కిటికీలో ఆకాశం

ఒక తీయని ప్రణయ ప్రయాణం – సీతారాం పద్యం

ఏప్రిల్ 2017

ప్రేమలో ఉన్నప్పటి స్థితి బహు విచిత్రమైనది. మరీ ముఖ్యంగా, ఎదుటి మనిషి కూడా తన పట్ల ఒక ఇష్టాన్ని ఏదో కలిగి వున్నారని ఒక ఊహలాంటిదేదో మనసులో కదలాడినపుడు ఇక ఆ ఊహ ఆ మనిషిని భూమికి కొన్ని అడుగుల ఎత్తున నడిపిస్తుంది.

ప్రేమలో వున్నపుడు లోకం లోని కాలమంతా తన సొంతమై పోవాలనీ, సొంతమైన ఆ కాలమంతా నిరంతరం ఆమె సమక్షం లోనే గడిచి పోవాలనీ, ఎన్నెన్ని ఊహలో కదలాడి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి కదా!

అలాంటి స్థితిలో, ఆమెతో కలిసి చేసిన ఒక చిన్ని బస్సు ప్రయాణ అనుభవాన్ని కూడా కవి సీతారాం ఒక అందమైన పద్యంగా ఎట్లా మనతో పంచుకుంటున్నాడో చూడండి!

ఆమె పక్కన

చుట్టూ ఎవరూ లేకుండా ఆమెతో
ఎంతకూ రాని గమ్యం వరకు చేరుతూ వుండాలని -
చిన్న పిల్లయి మారాం చేసినపుడు
ఆ అలిగిన కళ్ళను బతిమాలాలని
పెద్ద పిల్లలా నన్నే కోపం చేస్తుంటే
మళ్ళీ నా కన్నీటి కళ్ళు కనిపించకుండా
మోచేత్తో కళ్ళు తుడుచుకోవాలని
నా ప్రక్కనే కూర్చుని
చెప్పే కబుర్లలో నేనూ ఓ కబుర్నై మిగలాలని

సీటు దొరక్క నుంచున్నాను
ఆమె సమీపాన
కూర్చుందనే కానీ
తన కాళ్ళకీ నెప్పులే
తన కనురెప్పల గొడుగులెత్తి
కూర్చోమని పిలుస్తుంది
అలా పిలిపించుకుంటూ
ఆమె కోసం నుంచోవడమే ఆనందమంటే

ఆగిపోయిన మాటల్ని మళ్ళీ ఏదో మాటతో
మొదలు పెట్టే సంభాషణలో
ఒకరితో ఒకరు చెప్పుకునే సంభాషణలో
ఒకరితో ఒకరు చెప్పుకునే పదాల్లో
ఇద్దరికీ ఇద్దరమూ
ఒక్కరికి మరొక్కరమూ
మరే ఆమె సమీపాన్నే నుంచున్నాను

ఏం జయించానో తెలీదు గానీ
గుండెలో ఆమె పెదవులు విత్తిన
మాటలు మొలుస్తున్నాయి
వాటి నీడలు
ఆ నీడల్లోనే ఆమె దిగిపోయాక
నేను మిగిలాను
ఆ సీటు పక్కన
నా ఆలోచనల్లో నుంచున్నాను
బహుశా ఆమె
ఇంటికెళ్ళే దారిలో
ప్రక్కనే నిలబడి వెళ్తున్నానేమో!

కవిత మొదటి భాగంలో కవి అత్యాశ (?) వంటి ఒక ఊహని చేస్తున్నాడు.

చుట్టూ ఎవరూ లేకుండా, బస్సులో తనూ, తాను ప్రేమించిన అమ్మాయి మాత్రమే వుండి, ‘ఎంతకూ రాని గమ్యం వరకు చేరుతూ వుండాలని’.

ఈ ‘ఎంతకూ రాని గమ్యం వరకు చేరుతూ వుండడం’ అనడంలో చమత్కారం ధ్వనిస్తున్నా, ఇద్దరు మనుషులు కలిసి చేయవలసిన ప్రయాణంలో ఆస్వాదించవలసినది ప్రయాణమే తప్ప గమ్యాలు కాదన్న ఒక తాత్విక చింతన మనల్ని తాకుతుంది.

ఆమె చిన్న పిల్లలా మారాం చేస్తే, అలిగిన ఆమె కళ్ళని బతిమాలాలని, ఆమె పెద్ద పిల్లలా తనని కోపం చేస్తే, తడిసిన తన కళ్ళు కనిపించకుండా మోచేత్తో తుడుచుకోవాలనీ, యిట్లా ఏవేవో ఊహలు చేస్తూ చివరికి ఆమె తన పక్కన కూర్చుని చెప్పే కబుర్లలో తానూ ఒక కబురై పోవాలని ఆశపడుతున్నాడు.

ప్రేమలో వున్నపుడు, ఆమె కబుర్లలో కబురై పోవడం కన్నా ఎక్కువ ఆశపడేది ఏముంటుంది?

కవిత రెండవ భాగంలో ‘సీటు దొరక్క నుంచున్నాను’ అంటూ ఒక సాదా సీదా మాటతో కవి బస్సులో ప్రయాణ దృశ్య వర్ణనని ప్రారంభించాడు.

అయితే, ప్రేమలో వుండడం వలన, అందులోనూ తాను ప్రేమించిన స్త్రీ కూడా తాను ప్రయాణిస్తోన్న బస్సులోనే వుండడం వలన ‘తన కనురెప్పల గొడుగులెత్తి కూర్చోమని పిలుస్తుంది’ అంటూ వెంటనే గొప్ప ఊహ చేస్తాడు.

‘కనురెప్పల గొడుగులు’ అనే వర్ణన లో ఆమె చూపుల నీడలోనే అతడికి స్వాంతన లభించేది అన్న భావం లేదూ?

ఇక్కడ గమ్మత్తైన సంగతి ఏమిటంటే, ఆమె అట్లా కూర్చోమని పిలుస్తూ వున్నా సరే, ‘ఆమె కోసం నుంచోవడమే ఆనందమంటే’ అంటున్నాడు.

‘ఒకరికి మరొకరం’ లా ఆ ప్రయాణంలో ఆమెతో సంభాషణలు సాగాయని, ఆమె దిగిపోయాక ఆమె పెదాలు తన గుండెలో నాటిన మాటల నీడల్లో ఆమె ఖాళీ చేసిన సీటు పక్కన నుంచున్నానని అంటున్నాడు.

అక్కడితో ఆగకుండా, ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ‘ పక్కనే నిలబడి వెళ్తున్నానేమో’ అని కూడా అనుమానంలో పడిపోయాడు కవి!

ఎన్ని అందమైన ఊహలు, ఎంత సున్నితమైన ఊహలు…! భావుకుడైన మనిషిలో ప్రేమ ఎన్ని అందమైన ఊహల్ని సృష్టిస్తుందో కదా?!
హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కాలపు ప్రేమలకు ఇదంతా ‘పెద్ద ట్రాష్’ , ‘నాన్సెన్స్’ అని అనిపిస్తుందా? ఏమో ?!

**** (*) ****