2017 సంవత్సరం నవంబరు 18, 19 తేదీలలో హైదరాబాదులో రచయితల సమావేశం జరిగింది. అంతకన్న రెండు వారాల ముందు ఖదీర్ బాబు ఫోన్ చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించాడు. నేను సరే అన్నాను, అలాంటి సమావేశాల్లో ఏమి జరుగుతుందా అనే ఆసక్తితో, ఏదైనా కొత్త విషయం నేర్చుకొనే అవకాశం ఉంటుందనే ఆశతో.
మొదటి సెషన్ లో ఖదీర్ అక్కడకు చేరుకున్న 30-35 మంది రచయతలను సవివరంగా పరిచయం చేసినప్పుడు నాకో సందేహం కలిగింది– వాళ్లందర్నీ సంధించే సూత్రం ఏమయ్యుంటుందా అని. సుమారుగా సగంమంది పేర్లు గతంలో నేను విన్నవే – వారి రచనలు కొన్ని చదివి ఉన్నాను కూడా. తొలి పరిచయంలో మాత్రం ఆ సమూహం వివిధ అస్తిత్వవాదాల, రాజకీయ, సైద్ధాంతికధోరణుల కలగూరగంపలా అనిపించింది. దానికితోడు ఒక నిర్దిష్టమైన ఎజెండా అంటూ లేకపోవడం కూడా విస్మయం కలిగించింది. మన టీవీ డిబేట్లలో మాదిరిగా ధ్వనికాలుష్యం మరీ తీవ్రస్థాయికి చేరుకుంటేగనక సాయింత్రానికల్లా జారుకుందామని నిర్ణయించుకున్నాను. అయితే రెండురోజుల సమావేశం పూర్తయ్యేదాకా ఉండి సంతోషంగా, ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అదెలా సాధ్యపడింది? ఆ రెండ్రోజుల్లో ఏం నేర్చుకున్నాను? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
అక్కడకు వచ్చినవారంతా బాగా చెయ్యితిరిగిన, అనుభవజ్ఞులైన రచయితలు; లేదాఇటీవలే రాయడం మొదలుపెట్టిన యువ రచయితలు. ఒక నిర్దిష్ట ఎజెండా అంటూ లేకుండా వారందరితో – ఒక్కొక్కరుగా లేదా చిన్నచిన్న సమూహాలలో – ఇష్టాగోష్ఠిగా సంభాషించినప్పుడు కొన్నిసాధారణ లక్షణాలు గోచరించాయి. అందరిలోనూ ఒక అణకువ, నమ్రత, తెలుసుకోవాలనే తపన కనిపించాయి. తమని తాము మరీ సీరియస్ గా తీసుకోకుండా, తామే ప్రపంచపుభారాన్ని మోస్తున్నామనే భావన కలిగించకుండా నవ్వుకోగలిగిన మనుషులు వాళ్లంతా. అదే సమయంలో, వారిలోఎక్కువమంది తెలుగు సాహిత్యంతోనే కాకుండా దేశీయ, విదేశీ సాహిత్యాలతో లోతైన బాంధవ్యం కలిగిన వ్యక్తులని విశదమైంది. ఈ కారణాల మూలంగా ఆరుబయటి సంభాషణలు అర్థవంతంగా, ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంలో జరిగాయి. సమావేశస్థలిలో మరింత ఫార్మల్ గా జరిగిన చర్చల్లో వక్తలందరూ తమ వాదాలను బలంగా, నిర్మొహమాటంగా వినిపించారు. కొన్నిసార్లు వాతావరణం వేడెక్కింది; అలాగని ఎవరూ మండిపడలేదు.
మాట్లాడిన వారందర్నీ, అన్ని విశేషాలనూ పేర్కొనడం సాధ్యంకాదు గానీ, నా మట్టుకు నేను కొత్తగా, లేదా మరింత స్పష్టంగా తెలుసుకున్న కొన్ని ప్రధానమైన విషయాలు– కొండగుర్తులుగా రాసుకున్న పొడివాక్యాల్లోంచి:
• ఉద్యమాల ఉత్తేజం, ప్రేరణ అవి ఏర్పరచిన ప్రాపంచిక దృక్పథం – ముఖ్యంగా తెలంగాణా సాహిత్యంలో–నేటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నవి. (అల్లం రాజయ్య, డాక్టర్ పసునూరి రవీందర్ ల ప్రసంగాలు, ప్రమేయాలు ఇందుకు అద్దం పట్టాయి).
• అస్తిత్వవాదం ఏదైనప్పటికీ వాటి మూలాల్లో ఉండేది మానవీయత, ఆవేదన (అన్వర్, కుప్పిలి పద్మ).
• ముఖ్యంగా దళితవాదంలోనూ, తరువాత స్త్రీవాద, ప్రాంతీయ వాదాలలోనూ వస్తున్న ఇటీవలి రచనలలో బాధితుల స్వరాలను పలికించడంతో ఆగిపోకుండా ప్రత్యామ్నాయ సాధికారతను ప్రకటించుకొనే ధిక్కారం స్పష్టంగా వినబడుతున్నది. ఇదొక మంచి పరిణామం (రవీందర్, కృష్ణజ్యోతి, అపర్ణ తోట).
• రాబోయే కాలంలో మన రచనలకూ, సృజనాత్మకతకూ అడ్డుకట్టలు వేయడం ఎవరికీ సాధ్యంకాదు (అపర్ణ తోట).
• యువరచయితల రచనావ్యాసంగం తెలుగు సాహిత్యానికి ఆశాజనకంగా ఉన్నది. వారు ఎంచుకుంటున్న ఇతివృత్తాలలోని వైవిధ్యం అద్భుతం. గ్రామీణ పునాదుల నోస్టాల్జియాను అధిగమించి, ‘గడచిన దినాల తలపోతల బరువు’ నుండి విముక్తులై, ఆధునిక నగరజీవన సంక్లిష్టతను ఒడుపుగా పట్టుకున్న మొదటితరం రచయితలు వీళ్లంతా (ఖదీర్,రిషి శ్రీనివాస్,అపర్ణ తోట, చైతన్య పింగళి, మనోజ్ కనుమూరి, మహి బెజవాడ, కాశీరాజు, విజయ్, ఇంకా ఇతరులు).
• నిత్య సంఘర్షణ, విస్తృత జీవితానుభవసారమే రచనావ్యాసాంగానికి ముడిపదార్థం. మనమధ్య ఇంకా శారదలుండడం ఏకకాలంలో మనఅదృష్టం, దురదృష్టం.(భూతం ముత్యాలు, కరుణాకర్).
• తాత్వికచింతన కలిగిఉండే కథలు విరివిగా రాకపోవచ్చుగాని సదా వాటికొక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదొక తపన, ధ్యానం, అంతర్ముఖ అన్వేషణ, సూచనప్రాయమైన వ్యక్తీకరణ.(పూడూరి రాజిరెడ్డి, భగవంతం, అజయ్ ప్రసాద్).
• ఇవాళ్టి పరిస్థితుల్లో రాజ్యాంగానికీ, అంబేద్కర్ రచనలకూ విస్తృత ప్రచారం కల్పించడం కళాకారుల, బుద్ధిజీవుల కర్తవ్యం (మహేష్ కత్తి, ఇంకా ఇతరులు).
• తెలుగులో వస్తున్న ప్రతీ కథనీ (సంవత్సరంలో సుమారు మూడువేలని తెలిసింది!) ఓపిగ్గా చదివి, మంచిచెడులను విశ్లేషించే విమర్శకులు ఉండడం మన అదృష్టం. అంతటితో ఆగకుండా అమెరికాలో ప్రచురింపబడుతున్న కథలనుకూడా చదివి, వాటిని మన దృష్టికి తీసుకొచ్చిన రమణమూర్తిగారికి అభినందనలు.
• దక్షిణ అమెరికా సాహిత్యపు లోతులలోని కళాతత్వసౌందర్యం భిన్నమైనది, విలక్షణమైనదీను. అక్కడి ధోరణులను గనుక పరిశీలిస్తే మనం తెలుసుకోవలసినవి చాలానే మనల్ని చుట్టుముడుతాయి.(కె. సురేష్).
• తెలుగు కథల ప్రాచుర్యానికి ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలలోకి వచ్చే, రాగల అనువాదాలే సజీవవారధులు. (ఆదిత్య).
• తెలుగు రచయతలు తమ పుస్తకాలను తామే ప్రచురించుకొని అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. అయినప్పటికీ కొన్ని మెళకువలు పాటిస్తే ఈ పనిని సమర్థంగా నిర్వహించవచ్చు (ఖదీర్ బాబు). ప్రత్యామ్నాయం? ఈ-ప్రచురణ.(అనిల్ అట్లూరి).
ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి. ప్రధాననిర్వాహకులైన ఖదీర్, సురేష్ లు సమయపాలనను సమర్థవంతంగా పాటింపజేశారు. వారి అంకితభావానికీ, సామర్థ్యానికీ అభినందనలు. రెండు రోజులపాటు అంతమంది రచయతలతో, సాహితీమిత్రులతో గడపడం నాకు కలిగిన ఒక గొప్ప అవకాశం. నిర్వాహకులకు ధన్యవాదాలు.
ఎందుచేతనోగాని, ‘కొత్తగా రాస్తున్న యువరచయిత’గా నన్ను నేను పరిచయంచేసుకోగానే అక్కడున్నవాళ్లంతా గొల్లుమని నవ్వారు– నిష్కల్మషంగానే. అది నాకు ఉల్లాసం కలిగించింది; అలాగే, ఆనాటి హేమంత శుభోదయపు అరుణవర్ణం సాయింత్రానికల్లా ఊదారంగులోకి మారినప్పుడు నీలిదుస్తుల రచయితల గుంపులో నన్ను నేను విలీనం చేసుకోవడం కూడా.
- ఉణుదుర్తి సుధాకర్
మద్రాసులో అనేక సినిమాలు తీసి డెబ్బయ్యేళ్ళ వయసులో ఇప్పుడు నవల రాయాలనీ, నవలా రహస్యాలు ఏమైనా తెలుసుకోవచ్చనీ ఫ్లైటెక్కి వచ్చిన అప్పటి ప్రముఖ నిర్మాతా, అదే నగరంలో ఇంకోమూల రోడ్డుపక్క హోటల్లో కట్టెల పొయ్యి ముందు కళ్ళు మండుతూ కాళ్ళు బొబ్బలెక్కుతున్నా సాంబారు కాసి అనేక ఢక్కామొక్కీలు తిని టూరిస్ట్ కంపెనీ ఓనరయ్యి కథా రచయిత కూడా అయిన ఇంకో వంట మాస్టరూ, కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం తర్వాత మూడొందలకు పైగా సభల్లో ప్రసంగించి రాయటానికి టైం దొరకని తెలంగాణా దళిత కథా రచయిత, చిట్టగాంగ్ కొండ కోనల్లో రెండేళ్ళకు పైగా తిరిగి శోధించి రాసినందుకు అదే అవార్డ్ సాధించిన ఓ మహిళా యాక్టివిస్టూ – తను కథా రచయిత్రి కూడా, ఒకే ఒక కథ రాసిన ఓ కొత్త రచయిత పక్కనే నలభై ఏళ్ళుగా కథలూ, నవలలూ, వ్యాసాలూ రాస్తున్న తెలంగాణా సీనియర్ మోస్ట్ ఇంకొకరూ, హైదరాబాద్లో కేన్సర్ రీసెర్చ్ చేసే ఒక సైంటిస్ట్ సాహిత్యాభిమానం, అతి తక్కువమంది మాత్రమే చేయగలిగే భాషా సౌందర్య శాస్త్ర పరిశోధన మీద ఢిల్లీ యూనివర్సిటీ నుంచీ యువ విమర్శకుడొకరు, ముప్పయ్యేళ్ళ తర్వాత మళ్ళీ కథా రచన మొదలెట్టి కొత్త రచయిత అయిన ఓ ముంబై మెరైన్ ఇంజనీర్, రెండు నవలలూ కథాసంకలనాలూ కవిత్వం తెచ్చి మెప్పించిన ఒకప్పటి హైదరాబాద్ రిక్షావాలా, పాతికేళ్ళలో పది కథలే రాయగలిగిన ఓ అనామక రచయిత, రెండేళ్ళలో ఇరవైరెండు కథలు రాసిన మారుమూల ప్రముఖ రచయిత్రీ, కథ, సినిమా సంగీతం లాంటి అనేక రంగాలలో అనేక రకాలుగా చెయ్యి తిరిగిన ఇంటింటి కథా రచయిత పక్కనే రాసిన రెండు వైవిధ్య కథలకే చెయ్యి విరిగిన మరో కథా విరాగీ, ఏడాదికి మూడువేలకు పైగా కథలు చదువుతూ కథకు శిలువ వేసుకొన్న నిరంతరాధ్యయనశీలి ఒకవైపు, తన కథలు తప్ప మరొకరివి చదవని ఇంకొకరూ, ఆరు పుస్తకాలు అచ్చయ్యాక కూడా తగిన టైటిల్ దొరక్క రెండేళ్ళుగా తరువాతి పుస్తక ప్రచురణ ఆపిన సీనియర్ రచయిత్రీ, నాలుగైదు కథలకే సంచలన టైటిల్ దక్కించుకొన్న యువ రచయిత్రి ఒకరూ, ఇప్పుడు తన పూర్తి పేరుతో రాయటానికే సంకోచించాల్సిన పరిస్థితి వచ్చిన మైనారిటీ రచయిత్రి ఆందోళన ఒకవైపూ, ఫేస్బుక్లో ముప్పై వేల ఫాలోయర్లను గెలుచుకొన్న బిగ్బాస్… ఇంకా అనేకానేక రంగాల నేపథ్యాల వాదాల వివాదాల అస్తిత్వాల…
అందరూ ఊరికి దూరంగా ఒక చోట చేరి నవంబర్ 18, 19 మొత్తం రెండు రోజులూ ఒకరినొకరు ఆహ్వానిస్తూ, చర్చిస్తూ, విభేదిస్తూ, సహిస్తూ…
***
“నా కథలు ఎవరూ చదవట్లేదు. అసలెందుకు రాయాలి?”
“మా దళితుల మీద రాస్తుంటే ఎప్పుడూ ఒకటే రాస్తున్నాడు అని ఒక విమర్శకుడు బాధ. అవే ఎందుకు రాయకూడదు?”
“రచయిత డబ్బు సంపాదించాక రాయలేడంటారు. నిజమేనా?”
“తన బాల్యం మీదా, ఊరుమీదా ఒకే ధోరణిలో అనేక మంచి కథలు రాసిన ఒక రచయిత, ఇప్పుడు వేరే రకం కథలు రాయటం మొదలెట్టాడు. అలా చేయొచ్చా?”
“ఫలానా రచయిత కారు కొన్నాడు. ఆయన పని అయిపోయినట్టేనా?”
“ఒకే ధోరణిలో రాయటం మంచిదా, లేక అనేక విషయాల మీదా రాయొచ్చా…?
“ప్రయోగాత్మక కథలు నేటివిటీ లేకపోవటం వల్ల ఫెయిలవుతున్నాయి. కాదా?”
“నేను లేని కథల్ని నేను రాయను”
“నేనంటే నా పుట్టుకతో వచ్చే అస్తిత్వమొక్కటే కాదు. నాకు ఇంటా బయటా అనేక అనుభవాలుంటాయి. అవన్నీ రాయాలి. అంతే కానీ నువ్వు ఫలానా స్త్రీవి, ఫలానా మైనారిటీవి. అవి మాత్రమే రాయాలంటే అదొక్కటే నా జీవితం కాదు. రాయను.
“పెద్ద కథలు వేసే పత్రికల్లేవు. చిన్న కథలే రాయాలా?”
“కథలో నెగెటివ్ ప్రోటగొనిస్ట్ ని పెడితే అది నేనే అనుకొంటారేమో నా గుడ్ విల్ పోతుందేమో అని భయం వేస్తోంది”
“రాసేప్పుడు ఫలానా వాళ్ళేమనుకొంటారేమో అన్న భయం…”
“రాసి అచ్చేసుకొని చేతులు దులుపు కోవటం కాదు. దాన్ని పాఠకుల దగ్గరకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఇప్పుడు రచయితదే”
“తెలుగులో తక్షణ సమస్యల మీద వచ్చినట్టు తాత్విక వివేచన మీద కథలు రావటం లేదు. లేదా మన వాళ్ళకు రాయటం రాదా?”
“ఈ తరం రచయితలకు తాత్విక భూమిక లేదు, అంతా పైపై వ్యవహారమే. అసలు మనిషి లోతుల్లోకి వెళ్ళి…”
“ఇప్పుడు మనం మనమీద పని చేసే సెన్సార్ షిప్ గురించి మాట్లాడు కోవాలి. అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక ఫలానా నెగెటివ్ పాత్ర మా కమ్యూనిటీదే. ఈ రచయిత మాకు వ్యతిరేకం అంటున్నారు. ఇదో కొత్తరకం సెన్సార్షిప్”
“స్త్రీ విముక్తి సరే. మగవాడి నలుగు బాటు సంగతేమిటి. ఎవరూ రాయరా? రాయకూడదా?”
“గతంలో వచ్చిన అభ్యుదయ విప్లవ సాహిత్యాల్లో మా జీవితాల్లేవు. అందుకే మావి మేము రాసుకొంటున్నాం”
“అసలు కథ చెప్పే వాడు నెరేటర్. రచయితకూ నెరేటర్కీ వాడి దృక్పథానికీ మధ్య సంబంధం లేదు. ఈ సంగతి పాఠకులకు తెలియటం అటుంచి అసలు రచయితలకన్నా తెలుసా? అందుకే ఈ భయాందోళనలు”
“మీక్ బాల్ రాసిన నెరేటాలజీ తప్పక చదవాల్సిన పుస్తకం. అసలు డెరీడా, ఫూకో, లకాన్ లేకుండా …”
” వెస్టర్న్, రష్యన్, లాటిన్ అమెరికన్ సాహిత్యం సరే, మన పక్క రాష్ట్రాల్లో వస్తున్న అద్భుతమయిన సాహిత్యం మనం చదువుతున్నామా? తమిళ, కన్నడ , మళయాళీ భాషలు నేర్చుకోవటం అంత కష్టం కాదు ”
“తెలుగులో మనం రాసే కథలు సినిమాలుగా మారటం కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయింది. గమనించారా? ఇతర భారతీయ భాషల్లో అలా కాదు. అక్కడ మంచి కథల్ని సక్సెస్ఫుల్ సినిమాలుగా తీస్తున్నారు. అక్కడి సినిమా రచయితలు కూడా అద్భుతమయిన కథలు రాస్తున్నారు. తెలుగులో కథకీ సినిమాకీ మధ్య లింక్ తెగిపోయింది”
“కొత్త తరం పాఠకులకి మనం రాసేది అవసరం లేదు. మన సాహిత్యం…it is going to die, obviously”
“తెలుగులో పాఠకుల్లేరు, రచయితలు తప్ప”
“కథ సరే, అసలు నవలెందుకు రాయరు? రాసే శక్తి లేదా? లేక మనలో విషయం లేదా? లేక కథ రాస్తే వచ్చే పేరు ఆదరణ నవలా రచయితలకు లేదని …”
“హాస్య వ్యంగ్య కథలు రావటలేదు. అన్నీ సీరియస్ విషయాలే…”
“ఇతర భారతీయ భాషల్లో తెలుగునేల మీద ఉన్న అన్ని వాదాలూ వివాదాలూ ఉన్నాయి, కానీ వాళ్ళు తక్షణ స్పందనని మించినదింకేదో పట్టుకొని, కంపెల్లింగ్గా, ఏ ఇన్హిబిషన్స్ లేకుండా వైవిధ్యంగా రాస్తున్నారు”
“రచయిత ఇంటలెక్చువల్ అయ్యక ఎమోషన్స్ ఆగిపోతాయి, ఇక కల్పనా సాహిత్యం రాయటం సాధ్యమా?”
“ఇంటలెక్చువాలిటీకీ ఎమోషన్స్ కీ మధ్య సంబంధం లేదని తమిళ, కన్నడ , మళయాళీ రచయితలు నిరూపించారు”.
“ఇక్కడ సాధారణ రచయితల్ని చెకోవ్ లాంటి వాళ్ళతో పోల్చి చూడటం దారుణం. పోల్చాలంటే ఇక్కడి ఉత్తమ రచయితల్నీ, అక్కడి మంచి రచయితలతో పోల్చండి. అంతే కానీ ప్రపంచ కథ ముందు తెలుగు కథ తీసిపోయినట్టు మాట్లాడటం సరి కాదు”
“అమెరికన్ కథల పరిస్థితి కూడా మనకంటే గొప్పగా ఏం లేదు. మనకి ఏడాదికి సుమారుగా 2500 కథలు వస్తున్నాయి. అందులో 8 శాతం మంచి కథలు అని చెప్పొచ్చు. అక్కడ కొంచెం ఎక్కువ. 12 శాతం. కాకపోతే వాళ్ళు చిన్న చిన్న అంశాల్ని కూడా గొప్పగా మలుస్తుంటారు రేమాండ్ కార్వర్ లాగా”
“గత రెండు దశాబ్దాలుగా, ముఖ్యంగా కాలేజీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు బందయ్యాక ఓ కొత్త రైటిస్ట్ తరం వచ్చింది. అసలు ప్రమాదమేమంటే, భినాభిప్రాయం సహించలేని వీళ్ళు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కీలక పదవుల్లో నిర్ణయాత్మక శక్తులుగా తయారయ్యారు. సాహిత్యంతో పరిచయం అటుంచి, అసలు ప్రజాస్వామిక విలువలకే వాళ్ళు అపరిచితులు. ఇక తరువాతి తరం సంగతి అలోచిస్తుంటేనే భయమేస్తోంది”
ఇలా ఎన్నో ప్రశ్నలూ కొన్నే సమాధానాలు…
***
సమావేశానికొచ్చిన కొందరి అభిప్రాయాలు క్రింద:
రైటర్స్ మీట్ కోసం నేను మానసికంగా ఎప్పుడో ఆ సమూహం మీద వాలిపోయాను. స్థిరంగా రాస్తున్న వాళ్ళని, అప్పుడప్పుడు రాస్తున్న వాళ్ళని, కొత్తగా రాస్తున్నవాళ్ళని ఒక దగ్గర సమావేశపరచడమే పెద్ద సాహసం. అన్ని భావజాలాల ప్రతినిధులనూ పిలిచి వారి అనుభవాలను, వారి దృక్పథాలను, ఇంతకాలంగా రాస్తూఎదుర్కుకున్న ఇబ్బందులు, అధిగమించిన అవరోధాలు, తట్టుకున్న సవాళ్లు, విస్తృతం చేసిన భావజాలం, రాయకుండా ఉండలేని స్థితి, రాశాక ఏర్పడ్డ వాద వివాదాలు, ఎంత రాసినా రాయకుండా మిగిలిపోయిన జీవితాలు, సంఘటనలు, సందర్భాలు, అసంతృప్తులను, రాశాక ఎదుర్కుకున్న పరిస్థితులు, ఎదిరింపులు …
కథ గురించి, రాసే విధానం, టెక్నిక్, శిల్పం, తాత్వికత, సార్వ జనీనత, తమదైన కథాకథనం .. ఖుల్లంఖుల్లాగా స్పష్టంగా, ప్రామాణికంగా , అర్థవంతంగా , ఉద్విగ్నం గా, ఉత్తేజంగా, మనసులో ఉన్నదున్నట్టుగా చెప్పారు. గట్టిగా చర్చించుకోవడం జరిగింది.
ఈ పదేళ్లలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయకుండా, కనీసం పక్కన వున్న ఇతర రచయితలతో కూడా మాట్లాడుకోకుండా, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 వరకు .. కూర్చోవడం నాకైతే మొదటిసారే.
మీటింగ్ లా లేదు. సమావేశంలా లేదు. మాట్లాడిన ప్రతి ఒక్కరి మాట అందరూ విన్నరు. చర్చల్లో పాల్గొన్నరు. ఎవరికి వారు బయట ప్రత్యేక సమావేశం పెట్టుకోలేదు. చాలా ఏండ్ల తర్వాత ఎంతో ఇష్టంగా ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు కుదురుగా కూర్చున్నం.
గొప్ప కథలాగే గడిచిపోయాయి 2 రోజులు.
- అన్వర్ వరంగల్
***
ఈ రైటర్స్ మీట్ 2017 లో చాల మంది యువ రచయతలు పాలు పంచుకున్నారు. అది తెలుగుసాహిత్య లోకానికి ఒక ప్రోత్సాహకర పరిణామం అనిపించింది.
ఇది ఒక చక్కటి అనుభవం. నిజానికి నాకు తెలియని ఎన్నో కోణాలు ,మరెన్నో విషయాల గురించి తెలుసుకున్నాను.
- మణి వడ్లమాని
***
రాసే కుతూహలం ఉన్న నాలాంటి వాళ్లకు ఇక్కడ రెండ్రోజుల గ్లూకోస్ ఎక్కించబడింది . ఇప్పటికే బాగా రాసి, ఇంకా రాస్తున్న వాళ్లకు కొత్త వాళ్ళను కలిసి ఆలోచనలు పంచుకునే ఆటవిడుపు లాంటివి ఈ రెండురోజులు .
దైనందిన జీవితం లో ఉండే పీడన , నలుగుబాటు , భయాలు , ఆందోళనలు… వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి కుదురుగా కూర్చుని రాయాలంటే … ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలి . కలుస్తూ ఉండాలి.
- కరుణ కుమార్
***
ఇవీ నవంబర్ 18, 19 రెండు రోజులూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన రైటర్స్ మీట్ 2017 కబుర్లు.
2001 నుంచీ ఇప్పటి దాకా ఖదీర్ బాబు, సురేష్ లు నిర్వహిస్తున్న కథకుల సమావేశాల్లో ఇది పదకొండవది.
గత ఏడాది సూర్యలంకలో జరిగిన రైటర్స్ మీట్ రచయితల నుంచీ ‘కొత్త కథ – 2017′ వెలువడటం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.
ఇక ‘కొత్త కథ – 2018′ కోసం ఎదురు చూద్దాం.
- సురేష్
**** (*) ****
Good & thought provoking report.
సమగ్రంగా ఉన్న నివేదిక. పూర్తిగా చదివిన వారికి, సమావేశంలో చర్చకొఛ్హిన కొన్ని ప్రశ్నలకైన జవాబులు దొరికితే సంతోషమే.
The true reflections of Telugu literature . An end of an era . Anyone stressed the importance of Research on the subject she or he intends to write ?
Time constraints. Though there was reference to research in passing, there was no in-depth discussion. However, on the informal 1-1 or many meets, I am sure a few more topics were broached, discussed, and debated.
ఇటువంటి మంచి యత్నాలు ఇంకా కొనసాగుతుండడం ఆనందదాయకం.మంచి ఆశయం.మంచి విశ్లేషణ.మంచి ఆచరణ.నిర్వాహకులకూ,పాల్గొని రైటర్స్ మీట్ ని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు.
“ రచయిత ఇంటలెక్చువల్ అయ్యక ఎమోషన్స్ ఆగిపోతాయి ”
బుచ్చిబాబు, త్రిపుర, రావిశాస్త్రి ఇంకా అనేక ప్రముఖ ఇంటలెక్చువల్ రచయితల కధలు పై వాదనని నిర్ద్వందంగా ఖండిస్తాయి.
” ముప్పయ్యేళ్ళ తర్వాత మళ్ళీ కథా రచన మొదలెట్టి, కొత్త రచయిత అయిన ఓ ముంబై మెరైన్ ఇంజనీర్ ”
‘ఇద్దరు మావయ్యల కథ’ రాసిన (త్రిపుర గారి) ఉణుదుర్తి సుధాకర్ గారు అని తలపోస్తున్నా.
రాసేప్పుడు మరిచిపోయిన కొన్ని ముఖ్యమైన విషయాలు …
ఊరికి దూరంగా ఏ లోటూ లేకుండా జరిగిన ఈ సమావేశానికి ఏర్పాట్ల కోసం, సమావేశానికి ముందు నాలుగు రోజులకు పైగా శ్రమించిన వాళ్ళు బెజవాడ మహి , కరుణ కుమార్, ఖదీర్ లు.
ఈ సమావేశంలో గుర్తు తెచ్చుకొన్న అంతకుముందు సమావేశపు ప్రశ్న “రాష్ట్ర విభజన వంటి అతి పెద్ద చారిత్రక ఘట్టంలో వచ్చే సమస్యలమీదా, అనివార్య పర్యవసానాలమీదా ఆంధ్ర ప్రాంతపు రచయితలు ఒక్కటంటే ఒక్కటి కూడా కథ రాయ(లే)కపోవటం ఏమిటి?”
ఇంకేమన్నా మరిచిపోయిన విషయాలుంటే సమావేశానికి వచ్చిన మిత్రులు ఇక్కడ రాస్తారని ఆశిస్తూ.. రామయ్య గారు ఊహించినదానిమీద నో కామెంట్స్ .
-సురేష్
తెలంగాణ దళితకథల సంకలనం ‘ఔట్ ఆఫ్ కవరేజి ఏరియా’కు గాను 2015 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని
అందుకున్న రచయిత ( జాషువా, బోయి భీమన్నల తర్వాత సాహిత్య అకాడెమి గౌరవాన్ని అందుకున్న దళిత రచయిత )
అక్షరయుద్ధం చేస్తున్నది డాక్టర్ పసునూరి రవీందర్ గారే కదండీ సురేష్ గారూ!
“ మాటల మడుగు “ కవితా సంకలనానికి 2017 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నది
దళిత క్రిస్టియన్ కవయిత్రి మెర్సీ మార్గరెట్ గారే కదండీ సురేష్ గారూ!
సురేష్ గారూ, మీరు మా బబ్లూ వాళ్ల నాన్న సురేష్ గారు కాదని, సురేష్ కొలచాల గారు కాదని, మరో ముక్కెమైన సురేష్ గారని ఊహిస్తున్నా ( మీ కుఠోని గుర్తించ లేక పోయినా ).
“ చెప్పుకోండి చూద్దాం “ అని మా గొరుసన్న ( ప్రముఖ సీనియర్ కధా రచయిత గొరుసు జగదీశ్వర రెడ్డి ) విసిరే సవాలుకి ఎప్పటిలాగే చేతకాక చతికిలబడుతున్నా. అవును పూడూరి రాజీ నీ గొరుసన్నని ఆడకెందుకు లాకెల్లలేదు? ఏవిటీ గోరం?
నా మందబుద్దికి తెలిసినంతవరకు :
ముందు వరసలో కూర్చున్న వారు ( ఎడమ నుండి కుడికి ) చైతన్య పింగళి
రెండవ వరసలో దరిజాగా కురిసీలల్లో కూకున్న వోరు ( కుడి నుండి ఎడమకి ) ఉణుదుర్తి సుధాకర్, అనిల్ అట్లూరి,
మూడవ వరసలో నులుచున్న వారు ( కుడి నుండి ఎడమకి, చెట్టుకి దగ్గరలో ) ఖదీర్ బాబు, కుప్పిలి పద్మ, కోగంటి విజయకుమార్, మెహర్, కత్తి మహేష్ , పూడూరి రాజిరెడ్డి.
ఫొటోలో ఉన్నవారి పేర్ల వివరాలు ఫొటో కాప్షన్ గా రాస్తే గొరుసన్న దగ్గర నా మానం మరియాదా నిలబెట్టుకుంటా సురేష్ సామే.
రామయ్య గారి గోధుమ రంగు ఊహకు ఉణుదుర్తి సుధాకర్ గారు సమాధానమిస్తే చూడాలని ఉంది.
-సురేష్
మీరు ‘టైటానిక్’ సురేష్ గారు అని డా. జంపాల చౌదరి గారి ఓ ఈమెయిల్ ద్వారా, శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారి ద్వారా,
మీ కధలను అభిమానంతో తలపోసే త్రిపుర గారి ఆప్తమిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గార్ల ద్వారా తెలుసుకుని
నా మంద బుద్ధికి సిగ్గుతో తలవంచుకుంటున్నాను. ( ఈ నేమ్ డ్రాపింగ్ కు క్షమార్హుడిని ).
http://eemaata.com/em/issues/200107/647.html
ఇక ధైర్నం కూడగట్టుకోవాలంటే మా బబ్లూనే నాకు ఆసరా.