కవిత్వం

స్వప్ననిశ్చయం

జనవరి 2013

ప్రవహించే నది ఒక్కసారిగా ఘనీభవించింది
ఇప్పుడు ఆ గలగలలు లేవు
హొయలూ లేవు సొగసూ కానరాదు
కొండచరియ అంచున స్వప్నమొకటి
బిక్కు బిక్కు మంటూ భయంతో
ఆలోచనల్లో పడింది

తడిఆరిన కఠిన శిలాక్షరలపై
కరాళ ఘంటికలు నృత్యిస్తోంటే
రుతువులను బలిపీఠం పైకి
తెస్తున్న‌ విషసర్పమొకటి బుసలు కోడుతోంది
చిగురిస్తున్న ప్రతి ప్రశ్నని
మాంత్రికుడొకడు మాయం చేస్తున్నాడు

మిగలని మానవత్వపు జాడల్లొ
మనిషి తత్వం విధ్వంసించుకొంటుంది
మనిషిని మనిషిగా చుడలేని
వాదమొకటి తెరపైకి వచ్చి
తీవ్రవాదాన్నే ఎక్కిరిస్తోంది

తూరుపు కొండల్లో మసకబారిన‌
పసితనమొకటి
కళ్ళకు గంతలు కట్టుకొని
ఎటో పోతోంది
గమనం లేని రాబంధులు
మనిషి తలలు తగిలించుకొన్నాయి

రాలిపడుతున్నఒక్కో ప్రవాహము
ఆవిరవుతున్న వారధులు
బీజం లో నున్న ‘బోన్సాయ్’
మరుగుజ్జులను చూసి నవ్వుకొంటోంది
ఈ ప్రపంచంలకి రానని మోరాయిస్తుంది
ప్లాస్టిక్ పూవొకటి ఆహ్వానిస్తున్నట్లు

ఉలిక్కిపడిన స్వప్నం
తన ఉనికక్కరలేదనుకుంది
ప్రాయోపవేశం చేయాలనుకుంది
ఇది స్వప్ననిశ్చయం!