కవిత్వం

మళ్ళా పొత్తిగుడ్డల బళ్ళోకి…

29-మార్చి-2013

కవయించినా కవ్వించినా ఈ చిటికెడు క్షణాల్నే
పదాల వరస కుదరంగానే పద్యంగా భ్రమా..!
బతుకు ఏ శబ్దానికి అర్థంగా వదిగింది మిత్రమా?
మాటల్ని మనం మోస్తున్నామా..
మాటలే మనల్ని మూటలు కట్టాటాడిస్తున్నాయా?
నిద్దర బావిలో ఊరిన ఊహలు
తెల్లారి చేదకందేవెన్ని?
ఇద్దరం కాట్లాడుకునేది ఈ గుప్పెడు చప్పుళ్ళ కోసమా!
నవ్వొస్తున్నది నొప్పుట్టీ నొప్పుట్టీ..

పాలు
పూలు
పాపాలు
ఆపసోపాలు
ఆఖరికేదైనా ఆరడుగుల పుడకల పాలేననుకో
అట్లాగని
ఎప్పుటికైనా రాలేవేనని
వదిలేస్తున్నామా పళ్ళని?
తడవాలి..ఎండాలి..పండై రాలిందాకా
చెట్టుతోనే కదా ఉండాలి!
ఏ కాకో కొడితే కథే లేదనకో!

ఎక్కే దాకా ఎవరికెవరమో తెలియం
దిగినాకా ఒకరికొకరం పట్టం
వెనక్కెనక్కెళ్ళిపోయే ఈ కాసిని
ప్రయాణ క్షణాలకా ఇన్నవలక్షణాలు!

నీళ్ళే లేకుండా పడవను నడిపే కళ
ఏ పసివాడినడిగినా నేర్పిస్తాడు
పద పోదాం..పొత్తిగుడ్డల బళ్ళోకి
మళ్ళా కొత్త నవ్వులతొ మొదలెడదాం
మన ఏడ్పులు కలగలుపుకొని

ఈ ఏడ్చి ఏడ్పించే నవ్వులు
ఇంకొద్దు మనిద్దరికి!