కవిత్వం

ట్రాన్స్ ఫార్మింగ్

జనవరి 2013

జాగృతి నుండి అచేతనానికి
అచేతనం నుండి నిద్రావస్థలోనికి
వేలి కొసన జిగటను  పూసుకొని
అణువును  నిర్వీర్యం చేసే
ఒక నిరాశావాది ఆలోచన
 
ఎగిసిన అలను చీలుస్తూ
తీరంలో చీలను హద్దుగా దిగ్గొట్టి
అరచేత్తో అలను నిమురుతూ
చిన్నగా సుషుప్తి నుండి జాగృతి లోకి
జాగృతి నుండి చేతనంలోకి
చేతనంనుండి దివ్యచైతన్యం లోకి
ఒక‌ ఆశావాదపు ట్రాన్స్ ఫార్మింగ్
 
రెండు నాలికల  చీకటి నాగు
శబ్ధం చేయకుండా మైదానంలో అనకొండలా ప్రాకుతూ
సూర్యునికే  కాంతిని ప్రసరింపచేస్తూ
పడమటి కొండల చాటుకు నక్కినక్కి
నిశ్శబ్ధంగా……కాలచక్రం
 
రంగురంగుల ప్రకృతిని
ఓ ఎలిమెంటేదో
రహస్యంగా
నైరుతి నుండో
ఈశాన్యం వైపునో
రుతుచక్రానికి ఇందనాన్ని పూసి
ఇరుసు ఒరిసే శబ్ధాలతో
రుతువుల ట్రాన్స్ ఫార్మింగ్!!
 
గాలిపటం దారుపు అంచు ఆవల కలల‌ కండి
జ్ఞాపకాల గాలికి  అది  మరో ఆకాశం వైపు
ఉనికి నుండి శూన్యంలోకి
శూన్యం నుండి మరో తాధ్యాత్మికతకు
ఆలోచనల ట్రాన్స్ ఫార్మింగ్
 
 
భయపడుతున్న  సమాధులు దాక్కుంటున్నాయి
మళ్ళీ వెలికి తీస్తారని
చొక్కాలు..ఉంగరాలు …చైన్లు..ఉన్న  అస్థిపంజారాలను
లోపలకు జొప్పుతారెమో అని
బిక్కుబిక్కు మంటు బయపడుతున్నాయి
తారతమ్యాల భజంత్రీల చప్పుడు
చెవులు చిల్లులు పడుతున్నాయ్
ఓ పేద‌ అస్థిపంజరం దిక్కులేనిదైంది
అసమానతల ట్రాన్స్ ఫార్మింగ్!
 
 
ముసుగుతీసిన  మృగం
డప్పు కొడుతూ ఊగుతున్న చెట్లూచేమలు
భయంతోఅడవి  చీకటి మాటున దాక్కుంది
మనిషిగా తెరపైన !
మళ్ళీ ముసుగుతో తెరవెనక్కి
గాయపడ్డ నాగరికత తిరిగి హరప్పాలోకి
ట్రాన్స్ ఫార్మింగ్  !!!!