కథన కుతూహలం

వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు

జూన్ 2013

‘రయిక ముడి ఎరుగని బతుకు’ మీద పుస్తక పరిచయం

కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన ‘రయిక ముడి ఎరుగని బతుకు’ కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన ‘మొగుడు చచ్చిన’ ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే కాదు; జ్ఞానం, దేహం కూడ నిరాకరించిన క్రూరత్వం నుండే చలం ప్రవక్తగా పుట్టాడు. ఇప్పుడు రమేశు అదే బాట పట్టాడు.

ఎనిమిదో ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలైన కన్నెమ్మను, పూజలు (డిజైన్) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు, రెండు రయికలతో చుట్టింటికి (వంటిల్లు) పరిమితం చేసారు. “తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. మారుతల్లి ఆ ఇంటికి వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు. పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు.”

అలాంటి కన్నెమ్మను నిండు యవ్వనంలో మడేలు మురుగుడు వలచాడు. కన్నెమ్మ బతుకులో వసంతం వచ్చింది. “మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.” మురుగుడు తెచ్చిన జిలేబినీ ఒకరికొకరు తినిపించుకొంటుండగా వెనుకనుండి గొడ్డలి తో పొడిచి అతని ప్రాణం తీసాడు తమ్ముడు రాజిరెడ్డి. ఏమీ ఎరగనట్లు భార్యతో, కన్నెమ్మతో అత్తారింటికి చేరాడు. ఆ రోజు నుండి కడదాక, కన్నెమ్మ బతుకు పొంత కడవ బతుకయ్యి వదినె పుట్టింటికి ఊడిగం చేయటంలోనే గడిచిపోయింది. “అయిదు బారల ఎర్రప్రసను కోకను తుంటిదోపు (మొగుడు చనిపోయిన వాళ్లు కుచ్చిళ్లు పోయకుండా కట్టే కట్టు) కట్టుకొని, ఇంకొక కోకను చుట్టి చంకలో పెట్టుకొని వాళ్ల వెనకాలనే కన్నెమ్మ కూడా ఈ ఇల్లు కడప తొక్కింది”

ఎవరీ కన్నెమ్మ?

“కన్నెవ్వ మా మేనత్త ఆడబడుచు. ఆ ఇంట్లో పని చేయడం తప్ప ఎవరితో మాట్లాడటం నేను చూడలేదు, నా బాల్యంలో. ఎవరూ లేనప్పుడు నన్ను దగ్గరకు లాక్కొని ముద్దులు పెట్టుకొనేది.” అప్పుడు ఆమె కంట్లో తడికి సమాధానం స.వెం. రమేశుకు ఆమె ఎత్తుబడి (కర్మకాండలు) తరువాత తల్లి నుండి తెలిసింది.

ఈ కధ కాలం యాబ్భై అరవై యేళ్ళ క్రితమయి ఉండాలి. తెలుగు దేశాన ఉత్తరాదిన పుట్టిన చలం దక్షిణాన ఉన్న చదువురాని కన్నెమ్మను చేరలేదు. మడేలు మురగడితో ఆమె అనుభవానికి చాలా మూల్యం చెల్లించింది. ఈ దేశంలో పెళ్ళై భార్యలు ఉన్నఅన్ని వయసుల మగవాళ్ళు కూడా యధేచ్చగా, సునాయాసంగా కొనుక్కోగల, క్రీడించగల అతి చౌకైనా శృంగారం; యవ్వనంలో ఉన్న వితంతువు కన్నెమ్మకు నిషేధం. సహజాతిసహజమైన ఆమె మేని దాహం, ఆమె అనాధ మనసు కోరిన స్నేహం తన ప్రియ ప్రాణాన్ని బలిగొని ఆమెను కడదాక జీవన్మృతురాల్ని చేసింది.

ఇలాంటి ఇతివృత్తంతో కధలు కొన్ని వేలు వచ్చి ఉంటాయి. ఇక సినిమాలు చెప్పనక్కరలేదు. అందులో చాలా వరకు మనకు సంబంధం లేని లోకాల్లో, పరాయి వ్యక్తుల గురించి విన్నట్లు, చూసినట్లు ఉంటుంది. కాని రమేశు కధ నడక అసాధారణంగా ఉంటుంది. ఒక మగ రచయిత స్త్రీ పాత్రను సృష్టించినపుడు; ఆమె అంతరంగ ఆవిష్కరణ, కృతిమత్వం లేకుండా, బండతనం లేకుండా మాటలకందించటం కత్తి మీద సామే. అందుకోసం ఆడవాళ్ళ వగపు పట్ల దయ, ఔదార్యం ఉంటే సరిపోదు. వాళ్ళ హృదయపు లోతులను సృజించగలగాలి. వాళ్ళ గుండె చప్పుళ్ళు వినగలగాలి. వాళ్ళ మనసు సంవేదనలను భ్రాంతులు, భ్రమలు అంటించకుండా నికార్సుగా మన పరం చేయ గలగాలి. ఆ పని రమేశు అత్యధ్భుతంగా చేసి కూర్చున్నాడు ఈ కధలో.

ప్రకృతి లోని అన్ని జీవ రాశుల సృష్టి కార్యాలను అంగీకరించే మనుషులచేత; ఒక స్త్రీ మోహాన్ని, వాంఛనీ అంతే సహజంగా ఆమోదింపచేయటం సులభమైన పని కాదు. అందుకే మనుషులు అందుకోలేనీ, అందుకొన్నా అంగీకరించిన ఆడదాని దేహ కాంక్షలను మట్టితో చెప్పించాడు రమేశు. “ఎవరికీ పట్టనట్టు, ఊరంతా కలిసి వెలేసినట్టు ఆ మూలన పడి ఉండే నా దగ్గరకు పోతయ్య వచ్చి, నన్ను తాకి చూసినాడు. ఎన్నో నాళ్ల తరువాత ఒక మగోడి చెయ్యి తగిలేసరికి ఎంత నెమ్మది పడినానో. నీకు నేను ఉండానులే తొప్పర (బాధ) పడవద్దు అన్నట్టు నన్ను నిమిరినాడు. రెండు చేతుల నిండుగా నన్ను జవురుకొని జల్లలో పండుకోవెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఈ కానగమాను కింద చోటు చూపించినాడు. ఈ పొద్దో రేపో నాకొక కొత్త బతుకును ఇవ్వపోతా ఉండాడు.” అని నల్లమట్టి కుమ్మరి పోతయ్య స్పర్శకు పులకరించి పోతూ చెబుతుంది. “ఎవరు ఏమన్నా అనుకోండి, ఈ మాటను చెప్పే తీరాల. కుమ్మరోడి కింద తొక్కుడు పడిన చేరుమన్ను బతుకే బతుకు. ఆ ఇమ్ము (సుఖం) చవికొన్న వాళ్లకే తెలుస్తాది. కొవ్విన పుంజుకోడి కొప్పరించి మిందకు వస్తే ఒదిగి తోవ చూపిస్తాదే పెట్టకోడి, అట్ట మెదిగి పోయినాను పోతయ్య కాళ్ల కింద నేను.”

వస్తువులు తమను మనుషులుగా వ్యక్తీకరించుకోవటం ఈ కధకు గల ప్రత్యేకత. కధ జరుగుతున్న స్థలంలో, కాలంలో తను లేని లోటును పూడ్చటానికి, రచయిత అక్కడ వున్న గృహ పరికరాల ద్వార కధను చెప్పించాడు. కడుపులో దాచుకొన్న క్షోభని, బ్రతుకంతా నోరు విప్పి చెప్పని కన్నెమ్మ కధను చెప్పుకొన్నది పొంతకడవ, ఎత్తు బొట్ట, దొంతిగుడవ,బియ్యం జల్లెడ, చింకి చాప, రాగి చెరవ, అంబటి బాన, ఊదర బుర్ర, తూకు వెళుకు (తూర్పు వెలుగు). “ఇంకా సాకలి సొలుపు తీరలేదా” అనే దెప్పిపొడుపు మాట వెనుక అంతరార్ధం అంచలంచలుగా చెప్పుకొన్నాయి ఈ వస్తువులు. మధ్యలో ‘అయ్యో కూతురా, మడేలుకు ఒళ్లు అప్పగించేసిందా కన్నెమ్మ’ అన్న ఊదర బుర్రను తీవ్రంగా మందలించాయి. ‘ఒసే ముయ్యే. మనుసులు నిన్ను ఊది ఊది, వాళ్ల లోపలి కువ్వాళం అంతా నీలో చేరిపొయినట్టు ఉండాది.’ అని ఎకసెక్కం చేసాయి. ఆమె దుఃఖాన్నీ తమ సొంతంగా భావించి వల వలా ఏడ్చాయి. పొంత కడవ మాత్రం ఆమె కధ విన్న తరువాత తల్లడిల్లిపోయింది. ‘పగలు పొద్దుగూకులూ కాగికాగి కాలిపోయే నాకు, కడకు మిగిలేది మసే కదా. పండగపూట కూడా పొంతకడవకు అంత పసుపూకుంకుమా పెట్టరే. ఇంటిల్లిపాదికీ ఇంత ఊడిగం చేసే నన్ను, కడాన ఉలవరించుకొని పొయిననాడు దిబ్బలోనే కదా వేసేది. ఓటి మంగలానికి ఉండే మతింపు కూడా పొంతకడవకు ఉండదే.. నా బతుకు మాదిర బతుకే కదా ఆయమ్మది కూడా.’ అని తల పోసి వగచింది.
మేనల్లుడు కూడ ‘సాకలి సొలుపు తీరితే కదా’ అనగానే దినమంతా కూడూనీళ్ళు ముట్టకుండా అర్ధరాత్రి పుట్టినింటి నుండి తెచ్చుకొన్న రాగిచెరవను కావలించుకొని పొగిలి పొగిలి ఏడుస్తుంది కన్నెమ్మ. ఆ ఏడుపును చూసిన పొంతకడవ తను కూడ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి చుక్క పుట్టే పొద్దుకు పగిలిపోతుంది.

‘ఓస్ ఆడోళ్ళు చేసే ఎలాంటి పనైనా మేము చేసేయగలం’ అనే అహంకారం ఎంత అమానుషమో, ‘ఆడది ఎంత పనైనా తన కుటుంబం కోసమే కదా చేసేది’ అంటూ దాన్ని సహజ సూత్రంగా స్వీకరించటం కూడా అంతే అన్యాయం. స్త్రీ శ్రమని ఉపరితలం నుండి చూడటం, తేలిక చేయటం ఇక్కడే మొదలౌతుంది. ప్రతిపని మర నొక్కి చేసే రోజులు కావవి. నడుమును విల్లులా వంచాలి, భుజ కండరాలను పూర్తి స్థాయిలో ఉపయోగ పెట్టాలి. చేతులు, కాళ్ళు నిరంతరం శ్రమించాలి. పొద్దు పొడిచింది మొదలు, ఊరు గురకలు పెట్టేవరకు ఎడతెరిపిలేని, సృజనాత్మకత లేని వెట్టి చాకిరి అది. ‘దేవత, అనురాగమయి, త్యాగమయి’ పిలుపులు మాత్రమే (అదీ పొదుపుగా) భత్యంగా వచ్చే దగాకోరు దోపిడి. (కన్నెమ్మకు ఆ జీతం, భాగ్యం కూడ లేవనుకోండి). రచయిత చుట్టింట్లో పీట వేసుకొని దినమంతా కూర్చొన్నా కూడ ఆ శ్రమను అంత సజీవంగా అక్షరాల్లో పెట్టటం అసాధ్యం. ఒక రోజులో ఒక స్త్రీ చేసే కష్టాన్ని రచయిత తను కూడ చేసి ఉంటేనే అలా రాయగలడు అన్పిస్తుంది ఆ వర్ణన చదివితే. ఆ భాగం మాత్రం మీరు చదవాల్సిందే.

ఇక రచయిత భాషా, వస్తుపరిజ్ఞానం అపరిమితం. గతంలో విరివిగా వాడి, ఇప్పుడు సాహిత్యంలోను, మ్యూజియం లోనూ మాత్రమే కనిపిస్తున్న గ్రామీణ శ్రమలను, వస్తుసంపదను ఆయన మన కళ్ళకు కట్టించాడు. ముఖ్యంగా కుమ్మరి కుండలు చేసిన చేసే వైనం మన ముందు సాక్షాత్కరింపచేసాడు.

“మరునాడు తెల్లవారి లేచి మబ్బు (తొక్కి పెట్టిన మట్టి ముద్ద) పక్కనే సారెను పెట్టి, సారెను గిరగిర తిప్పుతా దాని మీద నన్ను పెట్టి చేతి ఒడుపును చూపించినాడు. ఆ ఒడుపుకు పులకరించిపొయిన నా ఒళ్ళు తీరుతీరున సాగింది. నేను పంతెను అయినాను, పటువను అయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లి మూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పు అటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవక పంటి, కడవ, కలి కడవ, పొంత కడవ, బాన, చాకలి బాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము,పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము… ఒక తీరు కాదు ఒక తెన్ను కాదు, వాడు చేతిలో ఏమి మరులమందు పెట్టుకొని నన్ను ముట్టుకొన్నాడో, నేను ఇన్ని పెడలుగా పొడలు కట్టినాను.” ఇవి మట్టి చేత రచయిత పలికించిన పలుకులు.

నెళవు (పరిచయం), పసను (రంగు), రెయ్యికోళ్ళు(కీచురాళ్ళు), ఇర్లనాటికో వెల్లనాటికో (అమావాస్యకో పౌర్ణమికో), కడంగి (ప్రయత్నించి), ఉల్లము (మనసు) లాంటి అచ్చతెలుగు పదాలు పాఠకులను ఉర్రూతలూగిస్తాయి.

ఈ కధను స్మరించుకొంటున్న సందర్భంలో కధ గురించి కొందరి అభిప్రాయాలు కూడ ఉటంకిస్తే బాగుంటుందనిపించింది.

“వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు,కనిపించే చిత్రం చాటున మూసుకు పోయిన కళ్ళని చూసి నమ్మకాల దారపు పోగులు తెగిపోతున్నసమయంలో, తాను నమ్మినదాన్ని శ్వాసించి, జీర్ణించి, అనుభవించి వ్యక్తీకరించే కృషి చేస్తున్నాడు రమేష్. పిచుకల కధలుతోనో, రయికముడి ఎరుగని బ్రతుకుల వ్యధలనో తన గొంతుకతో వినిపించాడు.కొత్త వడ్లతో చేసిన మొలక బియ్యం సారం అనుభవిస్తున్నత ఆనందం వుంది రమేశ్ కథలలో.” రమేశ్ కధల గురించి ఒక పాఠకురాలు హరిత అభిప్రాయం.

“ఒకమనిషిని మరొక మనిషి చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ఆ మనిషిలో ఒక లోపాన్ని వెతికి దాన్ని తురుఫు ముక్కలా వాడుకుని ఆమెని ఆ ఒక్క మాటతో కుప్పకూలేలా చెయ్యడం అనే రాజకీయం ఎంతకాలంగానో నడుస్తూనే వుంది . మానవజీవితావసరమైన ఒకానొక సుఖాన్ని ఒక లిప్త కాలం అనుభవించడం నేరం అయిపోయిన అస్వతంత్ర కన్నెమ్మ అనగా ఎంత? ఏడ్చి ఏడ్చి పొంతకుండ పగిలిపోయింది .కన్నెమ్మ ఇంకా ఎంతకాలం అట్లా కన్నీళ్ళు ఇగరబెట్టుకుంటూ బ్రతకాలి? జీవితం, తిండి ,వస్తువులు.అన్నిటా స్థానీయత తొణికిసలాడే కథ. ‘రవిక ముడి ఎరగని బ్రతుకు’ అక్షరాలను దృశ్యాలుగా మలిచే చిత్రకారుడు రమేష్ .పాఠకులని తన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించే మాంత్రికుడు.అచ్చతెలుగు అతని స్వంతం.” -సత్యవతి పి. (రచయిత్రి)

“అది ఒక కన్నీటి గాధ.’రయిక ముడి ఎరుగని బ్రతుకులు’ లో నా చిన్నప్పటి మహనీయ స్త్రీమూర్తులు ఎందరో నా మనసులో మెదిలాడారు.వేకువనే లేచి గబగబ అన్నం వండి, పొద్దున్నే పిల్లలకింత పెట్టి తానింత టిపినులో పెట్టుకొని పొలం కూలీకి పరుగులు తీసిన అమ్మ,గర్భాశయ కేన్సర్ తోనే ఇంటిల్లిపాదికీ వండివార్చిచాకిరీ చేసిన అమ్మమ్మ,తలజడ వేసుకోటం మాని, ముడి తోనే దూది ఉన్ని నేకి తనవాళ్ళ కడుపులు నింపిన నాయనమ్మ,ఎన్నని చెప్పేది ఎందరిని తలుచుకునేది?ఆ దృశ్యాలెన్నో రమేశ్ మన కళ్ళకు కట్టాడు.”- నూర్ భాషా రహంతుల్లా (డిప్యూటి కలెక్టర్, విజయవాడ).

మట్టిని తవ్వితే మాణిక్యాలు దొరుకుతాయి. పల్లెటూర్లలో నులకమంచాల్లో ముడుచుకొని ఉన్న ముసలమ్మలను కదిలిస్తే నాణ్యమైన జీవితాలు లభిస్తాయి. ఎటొచ్చి వినదగ్గ వారే వినాలి.రాయదగ్గ వారే రాయాలి. మరుగున పడ్డ, మసిగుడ్డలుగా మారిన మహోన్నత స్త్రీ మూర్తుల చీకటి గాధలను, ధవళ హృదయాలను సమస్త లోకానికి ఎరిక పర్చవా రమేశు! నీ సత్యమైన తీక్షణ దృష్టితో,నీ కధనా కౌశలంతో, నీ విశిష్ట భాషా పరిజ్ఞానంతో!