కిటికీలో ఆకాశం

సరళ జీవన సౌందర్యం – ఆశారాజు పద్యం

24-మే-2013

నాకు ఉర్దూ సాహిత్యం తో పెద్దగా పరిచయం లేకున్నా, ఉర్దూ కవులంటే ఒక తెలియని అభిమానం. బరువైన మాటలనీ, చదువరులు/శ్రోతలూ మోయలేని సంక్లిష్ట తాత్వికతలనీ త్యజించి, సరళ సుందరమైన వారి జీవన శైలి లాగానే,వారి కవిత్వం కూడా చాలా సరళ సుందరమైన భాషలో గొప్ప భావాలని పలుకుతుందని నాకున్న కొద్ది పాటి అనుభవాల నుండి స్థిరపరుచుకున్న ఒక అభిప్రాయం! మరీ ముఖ్యంగా, జీవితం లో చాలా చిన్న విషయాలుగా మనం శ్రద్ధ పెట్టని వాటిని కూడా కవిత్వం లో స్వీకరించి, వారు జీవితం పట్ల ప్రదర్శించే గొప్ప ప్రేమ నన్ను అబ్బురపరుస్తుంది.

మరి, అలాంటి గొప్ప ఉర్దూ సాహిత్య గుబాళింపు వున్న నగరం లో పుట్టి పెరిగిన ఒక తెలుగు కవి కవిత్వం, ఆ ఉర్దూ సాహిత్య సాంప్రదాయ సొబగులని అద్దుకోకుండా ఎలా వుంటుంది?…. అందులోనూ, ఆ కవి ఆశారాజు గారయితే ఇకచెప్పేదేముంది?

తెలుగు వచన కవిత్వాన్ని ఒక విద్యార్థిలా సీరియస్ గా చదివే రోజుల్లో ఆశారాజు గారి కవిత్వం నాకు గొప్ప ఆశ్చర్యంగా తోచేది. కారణం, ఆయన తన ప్రయాణం లో నుండో, లేక తన రోజు వారీ హైదరాబాదు జీవితం నుండో కవితావస్తువుల్ని స్వీకరించే పద్ధతీ … వాటిని చాలా సరళమైన పదాలతో, ప్రతీకలతో, సున్నితమైన భావాలతో కవిత్వం చేసే నేర్పరి తనమూ ! … హైదరాబాద్ లో ‘ఫుర్సత్’ గా కూర్చోవడానికి ఉదారంగా ఇంత చోటును యిచ్చి, గొంతు వెచ్చ పెట్టుకోవడానికి ఇన్ని చాయ్ నీళ్ళు ఇచ్చే ఇరానీ చాయ్ హోటళ్ళూ, నలుగురు మనుషులు తలదాచుకోవడానికి ఎకరాలకు ఎకరాలు ఇంటి కోసం మింగేసిన జూబ్లీ కొండలూ, బంజారా కొండలూ కాకుండా ఇరుకిరుకు గల్లీలలోనే గొప్పసంతోషం తో బతికే పేద ముస్లిం మిత్రులూ, లతాలూ, తలత్ మెహమూద్ లూ, ఫాతిమాలూ, హుసేన్ సాగరూ, చార్మినారూ, అతని కవిత్వం లో రెట్టింపు సౌందర్యంతో కదలాడుతాయి.

ఉదాహరణకి, వేసవి సెలవుల్లో పిల్లలు ఊరికి వెళ్ళిపోయాక ఇల్లు వుండే స్థితిని గమనించండి ….
‘ఇల్లు ప్రశాంతంగా వుంది’ అనుకుంటారు….లేక,
‘ఇల్లంతా బోసిపోయినట్టుంది’ అనుకుంటారు….లేక,
మీకు కవిత్వం రాసే వ్యాపకం వుంటే?
బహుశా, కొన్ని గంభీరమైన ఆలోచనలని కవిత్వం చేసేందుకు ఉపక్రమిస్తారు?!

మరి, పిల్లలు సెలవులకి వూరికి వెళ్ళిన తరువాత ఇంటిని చూసి, కవి ఆశారాజు గారు ఏమంటున్నారు?
తాను రోజూ నివసించే ఆ యింటిని చూడగానే, ఒక ‘పక్షుల్లేని గూడు’ ని చూసినట్టుగా వుంది అని ప్రారంభించాడు!

‘తలుపు తీసి లోనికెలితే / ఏకాంతం భయం

గదిలో మనుషులెవరూ వుండరు
అడుగులు మాత్రం కనబడుతుంటాయి
ఎవరి మాటలూ వినిపించవు
పరిమళం మాత్రం వీస్తుంటుంది

లైటు వేసి చూసుకుంటే /కళ్ళ నిండా జ్ఞాపకాలు
గోడల మీదా, సోఫాల మీదా, కుర్చీల మీదా
రంగు పెన్సిళ్ళ పిచ్చి గీతాల మరకలు
పరదాల అంచుల మీదా, టీ వీ స్టాండు మీదా
పసి వేళ్ళు ముట్టుకున్న తీపి గుర్తులు

మూలకు పారేసిన బొమ్మలు ఏడుస్తున్నాయి
బీరువా అద్దమ్మీది ‘తికిలి’ బొట్టు దేన్నో వెదుక్కుంటుంది
దండెంమీది గుడ్డలు పక్షుల్లా రెక్కలు కొట్టుకుంటున్నాయి

మంచంమీది దిండు దూరంగా కింద పారేసి వుండాలి
ఇల్లంతా పుస్తకాలు పరిచి వుండాలి
ఎవరో అంతా సర్ది పెట్టి అందవికారం చేసారు
ఆల్బం నుండి చించి పారేసిన ముక్కలేవీ?
ఈ చాప నిండా పౌడర్ వొలికి వుండాలి కదా
మందుల సీసాలన్నీ నెల మీద దొర్లుతుండాలి కదా
ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి
గదిని ఎందుకో గాయ పరిచారు
గదులన్నీ చిందర వందరగుంటేనే
బతుక్కి చైతన్యం వొచ్చినట్టు వుండేది
స్కూళ్ళకి సెలవులెప్పుడు అయిపొతాయో
ఊరెళ్ళిన పిల్లలు మళ్ళీ ఇంటికి ఎప్పుడు ప్రాణం పోస్తారో?’

నిజానికి, మీరు ఈ కవిత చదవడం పూర్తి చేసిన పిదప,ఇక ఇక్కడ నా మాటల అవసరం లేదు…
అయితే, ఒక పాటకుడిగా నన్ను ఈ పద్యం లో చాలా సార్లు వెంటాడిన వాక్యాలు కొన్ని మీతో పంచుకోవాలి నేను …..

‘ఎవరో అంతా సర్ది పెట్టి అందవికారం చేసారు’……
‘ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి
గదిని ఎందుకో గాయ పరిచారు’……
‘గదులన్నీ చిందర వందరగుంటేనే
బతుక్కి చైతన్యం వొచ్చినట్టు వుండేది ‘…

పిల్లలు లేని ఇల్లు అందం కోల్పోయి కనిపిస్తోందనే బాధని, కవి ‘అంతా సర్ది పెట్టి, అంద వికారం చేసారు’ అంటూ ఎంత సరళంగా వ్యక్తం చేసాడు!

‘గదులన్నీ చిందర వందరగుంటేనే / బతుక్కి చైతన్యం వోచ్చినట్టుండేది’ అని నెపం కాసేపు సర్ది పెట్టి వున్న గది మీదకు నేడుతున్నాడు గానీ, వాస్తవానికి ఆ గదికి అంత చైతన్యం తెచ్చింది ఎవరు?

ఇంతకీ, పిల్లలంటే ఎవరు?…. మళ్ళీ మన యింట్లో కొలువై, మన కళ్ళ ముందు కదలాడే మన బాల్యమే కదా!

‘బీరువా అద్దమ్మీది ‘టికిలి’ బొట్టు దేన్నో వెదుక్కుంటుంది
దండెంమీది గుడ్డలు పక్షుల్లా రెక్కలు కొట్టుకుంటున్నాయి’

అద్దం ముందు ముస్తాబయ్యే కూతురుని ఎంతో మురిపెంగా గమనించే తండ్రి అయి వుంటే తప్ప అద్దమ్మీద ఎవరి కోసమో వెదుక్కునే టికిలీలని గమనించడం సాధ్యమా?
పిల్లల పెంపకాన్ని పూర్తిగా భార్య కు వొదిలేసి తిరిగే భర్త కాకుండా వుంటే తప్ప, దండెం మీద పక్షుల రెక్కల్ని చూడడం చాతనవుతుందా?

చిన్న, చిన్న సంతోషాలే కాదు…ఇలాంటి చిన్న చిన్న తీయని బాధలు కూడా జత కూడినదే జీవితం….కదా!