కథలోపలి కథ!

అమాయకురాలు

ఫిబ్రవరి-2014

(కొకుగారి ‘అమాయకురాలు’ కథ చదివిన తరువాత)

వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?

భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. ‘తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?’ అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ, ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద, చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. ‘నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు, ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.

భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో, ఏమో, మరీ పసిది ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.

కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ, కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ, అందరు సంసార స్త్రీలకు మల్లే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.’ఊహల్లోనే ఏ సుఖమైనా వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు’ అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.

భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ.భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు.పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథా ప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.

భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.

ఏదైతేనేమి భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి.

అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.

పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.

బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన ‘ఉచ్చిష్టం’ ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.’వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేసా’ అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రిదగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ, తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు.

వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.

ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు.ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత, శాఖాంతరం కాకపోవడం మీద కొంత, ఎలా ఎవరిమీదో, వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా, కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని, మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియా పరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం ఆడదై పుట్టడం, వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.

ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫునుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు, కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే, చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ ‘అమాయకురాలు’ కథలో కొడవటిగంటి వారు. ఎంత నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటేతప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.

ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని, మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.

ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం, శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా తడిగానే ఉంచుతుంది.
కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు, వాక్యాలలోని ముళ్ళు ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.

మీకోసం ఆ కథ:

http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/amayakuralu.pdf