కిటికీలో ఆకాశం

“కాలీ దునియాఁ” ని నిలదీసిన కవిత్వం

ఏప్రిల్ 2014

‘కవిత్వం వేరే ఎక్కడో లేదు / నిస్సహాయుడు నిరాయుధుడైన ఒక గిరిజనుడు లేదా / ఒక దళితుడు మాట్లాడేదంతా కవిత్వమే’ అన్నాడు అజంతా. బహుశా ఆయన బతికి వుండి వుంటే, ‘మరీ ముఖ్యంగా, మతోన్మాదుల దాడిలో గాయపడిన ఒక ముస్లిం స్త్రీ ‘ అని కూడా చెప్పేవాడేమో!

‘జాతీయ వాదం’ అంటే ‘హిందూ మత వాదం’ గా మారిపోయిన దేశంలో, పొరుగున వున్న పాకిస్థాన్ ని శత్రుదేశం గా చూడడం మొదలు పెట్టిన నాడే ఈ నేల మీద ముస్లిముల్ని ఆ శత్రుదేశపు ప్రతినిధులుగా, ఎప్పటికైనా అక్కడి నేలకు తరిమి వేయవలసిన ఒక పర జాతిగా చిత్రించడం మొదలయింది. సమాధులలో గతించిన చరిత్రను తవ్వి పోసి, అప్పటి దాడులకు, ఇప్పటి అమాయకులని ముద్దాయిలుగా చూపి కవ్వించే చర్యలు మొదలైనాయి.

బలమైన జాతి, బలహీనమైన జాతి పైన ఎప్పుడు ఎక్కడ దాడులు చేసినా ఆ దాడులలో ముందుగా గాయపడేది స్త్రీలే! కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట గ్రామాలలో దళితుల పైన జరిగిన దాడులైనా, గుజరాత్ రాష్ట్రంలో ముస్లిముల పైన సాగిన మారణ కాండ అయినా, అమానవుల దాడులలో ముందుగా బలైపోయింది స్త్రీలే!

ఇంతకీ, ఈ దేశంలోని ముస్లిం స్త్రీలు ఎందుకు ఇంతగా ఒక అభద్రతా భావానికి లోనవుతున్నారు ?

ఒక హిందువుగా, ఒక ముస్లిం స్త్రీ భయం / బాధ ఏమిటో కొద్దిగానైనా అర్థం కావాలంటే, ఒక్క సారి షాజహానా రాసిన ‘కాలీ దునియా‘ కవిత చదవాలి. నిజానికి, ఒక వామ పక్ష భావజాలం ఉన్న కవిగా రాజ్యాన్ని ప్రశ్నించడం కన్నా, ఒక దళితుడిగా అగ్ర వర్ణ హిందూ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం కన్నా, ఒక ముస్లిం గా, మరీ ముఖ్యంగా ఒక ముస్లిం స్త్రీగా హిందూ ఫాసిజాన్ని ప్రశ్నించడానికి గొప్ప ధైర్యం కావాలి. గుడిహాళం చెప్పినట్టు, ‘పద్యం రాయాలంటే గొప్ప సాహసం కావాలి!’.
ఆ సాహసం, తెగువ, తన ధర్మాగ్రహాన్ని పదునైన కవిత్వం చేయగలిగిన నేర్పు పుష్కలంగా వున్న తొలి ముస్లిం వాద కవయిత్రి షాజహానా. గమనించవలసిన అంశం ఏమిటంటే, హిందూ ఫాసిస్టు చర్యలని ప్రశ్నించడాని కన్నా ముందు ముస్లిం స్త్రీలని ‘పరదాల పిరమిడ్ లలో ప్రాణం లేని మమ్మీలుగా’ చేసిన చాందస సంప్రదాయాలని ప్రశ్నించింది. ‘అరబ్ కబేలాలో ఆడదాని మాంసానికి ఇంత రేటు’ అని నిర్ణయించే కసాయితనాలని నిలదీసింది. ‘ఖౌసే ఖిజా’ అన్న కవితలో ‘చీకటి బుర్ఖాని తొడుక్కున్న రాత్రి కూడా వేకువ కోసం ఎదురు చూస్తుంది’ అని సున్నితంగా తన వేదనని పలికిన కవయిత్రి, ‘ఎవరితోనో లేచిపొయ్యి / ఎక్కడ మత కాలుష్యాన్ని చేస్తాననేగా / గోషాల చెరసాలలు ‘ అని కటువుగా తన ఆగ్రహాన్నీ వ్యక్తపరిచింది.

2

‘కాలీ దునియా ‘ కవిత, ముందే ప్రస్తావించినట్టు, 2002 సంవత్సరంలో, గుజరాత్ లో ముస్లిం ల పైన, మరీ ముఖ్యంగా ముస్లిం స్త్రీల పైన జరిగిన అమానవీయ దాడుల పట్ల ఆగ్రహాన్ని ప్రకటిస్తూ సాగిన కవిత. ‘కాలీ దునియా’ (నల్లని / చీకటి లోకం ) అన్న శీర్షికని పెట్టడం లోనే షాజహానా తన నిరసన ప్రకటనని పతాక స్థాయికి తీసుకు వెళ్ళింది ఈ కవితలో. నల్లని బురఖా ధరించిన ముస్లిం స్త్రీ కి, బయట లోకం నలుపు రంగులో కనిపిస్తుంది అన్న భావం ఒక వైపు, ఈ అమానవీయ దాడులకు పాల్పడి దీనిని ఒక బతకలేని చీకటి లోకం చేసారన్న భావం మరొక వైపు స్ఫురించేలా చేసిన శీర్షిక యిది.
పద్యం రాయడానికే కాదు, కొన్ని సార్లు, ఒక భయానక మారణ కాండని మన కళ్ళ ముందు, దాని బాధితుల ఆర్తనాదాలతో సహా నిలిపే ఒక పద్యం చదవడానికి కూడా ఒకింత సాహసం కావాలి. షాజహానా రాసిన ఈ ‘కాలీ దునియా ‘ కవితని చదవడానికి మరింత సాహసం కావాలి!

కాలీ దునియా – షాజహానా

బురఖా వేసుకున్నపుడు
ప్రపంచం నల్లగ అవుపించేది
బుర్ఖాలని చీల్చేసి
శరీరాలతో సహా తగల బెడుతున్నపుడు
బిత్తర పోయిన ప్రాణాలకు ఒక్క సారిగా
ఈ దునియా మొత్తం నల్లగా … ఎండిన రక్తం ముద్దలా
ఇప్పుడు బురఖా వేసినా వేయకున్నా
ప్రపంచమంటే కాషాయ శిల
కత్తి మొన
పొడుచుకొచ్చిన పురుషాంగం
ఇంత క్రూరత్వం దాగుంటుంది అనే కదా
మమ్మల్ని బయటికి రానివ్వడం లేదంటున్నారు
ఈ భయానక నిజం స్వప్నమైతే
కళ్ళు , బూసుల్ని దులుపుకున్నట్టు తుడిచేసేవి
కానీ, నిజం నిప్పై కాల్చింది
నీరై ముంచింది
కాషాయమై దింపుడు గల్లెం లేకుండా చేసింది
ప్రపంచం ‘మాయిపొర’ లో ఇరుక్కుని
ఉమ్మ నీరు తాగి
ఇవ్వాళ కాషాయం కక్కుతోంది

3

మా కాళ్ళ సందుల్లోంచి వొచ్చి
మమ్మల్ని బరిబత్తల పరిగెత్తించారు
నీ యింట్లో ఆడది కూడా
రహస్యంగా మా కోసం కన్నీళ్లు కార్చి వుంటుంది
మగ నా కొడుకుల ఊపిరి
బయటికి రాకుండా నొక్కేస్తే
పీడా పోతుందని ఒక్క సారైనా
మీ అమ్మ అనుకునే వుండాలి
స్త్రీకి పురుషుడి నగ్నత్వం ఎంత పాతో
అరాచకం అమానుషం క్రూరత్వం అంతే పాత
సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్ని
నీకూ నాకు మధ్య రక్త సంబంధం లేదంటావా ?
గుండెల్ని పెకిలించి
పొట్టలు చీల్చి
యోనుల్లో ఆయుధాలు పొడిచి
ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకుని ఉండొచ్చు
కానీ ‘నన్ను’ హత్య చేయలేవు
అనంతంగా సాగే జీవనదిని
నేను బతకడమే కాదు
నిన్ను పుట్టించి బతికించేది నేనే
అయినా స్త్రీ తప్ప మగవాడిని క్షమించేది యెవరు?
ఎప్పటికీ ప్రపంచం నా రొమ్ము తాగుతున్న బిడ్డే !

ఒక స్త్రీ గా, అందులోనూ అనుక్షణం అభద్రతా భావంతో జీవించవలసిన సందర్భం లోకి నెట్ట బడిన ఒక ముస్లిం స్త్రీగా ఎంతగా దుఃఖపడి వుంటే తప్ప, ‘ఇప్పుడు బురఖా వేసినా వేయకున్నా / ప్రపంచమంటే కాషాయ శిల / కత్తి మొన / పొడుచుకొచ్చిన పురుషాంగం’ అన్న వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తుంది?

ఒక సాటి స్త్రీగా, తమ పైన దాడి చేసిన ఆ అమానవుల తల్లులైనా తమ బాధని అర్థం చేసుకున్టారన్న ఆశతోనే కదా – ‘మగ నా కొడుకుల ఊపిరి / బయటికి రాకుండా నొక్కేస్తే / పీడా పోతుందని ఒక్క సారైనా / మీ అమ్మ అనుకునే వుండాలి’ ఇక్కడ కవయిత్రి అంటున్నది!
‘అల్లా ఒక్కడే దేవుడు’ అని నమ్మే ఇస్లామీయ విశ్వాసంతో, దాడులకు పాల్పడిన అమానవులను ‘సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్ని / నీకూ నాకు మధ్య రక్త సంబంధం లేదంటావా?’ అని అమాయకంగా ప్రశ్నిస్తోంది! ఇంత వేదననీ పంచుకుని, ఇంత ఆగ్రహాన్నీ ప్రదర్శించి, చివరికి, ‘అయినా స్త్రీ తప్ప మగవాడిని క్షమించేది యెవరు? / ఎప్పటికీ ప్రపంచం నా రొమ్ము తాగుతున్న బిడ్డే !’ అంటూ ఆ అమానవులని కూడా పెద్ద మనసుతో క్షమించేసి, ఒక తల్లిలా అక్కున చేర్చుకుంది.

షాజహానా! ఈ నేల పైని ఆకాశంలో మళ్ళీ ఏవో రంగులు మారుతున్న సంకేతాలు! ఈ ఆకాశంలో ఒక హరివిల్లు పురివిప్పుకోవడానికి ఇంకా ఎందరు షాజహానాలు ఎన్ని కవితలు రాయాలి?