కథ

రాగం

సెప్టెంబర్ 2013

ఆడిటోరియం చప్పట్లతో మారుమోగుతోంది. అనంత్‌ మాత్రం స్కూలు పిల్లాడిలా వయోలిన్‌ను బాక్స్‌లో సర్దుకుని లేచాడు. అందరివంకా చూసి దణ్ణంపెట్టి స్టేజి దిగాడు. మృదంగవిద్వాన్‌ కూడా అతన్ని అనుసరించాడు. చాలామంది అతని ఆటోగ్రాఫ్‌ కోసం వెంటబడ్డారు. టీవీకెమెరాలు వెంబడిరచినా అతను మాత్రం కేవలం చిర్నవ్వుతోనే సమాధానం చెప్పి వేగంగా బయటికి వెళిపోయాడు. డ్రైవర్‌ కారు డోర్‌ తీశాడు. కానీ కారు ఎక్కకుండా అప్పుడే వచ్చి ఆగిన ఆటో మాట్లాడు కుని వెళ్లాడు. కారు డ్రైవర్‌ సార్‌కి కోపం వచ్చిందన్నది అర్ధంచేసుకున్నాడు. ఆటో వెంటే కారు తీసికెళ్లాడు.

మర్నాడు ఉదయం అతను తొమ్మిదింటికి తీరిగ్గా లేచి ఎదురుగా ఉన్న తెలుగు పేపరు అందుకున్నాడు. రవీంద్రభారతిలో ఎన్నడెరుగని అద్భుత కచేరీ జరిగిందని పొగడ్తలతో పేపర్లు వెల్లువెత్తాయి. కానీ పక్కనే ఓ ఇంగ్లీషు పేపర్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పేజీలో అతని ఫోటోతో పాటు వార్తని చూశాడు. మరింత బాగా చేయగలిగినా ఎందుకో మద్రాస్‌ కచేరికంటే తక్కువస్థాయిలోనే ప్రదర్శించాడని ఉంది. తెలుగు పత్రికల్లో ఇందుకు భిన్నంగా ఉంది. ఆకాశానికి ఎత్తేశాయి. చదివి చిరాకుపడ్డాడు. నిజమే రెండు నెలల క్రితం మద్రాసు కచేరీ కంటే ఇది పేలవంగా సాగిందన్నది అతని మనసుకు తెలుసు.

పదకొండు అవుతుండగా నలుగురు విలేకరులు వచ్చారు. మరో ఇద్దరు అభిమానులు వచ్చారు. అతను తప్పనిస్థితిలో మాట్లాడవలసి వచ్చింది.

‘‘మీరు ఎంతో అద్భుతం చేశారు. వయోలిన్‌కే సొగసు తెచ్చారు..’’ ఇలా పొగడ్తలతో ముంచెత్తారు.

అతనికి చిరాకేసింది. కోపం ప్రదర్శించకూడదని ఊరుకున్నాడు. చాలా సహించాడు. వచ్చినవారిలో ఒకడు ఏకంగా ఒక కృతిని గురించి చెబుతూ అది మీవల్లే అంత గొప్పగా వయోలిన్‌పై వినే భాగ్యం కల్పించారు. హైదరాబాద్‌ శ్రోతలు నిజంగా ధన్యులు… ఇంకా ఏవేవో అంటున్నాడు.

‘‘మీకు సంగీతం తెలుసా?’’ ఒక్కసారిగా ఊహించని ప్రశ్నకు వాళ్లంతా అవాక్కయ్యారు. అతనే ఇంకా ఇలా అన్నాడు..

‘‘సంగీతం గురించి బాగా తెలిస్తేనే మాట్లాడండి. సెలవు.’’ అని లేచి నమస్కారం చేశాడు.

వచ్చిన విలేకరులు కంగారుపడ్డారు. అభిమానులిద్దరూ నవ్వుకున్నారు.

ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత ఒకరోజు ఒక అమ్మాయి అతన్ని కలవడానికి వెళ్లింది. గేట్లోనే పనివాడిని బతిమిలాడినంత పనిచేసి మరీ లోపలికి వచ్చింది. ఇక తప్పదన్నట్టుగా ఆమెను హాల్లో కూర్చొబెట్టాడు. అయ్యగారిని పిలుస్తానని మరో గదిలోకి వెళ్లాడు.

పెద్ద హాల్లో గోడలకు ఒకవైపు వయోలిన్‌ నాయుడుగారి ఫోటో, మరో వైపు చంద్రశేఖర సరస్వతిస్వామివారి ఫోటో ఉంది. చిన్న టేబుల్‌ మీద కొన్ని పుస్తకాలు పక్కనే చిన్న సరస్వతీ విగ్రహం ఉంది. వెనుక గదిలోంచి బాలమురళిపాట సన్నగా వినవస్తోంది. ఆమెకుఎంతో ఆనందంగా ఉంది. తను ఒక గొప్ప వయోలినిస్ట్‌ను కలుస్తున్నందుకు. మాటిమాటికి వాచీ చూసుకుంటోంది. కూనిరాగాలుతీస్తోంది. అంతలో అడుగుల శబ్దం విని అటు చూసింది.

కాస్తంత సన్నగా పొడవుగా, చామనచాయరంగులో అనంత్‌ రావడం చూసి లేచింది.

‘‘నా పేరు శ్రావ్య. సంగీతం నేర్చుకుంటున్నాను. మీ అభిమానిని. మిమ్మల్ని కలవాలని వైజాగ్‌ నుంచి వచ్చాను. ’’

‘‘చిత్రంగా ఉందే. నన్ను కలవడానికి వచ్చారా? నేనేమీ సినిమా మనిషిని కానే?!’’ అన్నాడు సోఫాలో కూర్చుంటూ.

‘‘మీ ప్రొగ్రామ్‌సిడీలు వింటూంటాను. ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా త్యాగరాజస్వామివారి సీరీస్‌..’’ ఇంకా ఏవేవో మాట్లాడబోయింది.

‘‘మీరేం చేస్తుంటారు? అంటే.. సంగీత సాధన కాకుండా..’’ చాలా సూటిగా అడిగాడు.

‘‘నేను డిగ్రీపూర్తిచేసి చిన్న ఉద్యోగం చేస్తున్నాను. వైజాగ్‌లో అమ్మా, తమ్ముడు, నేను ఉంటాము. అమ్మకి సంగీతం అంటే ఇష్టం. అందువల్ల నేను సంగీతం నేర్చుకునేందుకు వీలుకల్గింది.’’ తన వివరాలు చిన్నపిల్లలా వేగంగా చెప్పేసింది.

‘‘ఏది.. ఒక్కపాట పాడండి’’ అడిగాడు, ఆమె సంగీత ఆసక్తిని పరీక్షించాలన్నట్టు.

ఆమె ఆశ్చర్యపడింది, కంగారుపడింది. ఇది నిజంగా గొప్ప అదృష్టంగా భావించింది. అందుకే మెల్లగా గొంతు సవరించింది.

‘‘తులసీ దళములతో పూజింతు సంతోషముగా..’’ రాగయుక్తంగా పాడింది.

‘‘బావుంది. మరొకటి పాడండి’’ అన్నాడు.. తనకు తెలియకుండానే.

‘‘చింతా నాస్తికిలా తేషాం …’’ ఎంతో తన్మయత్వంతో పాడింది.

అతను చప్పట్లు కొట్టాడు. లేచి ఆమె దగ్గరకు వెళ్లి తలను నిమిరాడు..ఆశీర్వదించినట్టు. ఆమె ఆనందానికి అంతే లేదు. ఇది కనీ వినీ ఎరుగని సందర్భం. జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అతని కాళ్లకు నమస్కరించింది. ఆమెను అందుకు మందలించాడతను. తాను అంత గొప్పవాడిని కానన్నాడు. అయినా ఆమె అతన్ని రెండో గురువుగా భావించింది. అదే చెప్పింది. ఇద్దరూ నవ్వుకున్నారు.
కేవలం అరగంటసమయం లభిస్తే చాలనుకున్న శ్రావ్య ఆ సాయింత్రం ఆరింటివరకూ అతనితో మాట్లాడుతూ గడిపింది. అతనూ ఎంతో ఆనందించాడు. చాలారోజులకు పత్రికలవారికి, సంగీతం తెలియనివారికీ దూరంగా కొంత సమయం గడిపినందుకు. చీకటి పడుతుండగా ఆమె బయల్దేరింది.

‘‘వెళ్లస్తాన్‌ సార్‌.. ’’ అని మళ్లీ పాదాలకు నమస్కరించింది.

కవర్లో రెండు యాపిల్స్‌, రెండు అరటిపళ్లు పెట్టి ఇచ్చాడు. గేటుదాకా సాగనంపాడు. ఆమె కనిపించనంత దూరం చూస్తుండిపోయాడు. ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ గాత్రం ఎక్కడో విన్నట్టే అనిపించింది. నవ్వినా ఎవరో దగ్గరవారిలా అని పించిం దతనికి. ఎన్నడూ ఇతరుల గురించి ఇలా ఆలోచించనివాడు శ్రావ్య గురించి ఆలోచిస్తూ, నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు.

రాత్రి భోజనం చేసి అలా డాబా మీద తిరుగుతూ ఆమె గురించి ఆలోచించాడు. అపార భక్తిగీతాన్ని, ఆ వెంటనే తత్త్వాన్ని ఎంత బాగాపాడింది, ఎంత అవలీలగా పాడేసింది! ఈ అమ్మాయికి పుట్టుకతోనే సంగీతజ్ఞానం ఉందనిపిస్తోంది. తల్లిదండ్రులు ఆ జ్ఞానం కలిగినవారైనా ఉండాలి. లేదా గొప్ప గురవు లభించి ఉండాలి… ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ… ఉన్నట్టుండి తాను గొంతుసవరించుకుని ‘చింతా నాస్తికిలా…’ అలాపించాడు. అసలు సంగీతమే అంత!

పదిరోజుల తర్వాత ఇద్దరు పెద్దవాళ్లు కారులో వచ్చారు. వైజాగ్‌లో కచేరీ చేయాలని కోరారు. తనకు నిజానికి అంత తీరిక లేకపోయినా ఎలాగో అంగీకరించాడు. అయితే కొంత సమయం కావాలన్నాడు. డైరీ తీసి డేట్స్‌ పరిశీలించాడు.

‘‘వచ్చే వారం ఏర్పాటుచేసుకోండి’’ అన్నాడు.

అలాగే అని కొంత అడ్వాన్స్‌ ఇచ్చి మరీ వెళ్లారు.

అతను వైజాగ్‌లో కచేరీ చేసి మూడేళ్లవుతోంది. మొన్న వచ్చిన శ్రావ్య అక్కడినుంచే వచ్చింది. శ్రావ్య వివరాలూ తెలుస్తాయనే ఆలోచనా చేశాడు.

తాను కచేరీలో ప్రధానంగా వినిపించాలన్నుకున్న కృతులతో పాటు ‘తులసీదళములతో…’ కూడా ప్రాక్టీస్‌ చేశాడు. వైజాగ్‌ వెళ్లే రోజు ఆర్గనైజర్స్‌కు ఫోన్‌ చేశాడు, బయలుదేరుతున్నానని.
వైజాగ్‌ స్టేషన్‌కి వాళ్లు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. కారులో తమ గెస్ట్‌హౌస్‌కి తీసికెళ్లారు. ఆరోజు దాదాపు మధ్యాహ్నం వరకూ ఎందరో వచ్చి కలిసి అభినందనలు తెలిపారు. సాయింత్రం ఆరింటికి కచేరీ నిర్వాహకులు వచ్చి అనంత్‌ను కళాభారతికి తీసికెళ్లారు.అక్కడ కారు దిగగానే చాలామంది వచ్చి అభినందనలు తెలిపారు. మరో పదిహేను నిమిషాలకు అనంత్‌ కచేరీ ప్రారంభించాడు. చాలా రోజుల తర్వాత విశాఖలో కచేరీకి రావడం అనంత్‌ అభిమానులతో ఆడిటోరియం కిక్కిరిసింది. సంగీత ప్రియులకు ఇంకా ఆ మ ద్రాసు కచేరీ జ్ఞాపకాలు ఉన్నాయి.

అందరికి నమస్కరించాడు. క్షణం తర్వాత ‘తులసీదళములతో…’ తోనే కచేరీ ప్రారంభించాడు. అది ముగించిన క్షణం హా లంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఆ తర్వాత ‘పక్కన నిలబడి…’. ‘ఇంతకన్న తెల్ప తరమా..’ లతో ప్రేక్షకులను ఆకట్టుకు న్నాడు. అంతలో ఒక పిల్లవాడు పరుగున వచ్చి మృదంగం వాయించేవారికి ఒక చీటీ అందించి అంతే పరుగున వెళిపోయాడు. తెరచి చూశాడు. ఆ చీటీ మీద ఉన్నది చూసి ఆశ్చర్యంతో అనంత్‌కి అందించాడు.

అనంత్‌ పరిశీలనగా చూశాడు. గుండ్రటి అక్షరాల్లో చిన్న వినతి రాసి ఉంది. ‘దయచేసి త్యాగరాజస్వామివారి విరచిత ము ఖారి రాగం చాపుతాళం కీర్తన.. ఇందుకా ఈ తనువు పెంచినది.. వినిపించగలరు’ అని ఉంది. పేరు లేదు. ఎవరో మంచి సంగీతజ్ఞానం వున్నవారే అయి ఉంటారని ప్రేక్షకులకేసి చూశాడు. దణ్ణం పెట్టి వయోలీన్‌ అందుకున్నాడు. అంతే గొప్ప పారవశ్యంతో ఆ కృతిని వాయించాడు. అది పూర్తయి చప్పట్ల శబ్దానికి గాని అతను ఈ లోకంలోకి రాలేదు.

మరో రెండు కృతులు ముత్తుస్వామి దీక్షుతులువారివి వాయించి కచేరీ ముగించాడు. ఓ అరగంట తర్వాత బయటికి వచ్చి కారెక్కుతుండగా ఓ పెద్దాయన వెనక్కి పిలిచారు.

‘‘చాలా బాగుంది.. కానీ ‘ఓ రమా రమణ…’ లో ‘నే నోర్వజాలక.. అన్నప్పుడు గరిసరిసనిపా.. దగ్గర కొంచెం చేయి వొణికినట్లయింది. ఫరవాలేదులే..ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. మొత్తానికి చాలారోజులకు మంచి విద్వాంసునికచేరి విన్నానయ్యా’’ అన్నాడు.

అనంత్‌కి నిజంగానే చేతులు వొణికాయి. వెంటనే కాళ్లకు నమస్కరించాడు.

‘‘తమరు గొప్ప విద్వాంసులై ఉంటారు. అందుకే లోపాన్ని ఇట్టే పట్టి, కచ్చితంగా చెప్పగలిగారు. మీరు చెప్పింది నిజమే’’ అని ఇంకా ఏదో అడగబోయాడు. అంతలో శ్రావ్య వచ్చింది.

‘‘గురవులిద్దరికీ నమస్కారం’’ అంది.

‘‘వీరూ..’’ అని అనంత్‌ మాటపూర్తిచేసేలోపే శ్రావ్య తన గురవును పరిచయం చేసింది.

‘‘రామమూర్తిగారు.. మా గురువుగారు.’’

‘‘అలాగా. మీతో చర్చించాల్సింది చాలా ఉంది. రేపు మిమ్మల్ని కలవవచ్చునా?’’ అని అడిగాడు.

‘‘భేషుగ్గా.. అమ్మాయికి చెబుతాను. తీసుకువస్తుంది. మరి ఉంటాను.’’ అని రామమూర్తిగారు వెళిపోయారు. అనంత్‌ ఆయన్ను గురించే ఆలోచిస్తూ గెస్ట్‌హౌస్‌ చేరుకున్నాడు.

మర్నాడు తెల్లారుజామునే లేచి స్నానం, టిఫిన్‌ ముగించి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తొమ్మిదవుతుండగా శ్రావ్య వచ్చింది. ఇద్దరూ కారులో రామమూర్తిగారి ఇంటికి చేరుకున్నారు. ఇల్లు కొంచెం మోడర్న్‌గానే ఉంది. ఆవరణలో కొన్ని పూలమొక్కలున్నాయి. ఎత్తు అరుగుమీద పడక్కుర్చీలో రామమూర్తిగారు పడుకుని పుస్తకం చదువుతున్నారు. ముందుగా శ్రావ్య ఆయన్ను సమీపించి అనంత్‌ రాక గురించి చెప్పింది. అనంత్‌ చెప్పులు విడిచి లోపలికి వెళ్లాడు. ముగ్గురూ హాల్లోకి వెళ్లారు.

కాస్తంత విశాలమైన హాల్లో ఒకవైపు దేవుళ్ల పటాలు మరో గోడకు త్యాగరాజు, ముత్తుస్వామి ఫోటోలు ఉన్నాయి. అనంత్‌ సంగీత ఆలయంలోకి వచ్చినంత ఆనందించాడు. ఇంట్లోవారి పరిచయాలు ముగించి వెంటనే తనకు తెలీనివి తెలుసుకోవాలన్న ఆతృతతో పిల్లాడిలా కుర్చీని రామమూర్తిగారి దగ్గరికి జరుపుకున్నాడు. గొప్ప విద్వాంసుల కీర్తనలు పాడటంలో, వయోలిన్‌పై వాయించడంలోనూ చిన్నపాటి లోపాల్ని సరిదిద్దుకోవడం గురించి ఎంతో చర్చించుకున్నారు. మధ్యాన్నం భోజనం కూడా వాళ్లింట్లోనే కానిచ్చేశాడు అనంత్‌. రామమూర్తిగారి జీవనవిధానం, సంగీతంతో మమేకమైన జీవన విధానం ఎంతో నచ్చింది. ప్రతి పనిని సంగీతంతో ముడివేస్తూ, శ్రమ దూరం చేసుకుంటూండటం మరీ నచ్చింది. ఆ సాయింత్రం ఆ యనదగ్గర సెలవు తీసుకుని అనంత్‌ బయలుదేరాడు.

కారులో వెళుతున్నాడన్నమాటేగానీ, మనసంతా రామమూర్తిగారి చుట్టూ తిరుగుతోంది. ఆయన కచేరీలు చేయని గొప్ప వి ద్వాంసుడు. సంగీతమయం ఇల్లంతా.

‘‘సార్‌ యాపిల్స్‌ తీసుకోవాలన్నారు.. ఇక్కడ తీసుకుందామా?’’ అని మార్కెట్‌ రోడ్డులో కారు ఆపాడు.

కానీ అనంత్‌ మాత్రం ‘నీపైని మరలుకొన్న నేనెందుబోను..’ అని అనంత్‌ అనుకోవడం డ్రైవర్‌ని ఆశ్చర్యపరిచింది. లాభంలేదని అతనే దిగి వెళ్లి నాలుగు యాపిల్స్‌, డజను అరటిపళ్లు కొని తెచ్చాడు.
మర్నాడు హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం. కచేరీ నిర్వాహకులు, కొందరు అభిమానులు, అక్కడ పరిచయమైన ఒక్కరిద్ద రూ గెస్ట్‌ హౌస్‌కి వచ్చారు. ఎంతో సందడిగా ఉంది. వచ్చే ఏడు త్యాగరాజ ఉత్సవాలకు తప్పకుండా రావాలని కోరారు. అనంత్‌ అలా అందరి మధ్యలో ఉన్నాడన్నమాటేగాని మనసంతా రామమూర్తిగారిని మరోసారి కలవాలన్న ఆలోచనలోనే వున్నాడు. మధ్యాహ్నం భోజనం వరకూ ఎవరెవరో వచ్చి కలుస్తూనే వున్నారు. నాలుగవుతుండగా ఆర్గనైజర్‌ వచ్చాడు.

‘‘మా సార్‌ మిమ్మల్ని స్టేషన్‌కి తీసుకురమ్మన్నారు. మీరు రెడీ అయితే చెప్పండి వెళ్దాం’’ అన్నాడు.

‘‘ఒక్క అరగంట ఆగి బయల్దేరదాం..’’ అన్నాడు అనంత్‌. కనీసం శ్రావ్య ఐనా వస్తుందని ఆశించాడు. వాళ్ల దగ్గర్నుంచి ఫోన్‌ కూడా లేదు. ఇక తప్పనిసరై అనంత్‌ బయల్దేరాడు.

హైదరాబాద్‌ తిరిగి వచ్చినప్పటి నుంచి మనిషిలో కొంత మార్పు వచ్చింది. తాను కచేరీలు చేస్తున్నానేగానీ, జీవనంలో సంగీతాన్ని మేళవించలేకపోతున్నాను… అనుకున్నాడు చాలా సార్లు, చాలా సందర్భాల్లో.

కాలేజీలో చదివేరోజుల్లోనే తల్లిదండ్రులు పోయారు. డిగ్రీ తర్వాత ఆ ఇంట్లో ఉండలేక హైదరాబాద్‌ చేరుకున్నాడు. అప్పటి కే సంగీతంలో కొంత ప్రవేశం ఉండడంతో వయెలిన్‌పై మరీ ఇష్టంతో నాయుడుగారి శిష్యుల్లో ఒకరివద్ద వయోలిన్‌ సాధన చేశాడు. మెల్ల మెల్లగా కచేరీలు చేస్తూ అందరి మన్ననలూ పొందడంతోపాటు పెద్ద పెద్ద ఆర్గనైజర్ల దృష్టిని ఆకట్టుకున్నాడు, సంగీత విద్వాంసుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదంతా ప్రవాహంలా జరిగిపోయింది. రామమూర్తిగారితో చర్చ, ఆయన జీవనవిధానం గమనించిన అనంత్‌లో ఎంతో మార్పు వచ్చింది.

ఇప్పుడు తెల్లవారుజామునే లేచి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. పాడటం మీదా ఎక్కువ దృష్టిపెట్టాడు. ఇంట్లో తన పనులు అన్నీ తనే చేసుకుంటున్నాడు. పనివాళ్లకి పనితగ్గించేశాడు. ఇల్లంతా కలయ తిరుగుతూ హాయిగా పాడుకుంటూ తోచినట్లు ఉంటు న్నాడు. ఏదో తెలియని ఆనందం ఉరకలు వేస్తోంది. అన్నమయ్య, త్యాగయ్య, దీక్షితార్‌ కృతులు అలా ఆలపిస్తూ పుస్తకాలు చదువుతున్నాడు. మంచి సాహిత్యాభిలాష పెంచుకున్నాడు. తాను అంతగా ప్రాక్టీస్‌ చేయని గీతాల్ని, కృతుల్ని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. పాపులర్‌గా వున్నవి గాకుండా మిగతావి అందరికీ వినిపించాలన్న భావన గట్టిపడింది.

విశాఖ నుంచి తిరిగి వచ్చిన రెండు నెలల తర్వాత ఒక పెద్ద సంస్థవారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్గనైజర్లలో ఒకతను తన
అభిమాని కావడంతో అనంత్‌ అంగీకరించక తప్పలేదు. తాను కొత్తగా ప్రాక్టీస్‌ చేసినవి వినిపించాలని అనుకు న్నాడు. సభకు నమాస్కారం చేసి కచేరీని త్యాగయ్య ‘హెచ్చరికగ రారా..’ తో ప్రారంభించాడు. అంతా ఆహా ఓహో అంటూచప్పట్లు కొట్టారు. క్షణం తర్వాత ‘భావయామి…’ ప్రారంభించాడు. అది అక్కడివారికి అర్ధంకాలేదు, నచ్చనూ లేదు. అంతే వెంటనే చీటీల మీద చీటీలు వచ్చి పడ్డాయి.. అన్నమయ్య ‘అదిగో అల్లదిగో…’ వినిపించమని, ‘ననుబ్రోవమనీ చెప్పవే…’ ముందుగా వినిపించాల్సిందని. అనంత్‌కు అర్ధమైంది. వచ్చినవారిలో తొంభై శాతం సినిమాపిచ్చాళ్లని. ఉన్నట్టుండి ఎవరో నాయకుడు వస్తున్నారని తెలిసి ఆర్గనైజర్లు, హాల్లో ఉన్న ప్రముఖులు కుర్చీలమీంచి లేచి గుమ్మందగ్గర పడిగాపులకు వెళ్లారు.

అనంత్‌ కోపం వచ్చింది. అంతే కచేరీ ఆపేసి వయోలిన్‌ సర్ది లేచి అందరికీ నమస్కారం చేసి కిందికి వచ్చేశాడు. ఆర్గనైజర్లు అది గమనించలేదు. వాళ్లు పూర్తిగా గమనించేలోగానే బయటికి ఎలాగో తప్పించుకు వచ్చేసి కారెక్కాడు. మరుక్షణం ఇంటికి చేరాడు. గేటు తెరిచి లోపలికి వెళ్లబోతుంటే ఫోన్‌ వచ్చింది ఎవరో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడే చేశాడు.

‘‘అయ్యా మీరలా కచేరీ మధ్యలో మానేసి వెళ్లడం ఏం బాగోలేదు’’ అన్నాడు.

‘‘పేరంటాలకు పాడేవారుంటారు.. వాళ్లని పిలిచి కచేరీ పెట్టించుకోండి’’ అని ఫోన్‌ కట్‌ చేశాడు.

ఆ కోపం చల్లారలేదు. పనివాడు మంచినీళ్లు తెచ్చినా తాగలేదు. తనలో తాను విసుక్కుంటున్నాడు. ఎవ్వరినీ లోపలికి రానీయవద్దనిపనివాడికి చెప్పి తన గదిలోకి వెళిపోయాడు. ఆ సాయింత్రం ఎవరో నలుగురు వచ్చారు. అతి కష్టం మీద లోపలికి వెళ్లారు.!

మర్నాడు పేపర్లు అనంత్‌ని విలన్‌గా సృష్టించాయి. సంగీతం కంటే పొగరు ఎక్కువన్నట్టు వార్తలు వచ్చాయి. సభకు వచ్చినవారిని గురించి పట్టించుకోని పత్రికలు తన ఆగ్రహాన్ని మాత్రం అందరికీ వ్యతిరేక ఉద్దేశాలు కలిగేలా చేశాయి. అదే బాది óస్తోంది. కొద్దిరోజులు అలా తిరిగి వద్దామని బయల్దేరేడు. పదిరోజుల్లో వస్తానని పనివాళ్లకి, డ్రైవర్‌కి చెప్పి ఉన్నట్టుండి స్టేషన్‌కి వెళ్లాడు. విశాఖపట్నం టికెట్‌ తీసుకున్నాడు. రాజమండ్రిలో దిగి కాకినాడ వెళ్లాడు. కాకినాడలో చిన్ననాటి మిత్రుడు ఇంటికి వెళ్లాడు. వాళ్లిద్దరు సంగీతం గురించి కొత్త పోకడల గురించి ఎంతో చర్చించారు. కానీ అనంత్‌కి మనసు శాంతించలేదు. తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు.

వెళ్లిన వారం రోజులకే అనంత్‌ తిరిగిరావడంతో అంతా ఆశ్చర్యపోయారు. వచ్చిన రోజు నుంచి ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదు. ఎక్కువసమయం తన గదిలో ప్రాక్టీస్‌ చేస్తూనో, పాడుతూనో గడిపేస్తున్నాడు. సాయంత్రాలు బాల్కనీలో కూచుని పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాడు. రామమూర్తిగారిని గుర్తుచేసుకుంటున్నాడు. మెడిటేషన్‌ చేస్తున్నాడు.

ఒకరోజు రాత్రి పదకండు అవుతుండగా చదువుతున్న పుస్తకం మూసి అలా బాల్కనీలో కుర్చీవేసుకుని కూర్చున్నాడు. చల్లని గాలికి హాయిగా ఉంది. కానీ మనసు భారంగా ఉంది. లేచి వెళ్లి వయెలిన్‌ తెచ్చాడు. కుర్చీలో కూర్చుని అలా చుట్టుపక్కల చెట్ల కొమ్మల కదలిక చూస్తూ మెల్లగా వయోలిన్‌ కమాను అందుకున్నాడు. అతనికి తెలీకుండానే త్యాగయ్య కీర్తన ‘ఎందుకు నిర్దయ… ఉడతభక్తిగని ఉపతిల్లగలేదా..’ వాయిస్తూ అందులో లీనమై .. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. కొంతసేపటికి పనివాడు గమనించి నెమ్మదిగా లేపి బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి ఇవతలికి వచ్చేశాడు.
మర్నాడు తెల్లారుజామునే లేచి కాలనీ అంతా కలయ తిరుగుతూ పాడుతూ ఎంతో ఆనందించాడు. జాగింగ్‌కి వెళ్లేవారు చూసి ఆశ్చర్యపోయారు. చెవులు కొరుక్కున్నారు.. పిచ్చేమైనా పట్టిందా.. అనుకున్నారు. ఇవేమీ అనంత్‌కి వినపడటం లేదు,వాళ్లని పట్టించుకోవడమూ లేదు.. అలా పాడుతూనే ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇక పొద్దుట, మధ్యాహ్నం, సాయింత్రం తేడాల్లేకుండా తోచినపుడల్లా బయట తిరుగుతూ, అలా చెట్ల నీడల్లో కూర్చుని పాడుకుంటూండటం పెద్ద దినచర్యే అయింది.

ఒకరోజు అలా పాడుతూనే తెలియని ప్రాంతాల్లోకి వెళిపోయాడు. ఎంతో తన్మయత్వంలో పాడుతున్నాడు. కొంతసేపటికి చప్పట్లు వినిపించి కళ్లు తెరిచాడు. చూస్తే ఒక చెట్టుకింద నిలబడి అతను. రోడ్డు అవతల కూలీపనిచేసుకునేవారు టిఫిన్‌ తింటూండటం అయోమయానికి గురిచేసింది.

‘‘ఆహా.. ఏం పాడుతున్నారు సార్‌… ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు?’’ అని అడిగాడు ఎంతో భక్తిశ్రద్దలతో ఓ కూలీవాడు.

అనంత్‌ ఆనందానికి అంతేలేదు. వాళ్లందరికీ నమస్కరించాడు.

‘‘ఇన్నాళ్లకు నాకు నిజమైన శ్రోతలు దొరికారు. ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నాడు.

వాళ్లంతా తినడం ఆపేసి అతని దగ్గరికి వచ్చి అతని వివరాలు అడగబోయారు. అతను స్వవిషయాలు చెప్పదల్చుకోలేదు. మళ్లీ వస్తానని అనంత్‌ అక్కడి నుంచి వెళిపోయాడు.
ఆ సాయంత్రం చీకటిపడేవేళకి పార్కులోంచి వెళుతూ, ‘సరసీరుహ పున్నాగ చంపక వరాళి కురవక…’ అని పాడుతూ వెళుతూండటం చిన్నా, పెద్దని ఆశ్చర్యపరిచింది. తాము అంతగా ఆదరించలేకపోయామన్న సిగ్గుతో తల వొంచుకున్నారు.

కానీ ఇప్పుడు ప్రతి చెట్టూచేమా, పక్షులు పిట్టలూ, పనిపాటలు చేసుకునేవారు…అంతా శ్రోతలే! వేరెవరైనా పలకరించే ప్రయత్నం చేసినా..హాయిగా నవ్వుకుంటున్నాడు.. వాళ్లకు వినిపించేలా..‘తక్కువేమీ మనకూ …’ అని పాడుతూ వెళుతున్నాడు.