కవిత్వం

కాల్చేసే మంటొకటి…

25-జనవరి-2013

ఇప్పుడు నాకు విషాదమే అవసరమైంది
జడలు విప్పిన విషాదం
అది నన్ను  గుచ్చి గుచ్చి బాధపెట్టి
నాకో వ్యథను మిగిల్చాలనుంది
నాకు బాధే కావాలి
ఆమె జ్ఞాపకాలను దాచిన గుండెను
కాల్చేసే మంటొకటి
నాకిప్పుడు అవసరం
ఆ కాలుతున్న బాధే నాకిప్పుడు కావాలి
హృదయంలో గూడుకట్టుకొన్నఆమె రుపాన్ని
పలుగుల‌తో తొలగించే నొప్పి కావాలి
ఆ పలుగు చేసే గాయం కావాలి
గుండెలోతుల్లో ఘనీభవించిన‌ ఆమె మధురానుభూతులను
ఎగదోసి రగిలించి
కరిగించే సెగ కావాలి
ఆ సెగ రగిలించే వేదనే నాక్కావాలి
ఆమె అంతర్ సౌందర్యాన్ని
అతికించుకొన్న‌ మనసుపొరలను
విడదీసి ముట్టించే నిప్పురవ్వొకటి కావాలి
ఆ రవ్వ కాల్చే మంటే నాకిప్పుడు అవసరం
మనసును పదే పదే తడుముతూ
ఎంత ఎండినా ఆవిరవని ఆమె జ్ఞాపకాలను
నిలదీసి అంటించే అగ్గొకటి కావాలి
విరబూసిన మా కలల విరితోటలను
కబళించి దహించే దావానలం కావాలి
నన్నో జీవశ్ఛవం చేసే
నన్ను భౌతికంగా మాయంచేసే
నా గుండెను రాయిగ మార్చి
ఇంద్రజాలికుడొకడు నాకు ఎదురవ్వాలి
అవును..
నాకొక విషాదం  కావాలి………!