కవిత్వం

అమ్మలు

05-ఏప్రిల్-2013

వేళ్ళు నొప్పులు పెడుతున్నా
బుజ్జి వేళ్ళు పెన్సిల్ వదలవు
పెద్ద కాన్వాస్ మీద
కలని గీస్తుంది !
క్షణం నొసట ముడిచి
మరుక్షణం గల గలా నవ్వి
నా జీవన యాత్రకి
రంగులు అద్దుతుంది
ఏ గీత చూసినా
లోకం అంతర్ముఖమే!

2.
అలా వెళ్తుందా
కాలం పరిచే వలదాటి
అంతరంగాన్ని ప్రశ్నిస్తుంది
నాలోకి చూసినట్టు
చిరునవ్వుతో చూస్తుంది
సేదతీర్చే ఆలాపనతో
ప్రయాణిస్తుంది నాలోకి
చిన్ని అడుగుల వెంట
పెద్ద అడుగులు!!