కథాకథనం

గుండెగాటు పెట్టిపోయిన ఓ కొండకేక!

మే 2014

శిక్ష!
ఈ కథ బావుంది అనడం – తప్పు.
బావోలేదనడం ఇంకా తప్పు.
మరేమనీ అనడం?
తెలీదు… చాలా అరుదైన కథలు మాత్రమే నన్నిలాటి సందిగ్ధావస్థలోకి తోసేస్తాయి. ఇదని ఏదీ ఇతమిత్థం గా చెప్పలేని ఓ ఆలోచన్ని కలిగిస్తాయి. అగ్గిని రగిలిస్తాయి. అలాటిదే ఈ కథాను.

కటిక నిశ్శబ్దంలో – ఈ సమాజాన్ని నిలబెట్టేసి నిలదీస్తున్నట్టు, ఒక ఈదురు గాలొచ్చి, నివురూదేసి నిప్పు కణికను రూపు తేల్చినట్టు, ఈ భయంకర దురగతానికి రక్తం మరిగి, లోలోన అడవి చిచ్చు రగులుకున్నట్టు… అలా ఫీలౌతాం కథని చదువుతున్నప్పుడు, చదివాకానూ!
ఆ తర్వాత, మనసంతా చేదైపోతుంది. మళ్లా మళ్ళా గుర్తొస్తుంది. వెంటాడేస్తుంది. వేధించి పెడుతుంది.
ఇది చాలదూ? కథ, కంచికి పోకుండా, కంటి రెప్పల మీదకొచ్చి కూర్చుని మనిషిని మెలకువ చేసేందుకు!
ఇది చాలదూ? దుంగలా పడి, బండనిద్రపోతున్న లోపామయ వ్యవస్థని ఒక్క చురకతో చైతన్య పరిచేందుకు?

సరే, ఇంతకీ కథేమిటంటారా?
పోలీసూ, దొంగాట. – ఇదీ, కథలోని ముఖ్యాంశం. ఇదంతా చాలా మావూలేగా అని అంటున్నారా? కాదు. ఈ కథలో అస్సలు కాదు.

అసలైన కథేమిటంటే:
అనగనగా కొండ జాతికి చెందిన ఒక నాయక్. అతనికి సారా చేయడం, అమ్మడం మాత్రమే తెలుసు. అయితే అతను చేస్తున్న పని చట్టవ్యతిరేకం కదా.. అందుకని (పాపం) పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టేస్తారు. ఏమిటీ? అతన్ని పట్టుకుని చట్టానికప్పగించడానికి కాదు. అతన్ని చుట్టం చేసుకోడానికి. ఎలా అంటే..నాయక్ తయారు చేసే కల్తీ లేని సారా చాలా బావుంటుంది, దాని రేటూ అంతకన్నా చా..లా..బాగా వుంటుంది కనక, బేర సారాలు కుదుర్చుకోడానికన్నమాట అతన్ని పట్టుకుంటారు.
మన రచయిత మాటల్లోనే చెప్పాలంటే – ‘నువ్వింతకమ్ము..మాకింత ఇవ్వు..నీకింత మిగులు’ అనే లెక్కలు నేర్పుతారు. ఒక నీతిమంతుణ్ని చట్టం సాక్షిగా అవినీతి పరుడుగా మారచడమన్నమాట!
ఈ దొంగాటలో – అసలైన మరో దొంగడ్రామా కూడా తప్పకుండా వుంటుందని నాయక్ కి ఇలా సీన్ వివరిస్తారు పోలీసులు.

ఆ. ఏం లేదు. ఆఫీస్లో నేరాల లెక్కల్లో కెక్కడానికి (మాత్రమే) అతన్ని అరెస్ట్ చేస్తారు. అంతే. అదీ ఎప్పుడూ కాదు. ఏ మూణ్నెల్లకో, నాల్గు నెల్లకో. అదీ నిజం గా కాదు. ఉత్తొత్తిగా అన్నమాట ఈ ఆట.
నాయక్ నవ్వుకుంటూ సారా కాన్ తో వానెక్కుతాడు. సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ ‘మావూళ్లు’వాళ్ళకిచ్చేస్తాడు. హెడ్డు నించి దర్జాగా సిగరెట్టంటించుకుంటాడు. ఆ తర్వాత ఏ పెద్ద చౌక్ దగ్గరో దిగిపోతాడు. హాపీ గా ఇంటికె ళ్ళిపోతాడు.

ఇక ఇటు చూస్తే – కాన్లో సారాని పోలీసులంతా తెగ తాగేస్తారు. డబ్బు మాత్రం హోదాను బట్టి షేర్ చేసుకుంటారు. ఇదీ అక్కడ నడిచే పోలీస్సారా బాగోతం.
కథ ఇక్కడితో అయిపోతే, మీకీ కథ గురించి ఇంత ప్రత్యేకంగా నే చెప్పకనే బోదును!

ఆ తర్వాతేమౌతుందంటే:
ఆరోజూ అలాటి డ్రామాకి ఏర్పాట్లు సిధ్ధమై పోతుంటాయి.
నాయక్ అరెస్ట్ అవుతున్న నాటకం…మరి కొన్ని క్షణాల్లో తెరకెక్కబోతుండగా..సరిగ్గా రెండు క్షణాల ముందు అక్కడకొస్తుంది – నూర్జహాన్.
పేరుకు తగ్గట్టు అందగత్తె కాదు. పైలా పచ్చీసుదీ కాదు. మావూలు ఆడది. పైగా పోలియో తో కాలు చచ్చుబడ్డ కుంటిది. దానికి తోడు మొగుడి దురాగతానికి పెనమ్మీద పడి ఓ పక్క చెంపంతా కాలి పోయిన అభాగ్యురాలు.
రోజూ వచ్చినట్టె ఆ నాడూ వచ్చింది. రోజూ తెచ్చినట్టే దోసెలూ, చిట్టి వడలూ తెచ్చింది. – అమ్ముకోడానికి. కానీ.. పోలీసులొస్తున్నారన్న ఇసయం ఆమెకి జరంత కూడా తెలీదు. అదే విషమై కాటెస్తుందని ఆమె అప్పుడు ఊహించనూలేదు.
పసిగట్టిన నాయక్ – ఆమెని తరిమే లోపే పోలిసు మంద దిగిపోతుందక్కడ.
మర్చిపోకుండా గబగబా సారా కాన్ ఎక్కిస్తారు. ఆ వెనక నాయక్ ఎక్కేస్తాడు.
నిజానికి వాన్ వెళ్లిపోవాలి. కానీ, వెళ్ళదు. దుష్ట రైటరుగాడి కన్ను నూర్జహాన్ మీద పడటంతో ఆగుతుంది. ‘ఎక్కే రండా! స్పెషల్ వ్యాన్ గావల్నా నీకు?’ అంటూ వెనకనించి గట్టిగా (?) వొడిసి పట్టుకుని వాన్లోకి విసిరేస్తాడు. ( ఇక్కడ రచయిత స్పష్టంగా చెప్పకనే చెబ్తారు. ఆ రైటరుగాడు ఆమెనెక్కడ పట్టుకున్నాడన్నదీ అందరూ చూస్తూనే వున్నారని.
కుంటి నూర్జహాన్ విల్విల్లాడుతుంది. నీ కాల్మొక్కుతా దొరా విడవమంటుంది.
వాన్ పెద్దచౌక్ దగ్గర ఆగుతుంది.
నాయక్ దిగిపోతాడు.
‘నేంబోతా షారూ కాల్మొక్త..’ నూర్జహాన్ కొట్టుకుంటూనే వుంటుంది. వాన్ కదిలి వెళ్లిపోతుంది.
స్టేషనొస్తుంది.
ఎవడికి వాడు కావల్సినంత సారాని తాగుతుంటారు. ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు సీసాలు నింపుకుంటుంటారు.
మరో పక్కనుంచి, ‘పచ్చి బాలింతని. పన్నెండ్దినాలై కానుపై..నన్నిడ్సు దొరా..’ -అంటూ ఆమె చెవి కోసిన మేకలా మొత్తుకుంటూనే వుంటుంది.
రైటర్ గాడు ఆ వివరాలడుగుతూ పోతుంటాడు వాడిదైన దున్నపోతు భాషలో…అశ్లీలంగా..అసభ్యంగా. ( వాడి మాటల్ని నేనిక్కడ రాయలేను. ..చేతి వేళ్ళు సహకరించనందున.)
అంతటి అమానుషమూ అక్కడున్న అందరకీ చాలా సామాన్యమైన విషయం కాబట్టి ఎవరూ వినరు. చూడరు. పట్టించుకోరు. కాని, అక్కడే బెంచి మీద కూర్చున్న సెవెన్లెవెన్ ఇబ్రహీం..ఒక్కడే – తల పట్టుకునుంటాడు.
రైటర్ గాడు కిక్కెక్కిపోడం కోసం కాస్త సారా పట్టించి, నూర్జహాన్ ని సెల్ లోకి బలంగా ఈడ్చుకుపోతాడు. ఆ పైన బలవంతంగా..!!
కుంటి నూర్జహాన్..
పచ్చి బాలింత నూర్జహాన్
రైటర్ గాడి పశు కామానికి బలి అవుతూ..గావు కేకలతో..విలపిస్తుంది.
అక్కడున్న వాళ్లెవరికీ వినిపించని ఆ ఆర్తనాదాలు ఇబ్రహీంకి మాత్రమే వినిపిస్తాయి. ఇక వూరుకోలేకపోతాడు.
కథలో లీనమైన మనకే అనిపిస్తుంది. ఆ రైటర్ గాణ్ణి చంపేయాలని.
అలాటిది ….ప్రత్యక్షంగా చూస్తున్న – మంచిమనిషి ఇబ్రహీంకి రక్తం మరగదా? కసి పుట్టదా? పుట్టింది. వెంటనే కక్ష తీర్చుకోవాలనుకున్నాడు.
తెగించి శిక్ష వేసాడు.
కొంతలో కొంత తను ఊరడిల్లి, మనకింత ఊరటనిస్తాడు.
కానీ, ఏమిటా శిక్ష, ఏమా కథ తెలుసుకోవాలంటే..మీరు ఈ కథంతా పూర్తిగా చదివి తెలుసుకోవాల్సిందే.
నిజానికి రైటర్ గాడికది చాలా చిన్న శిక్షే. కానీ, ఇబ్రహీం తన స్థాయి కి మించిన ధైర్యంతో వాడికి పెద్ద శిక్షే విధించాడు. ఖాకీ చొక్కా వేసుకున్న ఓ కరుణాత్ముడు కనిపిస్తాడు. ఓ మానవతా మూర్తి అగుపిస్తాడు. మనలో పోలీసుల పట్ల , పోలీస్ శాఖ పట్ల గల గౌరవం పూర్తిగా చావకుండా..బ్రతికించి, బ్రతుకునిచ్చి పోతాడు.
అదీ ‘శిక్ష ‘ – కథాకథనం.
* కథాంశం నన్నెందుకు ఆకట్టుకుందంటే :
ఈ కథాంశం నన్నమితంగా ఆకట్టుకోడానికి, ఆవేదనకి గురి చేయడానికి గల ముఖ్య కారణం ఏవిటంటే,
- సోషియాలజీ లో ఒక పేపర్ అంతా కొండ జాతి వారి గురించిన సమాచారమే వుండేది. రేఫ్రెన్స్ కోసం లైబ్రరీకెళ్ళి బుక్స్ తిరగేస్తున్నప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు నన్నాలోకంలోకి తీసుకుపోయేవి. ఒక చుట్టు చుట్టుకొచ్చేవి. కొన్నిట్ని కేవలం సమాచార సేకరణ కోసం కూడా చదువుతుండే దాన్ని. రీసెర్చెర్స్ వెలికి తీసిన నిజాలు తెలుసుకుని, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి ఆలోచిస్తూ బాధ పడుతుండేదాన్ని.
సరిగ్గా ఈ కథ కూడా అచ్చు అలానే, నన్నంతకు మించిన వేదనకు గురిచేసింది.
కారణం..ఇక్కడ కథ లో- ఆ అమాయక జీవులు సజీవులై కళ్ళ ముందు కదలాడటం వల్ల. కథలోని పాత్రలు, స్వభావాలు, నూటికి నూరుపాళ్ళు అచ్చమైన కటిక నిజాలు కావడం వల్ల. ఆటవికతకు అద్దం పట్టి చూపడం వల్ల.
నిజం చెప్పాలంటే -
పోలీస్ రైటర్ గాడు – ఆ అంగవైకల్యురాల్ని వెనకనించి పట్టుకుని వేన్లోకి విసిరేస్తున్నప్పుడు..వాడి చేతుల్ని నరికేయాలన్నంత ఆవేశం కలుగుతుంది ఏ ఆడపచుకైనా!
పచ్చి బాలింత నూర్జహాన్, పాల సలపరింతల ఎద గల వొళ్ళు – వాడి ఇనప శరీరం కింద పడి, అప్పుడామె పడుతున్న నరకమంతా ప్రత్యక్షంగా చూస్తున్న భావన కలగటం వల్ల – ఏ స్త్రీ హృదయమైన స్పందిస్తుంది. కంట తడి పెడుతుంది.

మొన్నటికి మొన్న జరిగిన నిర్భయ దుర్ఘటన కూడా ఇలానే.. మనసుని దేవేసింది. చాలా రోజులు నన్ను దుఖం లో ముంచి పోయింది.

***

రచయిత గురించి :
తెలుగు రైటర్స్ లో – మనం మరచిపోలేని అతి కొద్ది మంచి రచయితల్లో ఒకరు – శ్రీ కాశీభట్ల వేణు గోపాల్.

ఈ రైటర్ – ఎంచుకునే ఇతివృత్తాలన్నీ రొటీన్ కి భిన్నంగా వుంటాయి. పాత్రలకు రంగులూ హంగులూ, హిపోక్రసీలూ ఏవీ వుండవు. సాదా సీదా గా, సహజాతి సహజం గా వుంటాయి. ఇంకా చెప్పాలంటే – అచ్చమైన మినిషిని చూస్తాం మనం వీరి అక్షరాల్లోంచి. ప్లస్ పాయింట్స్ తో మాత్రమే కాదు. మైనస్ అని మనం నిర్వచించే బలహీనతలతో సహా! – విషయాన్ని ఎన్ని కోణాలనించి అయినా కానీండీ.. ఏ మాత్రం వెరపు లేకుండా వున్నదున్నుట్టు..మనముందు పచ్చి నిజాల్ని పరిచేయగల సాహసవంతుడు ఈ రియల్ రైటర్.

కథ చెప్పే విధానం కూడా చాలా వినూత్నంగా వుంటుంది. శైలి కానీ, ఆ పొయెటిక్ భాష కానీ, ఎంచుకునే కథాంశం కానీ..దేనికదే – రచన ఒక ప్రత్యేకతను సంతరించుకునుంటుంది. వెరసి ఈ యూనిక్ స్టయిల్ కాశీభట్ల గారికి మాత్రమే చెల్లు అని అనిపించుకుంటుంది. పాఠకుల మనసుల్లో ముద్రించుకుపోతుంది.
కథలందరూ రాస్తారు. కానీ కొందరివే, సొంత సంతకాలై వుంటాయి.
గ్రేట్ కదూ! రచయిత ఎంతైనా అభినందనీయులు.

***

ముగింపు:
గుండెగాటు పెట్టి పోయే ఈ కథ – నిజం గా జరిగిన కథే అని చెబుతారు రచయిత.
అంతే నిజంగా మీరూ చదివి, మీ విలువైన అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చగలరని ఆశిస్తూ, అభిలషిస్తూ, మళ్ళీ ఇలానే మిమ్మల్ని మరో కథతో కలుస్తానని మాటిస్తూ… సెలవ్ మరి!?

 

కథ:


శిక్ష
- కాశీభట్ల వేణుగోపాల్


ఏవేవో భ్రమాతరంగాలు స్పృహా మగతల కొసలను పట్టుకు వేళాడుతూ..
గాంధీ మొహమ్మీద ఓ బొద్దింక!
క్రైమ్ లిస్టుల నల్ల బల్లమీదో బల్లి..గాంధీ మొహం బొద్దింకన్కర్చుకునేందుకు మొహమ్మీద బొద్దింక వాలినా బోసి నవ్వు నవ్వుతున్నాడు గాంధీ.
రేపుల్లేవు..నిల్..కొట్టివేత గీత..మా పోలీసుల్చేసే రేపులు నేరాలు కావు!
చెయిన్ స్నాచ్లు..మూడొందలోటి..!
హెచ్ బీలు..నూటెనభై తొమ్మిది..!
హింసల్లిస్టు చదివేలోపల గాంధీ మొహ్హమ్మీంచెగిరి రైటర్ టేబిల్మీది, పోలీస్ టోపీ మీద వాలింది బొద్దింక. గాంధీ ‘హా’ అనే లోపల పోలీస్ టొపీని భరించలేక బొద్దింక మళ్ళీ గాంధీ బొమ్మమీదే వాలింది.
బొద్దింక..గాంధీ..పోలీస్ టోపీ…!
జుగుప్స…అహింసా..జుగుప్స..
ప్రాణాలున్న శిలాజం..ప్రాణం పోయిన రాజకీయ పవిత్రత..ప్రాణాలు తీసే పాడు కంపూ!
నాలుక మందంగా ఉంది. కళ్ళు అంటుకుపోయినయ్.
మాసిన తెల్లచొక్కా, ఖాకీ పాంటు,
సస్పెండెడు ఎస్సైఫౌండండర్ద ఇన్ ఫ్లుయన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆన్ డ్యూటీ..డీసీపీ సికిందర్గాడు చేసిన లాకప్ మర్డర్కి తాను బలి!
అండర్ద ఇన్ ఫ్లూయన్సాఫ్ ఆల్కహాల్ ఓహోహో…! అప్పుడేమో తెలీదు…ఇప్పుడొంటినిండా నరనరానా అదే!
చిన్నగా వణుకుతూ వణుకుతూ వెళ్ళి పాయిఖానాల ముందున్న నల్లా దగ్గర మొహం కడుక్కుంటుంటే..
లంజెకొడ్కు యెప్పుడ్సస్సడో గానీ మన సీసీయస్కీ దామదైండు గద బై..గా డిసీపీ గానీ కూనీ కోసరానికి మన్తోని గీ తాగుబోతోన్ని సాకిస్తున్నరు!’ గట్టిగా అంటూ విసుక్కుంటున్నాడు రైటర్.
“ఊకో సార్! ఆయ్నకి , మనం బెట్టుడేముంది గనక..పెద్దసార్లకి బొయ్యెదాన్ల గీయన కిస్తున్నం!” లెవెన్ జీరో టూ వెంకటేశ్వ్రర్లంటున్నాడు.
మొహం కడుకుని లోపలలికొచ్చా.
“యేం సారూ! ఇంగ షురూ జేసుడేనా?” అని వికవికా నవ్వాడు రైటరు. “నీ కతే బాగుంది పో! దూపగైతే గుడుంబా, బుక్కవడ్తే టేషన్ల బువ్వ!” అని మళ్ళీ బొజ్జ లొడలొడా ఊగేలా వికవికా నవ్వాడు.
వాడి అపహాస్యాన్ని వినా ఆసహ్యాన్ని పట్టించుకునే దశ పోయింది.
సీసీయస్ బైటికొచ్చా.
సెంట్రల్ క్రైమ్ స్టేషన్..నిజమే..నేరాలన్నింటికి కేంద్రం ఇదే గదా!
పిల్ల కానిస్టేబుల్ ఇబ్రహీం మోపెడ్ స్టార్ట్ చేస్తున్నాడు.
“బాబూ! లక్ష్మీ విలాస్ లాడ్జి దగ్గర డ్రాప్చేసి పో!” అని వాడి అంగీకారం లేకముందే వెనకాల కూచున్నా.
వాడు విసుక్కున్నాడో, తిట్టుకున్నాడో, అసహ్యించుకున్నాడో నా కనవసరం! నా అవసరమంతా వేరే..వేరే..వేరే!
మోపెడ్ కదలబోతుంటే “ఓయ్ సెవెన్లెవెన్!” గట్టిగా అరిచినట్లు పిలిచి చప్పట్లు కొట్టి బొర్రాపుతూ మెట్లు దిగుతూ రైటరు.
ఏడొందల పదకొండు ఇబ్రహీం మోపెడ్ ఆఫ్ చేశాడు.
రొప్పుతూ దగ్గర కొచ్చాడు రైటర్. నా చేతిలో ఓ నల్ల రూపాయి నాణెం పెట్టాడు. “గా నాయక్ లంజొడుకు మాల్దెస్తే ఫోన్గొట్టు…గన్నె తాగొద్దు! గీడికొచ్చినంక పోస్తంలే! సమ్జయిందా?” అన్నాడు.
నను గూర్చిన సంభోదనల్లో ‘మీరు, సర్’ మాయమై రెండున్నరేండ్లయింది.. ‘ఓయ్, నువ్వు’ సమక్షంలో, ‘గా లంజొడుకు …తాగుబోతోడు’- పరోక్షంలో!
అర్ధమైందన్నట్టు తలూపాను.
సస్పెండెడ్ ఎస్సై ఫౌండండర్ద ఇన్ ఫ్లూయెన్సాఫ్ ఆల్కహాల్..తాగుబోతు లంజొడుకు..సీసీయస్ దామాద్…ఇప్పుడు పోలీసిన్పార్మర్ కూడా నన్నమాట.
అన్ని భావాలకూ ఒక్కటే రియాక్షన్ నా మొహమ్మీద..కాండ్రించి ఊసిన ఉమ్ము పడ్డా.. స్టేషన్ గోడకు తాపడమైన గాంధీ మొహమీదలా బొద్దింక వాలినా.. నంబరాఫ్ క్రైమ్ల లిస్టు బ్లాక్ బోర్డు మీదలా నా మీద బల్లి పాకినా…లాకప్ లో ఇంటరాగేషన్లో ఉన్న దరిద్రుడికి మల్లే నీళ్ళడిగితే ఖాకీ ఫాంట్లో పన్చేసి మా రక్షకభటులు ఉచ్చలు పోసినా..సకార వికారాల్లేని ముఖం నాదైపోయింది.
సికిందర్ గాడు చేసిన బడిపంతులు ఖూనీతోటే నేనూ ఖూనీ అయిపోయా. ఇప్పుడు నాదో శవ ముఖం. రైగర్ షూర్టీస్ తో నీలుక్కుపోయింది. వాడు డీసీపీ కాబట్టి అప్పుడు డ్యూటీలో ఉన్న ఎస్సైను నేనుకాబట్టి..కమ్యూనిస్టు సింపతైజర్ అన్న పేరుంది కాబట్టి..బడిపంతులు ఖూనీకోరు నేనే అయిపోయా. సస్పెక్ట్ బీటెస్టు డెత్ బై ఎస్సై ఆన్ డ్యూటీ హూ వాజ్ ఫౌండ్ అండర్ద ఇన్ప్లూయన్సాఫ్ ఆల్కహాల్…అంతే. తాగుడంటే ఏమో తెలీన్నేను ఇప్పుడొ పచ్చి అస్సల్ సిసల్ తాగుబోతుని..లంజొడుకు..సీసీఅస్ దాబోద్ గాడిని..ఆల్వేస్ అండర్ద ఇన్ప్లూయన్సాఫ్ ఆల్కహాల్..వెనకా ముందూ ఎవ్వరూ లేని నాకు సీసీయస్సే ఇల్లైంది. వాడు చేసిన నేరానికి పరిహారమేనన్నట్లు డిసీపీ నన్నిక్కడే ఉండనిస్తున్నాడు. ఇప్పుడు నాకు స్టేషనే ఇల్లు.

***

దేశంలో సారాయి నిషేధం..చీప్ లిక్కర్ పేరుతో సీసాల్లో సర్కారు వారే రంగు సారాయన్నమ్మడం చట్టబధ్ధం! ఖద్దర్లూ, ఖాకీలూ కలివిడిగా పాల పాకెట్లమ్మినట్లు సారా పాకెట్లమ్మడం, కళ్ళకు బ్లైండ్ల్ కట్టిన చెక్కగుర్రం గవర్నమెంటుకు కనబడదు.
నాయక్ లాంటి కొండజాతి వాళ్ళకు తెల్సిందీ, చేయగల్గిందీ ఆ అడవిలో దొరికే పువ్వూ, కాయా, కొమ్మా, చిగురూ, రెమ్మగిజిగురూ కలిపి సారా వండడమే. సీకాయా, కుంకుళ్ళూ, ఆకులూ మూలికల్తోపాటు కాచిన సారా అమ్మడం మాత్రమే వాడికి తెల్సు. సారా అమ్మడం నేరమంటే వింతగా చూసేవాడు. నాగరికత వాణ్నీ..వాళ్ళలాంటి వాళ్ళనూ కూడా తాకేసి వాళ్ళనీ కల్మషం చేసేసిందెప్పుడో! వాడి సారాకు మంచి రేటన్న సంగతి పోలీసులే వాడికి చెప్పారు. “నువ్వింత..కమ్ము!” మాకింత ఇవ్వు! నీకింత మిగులు” అన్న లెక్కలు నేర్పారు. రెణ్నెలకోసారి నిన్ను పట్టుకుంటాం..కేసు వేస్తాం..మాకూ ఆఫీసులో నేరాల లెక్కలు వండాల్సిన ఆగత్యముందని వాడికి చెప్పేశారు.
షరా మామూలుగా, ఈరోజూ నాయక్ సారా తెచ్చేరోజు. నే వెళ్ళి వాడు తెచ్చింతర్వాత రైటర్గాడిచ్చిన రూపాయతో సీసీయస్ కి ఫోన్చేస్తా…వాళ్ళొచ్చి రైడ్ చేస్తారు. వ్యవస్థీకృత నేరం.
నాయక్ నవ్వుకుంటూ సారా కాన్ తో వానెక్కుతాడు. వాన్లోనే మామూళ్ళనబడే రొక్కం ఇచ్చేస్తాడు. దర్జాగా చౌక్ దగ్గర వాణ్ణి మర్యాదగా దింపేస్తారు. మళ్ళీ ఏ మూణ్ణెళ్లకో తంతు రిపీటవుతుంది. కాన్లో సారా పోలీసుల్లో తాగేవాళ్ళందర్కీ వెళ్తుంది. డబ్బు మాత్రం హోదాను బట్టి బట్వాడా అవుతుంది.

***

లక్ష్మీ విలాస్ పక్క సందులోంచి నడుస్తున్న పందులూ, కుక్కలూ దిబ్బమీద ఎంగిలాకుల కోసం భీకరంగా యుధ్ధం చేస్తున్నాయి. ఆ వీధిలో రెండు వీధి లైట్లున్నా అవెప్పుడూ వెలగవు. మునిసిపాలిటీ వాళ్ళు వేసీ వేయగానే ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళను పిల్చుకొచ్చి అంబేద్కర్ నగర్ ఆడవాళ్ళు బల్బులు పగలగొట్టిస్తారు.
వాళ్ళకి ఆ చీకటి ముకిసందే పాయిఖానా. యే తెల్లవారుఝామున్నో, లేదూ రాత్రి చీకటి పడ్డ తర్వాతో ఆ కాలనీ ఆడవాళ్ళు డబ్బాలూ, చెంబులూ తీసుకువస్తారు. ఆ సందులోకి ఆ అవసరం తీర్చుకోవడానికి.
వాళ్ళకు పాయిఖానాలు శాంక్షనై నాలుగేళ్ళయింది. కాయితాలూ, సంతకాలూ, టెండర్లూ ఫైనలైజైనై. ముడుపుల్లో తకరారు కారణాన..ఆ కాలనీ ఆడవాళ్లకి వీధి దీపాలు పగలగొట్టించే తప్పు తప్పట్లేదు.
ఆ చీకటి సందులోంచి మనుషులూ, పశువులూ విసర్జించిన దుర్గంధంలోంచి నడుస్తూ రసూల్ గరాజ్ చేరుకున్నా.
యెప్పుడో గుడ్డి రసూల్ అనబడే ఓ మిలట్రీవాడు అక్కడ గరాజు నడిపేవాడు. వాడూ లేడూ, వాడు నడిపే గరాజు లేదు. దాని పేరు మాత్రం అవశేషంగా మిగిలింది. పడిపోయిన గోడకానించి వేసిన, వారపాకలో ముగురాడవాళ్ళతో ఓ ముసిల్ది ముండలఖానా నడుపుతోంది.
నాయక్ సారా కోసం వచ్చేవాళ్ళ కోసం కుంటి నూర్జహాన్ ఇంట్లో ఏసుకొచ్చిన దోసెలూ, చిట్టివడలూ అమ్ముతూంటుంది. దాని కాలు అవిటిది. పోలియో వచ్చి చచ్చుపడిపోయింది. దాని మొగుడు ముండాకొడుకు దౌర్జన్యానికి గురై పెనమ్మీద పడీ పక్క చెంప కాలిపోయింది. వికృతత్వమంతా మూరీభవించినట్టుంటుంది నూర్జహాన్.
నేను గరాజ్ చేరుకున్న పది నిముషాలకి ఆటోలో వచ్చి నాయక్ రెండు జెర్రీ కాన్లతో దిగాడు.
అవినీతి, ఈజీ మనీ వాడి గ్రామీణ నైర్మల్యాన్నీ, సంస్కృతిని కలుషితం చేశాయి.
సైను పంచెతో గళ్ళ చొక్కాతో తలపాగాతో వచ్చేవాడు పాంటూ స్లాగుల్లోకి మారాడు. బుర్రమీసాలు కత్తిరించి వత్తించాడు. చెవిలో పోగులు మాయమయ్యాయి. నాగరికుడైపోయాడు.
‘నమస్తే దొరా! జల్దొచ్చినవ. గిప్పుడె వచ్చిన ఇంగ బోనీ గలె, గిసింత గానీ!” అన్నాడు నన్ను చూడగానే.
నాకు ఊరికే మందు పోయడానికని అన్నాడు వాడికి తెల్సు నేను సస్పెండయిన ఎస్సైనని. వాడి దగ్గరకెళ్ళి చెప్పేశా అస్సల్సంగతి!
వాడి మొహంలో భయం కాదు. విసుగు పుట్టింది..బాంచెత్! అచ్చై పైలికి పెడ్తమన్నప్పుడు గద్సార్ కేసు! ఒక్క మైనాముందు గాల్నంటే యేం జేయాలె..ధూత్తెరకీ! అని ఊశాడు.
కాస్సేపు మౌనం వహించి ఓ క్యాన్ తీసుకెళ్ళి ముండలఖానా వారపాకలో దాచేసి వచ్చాడు. ఇంకో కాన్లోంచి ఓ ప్లాస్టిగ్లాసుడు సారా నాకు ముంచి ఇచ్చాడు. ఇద్దాగు దొరా! టేషన్లో నీ కోసరానికి బచాయిస్తరో, లేదో బాడ్ఖవ్లు!” అని ప్రేమగా అన్నాడు.
నే తాగేసి వెళ్లి రైటర్గాడికి పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ కొట్టా. పది నిముషాల్లో వానొచ్చింది. దాని ఖర్మనో యేమో వ్యానొచ్చే ఓ రెండు నిమిషాల ముందే కుంటి నూర్జహాన్ దోసెల బుట్టతో కాలీడ్చుకుంటూ వచ్చింది. “ఫో..ఫో!” అని నాయిగ్గాడు తోలేలోపలే..మావాళ్ళ మంద దిగిపోయింది.
నాయక్, వాడి సారాక్కానూ, నేనూ ఎక్కాము. మా రైటర్ గాడు కుంటి నూర్జహాన్ని చూసి, “ఎక్కే రండా! పెషల్ వ్యాన్ గావ్ల్న నీకు?” అని వెనుకనుంచి ఆ కుంటి దాన్ని ఒడిసి పట్టుకుని వ్యాన్లోకి ఎత్తేశాడు. వాడు ఆమెను పట్టుకున్నప్పుడు ఎక్కడ పట్టుకున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. “అయ్యా…సారూ! దోసెలమ్ముకునేదాన్ని..కుంటిముండని నన్నిడనండ్రి సారూ! దిక్కులేని ముండను సార్..నీ కాల్మొక్త!” అంటూనే ఉంది.
మా రైటర్గాడు విక వికా నవ్వుతూ ఆమె బుట్టలోంచి ఓ చిట్టి వడ తీసి కొరికి, “కాలు కుంటిదైనా మస్త్ కండ ఉందే నీకు సేతులు వట్టై..!” అని అందరివైపూ చూశాడు.
పెద్ద చౌక్ దగ్గర వ్యాన్ నిలబెట్టారు. నాయక్ జేబులోంచి రైటర్ జేబులోకి కరెన్సీ కాయితాలూ మారాయి. వాడు దిగిపోయాడు.
“నోంబోతా షారూ! కాల్మొక్త నన్నిడ్సుండ్రి!” అని కుంటి నూర్జహాన్ కొట్టుకుంటూనే ఉంది.

***

సీసీయస్ వెనకాల గది. నాయక్ ఇచ్చిన డబ్బు బట్వాడా అయిపోయింది. కుంటి నూర్జహాన్ ఏడుస్తూనే ఉంది. సీయై వెళ్లిపోయాడు. క్యాన్లో సారా గ్లాసుల్లోకీ, తాగేవాళ్ల కడుపుల్లోకూ చేరుతుంది. లెవెన్ జీరో టూ వెంకటేశ్వర్లు ఓ పొడువాటి సీసా నిండా నింపుకున్నాడు. “మా ముసిలోని కోసరానికి..” అంటూ.
సెవెన్లెవెన్ ఇబ్రహీం బెంచీ మీద కూచుని తలని రెండు చేతుల్తో పట్టుకున్నాడు. నిర్మలుడూ, స్వచ్చమైన వాడూ, యువకుడూ అయిన ఇబ్రహీం పై అధికారుల ముందు నిర్వూర్యుడు.
“దొరా! పచ్చి బాలింతని. పన్నెండ్దినాలై కాన్పై..నన్నిడ్సు..దొరా! కాల్మొక్త…పాపం, దొరా!” తల అడ్డంగా ఊపుతూ ఏడుస్తోంది.
ఇబ్రహీం అసహనంగా కదుల్తున్నాడు బెంచిమీద.
అచ్చా..జచ్చంటే ఇడుస్తానే…పోరడా..పోరా కాన్పుల?”
“పోరడే దొరా! పురట్లనే సందిగొట్టి జచ్చిండు దొరా! పచ్చిగున్నా…నన్నిడ్సు దొరా!”
“అప్..బాలింతటరోయ్!..ఓయ్ ఇబ్రహీం! వచ్చి దీని పాలు బితుకు సూస్తం!” అని వికవికా నవ్వాడు.
ఇబ్రహీం లేచి బైటకెళ్ళిపోయాడు. మామూలే అన్నట్లు మిగిలిన వాళ్ళున్నారు.
ఓ గ్లాసు మళ్ళీ సారా నింపుకుని కొద్దిగా తాగి టేబిల్మీద పెట్టి కుంటి నూర్జహాన్ని సెల్లోకి ఈడ్చుకు వెళ్లాడు రైటర్.
“ఓ…!” అని విలపిస్తూనే ఉంది నూర్జహాన్.
బైటికెళ్లిన పిల్ల కానిస్టేబుల్ ఇబ్రహీం లోపలికొచ్చాడు. బైటికెళ్లి గోడకు అటువైపు తిరిగి సగం ఉన్న ఆ గ్లాసుని నింపేశాడు.
జిప్ పెట్టుకుంటూ వచ్చి ఆ గ్లాసు టేబుల్మీద పెట్టి, “ఆ పందికి ఇంతకంటే శిక్ష నే నెయ్యలేన్సార్!” అని కళ్లు తుడ్చుకుంటూ బైటికెళ్లిపోయాడు.

***

అంకితం:
పోలీస్ జీవితాన్ని ఖాకీ కరకులో కాకుండా మనిషి ‘మల్లు’ లో జీవించిన రిటైర్డ్ ఎస్స్పీ అన్నయ్య శ్రీ పిన్నదరి శ్యాంసుందర్ గారికి – రచయిత.

(ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన వాస్తవ బీభత్సం. -రచయిత.)

**********


చిరునామా:
కాశీభట్ల వేణుగోపాల్
‘అక్షరం’87/1345-10, ఇంజనీర్స్ కాలనీ
నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర, కర్నూలు – 518 002
ఫోన్ : 08518 – 271927 సెల్ : 95500 79473.