కవిత్వం

లోపలి కోరిక

01-మార్చి-2013

‘నన్ను క్షమించవా?’
ఆ మొదటి రాత్రి అతడన్న మాటలు
ఎడారిగాలుల్లా ఇప్పటికీ బాదుతూనే ఉన్నాయి
కొర్కెల కొంగున వేసుకొన్న ముడి కాళ్ళకడ్డుపడింది

*

గది నిండా ఊడలతో ఆ వృక్షం
రాత్రంతా కురుస్తూనే ఉన్న‌
తెల్లటి మంచును స్పర్శిస్తూనే ఉ‍ది
ఆ గది చేరుకున్న‌నదులు
చెరొక ప్రక్కన‌ మౌనంగా ఘనీభవించి
నిశ్శబ్ధంగా ప్రవహించుకొంటున్నాయి

*

ఉద్వేగాల ఉత్సుకతల తీరాల్ని తగలకుండానే
ఆ ఉదయం ఆమెను చూసిన ప్రతి చూపు
బాగా జ్ఞాపకమే
ఏది ఒక్కసారి ఆ సిగ్గుల మొఖం చూపించూ

*

లోపల్నుండి దావానలంలా ఉష్ణ ప్రవాహం
ఆమెకు గుండెలవిసి పోవాలని లేదు
ఏడ్వాలని లేదు
అప్రయత్నంగా
కన్నిళ్ళను కుక్కుకొంది
ప్రవహించలేని నదిలా
ఒక ప్రాణమున్న శిలగా ఆమె
ఎండిన నదిలో
ఇమడని ఆ ప్రవాహం
ఇక పూలు పూయదు
ఆ గది అంతః కాంక్ష కు ఆమె బందీ గా మారింది