కవిత్వం

అతి చిన్న కారణానికి నేను మరణిస్తాను.

ఏప్రిల్ 2015

హుశా అతి చిన్న కారణానికి
నేను మరణిస్తాను.
చిన్న కలువపూవు కోసమో
అంచున వూగుతున్న మంచుబిందువు కోసమో
వాన చుక్క కోసం ఏప్రిల్ గాలిలో ఊగుతున్న పూరేకు కోసమో
మరణిస్తాను.

బహుశా
పిట్ట పాట కోసమో
పసిపాప బుగ్గపై సొట్ట కోసమో
సూర్యరశ్మిలోని ముత్యం కోసం
ఎవరి కంటిలోనో మెరుస్తున్న
కన్నీటిచుక్క కోసమో
మరణిస్తాను.

అత్యంత చిన్న దానికి
నేను మరణిస్తానేమో
వెండి వెన్నెల కోసమో
మేఘపు ముక్క కోసమో
బహుశా
ఇరవై ఒకటవ అంతస్థులో
ఏదో పచ్చటి మరకను అన్వేశిస్తూ
తప్పిపోయిన సీతాకోకచిలక కోసమో
మరణిస్తాను.

అతి చిన్న విషయానికి
నేను మరణిస్తాను.
సూక్ష్మాతి సూక్ష్మమయిన కల కోసమో
అనవసర శొకం కోసమో.
బహుశా, స్వప్నంలో
ఒక చుక్క సౌందర్యాన్ని చూసి
నిట్టూర్చిన అనామకుడి కోసమో.

మరణిస్తాను.

 

మూలం: హుమయున్ ఆజాద్  ( బెంగాలి కవిత)
ఆంగ్లానువాదం: అరునవ సిన్హ
ఆంగ్లం నుండి తెలుగులోకి: రోహిత్