కవిత్వం

ఆమె సమయాలు

02-ఆగస్ట్-2013

1
బట్టల షాపులో నేల మీద పరచిన
మెత్తని పరుపుపై కూర్చుని ఆమె నింపాదిగా
ఒక్కొక్క చీరనీ వేళ్ళ మీదగా తెరుస్తోంది
ఇవతల గడియారపు రెండు ముళ్ళ నడుమ
చిక్కుకుపోయి ఒకింత చీకాకుతో నేను

నేల పచ్చదనాన్ని అద్దుకున్న చీర
నీలాకాశపు సౌందర్యం నింపుకున్న చీర
పౌర్ణమి రాత్రి నక్షత్ర కాంతులతో మెరిసే చీర
రంగుల సీతాకోకలు కొలువైన చీర
సప్త వర్ణాల ఇంద్రధనుసు విరిసిన చీర

వేళ్ళ మీదుగా తెరిచిన ఒక్కొక్క చీర
అంచునీ అలా భుజం పైన కప్పుకుంటూ
ప్రశంస కోసమో, అభిప్రాయం కోసమో అర్థం కాని
కొనచూపుతో నా వైపు చూస్తూ ఆమె అంది-

‘పురుషులు కదా మీరు
రంగులలో దాగిన దేహాలపైనే వ్యామోహం
దొరికిన ఏవో రెండు రంగులనలా చుట్టేసుకుని
చుట్టూ వున్న వర్ణమయ ప్రపంచం అంతా
ఇక మీ చుట్టే తిరుగుతుందని భ్రమిస్తారు’

2
ఎనిమిది గంటల రాత్రి ఇల్లు చేరేసరికి
ఆమె బాల్కనీ కుండీలలో దాహంతో
వున్న మొక్కలకు నీళ్ళు తాపిస్తోంది
ఇంటి పనీ, ఆఫీసు పనీ ముగిసాక
మొక్కలని పలకరించే ఓపికని యెవరిచ్చారీమెకి ?

పసిపాపకు పక్క సర్దినంత మృదువుగా
కాసేపు కుండీల లోని మట్టిని సర్ది
మరి కాసేపు, విరిసిన బంతి పూలనీ
సన్న జాజులనీ, పారిజాతాలనీ పలకరించి
ఒకింత సేపు ఆమె విశ్రమించింది

కుండీల నడుమ విరిసిన నా చంద్రబింబం
తననే చూస్తోన్న నన్ను చూసి ఇలా అంది-

పని వేళల పిదప ఇల్లు చేరరు మీరు
ప్రతి రోజూ నలుగురు మిత్రులతో రోడ్డు పక్క
హోటళ్ళలో కబుర్లని పంచుకోవడం లో
ఆహ్లాదాన్ని వెదుక్కునే బదులు
ఇలా ఈ పూవులని పలకరిస్తూ
ఈ పూవులపై కురిసే వెన్నెలలో తడుస్తూ
ఇక్కడ కాసేపు హాయిగా విశ్రమించ వొచ్చు!