కథ

నువ్వు నేనూ ప్రేమా!

జూలై 2015

చ్చ లేని చందమామని చూసే అవకాశం వుంటుందా? -’ ఓ యెస్. దాందేముంది. ఎవరైనా కొత్త శాస్త్రజ్ఞుడొచ్చి, చంద్రుని మీద ఆ నల్ల బండ తొలగించేస్తే, నిండు కాంతి బింబాన్ని చూశే అవకాశం వుండొచ్చు. కానీ, స్త్రీ ముఖ బింబం మీద విషాదాన్ని తొలగించగల సైంటిస్టు మాత్రం ఒక్కడూ లేడు. పుట్టలేదు. ఇక పుట్టడు.

ఎన్ని యుగాల్నించి చూడటం లేదని తను?’ ఆవేశం గా అనుకున్నా.

‘ఛ! అలానా? అంత గొప్ప యుగాల పురుషుడువేవిటి నువ్వు?’ – ఇంటర్ కనెక్షనోడి మాటలకి పెల్లుబుకొచ్చింది నవ్వు.

బెర్త్ సీట్లో కదిలి, వెనక్కి నిఠారై కూర్చున్నా. పైకిముఖమెత్తి, కళ్ళు మూసుకుని నాలో నేనే నవ్వుకుంటుండిపోయా.

కానీ, కళ్ళ నిండా ఎదురుగా కూర్చుందే, ఆ కొత్త పెళ్లి కూతురి రూపమే కనిపిస్తోంది.

కలకలం గా వుంది. కాదు, కలవరం గా వుంది.

ఎందుకూ, ఏడుస్తోంది పాపం? ఆ విశాలమైన నయనాల నిండా ఆ పెనుతుఫాన్లేవిటీ? -

తను చూడలేదనుకుందేమో కానీ ఆమె ధోరణంతా పసికడ్తూనే వున్నాడు.

జడకి చుట్టిన పూల దండని ఒక్క లాగు లాగి, సీటు కింద కి విసిరి పడేసింది.

మెళ్ళో పసుపు దారాల తో ముడేసిన మంగళ సూత్రాల్ని చూసుకుని చూసుకుని కుములింది. అబ్బ అప్పుడు చూడాలి. సముద్రం నది బొడ్డున బలమైన నల్లటి అల ఒకటి గుర్తొచ్చి, మనసంతా చేదైపోయింది.
ఎందుకు దుఖిస్తున్నావ్? అడగాలని చూశాడు.

తన చూపుతో కలవకముందే కళ్ళు తిప్పేసుకుంది.

‘ఇస్స్..’

ఉలిక్కిపడింది.

ఆమె ఉలికిపాటుకి నేనూ అటు చూసాను.

బయట్నించి ఓ భారీ అవతారం ఆమెనుద్దేశిస్తూ “ఏం తింటావ్? చిప్స్సూ కోకూ తేనా?” అడుగుతున్నాడు.

అబ్బో. అంత సొగసుగానా అడేగేది? అనుకున్నా.

ఆమె తలొంచుకుంది గభాల్న. అతన్ని చూస్తూనే తలొంచేసుకుంది. అతనడిగిందేదీ తనని కాదన్నట్టు గుండెల మీద చుబుకం ఆనేంత లోతు గా తలొంచేసుకుంది. నేనప్పటికే పసికట్టేసా. ఆమె కళ్ళల్లోని భయాన్ని.
ఈ మెరుపులాటి అమ్మాయిని అత్తారింటికి పంపుతున్నట్టున్నారు.

ఇంతకీ ఈ అతిభయంకరుడెవరు?

అప్పటి దాకా ఆమె మీద పడి ఆక్రమించిన చీకటి పోయి, వెలుగు రావడంతో అర్ధమైంది. కిటికీ కి అడ్డమొచ్చిన ఆ నల్ల కొండ అక్కణ్నించి జరిగిందని.

ఆమె కదిలి, కిటికీ కి తల ఆంచుకుంది. ఆ పిదప రెప్పలు వాల్చుకుంది.

ఎంత అందం గా వుంది ఆ మోము! ప్రభాతాన పూసిన మందారమంత స్వచ్చం గా ముగ్ధం గా, మనోహరంగా వుంది. ముద్దు పెట్టుకోవాలనిపించేంత అమాయకం గా వుంది.

కానీ చారడంత చామంతి పూవు మీద కుంకుడు గింజనతికించినట్టు.. నల్లటి కనీళ్ళేమిటి?

అదిగో. నా అనుమానం నిజం. మళ్ళీ దుఖిస్తోంది. ఈ సారి గుండెలెగిసిపడేలా దుఖిస్తోంది.

లేత కొమ్మ. వొణికిపోతోంది. పందిరి నల్లుకోవాల్సిన బేల తనం, రైలు పెట్టెలో కూరితే ఎలాగబ్బా?

మన వాళ్ళకి కాసింతైనా డెలికసీ జ్ఞానాలుండవు. ఆడపిల్లకి పెళ్ళైతే చాలనుకునే మూర్ఖత్వం ఇంకా పోవడం లేదు.

“ఎక్స్క్యూజ్ మీ..” ఆమె వైపుకి ముందు కల్లా వొంగి మరీ పిలిచాను. చాలా మృదువుగా.

“హెలోఅండి” మెత్తని స్వరానికి కళ్ళు విప్పింది.

పలకరింపుగా నవ్వాను. జాలి గా చూసా. ఓదార్పుగా నిట్టూర్చా. స్నేహం గా చేయి జాచా.

ఏమిటన్నట్టు చూసింది.

మిల్క్ చాక్లేట్ తీసుకోండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగి నోరంతా తీపి ముద్దైపోతుంది. దీన్ని ఎలా అయినా తినొచ్చు. చప్పరించీ తినొచ్చు, లేదా బుగ్గనా పెట్టుకోవచ్చు. ఇది కొందామని షాప్ కెళ్ళాను. నా పాత ఫ్రెండ్ కనిపించాడు. అంతే. ఎన్ని కబుర్లాడుకున్నామంటే..మేమీ లోకం లోకొచ్చి చూసే సరికి- మా చుట్టూ రాపర్స్ గుట్టలే గుట్టలు. చూసి ఆశ్చర్య పోయాం. మేమేనా అన్ని చాక్లేట్స్ తిని పడేసిందీ అని.
మరో సారి, టైలర్ దగ్గరకెళ్ళా పాంట్ కుట్టిద్దామని. అప్పుడూ అంతే. ఈ చాక్లెట్ మహా రుచి మాయలో పడి, పాంట్ కి బదులు కట్ డ్రాయర్ కొలతలిచ్చి వచ్చా.

మెరుపు మెరిసింది. ఆమె ముఖం లో ఒక్కసారిగా వెలుగు రేఖ విరిసి మాయమైంది.

ఆ అర సెకను కే నా కళ్ళు జిగేల్మన్నాయి.

నా ఆఫర్ ని సున్నితం గా తిరస్కరిస్తూ..తలూపింది అడ్డంగా.

ప్లీజ్ తీసుకోండి. నా గుర్తు గా. నేను మీకు ఫ్రెండ్ ని. నాకు మీ మీద చాలా జాలేస్తోంది. ఎందుకో ..ఓదార్చాలనుంది..

ఆమె రెప్ప పాటులో నా చేతిలోంచి చాక్లెట్ బార్ తీసుకుంది. చీర కొంగు కి ముడేసుకంటూ, నా అనునయానికి మళ్లీ దుఖిస్తోంది.

“చాలా బాధలో వున్నట్టున్నారు. నాతో పంచుకో కూడదా! నేనెవరికీ చెప్పను. ప్రామిస్. మదర్ ప్రామిస్.” అంటూ, ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకుని, అర చేతికి నా అరచేయి తాకించి వాగ్దానం చేసేసా.

నేను చేస్తోంది కరక్టే. కాని ఆమె ఆశ్చర్య పోయింది. వింత చర్య అన్నట్టు. అసలే పెద్ద పెద్ద కళ్ళు మరింత పెద్దవైపోయాయి. నీలాకాశమంత విశాలమైపోయాయి. థళుక్కుమంది ఆనంద తారక.

ఇరువురి చేతి వేలి కొసల లోంచి అగ్గి పూలు రాజుకుంటున్నాయి.

ఆ లేత గులాబీ రేకుల పెదాలు అదురుతున్నాయి. సన్నగా.

ఇంతలో – ఒక ఊపిరి గొండ్రు పెడుతూ వినిపించే సరికి ఉలిక్కిపడ్డామిద్దరం.

“ఎవడ్రా నువ్వు? నా పెళ్ళాం చేయి పట్టుకున్నావ్? వొదులు. ?” గాండ్రించాడు.

ఆమె చెయీ లాగేసుకుంది. నేను వదల్లేదు.

ఇంకా షాక్ లోనే వున్నా. ఈ బంగారు బొమ్మ వీడికి భార్యా?

“ఏమిటీ! ఈమె నీ పెళ్ళామా?..జోకా?”

“ఒక్క కొట్టు కొట్టునంటే చస్తావ్ బక్కోడా..” అంటూ ఠప్పున నా చేయి మీద నిజంగానే కొట్టాడు. నరం విరిగింది. చేతులు వీడాయి.

ఆమె భయపడింది. మరి కాస్త మూలకల్లా ముణగదీసుకుంది.

నేను ఊరుకోలేదు. “ఏంటీ నీ గూడా ఇజం? ఆ? నిన్ను ఎక్కడో చూసా..ఎక్కడబ్బా..ఆ. నిన్ను హంతకుల లిస్ట్ లో చూసాను. ఆ. గుర్తొచ్చింది. మొన్న పేపర్ ప్రకటనలో నీ ఫోటో వేయలేదూ? అవును. ఖచ్చితం గా అది నువ్వే. వరసగా జరుగుతున్న రైలు హత్యల వెనక నీ హస్తం వుంది. నాకు తెలుసు నిజం చెప్పు. ఆ అమ్మాయిని బెది రించి కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నావు. అనుమానం రాకుండా పెళ్ళి చేసుకున్నట్టు నాటకాలాడుతున్నావ్?”

వింటున్న ఆమె – ప్రాణం లేచొచ్చినట్టు చూసింది నా వైపుకి.

ఇన్ని నిజాలు నీకెలా తెలిసాయనట్టు వెలుగయి పోతూ చూసింది.

ఆమెనీ నరకంలోంచి తప్పిస్తానన్న ఆశ కొద్దీ చూసింది.

వెంటనే గొంతు పెంచి బయటకి చూస్తూ “పొలీస్.. పోలీసు..” అంటూ అరిచా. ప్రయాణీకులు పోగయ్యారు. పోలీస్ తో బాటు గార్డ్స్, టీసీలు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ భారీ కురూపి – వాళ్ళతో కరచాలనం చేస్తూ నావైపు గుర్ర్రు గా చూశాడు. నాకేం భయమా? అన్నట్టే వున్నా. ఆమె దృష్టిలో హీరో అయిపోయా. ఎంత ఆరాధన గా చూస్తోందనీ నా వైపు. గభాల్న గుర్తొచ్చింది. అదే. పాంట్ జేబు తడుముకున్నా. ‘వుందా? – వుంది.’ హమ్మయ్య.
వాళ్ళల్లో వాళ్ళు లాలూచీ పడ్డారు.

చివరికి – పెళ్ళైంది కాబట్టి పేచీ లేదన్నారు. నాదే తప్పని తేల్చారు. నేనొప్పుకోలేదు. ఆమె తప్పదన్నట్టు తలొంచుకుంది మళ్ళా.

అంతా సద్దు మణిగింది. రైలు కదిలింది. కూత పెట్టుకుంటూ పరుగు లంకించుకుంది.

బండోడు అటు వాళ్ళతో కలసి వెళ్ళాడు.

ఏం చెబుతారు వెదవలు. ఈ ప్రయాణం అయ్యేదాకా ఊరుకోమని వాడికి నచ్చచెబుతారు.

లేకపోతే రచ్చ అవుతుందని భయపెడతారు వాణ్ని.

ఛా! వెదవ సమాజం. ఇంతమంది చదువుకున్న వాళ్ళుండీ చెత్త వెదవకి సలాం చేస్తారెందుకో అర్ధం కాదు.

హు. విద్య కన్నా కత్తి గొప్పది. పుస్తకం కన్నా కాగితపు నోటు గొప్పది.

లొంగిపోడానికి సిగ్గేయదూ?

ఇప్పుడు ఈమె పరిస్థితి ఏమిటీ? ఎవరూ ఆలోచించరే?!

జేబు మీద చేయి వేసాను అలవాటుగా. వుందిలే.

ఆమె కళ్ళెత్తి నా వైపు చూసింది.

నాకే భావమూ తెలీలేదు.

నేనలానే చూస్తూ వుండిపోయా. ఆమె కళ్ళల్లోకి.

గోరింటాకు పెట్టుకున్న చేతుల్ని చూసుకుంటూ, అర చేతిని పెదవులతో తాకింది సున్నితం గా.

ఏవిటీ, నిజమే. నమ్మలేని వాడిలా అయిపోయా. చలనం మొదలైంది నాలో. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసా.

కొంగు ముడి విప్పి, చాక్లెట్ తీసింది. కాగితం విప్పి, ముక్క తుంపి తీసుకోమన్నట్టు చేయి జాపింది నా వైపుకి.

భుజం మీద కి ముఖం తిప్పి, కళ్ళు వాల్చి, నవ్వీ నవ్వనట్టు! – ఆ భంగిమ మనసులో బలంగా ముద్రించుకుపోయింది.

సందేహం లేదు. ఈమె తన కోసమే పుట్టింది. అవును తన కోసమే.

ఛ. ఆ వెధవతో పెళ్ళి కానప్పుడెందుకు పరిచయం కాలేదు?

తల వెనక చెయ్యేసుకుని తెగ బాధ పడిపోయా.

ఇప్పుడు మాత్రమేమైందనీ..ఆమె వచ్చేస్తానంటే..తీసుకుపోతాడు.

శాస్తోక్తం గా జరిగిన బలవంతపు పెళ్ళి కంటే చాటుగా తీసుకుపోయి చేసుకునే కళ్యాణమే శుభప్రదం కదా.

అందుకే ఆత్రం గా అడిగేసాడు. “వచ్చేస్తావా? చెప్పు. నిజంగా అడుగుతున్నా వచ్చేస్తావా నాతో.”

టెన్షన్ భరించలేకపోతున్నాడు.

తన ప్రశ్నకి ఆమె అలజడి గా చూసింది మొదలు. ఆ తర్వాత సూటి గా చూస్తూ..తలూపింది సరేనంటూ.

నా గుండె అర క్షణం పాటు ఆగి కొట్టుకుంది. అంతే కెవ్వునరిచా. ” ఐ లవ్ యూ.. నే గెలిచా.. ఐ లవ్ యూ…”

ఆ బండోడొచ్చాడు. నేను నా సీట్లో కెళ్ళి కూర్చున్నా. ఏమీ ఎరగనట్టు ఆమె కళ్ళు మూసుకుంది.

మా ఇద్దరి వైపు అనుమానం గా చూస్తున్న వాడి కళ్ళని తుపాకీతో పేల్చి పడేసా నా చూపుల్తో.

అరె. కంగారుగా గబ గబా జేబు తడుముకున్నా. వుంది కదూ? – హా. వుంది.

రైలు వేగం గా అతి వేగం గా పోతోంది.

బోగీల్లో లైట్లారిపోయాయి.

కాలం నడిచి నడిచి అర్ధ రాత్రి దగ్గరకొచ్చింది.

ప్రయాణీకులందరూ నిద్దర్లు పోతున్నారు. ఆమె నేను తప్ప.

నేను ముందుగా కదిలి, తలుపు దగ్గరకొచ్చా. మరో రెండు నిమిషాల్లో ఆమే వచ్చి నా వెనకే నిలబడింది. చేయందుకున్నా. పాణిగ్రహణం జరిగిపోయింది. “డోంట్ వర్రీ. నేనున్నా నీకు ; నోటితో చెప్పకున్నా ఆమెకి వినిపిస్తూనే వున్నాయి నా మాటలు.

బయట వాన జోరుగా కురుస్తోంది.

“గుడ్డి వెల్తురొచ్చింది. “స్టేషననుకుంటా.. దిగిపోదాం. ”

రైల్ ఆగింది. ఎక్కడా ఏ జన సందోహమూ లేదు. ఎటు చూసినా వర్షం. వర్షం. ఉరుములు తప్ప.

మరీ మంచిది. ఎవరికీ కనిపించే చాన్సుండదు కదూ?

నా చేతిలో ఆమె చేయి బిగుసుకునుంది. రైలు పూర్తిగా ఆగీ ఆగకముందే ఒక్క దుముకు దుమికా.
అంతే.

ఆ తర్వాత ఏదో పెద్ద శబ్దమైంది. ఆ పైన తర్వాత నాకేమీ తెలీలేదు…నాకు స్పృహ తప్పుతోంది..త..ప్పు..తోం..ది..

***

ఎంత సేపటికి తెలివొచ్చిందో!- తెలీదు. చుట్టూ చీకటి. కటిక చీకటి. కంపార్ట్మెంట్ లో దూలానికి వేలాడుతూ ఒక గుడ్డి లాంతరు. అదీ గాలికి ఊగుతూ..ఇప్పుడా..అప్పుడా అంటూ ఆరిపోడానికి సిధ్ధం గా వుంది. కొస ప్రాణంతో.
మెల్లగా లేచి నిలబడ్డాను. కళ్ళు చికిలించి చూస్తున్నా చుట్టూ. జనం. జనం. పడీ పడీ నిద్రపోతున్నారు. ఛ. పడితే లేవదీసే వాళ్ళు కూడా వుండరు ఈ వెధవ మనిషి ప్రపంచంలో. అదే ఏ కాకో, అడవి దున్నో అయితే? ఎంత గోల చేసేవనీ? చుట్టూ చేరి.

అవునూ! ఇంతకీ..ఆమె ఏదీ? ఎక్కడ? నా దిల్? నా హార్ట్. ప్రాణాలకు తెగించి గెలుచుకుందామనుకున్న నా ప్రేమ. ఎదీ? కనిపించదే.

అంత కంగారులోనూ జేబు తడుముకున్నా. వుంది. ఎక్కడికీ పోలేదు. వుంది.

మరి ఈమె? గొంతెత్తి పిలవాలనుకున్నా. పేరు తెలీదు. అసలడిగితే కదూ?..వెళ్లిపోయిందా తననొదిలేసి?

అసలేం జరిగిందీ? ఏమో ఆ చీకట్లో..ఆ గాలి హోరులో ఏదో పెద్ద శబ్దమైంది. తను తూలి పడిపోయాడు. వెల్లకిలా. తల వెళ్ళి ఒక గట్టి రాయికేదో తగిలింది. అప్పుడు కూడా ఆమె చేయి తన చేతిలోనే వుంది.. అవును. తనకు బాగా గుర్తు. ఆ తర్వత?

తెలీదు. ఏమైందో.

ఆమె కావాలి. తను వెంటనే చూడాలి. తనని నమ్ముకుని అడుగేసింది. తన మాట నమ్మి వెంట వచ్చింది.

అసలే అమాయకురాలు. ఎవరైనా… ఏమైనా ..

గబ గబా జేబు తడుముకున్నా. వుంది. సిగరెట్టు పాకెట్ వుంది. క్షణమైనా ఆలస్యం కాకుండా తీసి, గభాల్న నోట్లో వుంచి, అగ్గి పుల్ల గీసా. బాగా తడవడం తో రెండు పుల్లలు ఆరిపోయాయి. మూడో పుల్ల వెలిగింది. వెంఠనే సిగరెట్ వెలిగించా. అంటుకుంది.

హమ్మ. ఒక్క దమ్ముకి ప్రాణం లేచొచ్చింది.

వెలుగుతున్న అగ్గిపుల్ల ని పైకెత్తి చుట్టూ చూస్తిని కదా అదిగో దూరం గా నా ప్రాణ సఖి స్థంభానికానుకుని కనిపించింది.

పూర్తి గా. ప్రాణం వచ్చేసింది. ‘హే. సఖీ” అరిచాను.

నమ్మలేనిదై చూసింది.

“అక్కడే వుండు వస్తున్నా.”

త్వరత్వరగా అడుగులేస్తున్నా. ఎక్కడా, ఈ జనం కాళ్ళకి అడ్డు తగులుతూ..జాగ్రత్తగా తొక్కకుండా నడుస్తున్నా.

మన వాళ్ళకి సెన్సుండదు. ఎక్కడ పడితే అక్కడే పడకలేసేస్తారు.

స్థంభం దగ్గరకొచ్చి ఆమె చేయందుకున్నా.

‘ఏమై పోయావని దిగులు పడ్డాను. పద. ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేయొద్దు. పద పోదాం. మనకవతల చాలా శుభ కార్యాలున్నాయి చేసుకునేందుకు” – తొందర పెట్టాను.

ఆమె సిగ్గుపడుతూ అందంగా నవ్వి నా చేయందుకుంది. దగ్గరకి లాక్కున్నా. ఒదిగిపోయి, అడుగులో అడుగు గా నాతో కలసి వచ్చేస్తోంది.

ప్లాట్ ఫాం చివరంచుకల్లా వచ్చి వెనక్కి చూస్తూ అన్నాను.

“వీళ్ళేవిటీ సఖీ, ఇలా నీళ్ళల్లో పడితేలుతూ కూడా నిద్రపోతున్నారు?. మరీ ఇంత నిద్రా? మంచిదైందిలే లేకపోతే మనం లేచి పోవడం సులువయ్యేది కాదు. అదిగో బండోడు కూడా సగం తేలి పడుకున్నాడు..హ్హ ..హహా.”
ఫక్కున నవ్వుకున్నాం. అప్పటికే ప్లాట్ఫాం దాటేసి ముందుకొచ్చేసాం.

ఆశ్చర్యం.

వరద నీరు పాదాలకంటటం లేదు.

అర్ధం కాని వాడిలా చూసానామె వైపు.

“లేకపోతే మనం లేచి పోవడం ఇంత సులభం అయ్యేది కాదు..” అంది సంగీతం లా నవ్వుతూ. నేను మొట్ట మొదటి సారిగా విన్న స్వరం. ఎంత మధురంగా వుంది.

నిశ్శబ్దం గా నడుస్తూనే వున్నాం. చేతిలో చేయ్యేసుకుని.

**** (*) ****