సిలికాన్ లోయ సాక్షిగా

ఓపెన్ హౌస్

ఫిబ్రవరి-2014

(సిలికాన్ లోయ సాక్షిగా – 10)

“ఓపెన్ హౌసులు చూసి రావడానికి ఈ శనివారం సాయం రమ్మని అడిగింది జెస్సికా” అన్నాను.

“ఊ…”అన్నాడు సూర్య.

“ఊ..కాదు, అసలు ఓపెన్ హౌసంటే ఏంటో తెలుసా?” అన్నాను.

“ఏవిటీ..?!” అన్నాడు కంప్యూటర్ లో తన పని తను చేసుకుంటూనే.

“ఇల్లు కొనుక్కోవాలనుకున్నవాళ్లకి అమ్మే వాళ్లు ఇల్లు చూడ్డానికి ఓపెన్ పెడతారన్నమాట. అలా ఓపెన్ పెట్టినప్పుడు ఎవరైనా ఇల్లంతా తిరిగి చూసి రావొచ్చు. మా చిన్నప్పుడు దసరా కి పిల్లలందరం మేడలున్నవాళ్ల ఇళ్లకి వెళ్లి సరదాగా మెట్లు ఎక్కి దిగేవాళ్లం. మళ్లీ ఇప్పటికి అమెరికాలో వచ్చిందీ అవకాశం. అందుకే జెస్సికాకి వస్తానని చెప్పేను” అన్నాను.

జెస్సికా, రాబర్ట్ మా కొత్త అపార్ట్ మెంటులో ఎదురు పోర్షనులో అద్దెకుంటున్నారు. కాలిఫోర్నియా లో బే ఏరియాలో మేమున్న ఏరియాకి అన్ని ప్రముఖ ఆఫీసులూ పది, పదిహేను మైళ్ల వ్యాసార్థంలో ఉంటాయి. అందుకే ఇళ్ల అద్దెలు కూడా చుక్కల్నంటేటట్టు ఉంటాయి. ఇక కొనాలంటే మాటలా! జెస్సికా దగ్గర్లోని ఎలిమెంటరీ స్కూలు లో టీచరుగా పని చేస్తుంది. రాబర్ట్ సాఫ్ట్ వేర్ ఫీల్డుకి మారాడట రెండేళ్ల కిందట. పిల్లలింకా లేరు కానీ వచ్చే ఏడాదికల్లా ముందు ఇల్లు కొనుక్కుని, పిల్లల సంగతి ప్లాను చేసుకుంటున్నామని చెప్పింది. ఎప్పుడూ నవ్వుతూ భలే చురుకుగా ఉంటుంది జెస్సికా.

ఇద్దరం పరిచయమైన కొద్దిసేపటికే ఎప్పటి నుంచో పరిచయమున్నవాళ్లలా మాట్లాడుకున్నాం.

“ఇక్కడి వాళ్లు చక్కగా జీవితం లో సెటిలయ్యేవరకూ పెళ్లీ, పిల్లలూ వంటివి పెట్టుకోరు. ఆలస్యమైనా ఇల్లు కొనుకున్నాకే పిల్లలు అని జెస్సికా అంది. పిల్లలకి వీళ్లలా తలా ఒక బెడ్రూము ఇవ్వగలిగినప్పుడే పిల్లల్ని కనాలన్న ఆలోచన మనకి ఎప్పటికైనా వస్తుందంటావా?” అన్నాను సూర్యతో.

తనేవీ మాట్లాడక పోయే సరికి దగ్గరకి వెళ్లి లాప్ టాప్ ముందు చెయ్యాడించి “నువ్వూ వస్తావా? మన ఊళ్లో ఇళ్ల రేట్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది?” అన్నాను.

“నువ్వెళ్లొచ్చినా నాకు తెలుస్తుంది గా” అని నవ్వి, “నాకిలంటివి అంత ఇంట్రెస్టు కాదని నీకు తెలుసుగా” అన్నాడు.

“సర్లే నీకు ఎంతసేపూ ఈ కంప్యూటరుంటే చాలు” అని “నిధి పేచీ పెడితే ఫోన్ చెయ్యి” అన్నాను.

***

“ఇళ్లు అమ్ముతారని నాకెక్కడెక్కడా ఎప్పుడూ చేతిరాత తో బోర్డులు కనబడలేదే!” అన్నాను జెస్సికాతో.

నువ్వు చెప్పినట్లు ఇక్కడ ఇళ్లు అమ్ముతామని ఎవరికి వాళ్లు ఇళ్ల బయట మీ దేశం లో లాగా బోర్డులు పెట్టరు. బోర్డులు పెట్టినా అవేవో బ్యాంకు ఎడ్వర్ టైజ్మెంట్లలా ఉంటాయి. ఇక్కడ ఇళ్ల అమ్మకం, కొనుగోలు అన్నీ స్వయంగా చేసుకుందామనుకునే వాళ్లు తక్కువ. అలా అమ్మడం కష్టం కూడా. అందుకే డబ్బులు మధ్య కొంత పోయినా మధ్యవర్తిత్వం నడిపే కంపెనీలకు అప్పగిస్తారు. వాళ్లు ఇళ్లని చక్కగా ముస్తాబు చేసి తిమ్మిని బమ్మిని చేసి అమ్ముతారు. ప్రైవేటు కంపెనీలు కొన్ని ఇళ్లను ముందే కొని అమ్ముడం గానీ లేదా ఇలా లావాదేవీలలో మధ్య వర్తులుగా పాత్ర నిర్వహించడం గానీ చేస్తాయి” అని చెప్పుకొచ్చింది జెస్సికా డ్రైవ్ చేస్తూనే.

ఆన్ లైను లో చూసి “ఫలానా కంపెనీ వాళ్లు ఇవేళ ఓపెన్ హౌసులు పెడ్తున్నారు.” అని కొన్ని అడ్రసులు నోట్ చేసుకొచ్చింది.
దాని ప్రకారం మొదటి ఇంటికి వెళ్లాం.

ఇంటి బయటే బోల్డు మంది చూడడానికి వచ్చిన వాళ్లు ఇంటి లోపలికి, బయటికి తిరుగుతూ ఉన్నారు.

ఇక ఇంటి లోపలైతే అందంగా మంచి ఫర్నిచర్ తో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు ఉంది.

మమ్మల్ని చూస్తూనే అక్కడ కూర్చున్న ఏజెంటు ఇంటి వివరాల బ్రోచరొకటి మాచేతికిచ్చి ఎప్పటి లోగా అప్లికేషన్ పంపిచచ్చో చెప్పింది.

ఇంటికి ఆస్కింగ్ ప్రైస్, ఇంటి వయసు వివరాలు కనుక్కుని బయటికొచ్చాం.

“నాకు ఇల్లు నచ్చింది” అసంకల్పితంగా అన్నాను.

నా వైపు ఆశ్చర్యంగా చూసి “నువ్వు చాలా అల్ప సంతోషివి ప్రియా. ఇలా మొదటిల్లు చూసి నచ్చిందన్న వాళ్లని నిన్నే చూసాను.” అంది.

“అంటే, నేనేం కొనుక్కోబోవడం లేదుగా. ఇందులో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుని అన్నానంతే.” అన్నాను.

“అవునవును. ఆ దృష్టితో చూస్తే నాకూ నచ్చింది. కానీ ఇంటిని కొనాలంటే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ల దగ్గర్నించీ పెస్టిసైడ్ రిపోర్ట్ వరకూ ఇంకా ఎన్నో చూడాలి” అంది.

ఈ సారి మేం చూసే రెండో ఇల్లు వచ్చింది. ఇల్లు ముందటి కంటే చిన్నదే కానీ ఇంటి అలంకరణలోనే రహస్యం దాగి ఉన్నట్లు ఇల్లు చక్కగా సర్దడం వల్ల చాలా బావుందనిపిస్తోంది.

అదే చెప్పాను జెస్సికా తో.

“నీకు అన్ని బీరువాల నిండా పుస్తకాలు చూసేసరికి బావుందనిపించి ఉందనుకుంటా” అని నవ్వింది జెస్సికా.

చిత్రంగా తనకి బోల్డు లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇంటికి ఫైర్ ప్లేస్ ఇక్కడ బాలేదనో, యార్డు బాగా చిన్నదనో, బెడ్రూం విశాలంగా లేదనో రకరకాల కారణాలు తను చెప్తూంటే వింటూ తనతో నడిచేను. తనతో బాటూ సింకులూ, స్విచ్చిబోర్డులూ పరీక్ష చేసేను.

అవునూ, రాబర్టు తో కలిసి ఇళ్లు చూడకుండా నన్ను రమ్మన్నావేంటి? అన్నాను వచ్చే దారిలో.

“చాల్లే. ఈ మగవాళ్ల గోల. స్థిమితంగా చూడడు, చూడనివ్వడు. పైగా ఒక రోజుకి ఒకట్రెండు కంటే చూడడం బోరంటాడు. అందుకే ఇక ముందు నేను చూసి నచ్చితే తనను మరలా తర్వాత తీసుకెళ్లాలని డిసైడ్” అన్నాను అని నవ్వింది.

***

ఆ సాయంత్రం సూర్యతో సందేహిస్తూ “మనమూ అమెరికాలో ఒక ఇల్లు కొనుక్కొంటేనో” అన్నాను.

ఆ మాట విని పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. నా వైపు కొంచెం పరీక్షగా చూసి, “రెస్టు తీసుకో ఉదయమంతా తిరిగి తిరిగి నీకు ఏమాలోచించాలో తెలీడం లేనట్లుంది ” అన్నాడు.

“నేనేమీ జోక్ చెయ్యడం లేదు” చిన్నబుచ్చుకుంటూ అన్నాను.

“ఇలా చూడండి సుప్రియా దేవి గారూ! కలలు కనడానికి కూడా కొంచెం అర్థం ఉండాలి. మీ ఆయనింకా అంత ఆస్థిపరుడు కాదు” అన్నాడు.

ఈసారి కోపంగా “అయితే ఏంటట? అంతా డబ్బుండే ఇల్లు కొనుక్కుంటారా?” అన్నాను.

అనడమే కాదు. తన భుజం పుచ్చుకుని కుర్చీలో కూలేసి యథావిధిగా పెన్నూ, పేపరూ తెచ్చాను.

నేనేదైనా చెప్పదల్చుకుంటే కాగితమ్మీద ప్లాను గీస్తేనే గానీ తనకి అర్థం కాదు మరి.

“జెస్సికా ఏం చెప్పిందంటే అమెరికా లో గత సంవత్సరం నించీ ఆర్థిక నష్టాల వల్ల ఇళ్ల కొనుగోళ్లు బాగా పడిపోయాయిట.” అంటుండగానే
“ఈ సంగతి అందరికీ తెలిసిందేగా బ్యాంకులకి లోన్లు కట్టలేక ఇళ్లు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకులకి అప్పగించేసిన వాళ్లు…. స్టాకు మార్కెట్టు…ద్రవ్యోల్బణం ” అంటూ సూర్య పెద్ద అర్థశాస్త్ర ఉపన్యాసం మొదలెట్టాడు.

“అవున్లే. అవన్నీ సరే. ఇలాంటి సమయం లోనే ఇల్లు కొనాలట తెలుసా?” అన్నాను.

“ఎందుకూ?” అన్నాడు.

“ఎందుకేమిటి? చవగ్గా వస్తాయి కదా.”

“ఎంత చవకకి? పదికీ, పరకకీ కాదు కదా” అన్నాడు.

“అదేలే. మిలియను చేసే ఇల్లు ఎనిమిది వందలకి, మిలియనున్నర చేసే ఇల్లు……” అని లిస్టు చదివాను.

“మిలియనుకి ఎన్ని సున్నాలో తెలుసా!” అని “మిలియను పెట్టి సిలికాన్ వేలీ లో ఇల్లు కొనాలంటే 20% శాతం డౌన్ పేమెంటు, అంటే 200 వేలు కట్టలి తెలుసా?” అన్నాడు.

నేను చాలా కాజువల్ గా “తెలుసు” అన్నాను.

నాకు నిజంగానే మతి పోయిందన్నట్లు చూసి “నాకు బోల్డు పనుంది.” అని లేవబోయాడు.

మళ్ళా భుజం పట్టుకుని కూలేసి ” అసలు ఒకప్పుడు ఇక్కడ ఇళ్లు కొనాలంటే లాటరీ తీసేవారట తెలుసా! ఏదో మన టైము బావుండి ఇప్పుడు ఇళ్లు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి. అయినా అన్నీ కనుక్కున్నాను. ఇప్పుడు బ్యాంకు వాళ్లు 5% డవున్ పేమెంటుక్కూడా లోన్లు ఇస్తున్నారు. అదీగాక వడ్డీ రేటు కారు చవకగా ఉంది.” అని
“మా ఊర్లో మా అమ్మా వాళ్లిచ్చిన ప్లాటు అమ్మేసేమనుకో. ఉన్న బంగారం తాకట్టు పెట్టేమనుకో. కొంచెం సేవింగ్సు కలుపుకుని, ఒక అయిదారు వందల వేలల్లో ఇల్లు చూసుకుని కొనుక్కుంటే, ఈ అద్దెకి కట్టే డబ్బు మార్టిగేజీకి కట్టినట్లు అవుతుంది, మహా అయితే మరికాస్త ఎక్కువవుతుంది. కొంచెం ఖర్చు తగ్గించుకుంటే సరి.” అని ఆపకుండా చెప్పేను.
నా వైపోసారి చూసి తల విదిలించి “ఆలోచిద్దాం” అన్నాడు.

మరలా మరుసటి వారం నేను జెస్సికా కూడా వెళ్లడానికి తయారవ్వడం చూసి “వెళ్తే వెళ్తున్నావు కానీ, ఇంటికొచ్చి నాకు ఉపన్యాసాలు దంచకు” అన్నాడు.

అలా నాలుగైదు వారాలు నేను వరసగా జెస్సికా కూడా వెళ్లి ఎక్స్ పర్టునయ్యిపోయాను. ఇక తెలిసిన స్నేహితులెవరైనా ఓపెన్ హౌసులు చూద్దామనుకుంటే నేను రెడీ.

ఇల్లు కొనాలంటే ఏ ఏరియాలో కొనాలి? ఎక్కడ ఏవేమి వసతులు ఉన్నాయి? ఎలాంటి రేట్లున్నాయి? మొదలైన వివరాలు ఆన్ లైను లో చూడకుండానే చెప్పడం కూడా వచ్చేసింది.

ఇక వారాంతాల్లో బయటికి ఒక్క దాన్నీ వెళ్లినా కనబడ్డ ఓపెన్ హౌసులు చుట్టి రావడం వివరాలు కనుక్కోవడం హాబీగా మారింది. గదులు చూడగానే అన్ని అడుగులుంటాయో, ఇంటిని చూసి మొత్తం ఎన్ని చదరపుటడుగులో ఊహించడం లాంటివి ఇంటికొచ్చి చెప్తూన్నపుడు ఎక్కడ కొనమంటానో అనే భయపడే సూర్య ముఖం చూడాలి.

ఒక రోజు ఏమైందంటే -

(ఇంకా ఉంది)