కిటికీలో ఆకాశం

మన చెవుల ముందు మోగుతోన్న డప్పు – సతీష్ చందర్ ‘ఒక జననం వాయిదా’

నవంబర్ 2013

‘కులం’ అనే మాటకు, ముఖ్యంగా ‘అంటరాని కులం’ అనే మాటకు సంబంధించిన స్పృహ నా జీవితంలో ఎప్పుడు కలిగింది అని తవ్వుకుంటూ వెళితే, నా చిన్నతనం లోని రెండు సంఘటనలు జ్ఞాపకం వొస్తాయి.

మొదటి సంఘటన జరిగినపుడు నేను మూడో తరగతిలో వున్న జ్ఞాపకం!

నాకు పదిహేనేళ్ళ వయసు వొచ్చే వరకు, వరంగల్ లోని రైల్వే గేటు అవతల వుండేవాళ్ళం. మేముండే ఏరియా దాటి ముందుకు వెళితే, అక్కడొక హరిజన వాడ వుండేది. అప్పుడు మా తాతమ్మ (నాన్న వాళ్ళ అమ్మమ్మ, ‘వెంకమ్మ’) ఇంటి దగ్గర గారెల్లాంటివి చేసి అమ్మేది. చిన్న దుకాణం కావడం వలన అటుగా వెళ్ళే వాళ్ళు మంచి నీళ్ళ కోసం మా ఇంటి దగ్గర ఆగే వాళ్ళు.
ఒక సారి, ఎవరో ఇంటి ముందర నిలబడి మంచి నీళ్ళు కావాలని అడిగితే, నేను నీళ్ళ చెంబు తీసుకు వెళ్లి అతడి చేతికి యిచ్చాను. అంతే, లోపలున్న మా తాతమ్మ వడి వడిగా వొచ్చేసి, చెంబుని లాగేసుకుని, ‘మాదిగోల్లకు అట్ల చెంబు చేతికిస్తవా ? … ఇట్ల దోసిట్ల పోస్తే చాలు’ అని నన్ను కోప్పడింది.

రెండవ సంఘటన నేను ఏడవ తరగతిలో వున్నపుడు జరిగింది. ఒక ఆదివారం, మా వీధికి దూరంగా వుండే ‘కృష్ణ కాలనీ’ లో వుండే నా మిత్రుడి ఇంటికి ఆడుకోవడానికి వెళ్లాను. అప్పుడు గేటు తీసుకుని లోనికి అడుగు పెట్టబోతూ వుండగా నా మిత్రుడి తాత గారు నన్ను అక్కడే ఆపేసి ‘మీదే కులం?’ అని అడిగారు. నా మిత్రుడూ, నేనూ బిక్క మొహాలేశాము కాసేపు. అప్పటికి మేము ‘ఫలానా కులం వాళ్ళం’ అన్న పరిమిత జ్ఞానం అబ్బి వుండడం వల్ల ఆ తాత గారికి చెప్పాను. అప్పుడు ఒక్క క్షణం అనిపించింది – నేను నా చిన్నతనం లో మా తాతమ్మ మందలించిన కులం వాడినయితే గనక, ఈ తాత నన్ను లోపలికి రానిచ్చే వాడు కాదు గదా అని!

జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న తరువాత కూడా, ఈ దేశం లో ఒక దళితుడు ఇంకా ఎన్ని అవమానాల భారాన్ని మోస్తూ వుంటాడో, ఎంతటి మానసిక క్షోభని అనుభవిస్తూ వుంటాడో, మనం దళితులుగా పుడితే తప్ప అర్థం కాదు. ‘ఈ రోజుల్లో కులాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు’ అని పెద్ద మాటలు చెప్పే వాళ్ళు కూడా దళితుల పట్ల ఎంత ఏహ్యమైన ఆలోచనలు కలిగి వుంటారన్నది వాళ్ళ ఆంతరంగిక లోకం లోకి తొంగి చూస్తే తప్ప అవగతం కాదు. నిజానికి అలాంటి మహానుభావుల భాషణలన్నీ ‘ప్రేమ / పెళ్లి గీత’ అవతలి వరకే ! … గీతకి ఇవతల వాళ్ళ, వాళ్ళ కులాలు / ఉప కులాలూ కడు క్షేమం! … గాంధీ మహాత్ముడంతటి మనిషి కూడా 1920 ల వరకూ ఆత్మ వికాసానికి హిందూ సమాజం ‘వర్ణాంతర వివాహం’ పైన విధించిన నిషేధం తప్పని సరి అని విశ్వసించాడు. తన జీవిత చరమాంకం లో, అంబేడ్కర్ , గోరా ల మాటలతో ప్రభావితమైన తరువాత, కుల వ్యవస్థ కూకటి వేళ్ళతో పెకలించ బడాలంటే సవర్ణులు – అస్పృశ్యుల నడుమ వివాహాలు జరగవలసి వుందని ప్రచారం చేయడం ప్రారంభించాడు!

తెలుగు కవిత్వంలోకి ‘దళిత కవిత్వం’ ఒక సునామీ లా దూసుకు వొచ్చిన కాలంలో వున్నందుకు గొప్ప సంతోషంగా వుంటుంది నాకు. అప్పటిదాకా వున్న కవిత్వ భాషనీ, ప్రతీకలనీ ‘దళిత కవిత్వం’ బదా బదలు చేసింది. ఊరి బాధలనీ, ఊరి గాధలనీ, ఊరి భావాలనీ ‘మర్యాదస్తుల భాష’ లో చదవడం అలవాటైన తెలుగు కవిత్వాన్ని ‘వాడ’ ఆక్రమించి, తన చెవుల్లో సీసం పోసిన ఊరి చెవులు దద్దరిల్లేలా డప్పు మోగించింది. మద్దూరి నగేష్ బాబు, తెరేష్ బాబు, ఎండ్లూరి సుధాకర్, సతీష్ చందర్, శిఖామణి, ఇంకా చాలా మంది దళిత కవులు, చాలా మంది దళితేతరులకు తెలియని, అనుభవంలో లేని దళిత జీవితాన్ని, క్షోభను కవిత్వం చేసారు. ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా పట్టించలేక పోయిన దళితుల జీవితాన్ని, వారి అవమానాల చరిత్రనీ ప్రతిభావంతులైన దళిత కవులు తమ కవిత్వం ద్వారా రికార్డు చేసారు-

అప్పటి కవితలలో నన్ను చాలా కాలం వెంటాడిన కవిత, సతీష్ చందర్ రాసిన ‘ఒక జననం వాయిదా’. నిజానికి, అప్పుడు వెలువడిన కవిత్వం లో నన్ను వెంటాడిన కవితలు చాలానే వున్నాయి. అయితే, ‘ఒక జననం వాయిదా’ కవితని ఇక్కడ నేను ప్రస్తావించడానికి కారణం, ఈ కవితలోని దళితుడు తర తరాలుగా తనని అవమానించిన హిందూ సమాజాన్ని ప్రత్యక్షంగా దూషించడు. అన్ని అవమానాలనూ తట్టుకుని, జీవితంలో ఒక సౌకర్యవంతమైన స్థితికి చేరుకున్నానని భావించే దశలో కూడా తర తరాల తన అవమానాల చరిత్ర తననెలా వెంటాడుతూ వున్నదో అద్దం ముందు నిలబడి వున్న తన దేహం లోని ఒక్కొక్క అంగం ప్రతీకగా చెప్పుకుంటూ పోతాడు. కవితని ‘ నా వారసుడెప్పుడూ ఒకే ఒక ప్రశ్న వేస్తాడు /’నాన్నా … నేనెప్పుడు పుట్టాలి?’ అన్న ఎత్తుగడతో ప్రారంభించి, దేహం లోని ఒక్కొక్క అంగం సాక్షిగా తర తరాలుగా తనని అవమానించిన అమానవీయ సమాజాన్ని దృశ్యమానం చేసి, చివరకొచ్చేసరికి ‘శబ్ద స్రావం జరిగి ఒక జననం వాయిదా పడుతుంది’ అని ముగిస్తాడు.

సతీష్ చందర్ వాక్యం అంటేనే రెండు వైపులా పదునైన వ్యంగ్యం వున్న చురకత్తి. చాలా సార్లు అది కసుక్కున దిగిపోతుంది.
‘ఒక జననం వాయిదా’ కవితలో ఆ వాక్యాలు మన మనసులోకి దిగిపోయి, గుండెని మెలిపెడతాయి-
నిజానికి ఈ కవితకు నా బోటి వాడి వ్యాఖ్యానం అక్కరలేదు. కావలసిందల్లా దళితుడు డప్పు చేత పట్టి తన కథని గానం చేస్తూ పోతున్నపుడు ఒకింత ప్రేమతో, కొంచెం దయతో వినగలిగే మనసు చాలు!

ఒక జననం వాయిదా

నా వారసుడెప్పుడూ ఒకే ఒక ప్రశ్న వేస్తాడు
‘నాన్నా … నేనెప్పుడు పుట్టాలి?’
నిలువుటద్దం ముందు నిల్చుంటాన్నేను
అవయవాల దొంతర కాదు
అవమానాల పరంపర కనిపిస్తుంది

ఒత్తయిన ఉంగరాల జుత్తు చూసుకున్నపుడు
కత్తులూ కత్తెరలూ నిరాకరించిన
మా ముత్తాత శిరోజాలు
ముడులు ముడులుగా గుర్తుకొచ్చి
కరకు దువ్వెనతో కర్కశంగా సాఫు చేస్తాను

రెండు చెవులూ రెండు ప్రమిదల్లాగా
జ్వలన సంగీతాన్ని దాచుకొంటున్నపుడు
నేరం చేసినట్లు నాలో నేను భావించి
ఏ సీసమూ పడకుండా
కర్ణభేరుల మీదకి తలను దువ్వుకుంటాను

ముడుచుకుపోయిన పెదవులు
మెల్లిగా నవ్వబోయినపుడు
నా పూర్వీకుల భగ్న ప్రేమలకు బహుమానాలుగా
సవర్ణ సుందరీ మణులిచ్చిన విష పాత్రలు జ్ఞప్తికి వొచ్చి
నా ప్రతిబింబం మీద నేనే ముద్దులు కక్కుకుంటాను

నిండు చేతుల చొక్కాకి గుండీలు పెట్టుకున్నపుడు
ఊరి వెలుపల వరకూ నా తల్లి గుండెల్ని కప్పుకున్న
వాయు వస్త్రాలు స్ఫురణకు వొచ్చి
నా భుజాల్ని నేనే మార్చి మార్చి తడుముకుంటాను

నాజూకైన బెల్టుని నడుంకి బిగిస్తున్నపుడు
నా చరిత్రను నా చేతనే తుడిపించదానికి
నా వెనకెవరో చీపురు కడుతున్నట్లే భ్రమించి
నా చుట్టూ నేనే రంద్రాన్వేషణ చేసుకుంటాను

మెరిసే బూట్లకు లేసులు కడుతున్నపుడు
నేల తల్లి మాత్రమె ముద్దాడిన నాన్న నగ్న పాదాలు
అనుగాయలతో మెల్లిగా మూలిగినట్లనిపించి
నా కాళ్ళకు నేనే నమస్కరించి నిలబడతాను

చిట్ట చివరిగా తల యెత్తి మీసాలు కాస్త మెలి వేద్దామనుకున్నపుడు
‘రిజర్వేషన్ గాళ్ళకి పౌరుషాలు కూడానా?’ అన్న
ఆఫీసులో అధికారి ప్రతిభా పాటవాలు అడ్డొచ్చి
భూతకాల వర్తమానాన్ని మింగలేక గుటకలు వేస్తాను

నా వారసుడప్పుడు ఒకే ప్రశ్న వేస్తాడు
‘నాన్నా! నేనెప్పుడు పుట్టాలి?’
నిలువుటద్దం నుంచి తొలగిన నేను
గోడకి వేళ్ళాడదీసిన మా తాత డప్పు మీద
అదే పనిగా వాయిస్తాను
శబ్ద స్రావం జరిగి ఒక జననం వాయిదా పడుతుంది

హిందూ సమాజం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోని ఒక విషాద వైచిత్రి ఏమిటంటే, మంగలి, చాకలి లాంటి బహుజన కులాల విషయం లో అగ్ర కులాలు, యితర బహుజన కులాలు కూడా దూరాన్ని పాటిస్తే, ఈ మంగలి, చాకలి లాంటి కులాలు దళితులని దూరంగా పెట్టడం. ఆ అవమానాన్నే ‘కత్తులూ కత్తెరలూ నిరాకరించిన మా ముత్తాత శిరోజాలు’ అంటున్నాడు కవి.

ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కొన్ని వేల యేళ్ళుగా ‘అస్పృశ్యులు’ అన్న భావనని దళితులలో నూరి పోసి, ఇక ఇప్పుడు ఎవరూ చెప్పకుండానే, ఒత్తిడి చేయకుండానే, దళితుడు తనకు తానే ‘అవును నేను అంటరాని వాడిని … నేను చదవడానికీ, వినడానికీ అర్హుడిని కాను’ అని అనుకునే స్థితికి నెట్టివేయడం … అందుకే ‘జ్వలన సంగీతాన్ని దాచుకొంటున్నపుడు /నేరం చేసినట్లు నాలో నేను భావించి, ఏ సీసమూ పడకుండా’ అంటున్నాడు.’భారత రత్న’ అంబేద్కర్ లాంటి మహానుభావుడి చొరవ వల్ల ప్రజాస్వామ్య దేశంలో దళితులకు ఎదిగే అవకాశాలు లభించినా ఇప్పటికీ మారని స్థితిని ఎత్తి చూపుతూ ‘రిజర్వేషన్ గాళ్ళకి పౌరుషాలు కూడానా?’ అన్న అధికారి మాట గుర్తుకొచ్చింది అంటున్నాడు.

చివరికి, తన తదనంతరం ఈ అవమానాల భారాన్ని మోయవలసిన తన వారసుడిని ఈ లోకం లోకి అనుమతించలేని స్థితిలోకి నెట్టిన ‘సవర్ణ సమాజం’ గుమ్మం ముందు నిలబడి, దాని చెవులు పగిలి పోయేలా తన తాత డప్పు తీసుకుని అదే పనిగా వాయిస్తున్నాడు … వినిపిస్తోందా మనకు ?

-కోడూరి విజయకుమార్
04 నవంబర్ 2013