కిటికీలో ఆకాశం

‘తుమ్మెద’ కు కృతజ్ఞతలు స్మైల్ !

అక్టోబర్ 2013

ఇంట్లో ఆడుకోవడానికి చిన్న తనంలో నాకు మా నాన్న కొని తెచ్చిన బొమ్మలు, ఒక రెండు గుర్తున్నాయి. ఒకటి, కీ తిప్పితే పరుగు తీసే కారు, రెండవది నెంబరు బిళ్ళల్ని అటూ యిటూ తిప్పుతూ ఆడుకునే ఒక పజిల్. నా తరువాత నలుగురు చెల్లెళ్లకి ఈ పాటి అదృష్టం కూడా లేకపోయింది.

సరే… ఆటలు ఇంటిలోకన్నా బయటే ఎక్కువగా ఆడుకునే వీలున్న ఆ రోజుల్లో, ఊరిలో గడిపిన అదృష్టం వలన ఆ లోటు ఎన్నడూ పెద్దగా తెలియలేదు.

అలా బయట ఆడుకున్న ఆటలలో నలుగురు స్నేహితులతో కలిసి ఆడే దాగుడు మూతలు, కబడ్డీ, చిర్ర -గొనె (బిళ్ళంగోడు) లాంటి ఆటలు కాక, చిన్నతనంలో నేను ఒంటరిగా ఆడుకుని ఆనందించిన ఆట ఒకటి వుంది . అది – రెండు వర్షాలు పడిన తరువాత ఝామ్మని ఎగురుకుంటూ వొచ్చే తుమ్మెదలని పట్టుకుని, వాటి తోకలకు దారం కట్టి, అవి ఎగురుతూ వుంటే ఆనందించడం … అన్నట్టు, మా వూరిలో (వరంగల్ లో) తుమ్మేదని ‘దువ్వెన’ అని పిలిచేవాళ్ళం.

ఎన్నెన్ని తుమ్మెదలు … రంగు రంగుల తుమ్మెదలు … కొంచెం బలిష్టంగా వుండే నీలి రంగు తుమ్మెదని పట్టుకుంటే ఆ ఆనందమే వేరు …. అన్నం తినేందుకు రమ్మని అమ్మ కేక వేస్తే , ఆ తుమ్మెదని అలాగే పట్టుకెళ్ళి, మంచం కోడుకి కట్టి వేస్తే, ఆ తుమ్మెదలని అట్లా బాధ పెట్టొద్దని నాయనమ్మ కోప్పడడం, కాసేపు వినినట్టు నటించినా తిరిగి మరొక తుమ్మెద వేటలో పడడం …

ఇప్పటికీ ఎప్పుడు ఏ తూనీగ కంట పడినా నా బాల్యం జ్ఞాపకం వొస్తుంది …. నా బాల్యంతో పాటే, ఆ తదనంతర కాలంలో నేను చదివిన ఒక గొప్ప కవిత ‘తూనీగ ‘ కూడా ! మొదటి సారి, ‘స్మైల్’ రాసిన ఈ ‘తూనీగ’ కవిత చదివినపుడు నాకు రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు. అప్పటి నా ఆనందం కోసం నేను వేటాడి, వేటాడి హింసించిన తూనీగల జ్ఞాపకాలే ఆ రాత్రంతా !

(స్మైల్ – కవి / కథా రచయిత)

‘తూనీగ’ కవిత ‘వేళ్ళు తొండలై పోయేవి తూనీగ దొరికే దాకా’ అన్న వాక్యంతో మొదలవుతుంది, గుండెని సర్రున కోసేస్తూ … అక్కడి నుండి ముందుకు వెళ్ళీ , వెళ్ళీ ముగింపుకి వొచ్చేసరికి ఒక్కసారిగా మనసు భారమై పోతుంది … అలా, నాలాగ తూనీగలని వెంటాడి పట్టుకుని ఆటలాడిన అనుభవాలు మీ జీవితం లో కూడా వుండి వుంటే-

“వేళ్ళు తొండలై పోయేవి తూనీగ దొరికే దాకా
మేఘాలు మొహాలు చూసుకునే పచ్చని చెరువు నీట్లో
పచ్చిక గరువుల్ని నేవరేసే గేదెల కొమ్ముల మీద
సాయంత్రపు సూర్యుడితో పాటు
గాలి సర్దాగా కూచున్నట్టు గుంపులు గుంపులుగా తూనీగలు
ఆశగా చూస్తుండేవి నా వేళ్ళు తొండలై పోయి
ఇంద్ర ధనుస్సు వేళ్ళ చివర రెపరెపమన్నట్టుండేది
తూనీగ తోక పట్టుకున్నపుడు
రంగులోకాల నీడ నున్నటి అద్దాల కళ్ళలో మిల మిలా మెరిసేది
చూసేస్తున్నానని కాబోలు నా అరిచేతిని కరిచేది తూనీగ మెత్తటి కసి దవడల్తో
వొదిలే వాణ్ని కాదు … వోదిల్తే
నే మనసుతో తప్ప ఎగరలేని ఎత్తులకి మళ్ళా
గాలిలో రెక్కల చేపల్లే ఎక్కడికో ఈదుకు పోతుందని
తోకకి దారం కట్టి వొదిలే వాడిని
గింజుకునే మా కుక్క పిల్ల మెడకి పటకా మల్లే -
ఓ కాస్త ఎత్తుకి ఎగిరి దారపు బరువుకి
చడీ చప్పుడు లేకుండా కింద పడిపోయేది
అక్కయ్య జడ లోంచి రాలిన కనకామ్బరవల్లే
వెర్రి ఆనందంగా వుండేది నాకు – రెండో క్లాసు లోంచి
మూడో క్లాసుకి ఎగిరినప్పట్లా , దుమ్ములో చిలుం పట్టిన బేడ బిళ్ళ
ఎవరిదో నాకు దొరికినప్పట్లా, మా అన్నయ్య నాకివ్వని వాడి బంతి
పగిలిపోయి ఎగరనప్పట్లా
నా సంతోషపు రూపం ఆ సన్నటి దారం అప్పుడు
చీకటి పడేది యింటికెల్లాలి
తూనీగా వొదిల్తే వెళ్ళిపోతుంది
నా సంతోషం నా నుంచి ఎగిరిపోతుంది
అది అలాగే వుండిపోవాలని తహ తహ
తుమ్మ ముల్లుకి తూనీగని శిలువ వేసేసా కదలకుండా మెదలకుండా
బాధకి అరుపులు లేవు – రెక్కల రెపరెపలు తప్ప
తూనీగ చచ్చిపోయింది
ముళ్ళు మాత్రం అలాగే వుంది – మొన మీద గుచ్చుకు వున్న గుండెతో
నా గుండెతో నా గుండెతో నా గుండెతో “

‘మేఘాలు మొహాలు చూసుకునే పచ్చని చెరువు నీట్లో’ …. ‘సాయంత్రపు సూర్యుడితో పాటు గాలి సర్దాగా కూచున్నట్టు గుంపులు గుంపులుగా తూనీగలు ‘…. ‘ఇంద్ర ధనుస్సు వేళ్ళ చివర రెపరెపమన్నట్టుండేది తూనీగ తోక పట్టుకున్నపుడు’ …. ‘గాలిలో రెక్కల చేపల్లే ఎక్కడికో ఈదుకు పోతుందని’ ……. ఎన్నెన్ని అందమైన ఊహలు చేసాడీ కవి ఈ కవితలో! … బాల్యమంటే ఊహలే కదా … ఊహల్లేని బాల్యం వుండదు కదా !

‘రంగు లోకాల నీడ నున్నటి అద్దాల కళ్ళలో మిల మిలా మెరిసేది’ అంటున్నాడు. కవీ! … అలా మెరిసేది తూనీగ కళ్ళలో మాత్రమే కాదు కదూ!… ఆ కళ్ళు తూనీగవి మాత్రమే కాదు కదూ! ఒక సన్నటి దారం లో కూడా గొప్ప సంతోషాన్ని చూసుకున్న రోజులు కదా అవి !

ఈ ఆనందం ఇలా నిలిచి ఉండాలనే ఒక వెర్రి ఆశతోనే కదా తూనీగని అలా శిలువ వేసింది …. కవీ! … నువ్వు పలవరించింది తూనీగని మాత్రమేనా? …. మరణించింది తూనీగా మాత్రమేనా? … ఈ ‘ఎలిజీ’ తూనీగ కోసమేనా? … చూస్తూ ఉండగానే మాయమై పోయిన బాల్యం కోసమా?

నిజమే … ఈ బాధ ఎవరికీ వినిపించదు … ఇక్కడ అందరిలోనూ తుమ్మెద జ్ఞాపకాలకు సంబంధించిన బాధ ఒకటి సుళ్ళు తిరుగుతోంది ….

నిజమే …. ‘బాధకు అరుపులు లేవు – రెక్కల రెప రెపలు తప్ప’

 

(స్మైల్ కవితా సంపుటి ‘ఒఖడే’ నుండి)