కొత్త పుస్తకం కబుర్లు

అనుపమ స్వప్నయానం

డిసెంబర్ 2017

సీసాలో ఓ ఉత్తరముంచి సముద్రంలోకి విసిరేయటం లాంటిది కవిత్వమంటే.

ఆ సీసా అలల పై తేలుతూ ఏ తీరం చేరుతుందో.చరిత్రలో ఎప్పుడూ ఎవరో ఒకరు కవిత్వం రాస్తూనే ఉంటారు. ఓ మారుమూల గ్రామంలో లాంతరు వెలుగులోనో, అనేక అంతస్తుల భవనంలో ఓ ఇరుకు గదిలోనో, ఏడు సముద్రాలకవతల అంతరించిపోయిన తెగ తాలుకు చివరి మనిషో – నిరంతరం ఎవరోఒకరి చేత కవిత్వం రాయబడుతూనే ఉంటుంది. కవి తనకు మాత్రమే సొంతమైన ఒక నిశ్శబ్ధంలో రాసే కవిత్వం చరిత్రగమనంలో ఓ కాలానికే ఉపమానం అవుతుంది. ఓ కాలంలోని మనుషులు రక్తమాంసాలతో అనుభవించిన జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఓ కాలపు అస్థిత్వాన్ని నిర్వచిస్తుంది.

కవిత్వం (creative work ఏదైనా) రాయటం పగటికల కనటంలాంటిదని ఫ్రాయిడ్ అంటాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటూ తన సొంత ప్రపంచాన్ని నిర్మించుకునే పిల్లాడు కొనసాగింపుగా పెద్దయ్యాక తన ఏకాంతంలో కథలూ కవితలూ రాస్తుంటాడని అంటాడు. ఈ రెండు పనులూ ఒక రకంగా, ఊర్మిలా అన్నట్టు “కన్నులు తెరిచి కన్న స్వప్నం” లాంటివి. ఈ సందర్భంగా కవిత్వమనే కలను చేయుపట్టుకొని నడిపించే (Writing is nothing more than a guided dream – J.L. Borges) తన స్థితికి తాను ఇచ్చుకున్న పేరు – ఊర్మిల. రామయనంలో పద్నాలుగు సంవత్సరాలు నిద్రలో బ్రతికిన ఊర్మిల కలలలో ఎంత దూరం ప్రయాణించిందో – ఎన్ని రామాయణాలు చూసిందో, ఎంతమంది లక్ష్మణులను పెళ్ళడిందో- అంతటి జీవితాన్ని కలగన్న ఊర్మిలకు మెలుకువకూడా ఓ మరణంలాంటిదే. మేలుకున్న ఊర్మిలకు తన స్వప్న జ్ఞపకాలుగా మిగిలేది పిడికెడు బూడిద మాత్రమే.

(తెల్లారితే షార్జహద్ బ్రతికిపోతుంది, మేలుకుంటే ఊర్మిల మరణిస్తుంది)

లక్ష్మనుడి కోసం పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోయి కలగన్న ఊర్మిల వేరు, కలలో సముద్రాలు దాటిన ఊర్మిల వేరు. ఈ కవిత్వం రాసిన ఊర్మిల వేరు, ఈ కవిత్వంలోని ఊర్మిల వేరు (“The I in a poem, I want to insist, is the consciousness from which the poem comes, but it’s not the I to whom I subscribe when I sign an affidavit, when I set forth facts in order to get a driver’s license or a passport” – Adrienne Rich, “The Genesis of Yom Kippur 1984″ ) ఏకరీతిగా సాగే జీవితంలోకి నెట్టబడిన స్త్రీ ఊపిరి పీల్చుకోటానికి ఉపరితలంలోకి వచ్చినప్పుడు రాయబడిన కవిత్వం ఇది. స్థన-కాల పరిమితులకు కట్టుబడాల్సిన స్త్రీ పగటికల ఈ కవిత్వం. “అగాధం అంచున వేలాడుతూ” ప్రాణాతీతమైన తొందరతో రాసిన కవిత్వం ఇది.

అందుకే ఈ కవిత్వంలో ఇద్దరు స్త్రీలు కనిపిస్తారు. భౌతిక వాస్తవానికి రాజీ పడిన స్త్రీ, స్వప్న ప్రపంచంలో ఎవరికీ జవాబుపడని స్త్రీ. ఒక స్త్రీ మరొక స్త్రీని ఎప్పుడూ గమనించుకుంటూ ఉంటుంది. ఒక స్త్రీ కి మరొక స్త్రీ సాక్ష్యం. ఒక స్త్రీ మరొక స్త్రీని కలుసుకోటానికి నిరంతరం తాపత్రయపడుతూ ఉంటుంది. తన రోజూవారి జీవితానికి దూరంగా, స్థలకాల పరిమితులకు అవతల ఓ కలలాంటి ప్రదేశంలో ఒక స్త్రీ మరొక స్త్రీని కలుసుకుంటుంది.

ఊర్మిల చూసిన ప్రతొక్క వస్తువుకీ ఓ అభౌతిక అర్థాన్ని ఇచ్చుకుంటుంది. ఆరకంగా తన ప్రపంచాన్ని తనకనుగునంగా నిర్వచించుకుంటుంది. తన హృదయం పిచ్చిదాని పిడికిలో రాయి, “జీవితం” “ఆకలిగొన్న దాహం”, తనకు “గాలిలో తిరగాడే దువ్వెనలు సంకేతాన్ని మోసుకొ”స్తాయి, తటాలున పడిన చినుకు “జ్ఞాపక తెరలుతీసే” మంత్రం అలా తన చుట్టూ ప్రపంచమన్న నాలుగు డైమెన్షన్ల వాస్తవాన్ని భాషా అనే అసంఖ్యాక డైమెషన్ల ప్రపంచంలోకి విడుదల చేస్తుంది. పెట్టుబడీదారి వ్యవస్థలో, పురుషస్వామ్య సమాజం తనకిచ్చిన భాష తనను తన ఆలోచనల్లో కూడా ఎక్కువ దూరం పోనివ్వదని తన భాషని తానే సృష్టించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. “సుదీర్ఘ కాలరేఖపై/ ఒంటరి పయనం/ చుట్టూరా/ కనుచూపు మేర/ ఎండి మోడైన కొమ్మలు రెమ్మలు” అంటూ తన చుట్టూ అల్లుకున్న ప్రపంచం స్వభావాన్ని generalise చేస్తుంది.

కానీ భౌతిక ప్రపంచం మనిషిని ఎలా నిర్వచిస్తుందో, ఉపమానాల ప్రపంచం ఊర్మిలనీ నిర్వచిస్తుంది. ఒక సందర్భంలో ఎన్నో నిజాల్లో బ్రతికే తాను, ఒక నిజానికే ఎన్నో నిర్వచనాలను వెతికే తాను – తనకుతాను అసంఖ్యాక అస్థిత్వాలను ఆమోదించుకుంటుంది. ఒకే అస్థిత్వానికీ బంధీ అవ్వటాన్ని నిరాకరిస్తుంది. “విరుచుకుపడ్డ మంచు బిందువు” తానే, “కత్తులు పొదిగిన కూలిన వంతెనా” తానే. “కడదాకా గమ్యం చేరని బాటసారీ” తానే, తలకిందులైన ప్రేతం” తానే. ఓ దేహంలేని తనంలో తననుతాను నిర్వచించుకుంటుంది – “దేహాన్ని వదిలి/ అద్దం ముందుకెళ్ళి నిల్చుంటుంది”.

ఈ రకంగా తనకు తానూ, తన చుట్టూ ప్రపంచానికీ అర్థాన్ని ఇచ్చుకుంటూ, ఓ భాషని సృష్టించుకుంటూ, నిరంతరం తననుతాను నిర్వచించుకుంటూ ఉంటుంది.

స్త్రీలు తాము స్వేచ్చగా ఆలోచించగలిగే భాష సృష్టించుకున్నప్పుడే – ఈ పురుషస్వామ్య సమాజాన్ని ఎదిరించి మాట్లాడగలుగుతారు.

“What does it mean when the tools of a racist patriarchy are used to examine the fruits of that same patriarchy? It means that the most narrow perimeters of change are possible and allowed.” – Audre Lorde, The Master’s Tools Will Never Dismantle the Master’s House.

అందుకే స్త్రీ తమకు మాత్రమే సొంతమైన భాషని సృష్టించుకోవాలి. పురుషుని దృష్టిసోకని ఓ భాష, నవ్వుకోటానికి, ఏడ్చుకోటానికీ స్వేచ్చాయుత భాష. “Poetry is not a luxury” అనే వ్యాసంగంలో లార్డే అంటుంది:

“For within living structures defined by profit, by linear power, by institutional dehumanisation, our feelings were not meant to survive. Kept around as unavoidable adjuncts or pleasant pastimes, feelings were expected to kneel to thought as women were expected to kneel to men. But women have survived. As poets. And there are no pains. We have felt them all already. We have hidden that fact in the same place where we have hidden our power. They surface in our dreams and it is our dreams that point the way to freedom. Those dreams are made realisable through our poems that give us the strength and courage to see, to feel, to speak and to dare.”

తీరం చేరిన సీసాలోని కవిత్వం ఏ అనామకుడి కాలు తగులుతుందో. ఆ అనామకుడు మరొక ప్రపంచం నుండి వచ్చిన ఆ కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో. ఆ అనామకుడిలో ఈ కవిత్వం ఏ భాషని నిద్రలేపుతుందో.

***

పుస్తకం వివరాలు:
పుస్తకం: అంగారస్వప్నం
రచయిత: ఊర్మిళ
ప్రచురణ: ప్రేమలేఖ
వెల: Rs. 200
ప్రతులకు: నామాడి శ్రీధర్, 3-129, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా, AP 533214