కని పెంచిన తల్లుల గురించీ, ప్రేమలో ముంచిన లేక మునిగాక వొదిలి వెళ్ళిన ప్రియురాళ్ళ గురించీ ఇబ్బడి ముబ్బడిగా కవితలు రాసిన కవి, తనను నమ్మి తనతో జీవితాన్ని పంచుకోవడానికి వొచ్చిన స్త్రీ గురించి కవితలు అల్లడంలో ఎందుకు వెనుక పడ్డాడు?
ప్రేమలో పూర్తిగా మునిగి పోయిన తరువాత నిర్దయగా వొదిలి వెళ్ళిన స్త్రీనే తలుచుకుంటూ కవితలు అల్లితే ‘ఆహా – ఓహో‘ అనే లోకం, ఇంటి పట్టునే వుండి, పురుషుడి పిల్లలకు తల్లై, అతడికి ఒక కుటుంబాన్ని అపురూపమైన బహుమతిగా ఇచ్చే స్త్రీ గురించి కైతలు కడితే వెక్కిరిస్తుందని భయపడ్డాడా? లేక, ఎంత ప్రేమాస్పదురాలైన స్త్రీ అయినా భార్యగా వొచ్చాక, ఇక ఆమె తన ఆస్తిగా మారిపోతుంది కాబట్టి ఆమె పట్ల ఒక ఉదాసీనతా?
కారణాలు ఏమైనా, తెలుగు కవిత్వంలో అర్థాంగి పైన వొచ్చిన అతి తక్కువ కవితలలో ఒక అపురూపమైన కవిత- ఎండ్లూరి సుధాకర్ రచించిన ‘సహచరి’.
ఓల్గా లాంటి స్త్రీ వాద రచయిత్రులు, కవయిత్రులు స్త్రీని ‘ఆకాశంలో సగం’ అంటోన్న కాలంలో వెలువడిన ఈ కవితని ‘నువ్వు నాలో సగభాగమేమిటి?/ నేనే నీ అర్థాన్ని’ అన్న కొత్త ప్రతిపాదనతో ప్రారంభించాడు కవి.
అవును కదా! స్త్రీ నుండి లోకం లోకి వొచ్చి పడిన పురుషుడు అయితే గియితే ఆమెలో సగమవుతాడు గానీ, ఆమె అతగాడిలో సగమవడం ఏమిటి? గట్టిగా మాట్లాడితే, కవి తన కవితలో చెప్పినట్టు, ఆమే పూర్ణాకాశం, అతడు ఆమె చాయాచిత్రం!
పెద్దగా వ్యాఖ్యానాలు అక్కర్లేని అందమైన ఈ కవితని ఒక సారి చదవండి. మీరు సున్నిత హృదయులైన భర్తలైతే మళ్ళీ మళ్ళీ చదువుకుంటారు.
నువ్వు నాలో సగభాగమేమిటి?
నేనే నీ అర్థాన్ని
నువ్వొక్కతివే పూర్ణాకాశానివి
నేను నీ చాయా చిత్రాన్ని మాత్రమే
నువ్వు ప్రేమగా ఆహ్వానించినపుడు
నేను కృతజ్ఞతా హృదయంతో
నీ చేతుల మధ్య పరిమళించి
నీ డొక్కలో తలదాచుకుని
నా శైశవ స్పర్శని పునరావృతం చేసుకుంటాను
ఆ తర తరాల అహం పీక నొక్కి
విలపిస్తున్న వేకువ లాగా
నీ కళ్ళ నిండా పరివ్యాప్తమౌతాను
ఏ వృక్షం నుండి నువ్వు విత్తనమయ్యావో
ఆ చెట్టుకీ ఆ మట్టికీ నమస్కరిస్తున్నానుఇనుప కచ్చడాలు దాటి
దుఃఖిత ఏకాంతాల సుదీర్ఘ బాధార్ణవాలు దాటి
చీకటి కాండ పటలాలు దాటి
ఇంత కాలానికి నన్ను చేరుకో గలిగావు
ఒక నీటి బొట్టు లాంటి నన్ను
మహా సముద్రాన్ని చేసి
దాంపత్య దీప స్థంభానివయ్యావు
చరిత్ర తన తప్పు ముసుగు విప్పి
నీ ముందు మోకరిల్లుతోంది
ఓ నా పిల్లల తల్లీ !
నువ్వు సాలభంజికవు కాదు
భూగోళాన్ని గర్భీకరించుకున్న అనంత చైతన్య రూపానివి
గొప్ప సౌందర్య ప్రవాహానివి
తమాల వృక్షాల మీద కురుస్తోన్న వెన్నెల వర్షానివి
నా అహంభావ జాతి పత్రం మీద క్షమా సంతకానివి
ప్రకృతి విలీన రహస్య రాత్రి మైదానంలో
నా కోసం మిథున సంగీత మధుర స్వరాల్ని ఆవిష్కరిస్తావు
కోల్పోయిన నా బాల్యం ఉంగరం
నీ చేతుల్లో భద్రంగా వుంటుంది
దిన దిన క్షణ క్షణ వేన వేల విచిత్ర స్పర్శలు
నాకు దయతో కొత్త ద్వారాలు చూపిస్తాయి
నా సంకుచిత పురుష సింహాసనాన్ని కాలదన్ని
నీ చిటికెన వేలు ఆసరాతో
నిగూడ జీవిత కీకారన్యాల్లోకి నిర్భయంగా నడిచి వెళ్తాను
‘నీవొక్కతివే పూర్ణాకాశానివి’ అని చెప్పడంతో ఆగకుండా‘, ‘నీ డొక్కలో తలదాచుకుని / నా శైశవ స్పర్శని పునరావృతం చేసుకుంటాను’ అంటున్నాడు. ‘శైశవ స్పర్శ’ అన్న మాట వాడడం ద్వారా తన జీవితంలో ఆమె స్థానం ఎంతటి వున్నతమైనదో చెబుతున్నాడు కవి.
కవితని ఒక సారి మళ్ళా చదవండి- మొదటి సగంలో ‘నువ్వు సాలభంజికవు కాదు’ అని చెప్పిన కవి, ‘నా సంకుచిత పురుష సింహాసనాన్ని కాలదన్ని’ అంటున్నాడు.
‘ప్రతీ పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ వుంటుంది’ లాంటి దుమ్ము కొట్టుకు పోయిన మాటలను చిన్నతనం నుండే నూరి పోసి, పురుషుడి అంతరంగంలో స్త్రీని ఎప్పుడూ వెనుకే పడవేసిన లోకానికి, పురుషుడు తన స్వప్న సింహాసనాన్ని అధిరోహించే క్రమంలో అతడి విజయ గమనాల పైన పూలు కురిపిస్తూ సాలభంజికలుగానే స్త్రీలు మిగిలి పోవాలని ఉపదేశించే పితృస్వామ్య ప్రపంచానికి ఇదంతా అర్థమవుతున్నదా?
కవితలోని ఈ పంక్తులు చదవండి-
‘ప్రకృతి విలీన రహస్య రాత్రి మైదానంలో
నా కోసం మిథున సంగీత మధుర స్వరాల్ని ఆవిష్కరిస్తావు’‘దిన దిన క్షణ క్షణ వేన వేల విచిత్ర స్పర్శలు
నాకు దయతో కొత్త ద్వారాలు చూపిస్తాయి’
వేన వేల ఆమె స్పర్శలు దయతో కొత్త ద్వారాలను చూపిస్తాయి అని వెల్లడించడం ద్వారా, భార్యా భర్తల సంబంధంలోని చాలా సున్నితమైన అంశాలను కవి స్పృశించిన తీరు మనల్ని ముచ్చట గొల్పుతుంది.
ఇక ఆ తరువాత?
ఆమె పూర్ణాకాశం అన్న ఎరుక వున్న వాడికి, ఒక నీటి బొట్టు లాంటి తనను ఒక మహాసముద్రంగా మార్చి దీపస్తంభంలా నిలిచింది అమేనన్న జ్ఞానమున్న వాడికి, ఆమె సాహచర్యంలో తన సంకుచిత పురుష సింహాసనాన్ని కాలదన్నిన వాడికి ‘ఆమె చిటికెన వేలు పట్టుకుని నిగూడ జీవిత కీకారణ్యాల లోకి వెళ్ళడం’ ఎంతో సుళువు!
ఇదంతా సరే గానీ, భార్యా భర్తల బంధాన్ని బతికించుకోవడం అంటే ‘రోజూ ఆరు సార్లు హగ్ చేసుకోవడం’, ‘డజన్ సార్లు ముద్దు పెట్టుకోవడం’, ‘ఎప్పుడైనా ఒకరిపై ఒకరికి కోపంగా వున్నా ఐ లవ్ యూ – ఐ లవ్ యూ అని కంట్రోల్ చేసుకోవడం’ లాంటి వృత్తి ఫ్యామిలీ కౌన్సిలర్ల ఉపదేశాలనే నమ్ముకున్న ఈ అత్యాధునిక కాలంలోని భార్యా భర్తలను ఈ కవితలు చేరతాయంటారా?!
**** (*) ****
. “నీ డొక్కలో తలదాచుకుని,నా శైశవ స్పర్సని పునరావృతం చేసుకుంటాను”
పురుషుడిలో ఈ ఒక్క భావన చాలు ..
ఆ బంధం అత్యంత మహోన్నతం కావటానికి ..
ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేయటానికి.
విలపిస్తున్న వేకువ లాగా నీ కళ్ళనిండా పరివ్యాప్తమౌతానన్న భావన .. చదువుతూన్న కళ్లల్లో ఆ క్షణమే కన్నీటి జడిగా మారింది .
“నా అహంభావ జాతి పత్రం మీద క్షమా సంతకానివి ..
కొల్పొఇన నా బాల్య ఉంగరం నీ చేతుల్లో భద్రంగా వుంది.” ..
ఎంతమందికి తెలుసు ఈ పచ్చి నిజాలు.?
తెలిసినా ఒప్ప్పుకోగల హ్రుదయాలేన్ని.?
నాకు రాయడం ఎలాగో తెలియదు. ఐన, నా మనసులో భావాన్ని ఎక్ష్ప్రెస్స్ చేయకుండా ఉండలేక పోయాను.
కవికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వమెప్పుడూ ,ఆహ్లాదంతో కూడిన అర్థవంతమైనదిగా ఆదర్శప్రాయంగా ఉంటుంది.
Good poem
Great expression
Hats up
నన్ను గుర్తుపట్టలేదా కృష్ణరాయా!
నేనయ్యా దాసరి మాలను
మంగళ కైశికీ రాగవేదిక మీద
నర్తించిన సింహ క్ష్వేళను
నేను ప్రభూ! చర్మకారుణ్ణి
భూదిగంతరాల ప్రతిధ్వనించిన
జంబూద్వీప ఆది స్వరాన్ని
శ్రీరంగధాముని ముందు
సంగీత స్వర సముద్ర ఘోషని
మంగళ కైశికీరాగ గోసంగిని
అని ఎలుగెత్తి వాసికెక్కిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి లోని మరో పార్శ్వాన్ని
సహచరీ ” నీ చిటికెన వేలు ఆసరాతో
నిగూడ జీవిత కీకారన్యాల్లోకి నిర్భయంగా నడిచి వెళ్తాను ”
అన్న ఎండ్లూరి సుధాకర్ గారిని చూపిన విజయకుమార్ గారికి ధన్యవాదాలు.
వ్యాఖ్యానించడానికి కూడా ఏమీ లేదు. మనసంతా వ్యక్తీకరించలేని భావంతో ఉదాత్తంగా నిండిపోయింది . నిజమే ఇలాంటి కవిత్వాన్ని విజయ్ కుమార్ గారు పరిచయం చేయకపోతే అసలు ఉన్నట్టు తెలియదేమో, ఎందుకంటే ఇలాంటి కవిత్వం తాటాకు చప్పుళ్ళలో దాగిపోయి ఉంది. వెలికి దీసి మరికొందరికి పరిచయం చేయాల్సి ఉంది. ధన్యవాదాలు.