కవిత్వం

రేపటి నిన్నలో…

07-జూన్-2013

మనసు ఎడారిని తలపించింది
అల్లుకున్న ఊహలన్నీ ఆవిరైనట్టు
జ్ఞాపకాలన్నీ సంకెల తెంచుకున్నట్టు

ఏంటో ఎటుపోతున్నాయో
తలపుల రహదారులు
ఆరని ,అంతుచిక్కని అనలానికి
నన్ను సమిధను చేస్తూ

అప్పుడెప్పుడో ఉబుసుపోక
చెప్పుకున్న పిట్టకథ వెక్కిరిస్తోంది

చెట్టు నువ్వని నీడ నీ జ్ఞాపకమని
భావుకత వల్లించిన మనసుకి
ఆనీడ జాడే లేని మొండి గోడ వెక్కిరించింది

ఎన్నివసంతాలైనా చిగురించని
ఆ మోడు నేలకొరిగితే
మరి తపనల తలపులనే కానీ
నిన్ను చూడలేనని మనసు
నీ జ్ఞాపకాలని వేలివేయమంది

నిను వెలివేసి నేను ఒంటరినవ్వనా??
ఎన్ని రకాలుగా వివరించినా
అనునయించినా,అర్థించినా
వినని మనసు జ్ఞాపకాలతో
అలాగే ఉడికిస్తుంది ఊరడిస్తుంది

అంతులేని ఈ వింత ఆటలో
ఒక్కోసారి సమిధనై
అనునిత్యం జ్వలించే జ్వాలనై
ప్రేమాంబుధిలో ఓ తుంపరనై
తుంపరలతో నిండిన వర్షపు చెమ్మనై
ఏ క్షణానికాక్షణం నన్నిలానే
ఓలలాడనీ రేపటి నిన్నలో…