చేసినా సూర్య కూడా కాస్త రీసెర్చి చేసి చివరకు వాళ్లు చెప్పిన బాంకే బెస్టని నిర్ణయానికి వచ్చాడు.
ఇక డబ్బుల ట్రాన్స్ ఫర్, అడ్వాన్సు పేమెంట్లు ఇవన్నిటికీ ఒక థర్డ్ పార్టీ ప్రవేశించింది.
అదే “ఎస్క్రో”.
“అదేవిటి? ఇండియా లో మనమెక్కడా విన్నట్లు లేదే?” అన్నాను సూర్య తో.
“అదిక్కడ ఇలాంటి కొనుగోళ్లు, అమ్మకాలకు ఒక థర్డ్ పార్టీ మధ్యవర్తిగా ఉండే విధానం. మనకూ, అటు అమ్మే వాడికీ మధ్య ఈ ఎస్క్రో ఒక మధ్య వర్తిత్వం వహించే ఒక సంస్థ అన్నమాట. మనమిచ్చిన అడ్వాన్సు తీసుకుని అవతలి వాడు ఎగేయకుండాను, బ్యాంకు లోను మనకు రాకపోతే అవతలి వాడు వేరే ఎవరికైనా అమ్ముకునేందుకు… ఇలా రకరకాల లావాదేవీలు పూర్తయ్యేంతవరకు ఈ మధ్యవర్తి డబ్బును తన దగ్గిర పెట్టుకుంటాడు.” అన్నాడు.
“అంటే మనల్ని మనం నమ్మం కానీ, ఎస్క్రోని ఎలా నమ్మాలి?” అన్నాను.
” ఇవి కూడా చిన్న సైజు బ్యాంకుల లాంటివే కాబట్టి నమ్మొచ్చన్న మాట” అని,
“మొత్తం కొనుగోలు సక్రమంగా పూర్తయ్యేంతవరకు అన్ని విధాలా హామీదారుగా వ్యవహరించడానికి ఇలాంటి సంస్థల్ని ఈ దేశం లో పోషిస్తూ ఉంటారు. బహుశా: మానవ సంబంధాలలో అత్యంత ప్రమాదకరంగా మారిన ఆర్థిక లావాదేవీలలో మనుషులపైన నమ్మకం శూన్యమైపోయి అనుకుంటాను” సాలోచనగా అన్నాడు మళ్లీ.
అనుకున్న ప్రకారం మా డౌన్ పేమెంటు మొత్తం ఎస్క్రోకి సమర్పించాం. అమ్మే పెద్ద మనిషి అప్పటికీ ఎవరో మాకు తెలియదు. డాక్యుమెంట్లలో పేరుని బట్టి ఇండియన్సయితే కాదని అర్థమైంది.
ఇంటికి సంబంధించి అన్ని టెస్టులూ పూర్తయ్యాయి. రిపోర్టులు వచ్చాయి.
ఇంటిని ఆమూలాగ్రం పరిశీలించి ఒక “హోం ఇన్స్ పెక్షన్ రిపోర్టూ”, చెక్క ఇల్లు కాబట్టి ఎక్కడెక్కడ కర్ర పుచ్చిందో, ఏమేమి మందులు అవసరమో వంటి “టెర్మయిట్ టెస్ట్ రిపోర్టూ” వచ్చాయి.
దాదాపు వెయ్యి వరకు ఖర్చు అయ్యింది.
రిపోర్టుల్లో నెగెటివ్ పాయింట్లని బట్టి రేటు మరలా మాట్లాడొచ్చని, కాస్తో కూస్తో తగ్గించమని అడిగొచ్చని మా ఏజంటు చెప్పింది.
“అవతలి వాడు మహా ఘటికుడన్న విషయం అప్పటికే బాగా తెలిసింది కాబట్టి ఆశ పెట్టుకోవడం వేస్ట్” అన్నాడు సూర్య.
అన్నట్లు గానే ససేమిరా వొప్పుకోలేదు అవతలి వ్యక్తి.
ఏవో చిన్నచిన్న రిపేర్లు మాత్రం చేయించి ఇస్తానని, మిగతా అన్నీ మమ్మల్నే చూసుకోమని కబురు పంపించాడు.
మరో పది రోజుల్లో అనుకున్న గడువు ప్రకారం లోను శాంక్షనయ్యిందని, మర్నాడు ఇంటి తాళాలు తీసుకోవచ్చని ఏజంటు నించి ఫోను వచ్చింది.
అనుక్షణం గండంగా గడిచి మొత్తానికి ఇల్లు చేతికొచ్చే రోజు వచ్చినందుకు ఊపిరి పీల్చుకున్నాం.
“ఇంటి తాళాలు ఇవ్వడానికి ఇంటాయన వస్తాడనుకుంటా, ఎవరో చూసి తీరాలి మహానుభావుణ్ణి”అన్నాను.
“అటువంటి అవకాశం నీకు లేదులే, గరాజు కోడు ఈ-మెయిల్ లో వచ్చింది. ఇంటి తాళాలు గరాజులో వాషింగ్ మెషీనులో వేసేనని చెప్పేడట” అన్నాడు సూర్య.
భలే విచిత్రంగా అనిపించింది. అలా కనీసం కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ముఖ ముఖాలు చూసుకోకుండానే అమ్మకం జరిగిపోయింది.
తాళాలు తీసుకున్న మర్నాడే ఇక ముహూర్తమూ, అవీ అంటే అవతల అపార్ట్ మెంటు లీజు మరలా నెల రోజులు కొనసాగించాల్సొస్తుందని పొద్దుటే చిన్న దేవుడి పటం ఒక చేత్తో పట్టుకుని, ఇక్కడ బిందెలూ గట్రా ఉండవు కాబట్టి చిన్న స్టీలు గిన్నెలో తెచ్చిన సీసాడు నీళ్లూ పోసి మరో చేత్తో పట్టుకుని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేసాం.
కరెంటు స్టవ్వు మీద చప్పున అడుగంటి మాడిపోయిన పర్వాన్నం అమృతప్రాయంగా తిన్నాం.
“అన్నీ సరే గానీ, అన్నీ లెక్కేస్తే మార్టిగేజు ఎంత కట్టాలో తెలుసా? మనం 20% పూర్తి డవున్ పేమెంటు కట్టలేదు కాబట్టి, అందుకు పెనాల్టీగా ఎక్స్ ట్రా ఇన్సూరెన్సు కట్టాలి. అది కూడా కలుపుకుని…” అంటూ అదే పనిగా లెక్కలు వేస్తూ ఏదేదో అంటున్నాడు సూర్య.
“శుభమా అని కొత్తింట్లోకి వస్తే, ఈ మార్టిగేజి గోలేవిటి?” అని మనసులో అనుకున్నా,
“ఊ.. అయితే ఏంటట?” అన్నాను దిగాలుగా ఉన్న సూర్య ముఖం పైని చెమటని తుడుస్తూ.
*** * ***
అమ్మో..ఇల్లుకోనడమంటే విదేశాల్లో ఇంట కష్టమా.. కద బాగుంది madam ..
గీత గారు యెలెఉన్నరు చాల కాలమైంది రాజమండ్రి లో కవితలు విని అపుడపుడు మీ కవిత్వం చాడువుతునాను ఇప్పుడు మీ కదకుడా చదివాను చాల భాగుంది —”రాం” ( కోయి టా అమ్మ కు కనిటి ఉత్తరం )
సుమ గారూ! ఇల్లు కొనడమే ఒక కథ ఇక్కడ. మీకు నచ్చినందుకు థాంక్స్-
రామ్ గారూ! ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? అవును ఒక తరం గడిచిపోయింది. ఇన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నందుకు థాంక్స్-
kgeetamadhavi@gmail.com కు మెయిల్ చెయ్యండి.
చాల సంతోషం గా ఉందండి మీతో ఎదురుగా మాట్లాడినట్టే ఉంది ఇప్పుడు నేను విశాఖలో ఉంటున్నాను . సముద్రం వార కుర్చుని అపుడపుడు మీ కవితలు కూడా చదువుతున్నాను మీరు ఇండియాకి ఎపుడు వస్తారు