ముఖాముఖం

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

మార్చి 2015

రంజని-కుందుర్తి అవార్డ్, ఆంధ్రసారస్వత సమితి అవార్డ్, రమ్యభారతి కథా పురస్కారం, ఇస్మాయిల్ పురస్కార గ్రహీత కవయిత్రి రేణుకా అయోల గారితో ముఖాముఖం.

Q: కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి తేడా ఎమిటి? దాన్ని మీరెంతవరకు సాధించగలిగారు? మీకు నచ్చిన తెలుగు మరియు తెలుగేతర కవిత్వము, కథలు రచయతలు/త్రులు గురించి చెబుతారా?

కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి కావలసింది నిజాయతి, అది నేను సాదించేనని అనుకుంటున్నాను. కవిత్వాన్ని ప్రేమించే నేను అందరి కవిత్వం ఇష్టపడతాను. అనువాదాలు అంతగా చదవలేదు. కధలు, నవలలు విరివిగా చదివినా, నేను ఎక్కువగా ఇష్టపడ్డ రచయతలు; కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాధ్.

ఉద్యోగరీత్య మధ్యప్రదేస్ లో వుండం వల్ల గజల్స్ వినడం, వాటిపై ఆసక్తి పెంచుకుని వాటిని అనువాదం అనేకన్నా అభిమానంతో నాభావాలకి అనుగుణంగా అనువదించడం కూడా నేర్చుకున్నాను. గజల్స్ ఇష్టపడడానికి కారణం, కవిత్వానికి దగ్గరగా వుండడం, ప్రేమ, తత్వం రెండు సమానంగా వుండం వల్ల వాటికి ఇంకా దగ్గర అయ్యాను. ప్రేమిచడం తెలియని వాళ్ళు జీవితంలో గల ఆర్ద్రతని చూడ లేరు. జీవితాన్ని అనుభవించని వాళ్ళు లోపలి కన్నీటిని, తడిని కవిత్వంలో చూపించలేరని అనుకుంటాను.

Q: నచ్చిన గజల్స్, గజల్ కవుల గురించి చెప్పండి? ఎందుకు నచ్చాయో కూడా?

నేను ఎక్కువగా ఇష్టపడి వినే గజల్స్ హింది గజల్స్. జగ్జీత్ సింగ్, పంకజ్ ఉదాస్, మెహదీహసన్, హరిహరన్ ఇంకా ఎంతో మంది ప్రముఖులు వున్నా వీళ్ల గజల్స్ ఎక్కువగా ఇష్టపడతాను. వీటిలో చాలా వాటిని ఫేస్ బుక్ గజల్ గ్రూపులో ప్రతీ శనివారం “నాకు నచ్చిన గజల్” శీర్షికలో తెలుగులోకి అనువదించి పరిచయం చేసాను. అందులో నేను ఎక్కువగా ఇష్టపడినవి
పంకజ్ ఉదాస్-ఏక్ ఐసా ఘర్ చాహియే, మోహే ఆయేనా జగసే లాజ్
జగ్జీత్ సింగ్ గజల్స్ లో మై ఖయాలుహూ కిసి అవౌర్ కా (హరిహరన్ ) పాడినది, హోటోంసే ఛూలో తుమ్, ఛీట్టి నా కొయీ సందేశ్.

Ek Aisa Ghar Chaahiye Mujhako – Pankaj Udhas

“ఒక ఇల్లు నాకు కావాలి
దాని స్వరూపమే ఆనందానికి చిరునామాగా వుండాలి
ఒక ఇల్లు నాకు కావాలి
మానవత్వాని ద్వారాలు మూయనిది
సిఖ్ ,పెహ్ల్వానులు, మదువుని సేవించే వాళ్ళు
అందరు ఆనందంతో వచ్చి వెళ్లే ఇల్లు కావాలి
ఒక ఇల్లు నాకు కావాలి
ద్రాక్ష పళ్ల సింహాసనం దక్కించుకున్న ఆనందంపు మద్య హ్నంలా
వచ్చిన వాళ్ళు మళ్లి తిరిగి వెళ్ళలేనంత ఆనందం వుండాలి
ఓ మూల గజల్ ప్రతిధ్వనించాలి ,సంతోషానికి పుట్టినిల్లు అవ్వాలి
ఆలాంటి ఇల్లు నాకు కావాలి
ఒక ఇల్లు నాకు కావాలి
నా స్వంతంమనుకుని వచ్చేవాళ్ళు నా అతిధులు
బజారులో ఎవరికీ ఖరీదు చెల్లించని అవసరం వుండని ఇల్లు
ఒక ఇల్లు నాకు కావాలి
దాహంతో చెప్పడం ఎంత సులువు వో కదా జాఫర్
కాని కళ్ళతో సంజాయించడం చాలా కష్టం ….”

ఇవన్నీ కూడా నా బ్లాగ్ లో పెట్టాను.

Q: ఫిక్షను ఎక్కువ చదువుతారా? కాల్పనికం ఎక్కువ నచ్చుతుందా? కవితనా? ఇష్టమైన నవల గురించి చెప్పండి? తెలుగు, తెలుగేతర క్లాసిక్ మరియు వర్తమాన కథలు చదువుతారా?

కధలు నవలలు చాలా చదివాను. అనువాదాలు చదవడం చాలా ఇష్టం. ఆదివారం ఆబిడ్స్ లో రోడ్డు మీద దొరికే పుస్తకాలలో అనువాదాలు వెతుక్కుంటూ గంటలు గంటలు గడపడం చాల ఇష్టమైన వ్యాపకం. ఎన్నో అనువాదాలు చదివినా నాకు బాగా నచ్చినవి లజ్జా, చంఘీస్ ఖాన్, ఏడూ తరాలు, క్లియోపాత్ర, పాండవపురం, సంస్కారం, పర్వ ఇలా ఎన్నో! ఇంక కధలు నవలలు తెలుగులో విరివిగా చదివాను. కొన్ని పుస్తకాలు మళ్ళి మళ్లి చదవాలనిపిస్తాయి. అందులో నాకు బాగా నచ్చినవి నేను ఇష్టపడి చదువుకునేవి… మునిపల్లె రాజుగారి “మాజికల్ రియలిజం”, “అంధ్రా నెపోలియన్” కథలు, జి.అర్ మహర్షి సీరీయల్ “మట్టి తీగలు”, “బమ్మిడి జగదీశ్వర రావు, చలం మ్యూజింగ్స్… ఇంకా ఫలానా అంటూ ఏమి లేదు చదివించే పుస్తకం ఏదైనా చదువుతాను. ముఖ్యంగా నాకు హాస్యం అంటే చాలా ఇష్టం, వంగూరి చిట్టెన్ రాజు గారి కధలు చలా ఇష్టంగా చదువుతాను.

Q: కవయిత్రిగా మిమ్మల్ని నిరుత్సాహ పరిచిన అనుభవం ఏవైనా పంచుకుంటారా?!

నన్ను నిరుత్సాహం కాదు గాని ఆశ్చర్యపరిచిన ఒక సంఘటన చెప్పాలి. విపులలో ముషాయరలో వచ్చిన కవిత, దాని నేపద్యం భర్తని పోగొట్టుకున్న స్త్రీ మనోభావాలను రాస్తే తోటి రచయిత్రులు కొందరు వాళ్ళని అవమాన పరిచానని పోలీసులుకి, కోర్టుకి వెళతామన్నారు. అది ఎప్పుడు తలుచుకున్నా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దానికి భిన్నంగా పరిస్థితులు లేవు గనక.
నాకు ఎక్కువ ఆనందం కలిగించింది నా రెండవ కవితా సంపుటి “లోపలిస్వరం”. ఈ పు స్తకం చదివి శీలాసుభద్రగారు ఉత్తరం రాయడం, ఆదూరి సత్యవతి గారితో పోల్చడం ఎప్పటికి మరచిపోలేని సంగతి.

ఈ కవిత “విపుల” డిసెంబరు 2008 సంచికలో ముషాయిరా శీర్షీకలో ప్రచురితం అయ్యింది

ఓ చినుకు
=======
నాణానికి మరోవైపు
స్త్రీ జీవితంలో నడి వయసులో
వైధవ్యపు ఛాయలు ముసురుకున్నప్పుడు
అంతులేని స్వేచ్చ -మౌన ఎడారిలా
సంప్రదాయాలు చేదించుకుంటూ
అలంకారాలతో తృప్తి పడుతూ
మోసగించుకుంటూ
గుండెలోతుల్లో రగులుతున్న అసహనం
ఆలోచనల్లో నలుగుతున్న స్పందనలు
కారుచిచ్చులా మనసుని తనువుని రగులుస్తున్నా
మంచుముద్దలా వుంచాలని ప్రయత్నిస్తూ ఓడిపోతూ
ఈ కాలాన్ని నమ్ముతూ
తోడు కోరుకున్నప్పుడు
స్నేహాలకే గాని పెళ్ళీకి పనికి రావని నిక్కచ్చిగా వ్యక్తపరచినప్పుడు
గాలనికి చిక్కున్న చేపలా గిలగిల లాడుతూ
మోయలేని ఒంటరితనం తోడుకోరికున్నప్పుడల్లా
మగాడు లేకుండా బతకలేనా?
అసరాలేకుండా జీవితాన్ని వెళ్ళదీయలేనా?
గొంతెత్తి ఆక్రోశిస్తూ
స్త్రీ వాదినని బుజ్జగించుకుంటూ
జీవితాన్ని కాలానికి బలిచేస్తూ
ఓదార్చుకుంటున్న హృదయంపై
మంటలార్పుతూ ఓ కన్నీటి చినుకు…

అప్పుడప్పుడే సాహిత్యంలో అడుగుపెడుతున్న రోజులు, నాతో ఓ స్త్రీ పంచుకున్న అనుభవాలు యధాతధంగా రాసాను కాని అందరు రచయిత్రులు విపరీతంగా స్పందించారు. “స్త్రీ వాదినని బుజ్జగించుకుంటూ” దీని మీద పెద్ద చర్చలు జరిగాయి. “భూమిక” స్ర్తీ వాదపత్రిక ఆఫీస్ లోకి రమ్మన్నారు. నన్ను సంజాయిషీ ఇవ్వమన్నారు. క్షమాపణ చెప్పమన్నారు.
నేను ఆఫీస్ కి వెళ్ళాను వివరంగా చెప్పాలని కాని ఎవరూ నాతో మాట్లాడలేదు, వివరణ అడగలేదు. నేను చెప్పలేదు. అక్కడితో ఆచర్చ ఆగిపోయింది. అయితే ఇప్పుడు కూడా అందరి సమస్య కాదు. అప్పుడు చెప్పలేక పోయాను. మీ ద్వారా ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. ఈ కవిత ఓ స్త్రీ మనోభావం మత్రమే. నిజమే సమాజంలో ఎంతో మంది నడివయసులో, చిన్నతనంలో భర్తలని కోల్పోయినా స్త్రీలు ధైర్యంగా పిల్లల కోసమే జీవితాలు వెళ్లదీసిన వాళ్లు వున్నారు.

వాదాలు నాకు తెలియవు. ఒక స్త్రీ గొంతుకకి అరువు ఇచ్చాను నిజాయతిగా కాని 2008 కి 2014 సంవత్సరానికి ఏమి తేడా లేదు. అదే అసహనం, తోటి స్త్రీ అంటే చులకన. సమాజం మారలేదు. విలవల్లో మార్పులేదు. కొత్త మార్పు “సహజీవనం” అంటున్నారు. ఇది స్త్రీలకి, యువతులకి ఎంత మేలు చేస్త్తోంది అని ప్రశ్నించుకుంటే సమాధానం మళ్ళీ వ్యక్తిగత అనుభవం అవుతుంది. సమాజంలో ఇంకా మార్పురావాలి. రాస్తున్న రాతలకి, మనుషుల ప్రవర్తనలకి పొంతనలేదు. అందుకే వ్యక్తిగతం వేరు, రచనలు వేరు అనిపిస్తోంది నాదృస్టిలో.

Q: మీ కథలు అనగానే రెండు గుర్తుకొస్తాయి.
1. కవిత్వ నేపద్యంతో మొదలుపెట్టి జంతువుల మధ్య కథ నడిపారు, రెండు చందమామలు.
2. తోపుడు బళ్ళమీద బాంబులు అమ్మే కథ
ఎలాంటి ప్రేరణ నుండి రాస్తుంటారు? మీకు నచ్చిన కథ, ఇతరులు మెచ్చిన కథ గురించి చెబుతారా?

సమాజాన్ని దగ్గరగా పరిశీలించినప్పుడు, మనుసులో జనించిన ఆవేదనని నలుగురుతో పంచుకోవాలి అనుకున్నప్పుడు కదా కధలు రాయాలని అనిపిస్తుంది. అ నేపద్యంలోంచి వచ్చిన కదలే మీరు అడిగిన రెండు కధలు.
బాంబులు ఎంత తేలిగ్గా మనుషుల ప్రాణాలు గాల్లోకి ఎగరేస్తాయో కదా! వార్తలు చదివినప్పుడు టివి లో చూసే దృశ్యాలు, మనసుని కలిచివేస్తాయి. ఒక్క క్షణం మనం అక్కడ వుంటే?!
రేప్పొద్దున వీటినే కూరగాయల బండిలోపెట్టి అమ్మినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనం వాటికి అంతగా అలవాటు పడిపోతాం, ఇప్పుడు జరుగుతున్న రోడ్డు, రైలు ప్రమాదాల్లాగా!

రెందవ కధ నేటి సాహిత్య ధోరణులు. అదే నాపుస్తకం టైటిల్ కూడా! మామూలుగా రాయడం కన్నా జంతువులే కథకులు అయితే అనే ఆలోచనలోంచి పుట్టిన కధ. బహిరంగంగా ఎవరు మెచ్చుకోలేదు గాని పత్రికలలో విరివిగా వచ్చిన రివ్యూలవల్ల మంచి కధలు రాసానన్న తృప్తి మిగిలింది. నాకు చాల నచ్చిన కధ, “నాది కాని వెన్నెల”. ఇది చాలా మంది మెచ్చుకున్న కథ. ఇది “నడుస్తున్న చరిత్ర” పత్రిక వారి కదల పోటీలో మొదటి బహుమతి కూడా పొందింది.

Q: మీరు సాహిత్య కార్యక్రమాలలో, సదస్సులలో పాల్గొన్నారు కదా! అభిప్రాయాలు, అనుభవాలు చెబుతారా? స్వదేశంలో జరిగే వాటికి, విదేశాలలో జరిగే వాటికీ మధ్య ఏమైనా తేడా వుందంటారా?

నగరంలో సాహిత్య సభలు, సదస్సులు ఒక రకంగా రోటీన్ గా సాగిపోతాయి. పుస్తకాల ఆవిష్కరణలతో సహా.
కొన్ని సార్లు పుస్తక పరిచయం కన్నా వేరే వాళ్ళ పుస్తకాలు మెచ్చు కోవడం, అసలు విషయం పక్కన పెట్టి వేరే విషయాలు మాట్లాడిన సందార్భాలు ఎన్నో అయినా వాటికి కూడ అలవాటు పడిపోయాము అనిపిస్తుంది.

కవి సమ్మేళనాలలో పాల్గొనడం కూడా రోటీన్ అనిపిస్తుంది ఎవరి కవిత వారు చదవగానే లేచి వెళ్ళిపోవడం. అసలు ఎలాంటి కవిత చదివారు, ఏ భావంతో చదివారు అని పట్టించుకోక పోవడం లాంటి అనుభవాల వల్ల ఆసక్తి పోతుంది. సీనియర్స్ ముందు కవిత చదవాలని వారి అభిప్రాయాలూ తెలుసుకోవాలని వుంటుంది, కాని వాళ్ళు లేచి వెళ్ళిపోవడం చాల బాధగా వుంటుంది. అయినా కవి సమ్మేళనాలు సాగిపోతూనే వుంటాయి.

ఇంక విదేశాల విషయానికి వస్తే నేను ఊహించని అనుభవం ఎదురైంది. ఇక్కడి అనుభవంతో నా పుస్తకాలు నాతో పాటు తీసుకు వెళ్ళ లేదు కాని గురువారం మా అబ్బాయి స్నేహితుల ఇంట్లో పూజకని వెళ్ళినప్పటి పరిచయంలో నేను రచయిత్రిని అని చెప్పాను. వెంటనే వంగూరి చిట్టెన్ రాజుగారికి ఫోన్ చెయ్యడం వారు ఆ పై శనివారం నెల నెల వెన్నెల కార్యక్రమానికి ఆహ్వనించడం సంతోషంగా అనిపించింది. అప్పటికి రాజుగారితో నాకు ముఖ పరిచయం కూడా లేదు.

ఆ సభలో వారి ఆదరణ మరచిపోలేనిది. నేను చదివిన కవిత్వాన్ని చాల శ్రధగా విన్నారు. మొట్ట మొదటి సారిగా కవిత్వ వివివరణ అడిగినప్పుడు అనిపించింది తెలుగు భాష మీద వాళ్ళకున్న మమకారం, అతిధుల పట్ల గౌరవం, సాహిత్యం పట్ల వున్న మమకారం…

రెండవసారి సత్యం మందపాటి గారితో ప్రయాణం. దారిలో వారితో చర్చించిన అనేక విషయాలు విన్న తరువాత ఇప్పటికి అంటే 30 సంవత్సరాలుగా స్వదేశానికి దూరంగా వున్నా తెలుగు మీద మమకారం సాహిత్య సాన్నిహిత్యాన్ని వదలకపోవడం ఆనందంగా అనిపించింది.

Q: ఏదైనా చదివినప్పుడు నేనూ ఇలా రాయగలనా అనిపించడం కానీ రాయడం కానీ జరిగిందా?! వివరిస్తారా?

కవిత్వం పట్ల నాకున్న విపరీతమైన ప్రేమతో నేను ఎక్కువగా అభిమానించే శివారెడ్డి గారి కవిత్వం చదివినప్పుడు ఇలా ఇంత సరళంగా, ఎప్పడు ఎక్కడో తారసపడే మనుషులు గుర్తుకొచ్చేంత అద్బుతంగా కవిత్వం రాయగలనా అని అనిపించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చినవీరభద్రుడి గారిలా ఎప్పుడు అగ్నిపూల చెట్టు కనిపించిన గాజుల మలారంలా వుంది అన్న పదం వెంటాడి నప్పుడు, వర్షం రాత్రి నిశ్శబ్ధం కురిసినప్పుడు ఇలా రాయగలనా అని బెంగ పడిన రోజులు ఎన్నో.. అలా రాయడానికి ప్రయత్నించినా అసంతృప్తే మిగిలింది.

Q: ఇప్పటివరకూ మీ పుస్తకాలగురించి, ముద్రణల గురించిన అనుభవాలు ఏమైనా పంచుకుంటారా? ఎన్ని పుస్తకాలు వచ్చాయి, రాబోతున్నవి.

ఇప్పటి వరకు మూడూ పుస్తకాలూ వచ్చాయి.
ఒక కధల సంపుటి, “రెండు చందమామలు“.
రెండవది కవితా సంపుటి “పడవలో చిన్ని దీపం”.
మూడవది కవితా సంపుటి “లోపలి స్వరం”.
కవితల పుస్తకాలు చెల్లవు అని నిర్మొహమాటంగా పుస్తకాల షాపు వాళ్ళు అన్నపుడు చాలా బాధ వేసింది. అయినా నాకోసం నేను వేసుకుంటూన్నాను అనుకున్నప్పుడు అంత బాధ వుండదు.

**** (*) ****


(వాకిలి కోసం జాన్ హైడ్ కనుమూరి గారు జరిపిన చివరి ఇంటర్వ్యూ ఇది.)

**** (*) ****