నీరెండ మెరుపు

ఇంక చదువుకుందాము బాల్యాన్ని….

22-మార్చి-2013

కవిత్వానికి ఒక సంభాషణ వుంటుంది దానిలో ఒదిగిపోయి మనం కవిత్వంతో పాటూ ప్రయాణిస్తాము.

ఏలాంటి సంఘటన అయినా అది మనకే జరిగిందా లేక మనం గమనిస్తున్న మనుషుల మధ్య జరుగుతోందా అన్నంత సహజంగా పాఠకులను తీసుకువెళ్ళినప్పుడే ఆ పద్యం మనల్ని వెంటాడుతుంది. ఆ పోలికలు వున్న ఏ సందర్భాన్ని చూసినా వాళ్ల భావాలు మన మనసులోకి ఆ పదాలతోపాటు సీతాకోకచిలకల్లా వచ్చి వాలిపోతాయి. అప్పుడు ఆకవి పేరు గుర్తుకి రాక పోవచ్చు కాని ఆకవిత్వం మనల్ని వెంటాడుతుంది. అలాంటి పద్యమే గంటేడ గౌరునాయుడి పద్యం”బాల్యం”.

బందులదోడ్దీ అంటే పల్లె టూళ్లలో దొంగతనంగా చేల్లొ పడి మేసిన పశువులని బందులదోడ్డిలొ కట్టేస్తారు.
అందమైన బాల్యం హాయిగా తూనిగలా ఎగిరే బాల్యం వయసుకి మించిన బాధ్యతలతో యూనిఫాం పూతలో మగ్గిపోతోంది అంటారు.

బందులదోడ్ది చూడగానే కవి జ్జాపకం వస్తారు.
పిల్లలు గుర్తుకి వస్తారు
ఇంటిముందు ఇసుక కుప్పలు వుంటే ఆటలు ఆడుకోని పిల్లలు వుండరు
కుక్కపిల్లలతో పాటూ అప్పుడు ఆవీధంతా పిల్లల నవ్వులు కేరితలు వినిపిస్తాయి
అవి లేని ఇసుకని గుర్తు చేసుకుంటారు.
కాగితం పడవలు గాలిపటాల తో గడపని పసితనం చూసి ప్రకృతి రోదిస్తుంది అంటారు.

“మల్లేపూలుపాతరేకు డబ్బాలో కూరితే ఎలా వుంటుందో పసి కూనలు మోసే ఆర్టీసి బస్సు” అంటారు. ఇప్పుడు కనిపిస్తున్న ఆటోలో పిల్లల్ది కూడా అదేస్థితి.

వెంటనే అతను రాసిన పదాలవెంట జ్జాపకం పరుగుపెడుతుంది.

———————————–

బాల్యం

యూనిఫాం పూత పూసి
బాల్యాన్ని బందుల దోడ్లకేసి నేట్టేస్తుంటే
ఉదాయాలు సాయంత్రాలు
ఎరుపెక్కిన కళ్లతో రోదిస్తాయి

హోంవర్కు ఊబిలో కూరుకుపోయిన
పసి మొగ్గల లేత పాదాల స్పర్స కోసం
ఇంటిముందు ఇసుక కుప్ప
శోకమై అంచులు దిగజారుతుంది
బలపం పట్టిన లేత గులాబీల పిడికిళ్ళలో
గాలి విలవిలా తన్నుకుంటుంది

గాలి పటాలు పలకరించక
వెండి మబ్బులు ఏడుస్తాయి
కాగితప్పడవలు కనిపించక
వాన నీటి కాల్వలు
కన్నీటి కాల్వలౌతాయి
పుస్తకాల బరువుతో కాళ్ళీడ్చే
బుల్లి నేస్తాలను చూసి
తూనీగలు రోదిస్తాయి

పాత రేకు డబ్బాలో మల్లె మొగ్గల్ని కుక్కినట్టు
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యే
పసికూనల్ని మోస్తూ అర్టీసి బస్సు
తన జన్మకు తానే అసహ్యించుకుంటుంది

ఆటల్లేవు అల్లర్లులేవు
ఎక్కడివస్తువుల అక్కడే ఉన్నాయి
బిక్కుబిక్కుమంటూ
ఎలా సర్ది ఉంచిన ఇల్లు అలాగే ఉంది
దుఃఖం బిగ బట్టుకున్నట్టు
ఇరుకిరుకు గదుల్లో చెమట చిత్తడిలో నానిన
బొమ్మలపుస్తక మైపోయింది బాల్యం

నెమలి కన్నుకు నోచని
వాచకమైపోయింది బాల్యం
ఇప్పుడు అమ్మతనం మరచి
అమ్మలు మమ్మీలైపోతున్నారు
కాన్వెంటు బజారులో కేజీలలెక్కన
చదువులు కొనడానికి
క్యూలో నిలబడి డాలర్లను
కలగంటున్నారు డాడీలు.

ప్చ్…
బ్రతుకు చీర నుండి బాల్యం అంచును
వేరు చేస్తున్నారెవరో
——————————

సరళ మైన భాషతో హాయిగా చదువుకునే బాల్యం ఎక్కడా ఈవాక్యమెందుకు అని అనుకోకుండా బాల్యన్ని ముఖ్యంగా పల్లె బాల్యన్ని
కాగితం పడవలని గాలి పటాలని కళ్లముందుంచుతుంది.