ఏవి తల్లీ నిరుడు కురిసిన సుమ సమూహములు!
1
పువ్వులు కనిపించడం లేదు.
నవ్వులు వినిపించడం లేదు
ప్రకృతిబడి చదువులు మూలబడి
పూబాలల కిలకిలలు
ఆటల మైదానాలలో వినిపించడం లేదు
చక్కిలిగిలి పెట్టినట్లు
చక్కెర తేనెకు అద్దినట్లు
ముక్కెరతో పోటీకి దిగి
ముద్దుగుమ్మల సిగ్గుపెదవులు
మొగ్గలు పూయించడం లేదు
పెద్దలు పెదవులు
నవ్వుల నగారాలు మోగించడం లేదు
‘సర్వం ప్రియే చారుతరం వసంతే’
సత్యమే కానీ కవి కాళిదాసా
ఏ వసంతమూ పూలసంతకం
సంతొషంగా చేయడం లేదు!
2
నలుడానాడు
ఆరామ వీక్షావిహారానికనేగిన
శ్రీనాథ శృంగార
ప్రవాళరాగ చ్చురిత
విలాస కాననలిప్పుడేవీ కానరావు!
మందార మకరంద మాధుర్యమున తేలు
పోతన్నమధుపములు
పాపమిప్పుడే మదనములకి పోలేవు!
వనమాలికాగళసీమకా విప్రనారాయణు
డర్పించిన నవపుష్పమాలికలిలు
ఇప్పుడెక్కడా పోలికలకైనా లేవు!
విచ్చిన నెత్తమ్మి విరుల జారిన పూతేన సౌరభాలు,
గాలి తాకున తేలి వచ్చిన పూరేకుల కొత్త అందాలు
పినవీరభధ్రుని శాకుంతలంతోనే అంతమయ్యాయా!
‘నానాసూన వితాన వాసనల నానందించు సారంగమేలా
నన్నొల్లద’న్న గంధఫలి అందాల అలకలు
అల్లసానయ్యతోనే చెల్లిపోయాయా!
మోదుగమొగ్గ, , మంకెనమొలక,
కుంకుమపూవు, కురవకమూ,
నవమల్లీ, మాగధి, మాధవి, శేఫాలీ
వకుల ముకులముల వలె
పూవులు ఎన్నిరకాలో
నవ్వులన్ని రకాలు
ఐనా హాసమందిరోద్యాన
ఖేలనానంద విభవమవధరించే
సావధాన మిప్పుడెవరికీ లేదు.
ఆరురుతువుల పూజ పూజ్యమైపోయింది
మనిషి మసలేదిప్పుడు సంపూర్తిగా
సౌందర్యరాహిత్య సామ్రాజ్యంలో!
3
స్వర్గధామంలో సంతు పెరిగి
కొత్తలోకానికని తేలివచ్చిన
యక్ష గంధర్వ కింపురుష అచ్చర
సంతానమేనా నిజంగా మనం?
నలుదిక్కులా వెదజల్లే
బహుచక్కని సుమ పరిమళాలు
మా జడబుద్ధులకే మాత్రం
స్వర్గమార్గాలు తెరవడం లేదే!
ప్రాయపు నాయకులు, పుష్పలావికలు
కాయజుతూపుల సారస బేరములు
చేమకూరకవి కాలపు విజయవిలాసాలు
ఆదిశేషువైనా వేనోళ్ళ తెగడగలేని
ప్రేమలేమితనం ప్రస్తుతం మమ్ముమ్మరించింది.
పరిమళము లేని పనికి రాని
శూన్యకుంజములే ఎటు చూసినా గాని
మిగలలేదొక్క మొగ్గ కూడ చూడ
ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
మధుర మధుర మైరేయమున కేమయిందో!
మా మరుగుటెదలనుండి ఎందుకెప్పుడు
ఎటుల మటుమాయమయిందో!
ఒక్కొక్క ఫాలాన ఒక పావక నేత్రం
ఒక్కొక్క హృదయాన కరుడుగట్టిన గోత్రం
నవ్వడమే రాని నవీన మానవుడు
అయ్యయ్యో… అయ్యాడుగా తాను
తనకే పరాయి నేడు!
4
‘నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును’
జననమాది మరణం దాకా
మనస్సుహాసిని మధుర వీచిక
మనిషి బతికున్నాడనేదానికి సూచిక
మనిషికొక్కడికే కదా సొంతం
నవ్వుతూ తుళ్ళుతూ బతకడం ఆసాంతం
నయనానందకరం
హృదయ వేదనాహరం
అందుకే దరహాసం
సదా పెదాలపై ధరించాల్సిన
ఏడువారాల అలంకరణం
5
వాడనిది, వాసనలు వీడనిది
నలుదిక్కులా భూవనమంతా
లవలేశమైనా వదలక
ప్రతి గేహ దేహళి పదమాగి
ప్రతి హృదయద్వార తోరణముగా వూగి వూగి
లోలోని స్నేహక్షీరమొక్కింత ఒలకబోసే
పసినవ్వు, ముసిముసి నవ్వు, ముసిలిబోసి నవ్వు
చలినవ్వు, వెచ్చని చెలినవ్వు,
నిండుగా తడిపేటి వర్షహర్షపు నవ్వు
కర్కశహృదయజాంగలములపైన కరుణతోవర్షించు
శీతలస్నేహ దుగ్ధధారలబోలు నవ్వు
విద్వేషవైతరణి దాటించు సౌహార్దసేతు నవ్వు
చీకటిని చిటుక్కుమని విరిచేటి చిరుదివ్వె నవ్వు
ఆకలిని హాంఫట్టుమని మింగించే అంబలి నవ్వు
లోకాస్సమస్తా సుఖినోభవంతని
మనసా వాచా ఆశీః వహించే
మహనీయమైన నవ్వు
జగానున్నదంతా సహోదరులేనన్నంత
విశాలత పెంచు కులాసా నవ్వు-
పువ్వులా
మళ్ళీ మళ్ళీ
సర్వజనావళి
పెదాలపై పూయాలని సుంత
నా కలవరింత
sir, mee kavitaasumam vaadanidi,