కథాకథనం

నును రెక్కల ఆశల చివుళ్ళు- ‘రెక్కలున్న పిల్ల’ గుండె చప్పుళ్ళు…

జనవరి 2014

కథ అంటే కేవలం ఊహ మాత్రమే కానిది.

కథంటే నిజానికి – మనల్ని మనం అద్దంలో చూసుకుంటున్నట్టుండేది,మ న్లని తనలోకి వొంపుకుని, ముంచి తేల్చేది, – మనల్ని అచ్చవైన మనిషిలా ఆలోచింపచేసేది, అదే – కథ. అసలైన కథ. -అని అంటాను. మనుషుల్లోకి మల్లేనే, కథల్లోనూ అనేక రకాలుంటాయి.

అనేక మనస్తత్వాలు. అనేకానేక సమస్యలు. పరిష్కారాలు. రాని జవాబు కోసం ఎదురుచూసే కళ్ళు. జాడ తెలీక తిరుగాడు ఆకారాలు..ఇలా ఎన్నో షేడ్స్..షెడ్డింగ్ టియర్స్..చూస్తుంటాం.

కొందరు – కొందరి కథల్ని మాత్రమే చదివేందుకిష్టపడతారు. నేనైతే కనిపించిన కథని కనిపించినట్టు చదివేస్తాను. రోజుకి నా దగ్గరికొచ్చే కథలు ఏడెనిమిదుంటాయి. నేను దగ్గరకెళ్ళి చదివేవి మరికొన్నుంటాయి. ఇదని, అదని ఏముంది. అన్నీ చదువుతాను. కొన్ని మావూలుగా వుంటాయి. ఇంకొన్ని బావుంటాయి. మరి కొన్నికథలు ఇంకా బావుంటాయి. కానీ, చాలా కొన్నే..అలా మనసులో ముద్రించుకునుంటాయి. నిద్రలో సయితం మూసేయలేని పేజీలా మిగిలిపోతాయి. నా దృష్టిలో రచయిత – ఒక సైంటిస్ట్! ఈ సమాజమే అతనికొక ప్రయోగ శాల. సమస్యలే పరిశోధనాత్మక అంశాలు. ఈ డిటెక్షన్, అన్వేషణ, డిస్కషన్, వివరణ, తేలిన ఫలితం, వదిలేసిన ముగింపు .. ఆసక్తి కరం కాకుండా ఎలా పోతుంది? ఛదువుతున్న కొద్దీ తెలిసే నిజాలు ఆశ్చర్యకరమౌతున్నప్పుడు, మనిషి గురించి తెలుసుకోడం కంటే మించిన సస్పెన్స్ థ్రిల్లింగ్ స్టొరీ మరోటేముంటుందనిపిస్తుంది నా మటుకు నాకు. అందుకే కథలు చదవడం ఇష్టం. చాలా ఇష్టం . వీటిల్లోని మనుషులూ కూడా! ఐతే, సమస్య ఏదైనప్పటికీ, రచయిత దృష్టి కానీండీ, ఆలోచనా దృక్పధం కానీండీ..విభిన్నమైనప్పుడు, ఆ రైటర్ పెర్సెప్షన్, పరిశీలనా విధానం, ప్రెజెన్టేషన్ వినూత్నమైనప్పుడు..ఇక కథ అమితంగా ఆకట్టుకోకుండా ఆపడం ఎవరి తరం?!

గుండె గుప్పెడే. కదిపితే కదిలే రహస్యాలే – గుట్టలు. బట్టబయలయ్యే గుట్లు. తేటతెల్లమయ్యే నిజాలు ఎన్నో! ఎన్నెన్నో!! అలా ఓ నిజాన్నీ నిగ్గు తేల్చిన కథే ఈ కథ – రెక్కలున్న పిల్ల. రచయిత్రి – ఎస్.జయ.

నేనే కథ చదివినా, రచయిత పేరు చూసి, చదవను. కథ నచ్చేశాక చూసే ఆ పేరుని మర్చిపోనూలేను. కొన్నాళ్ళకి ఆ పేరు జ్ఞాపకాల్లోంచి తప్పుకున్నా, కథ మాత్రం..ఊహు. పోదు. ఏ మాత్రం పోలేదు. అలాటిదే ఈ పిల్ల! ‘రెక్కలొచ్చిన పిల్ల’ కథ.

ఆడపిల్లకి అందమున్నా, లేకున్నా డబ్బున్నా, లేకపోయినా, ఛదువున్నా, లేకపోయినా – పెళ్ళౌతుంది. కాని రెక్కలుంటే మాత్రం..హమ్మో! పెళ్లవడం కష్టం. చాలా కష్టం. అసలు రెక్కలంటే ఏవిటీ? అవి ఎలా వుంటాయి? అందులో మగాడు భయపడిపోయేంత ప్రమాదకరమైన విషయవేవుంది? – నాకూ ఇదే,సందేహం కలిగింది కథ చదువుతుండంగా! నా డౌట్ని క్లియర్ చేస్తూ హీరో అడుగుతాడు భయపడుతున్న ఫ్రెండ్ని ఉద్దేశిస్తూ.. “ఆశ రెక్కల్ని చూశావా?” అంటూ. ఆ ఫ్రెండ్ అంటాడు. “చూళ్ళేదు కానీ, రెక్కల చప్పుడు చాలా సార్లు విన్నాను. ఆమె దగ్గరగా వచ్చిందంటే చాలు.రెక్కల చప్పుడు వినిపిస్తుంది. భయంతో వణికిపోతాను. ఆశ వైపు చూడాలన్నా నాకు భయమే. నువ్వు చూశావా?” అంటూ ఎదురుప్రశ్నిస్తాడు. ఆమెకి రెక్కలున్నాయని తెలుసని, ఆ రెక్కల్ని ప్రేమించే తాను పెళ్ళి చేసుకుంటున్నా ననీ వివరిస్తాడు హీరో.

ఆమెని చేసుకుంటె అతని బ్రతుకెంత అగచాట్లపాలైపోద్దో అని “ ఆశకు రెక్కలున్నాయి. నీ చేతుల్లోంచి ఎగిరిపోవచ్చు” అంటూ హెచ్చరిస్తాడు హీరోని. ఆ రెక్కలున్న పిల్లని చేసుకుంటే ఉరేసుకుని చస్తానంటుంది తల్లి. అయినా సరే అతను వివాహమాడ్తాడు. అక్కడితో కథైపోవాలి కదూ? కాని, కాదు. చిత్రమేమిటంటే…అతను ఆమెని అప్పటికింకా పూర్తిగా తెలుసుకోలేకపోడం. ఆ రెక్కలార్చిన గుణ లక్షణమేమిటో, లక్ష్యమేమిటొ కథాంతం లో కానీ అతనికి పూర్తిగా అవగతం కాకపోవడం (ఆ మాటకొస్తే, పాఠకునికి కూడా!)ఇదే ఈ కథలోని ప్రత్యేకాంశం గా చెప్పుకోవాలి.

కథ పూర్తయ్యాక కూడా, ‘ఇంతేనా’ అనిపించొచ్చు కొందరికి. కానీ, ‘ఎంచిఎంచి చూడ అంతయూ వ్యాపించి ఉన్న సమస్య ఇదే కదా’ అని అనిపించే కథ -ఈ కథ!

నాకెందుకీ కథ నచ్చిందంటే:

ఇతివృత్తం వల్ల! ఆ కాలానికీ, ఈ కాలానికి, మరి రాబోయే ఏ కాలానికి కూడా నిత్య నూతనం గా వుండే కథాంశం కావడం వల్ల! భార్యా భర్తల మధ్య అపోహలు, అపార్ధాలు, కలహాలు, కక్ష సాధింపుచర్యలు..చిలికిచిలికి గానివానలౌతూ విడాకులకి దారి తీయడాలు..ఇప్పటి ఈ సమాజంలో మనమెక్కడ చూసినా కనిపించే సంఘటనలు. ‘ఛదువు, ఉద్యోగం, సంపద, హోదా అన్నీ వున్నా ఆ ఇద్దరి మధ్య కొరవైనదేమిటీ?, కాపురం హాయిగా సాగకపోడానికి!’ అని అనిపిస్తుంది. ప్రేమించి, పెద్దల్నెదిరించి వివాహమాడిన వారి మధ్య కూడా ఇన్నేసి అపార్ధాలకు మూల కారణం ఇదీ అని తెలుసుకున్నప్పుడు మనసు బాధతో మూల్గుతుంది. ‘పెళ్ళికి ముందు ఇతగాడిలాటి వాడనుకోలేదని ‘ – ఆమె, “ఛ! ఇంత ఇరుకు మనసు గత్తె అని నేనూ అనుకోలేదని ‘ అతనూ!- విడాకుల తర్వాత కూడా ఇవే కామెంట్స్..ఒకరి పై ఒకరు విసురుకోడం సర్వసాధారణం. ఇరువురి మధ్యా అవగాహనా లోపమో, అహంకారమో కంటేనూ నేనెప్పుడూ సందేహించే ఒక పదం..ఈ కథలో నాకు స్పష్టంగా దర్శనమీయడం వల్ల కూడా, నాకీ కథ అమితంగా నచ్చడానికి బలమైన కారణమైందని చెప్పొచ్చు.
అదే, అ పదం పేరే – స్వే చ్ఛ.

జస్ట్ రెండురోజుల కిందటే ఒక ఫ్రెండ్ తో ఇదే అంశం మీద మాట్లాడుతూ.. ఇలానే అన్నాను. ప్రేమికులు ఒకరితో ఒకరు “నీ కోసం నే చస్తా ” అని అంటారు కానీ, నీ కోసం నా స్వే చ్ఛ ని వొదులుకుంటా. గంగలో కలిపేస్తా. అని పొరబాట్న కూడా ప్రామిస్ చేయరు. ఆసలా మాటకి చోటే వుండదు ప్రేమించుకునేటప్పుడు. పెళ్ళై, కలసి బ్రతుకుతున్నప్పుడే అర్ధమౌతుంది. ఈ స్వేచ్ఛా ప్రాణ వాయువు ఆవశ్యకత ఎంత పెద్దదో, ఎంత గొప్పదో, మరెంత అవసరమైనదో మనిషి జీవించేందుకని!

ఇద్దరి గుండెల్లోంచి పుట్టొకొచ్చే ప్రేమ కంటేనూ, ముందుగా -ఒకరి స్వేచ్చని మరొకరు ప్రేమించి, గౌరవించుకునే గుణం పుట్టాలని..అప్పుడే ఆ వైవాహిక జీవితం సఫలమౌతుందనీ గ్రహించాలి. ఒకప్పుడు నే చదివిన ఓ కొటేషన్ నాకెప్పుడూ గుర్తొస్తూ వుంటుంది. ‘మనిషిని ప్రేమించడమంటే అతని బలహీనతలను కూడా అంగీకరించడం’ అని. అదే సూత్రాన్ని తిరగ రాయాలి. ”నువ్వొక మనిషిని ప్రాణంగా ప్రేమించడమంటే, వారి స్వేచ్చని కూడా అంతే ప్రాణం గా ప్రేమించడం’ అని. . అప్పుడే ఆ సహజీవనం స్వర్గం లా వుంటుంది.

ఈ సూత్రం అతనికి మాత్రమే కాదు, ఆడపిల్లని కన్న ప్రతి తల్లితండ్రులకు కూడా వర్తిస్తుందని చెబుతుంది ఈ కథ.
ఇందులోని పాత్రలన్నింట్లోకి, కథానాయిక – ఆశ కి అందమైన రెక్కల్ని ప్రసాదించిన టీచర్ పాత్ర హృదయానికి హత్తుకుంటుంది. ఆ అందమైన రెక్కల్ని అపురూపంగా దాచుకోడం, అవసరమైనప్పుడు విసరిపోవడం, వాటికి భద్రత కల్పించడం, చదువుతున్నప్పుడు మనసు స్వేచ్చా విహంగమైపోతుంది.

కథ చివర్లో ఆశ మాటలు కడు ఆసక్తిని రేకెత్తిచే వింధంగా వుంటాయి. (కథని పూర్తిగా నేను చెప్పడం కంటెనూ, చదవడం వల్లనే గొప్ప అనుభూతి కలుగుతుంది.)

ఈ కథ లో లోతైన భావముంది. చురుకైన సంభాషణలున్నాయి. వాటికి చురకలంటించి పోయే స్వభావాలూ వున్నాయి. కథా, కథతో బాటు కథనం రెండూ కూడా జోడు గుర్రాల బండి మీద స్వారీ లా సాగిపోతూ..చదువరిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. చిక్కని ఆలోచన్లు చేయమంటాయి.

మంచి కథనందించిన రచయిత్రి కి నా శుభాభినందనలను అందచేస్తూ

—————————————————————————————————————–

కథ:

రెక్కలున్న పిల్ల

-ఎస్.జయ.

“నీకేమన్నా పిచ్చా! ఉండుండి ఆశనా పెళ్ళి చేసుకునేది? ప్రేమా పిచ్చి ఒకటే అన్నారు కానీ పెళ్ళీ పిచ్చీ ఒకటనలేదు.” రవిశంకర్ మురళిని ఎగతాళి చేశాడు.

“……”

“ఆశ గురించి ఒక విషయం చెప్పనా, నొచ్చుకోకు మరి. ప్రేమ కోసమై వలలో చిక్కుకున్నావేమో”నని మురళి కళ్ళల్లోకి చూశడు రవిశంకర్. ఆ కళ్ళల్లో ఏ ఉత్సుకత కనిపించలేదు. మాట్లాడ్డానికి కాసేపు తటపటాయించాడు రవిశంకర్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈలోగా సిగరెట్ వెలిగించాడు.

రవిశంకర్, మురళి మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే కాలేజీలో లెక్చరర్లు. ఒకరు ఎకనామిక్స్. మరొకరు పొలిటికల్ సైన్స్. ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఒకే స్టూడెంట్ యూనియన్లోనూ పని చేశారు. వారి మధ్య దాపరికాలు లేవు.

“ఆశకు రెక్కలున్నాయి. ఎప్పుడైనా నీ చేతుల్లోంచి ఎగిరిపోవచ్చు” రహస్యం చెబుతున్నట్టు చెప్పాడు రవిశంకర్.

మురళి మందహాసం చేస్తూ “ఆశ రెక్కల్ని చూశావా?” అడిగాడు.

“చూళ్ళేదు కాని, రెక్కల చప్పుడు చాలాసార్లు విన్నాను. ఆమె దగ్గరగా వచ్చిందంటే చాలు. రెక్కల చప్పుడు వినిపిస్తుంది. భయంతో వణకిపోతాను. ఆశ వైపు చూడాలన్నా భయమే. నువ్వు చూశావా?” ఎదురు ప్రశ్న వేశాడు.

“………….”

మురళి వైపు జాలిగా చూస్తూ రవిశంకర్ మళ్ళీ అన్నాడు. “నువ్వు చూసి ఉండవు. విని ఉండవు. ప్రేమ మైకంలో ఉన్నావు కదా!”

“అట్లా జాలిగా చూడకు. నేనేమీ చిక్కుల్లో పడలేదు. ఆశకు రెక్కలున్నాయని తెలుసు. ఆమె వ్యక్తిత్వం చూసి స్నేహం చేశాను. ఆమె రెక్కల్ని చూసి ప్రేమించాను. కలిసి ఉందామనుకుంటున్నాం.”

“ఇది..ఆశ నిర్ణయమే కదా!”

“పెళ్ళంటే ఏమిటి. ఒక ఇంట్లో ఇద్దరిని బంధించి కాపురం చేయండి అని అందరూ అమోదించడమా! మా మధ్య ప్రేమ ఉన్నన్ని రోజులు కలిసి వుంటాం. లేనప్పుడు ఇంత సింపుల్ గానూ విడిపోతాం. కలిసి వుండటానికి పెళ్ళిపీటలు, మంగళ వాయిద్యాలు అక్కర్లేదు. విడిపోతున్నప్పుడు లాయర్లు, కోర్టులు, తీర్పులు అక్కర్లేదు.”

“ఇంట్లో చెప్పావా మీ అమ్మా నాన్న ఇష్టపడ్డారా?”

“ఆశను మా అమ్మానాన్నకు పరిచయం చేశాను. చాలా మంది తల్లితండ్రుల్లాగే మా వాళ్ళూ అభ్యంతరం చెప్పారు.” విషయాన్ని చాలా క్లుప్తంగా స్నేహితునికి చెప్పాడు మురళి.
మురళికి తన అమ్మానాన్నల సంగతి తెలుసు. ఆంగీకరించరని కూడా తెలుసు. కానీ తనేం తప్పు చేయడం లేదు. వారికి విషయం తెలియకుండా రహస్యం గా ఉంచాల్సిన పనేమీ లేదు అనుకున్నాడు.

ఒక రోజు ఆశను ఇంటికి తీసుకెళ్ళాడు. ఆశను చూడగానే మురళి తల్లి “అందమైన పిల్ల. భాగా చదువుకున్న అమ్మాయి.” అని సంబరపడింది. కానీ, ఆశను చూస్తున్న కొద్దీ ఆమెలో ఆందోళన పెరగసాగింది. ముందు ఆశ కళ్ళల్లో మెరుపు చూసి తొట్రుపడింది. మరి కాసేపటికి మాటల్లో సూటిదనం, స్పష్టత చూసి జంకింది.
ఆశ ఒక గంటలోనే ఆ ఇంటితో, ఆ మనుషులతో ఎన్నో ఏళ్ళ పరిచయం వున్నట్లు కలివిడిగా మాట్లాడుతూ, ఉల్లాసంగా ఒకసారి తన రెక్కల్ని విప్పి ఆనందంగా ఆడించి, ముడిచింది. అంతే, మురళి తల్లి భయంతో వణికిపోయింది.

ఆశ వెళ్ళిపోయాక, “ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. ఎక్కడో పెళ్ళి చేసుకుని ఆమెను ఇంటికి తెచ్చావా నా శవాన్ని చూస్తావు.” అని బెదిరించింది తల్లి.

“మేము ముందే నిర్ణయించుకున్నాం. వేరే ఇల్లు తీసుకుంటున్నాం.”

“నువ్వు కాక మాకు ఇంకెవరున్నారు. రెక్కలున్న పిల్ల పెళ్ళయిన వెంటనే వేరే కాపురం పెట్టిస్తుందేమోనని భయపడి ఈ పెళ్ళి వద్దంటున్నాం. కానీ, పెళ్ళి కాకుండానే వేరే పోతావా?” మురళి తండ్రి అడిగాడు.

“పుట్టింటి నుంచి మెట్టినింటికి వలసపోవడానికి ఆమె మామూలు ఆడపిల్ల కాదు. అందుకే మా ఇల్లు మేం ఏర్పాటు చేసుకున్నాం.”

“ఈ ఇల్లు, అవీ, ఇవీ, ఏవీ వద్దంటున్నావు. కనీసం మేము నీ తల్లితండ్రులమనైనా ఒప్పుకుంటావా? అడిగింది తల్లి.

“ఆశకు ఆమె తల్లితండ్రులు ఎంతో, నాకు మీరు అంతే. అమ్మాయిలకు పుట్టిల్లు తాత్కాలికమనే కదా చెబుతుంది మీ సంప్రదాయం. ఒక తల్లి కడుపున పుట్టిన అమ్మాయికి ఒక సంప్రదాయం, అబ్బాయికి మరో సంప్రదాయం. ఈ తేడా ఒద్దంటున్నాం. అందుకనే వేరే ఇల్లు చూసుకున్నాం. మీకిష్టమైనప్పుడు మీరు మా ఇంటికి రావొచ్చు. మా కిష్టమైనప్పుడు మేము మీ ఇంటికి వస్తాం.”
మురళి వెల్లడించిన భావాలు అతని తల్లికి, తండ్రికి పూర్తిగా కొత్త. వారికి ఎంత అర్ధమయ్యాయో వారికే తెలియదు. ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వమనో, చచ్చిపోతామనో బెదిరించి ప్రేమ పెళ్ళిళ్ళను ఆపగలిగిన సంప్రదాయం తెలుసు కాని, వాటికి ఏ మాత్రం విలువివ్వని వారితో ఎట్లా గొడవపడాలో, బెదిరించాలో తెలియదు. సరి కదా, మురళి మాటలు వారి మనసుల్ని కలవరపెట్టాయి. ఈ కొత్త దనం ఎట్లా ఉంటుందో చూడాలన్న కుతూహలం కూడా వారిలో కలగక పోలేదు.

***

“నీకు రెక్కలు వచ్చేట్లుగా పెంచిన మీ అమ్మను చూస్తే నాకు చాలా గౌరవం. మా అమ్మ మా అక్కను ఎప్పుడూ ప్రతి చిన్న పనికి కోప్పడుతూ, సరి దిద్దుతూ వుండేది. పెళ్ళి కాకముందే మా అక్కను ఓ మంచి గృహిణి గా తయారుచేసింది మా అమ్మ.” అన్నాడు ఒకరోజు మురళి వంట సమయంలో.
మురళి, ఆశ వారంలో రెండుసార్లు మాత్రమే వంట చేసుకుంటారు. ఎవరికిష్టమైనవి వారు నాలుగు రకాల కూరలు చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటారు.ఇద్దరు కలిసి ఒక గంటలో వంట పూర్తి చేసేలోగా, తరచుగా వాళ్ళు చిన్నప్పటి ఆటపాటల గురించి, చిన్ననాటి స్నేహితుల గురించి, తల్లితండ్రుల గురించి, ఒక్కోసారి ఫక్తు వంటల గురించి మాట్లాడుకునేవాళ్ళు.
మురళి మాటలకు పగలబడి నవ్వింది ఆశ.

“నాకు రెక్కలు రావడానికి మా అమ్మ కారణమని అంత ఖచ్చితంగా ఓ నిర్ణయానికి ఎట్లా వచ్చావు?” అంది.

“మరి!…”

మా శ్యామల టీచర్ స్నేహం వల్లనే నాకీ రెక్కలు వచ్చాయి.” అని తన రెక్కల్ని చాపి, వాటివైపు మురిపెంగా చూసుకుంది. మురళి లాలనగా ఆశ రెక్కలను సుతారంగా నిమిరాడు. ఆశ కళ్ళు గర్వంతో వెలిగిపోయాయి.

**

నేను ఎని మిదో తరగతి చదువుతున్నప్పుడు, శ్యామల టీచర్ మాకు ఇంగ్లీషు టీచ్ చేసేది. ఆమె మాకు ఎన్నెన్నో కొత్త కథలు చెప్పేది. అవి ఏ పుస్తకాల్లో ఉంటాయో, ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో అడిగాను. ఒకసారి ఇంటికి రమ్మంది. ఛాలా పుస్తకాలు వున్నాయి. నాకప్పుడే తెలిసింది. నాక్కూడా పుస్తకాలంటే ప్రాణమని. నేను ఇంటర్లో చేరాక కూడా మా టీచర్ ఇంటికి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని చదివేదాన్ని. రంగనాయకమ్మ రాసిన ‘జానకి విముక్తి’ నవలను బట్టీయం వేశానంటే నమ్ము ఆ బుక్స్ నాలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించేవి.
ఎవరు ఏం మాట్లాడినా, ఏదో లోపం ఉన్నట్లు, అనిపించేది. నేను అమ్మ చెప్పినట్లు నడుచుకోవడం లేదని, దీనికంతా కారణం శ్యామల టీచరేనని మా అమ్మ అనుకొంది.” అని చెప్పింది ఆశ.

“కాలేజీలో చేరావు. శ్యామలా టీచర్ ఇంటికి ఎందుకు వెళతావు? ఆ పుస్తకాలు చదవడం మానేసేయ్.” ఒక రోజు ఆశ తల్లి అనూరాధ అంది.

“ఆ బుక్స్ చదవడం నాకిష్టం. చదువుతాను. నా తప్పేమీ లేకపోయినా, నన్ను కోప్పడితే, గంగిరెద్దులా తలాడిస్తూ వుండలేను.”

“ఈ తలబిరుసుతనమే వద్దనేది. ఏ తప్పు లేదంటూనే ఎట్లా మాట్లాడుతున్నావో చూడు. పక్కింటి సీతను చూసి నేర్చుకో. ఎంత అణకువ గల పిల్ల! ఈ వీధికే వన్నె తెచ్చే పిల్ల.” అంది అనురాధ.

“నిజమే. ద్వాపర యుగం సీతకు, ఈ సీతమ్మకు పిసరంతయినా తేడా లేదు. చెప్పినట్లు వినే మంచి పిల్ల. తనకిష్టమైన పని ఏదీ చేయదు. అందరి చేత మంచి అనిపించుకోవడానికి, ఎన్ని బాధలొచ్చినా భరిస్తూ బతకడానికి తయారవుతోంది. జీవితమంతా du a@hఖిస్తుంది.”

సతీమ తల్లి సీతను కూడా తిరస్కరిస్తున్న ఆశ, తన చేతులు దాటి పోయిందని గుర్తించింది అనురాధ. ఈ విషయాన్ని అంగీకరించే స్థితిలో ఆమె లేదు. ఆశను లొంగదీఎయడానికి తనలో ఎక్కడలేని కాఠిన్యాన్ని బయటపెట్టింది. మొరటుగా తిడుతూ, కొట్టడానికి ఆశ మీదికి చేయి ఎత్తింది.

చెంప మీద దెబ్బ పడకుండా తప్పించుకోగలిగింది ఆశ. కానీ, తల్లి తనను అవమానించడం భరించలేకపోయింది. తన తల్లి ప్రవర్తనను అసహ్యించుకుంది. తల్లి వైపు నిర్లక్ష్యం గా చూసింది. ఆ చూపుతో ఆ తల్లి కూడా సిగ్గుతో కుంచించుకుపోయింది.

మరునిమిషంలో ఆశ రెండు మూడు పుస్తకాలు తీసుకొని, “శ్యామల టీచర్ ఇంటికి వెళ్తున్నాను. ఉదయం వస్తాను.” అంటూ వెళ్ళబోయింది.

అనురాధ – ఆశ వైపు వింతగా చూసింది. “ఏమిటి ఈ పిల్ల ఇంత జరిగాక కూడా టీచర్ ఇంటికి వెళ్తానంటోంది.” అనుకుంది.

“ఒకటి గుర్తుంచుకో అమ్మా! నేనేం చిన్నపిల్లను కాను. మంచి చెడు నిర్ణయించుకోగలను. ఇంకెప్పుడూ నా మీదకి చేయి ఎత్తొద్దు.” ఆశ చాలా మామూలు విషయంలా చెప్పి వెళ్లిపోయింది. ఆశ ప్రవర్తనకు ఆ తల్లి ఆశ్చర్యపోయింది.

శ్యామల టీచర్ ఇంటికి వెళ్లిన ఆశ, రోజు కన్నా ఎక్కువసేపు చాలా శ్రధ్ధగా పాఠాలు చదువుకుంది. అర్ధరాత్రి దాటినా నిద్ర రావడం లేదని, చదువుకోవడానికి ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ బుక్ తీసుకుంది. ఫ్రాన్స్ లో 1968 లో జరిగిన విద్యార్ధుల ఉద్యమం గురించి విద్యార్ధుల పై ప్రభుత్వ దమనకాండ గురించి ఏంజిలా కాట్రొచ్చ రాసిన పుస్తకం అది. ఆ పుస్తకం చదువుతూ, ఆ సంఘటనలు ఇప్పుడే అరుగుతున్నట్టు ఆ విద్యార్ధుల్లో తను ఉన్నట్లు అనిపించింది ఆశకు. ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయి, ఏకబిగిన ఆ పుస్తకం పూర్తిచేసింది. ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం వచ్చినట్లు అనిపించింది. నిద్రలోకి ఒరిగిపోయింది.

అందమైన కల. ఆద్భుతమైన ఆనందమేదో తనలోకి పొగమబ్బులా దూసుకుపోయింది. తనకు రెక్కలు మొలుచుకొచ్చాయి. ఆకాశంలోకి ఎగిరిపోయింది. తెల్ల మబ్బుల మధ్య గిరికీలు కొడుతోంది తను. ఆశ సంతోషంతో కళ్ళు తెరిచింది. భుజాలను తడుముకొని ఉలిక్కిపడింది. ఇప్పుడు తనకు రెక్కలున్నాయి. రెక్కల్ని చూసుకొని ఆశ్చర్యపోతుంటే, శ్యామల టీచర్ కాఫీ కప్పుతో వచ్చి
‘మంచి కలతో మేల్కొన్నట్టున్నావ్?” అని అంది.

“అవును టీచర్. రెక్కలొచ్చినట్టు కల కన్నాను. మెలకువ వచ్చి చూసుకుంటే నిజంగానే నాకు రెక్కలొచ్చాయి.” అని, చూపించింది.

శ్యామల టీచర్ వాటిని చూసి ఆనందంతో పొంగిపోయింది. “ఎంత అందంగా వున్నాయి ఈ రెక్కలు.” అంది రెక్కలను సుతారంగా నిమురుతూ.

ఆశ తన రెక్కల్ని చూసుకోవడంలో మునిగిపోయింది. కాఫీ తాగడం మరిచి,

“ఎందుకైనా మంచిది. రెక్కల్ని ఎవరికంటా పడకుండా జాగ్రత్త చేసుకో. నీ కాళ్ళ మీద నీవు నిలబడగలిగే పరిస్థితి వచ్చేవరకు జాగ్రత్త తీసుకో.”

శ్యామల టీచర్ మాటలతో ఆశకు ముందు తన తల్లి, తండ్రి గుర్తొచ్చారు. ముందు వారికంట పడకుండా చూసుకోవాలి అనుకుంది.

ఆశ భయపడినట్టే జరిగింది. ఒకరోజు చదువుకుంటూ మైమరచి రెక్కలు చాపింది ఆశ. అనూరాధ ఎందుకనో అప్పుడే ఆ గదిలోకి వచ్చి కూతురిని చూసి భయపడింది. మరుక్షణంలో ఆశ తన తప్పు తెలుసుకొని, రెక్కల్ని ముడిచి, ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త చేసుకొంది. మళ్ళీ ఏమీ ఎరగనట్టు ఏకాగ్రతతో చదువుకుంటూ కూర్చుంది. అనూరాధ ఆందోళనగా వెళ్ళి భర్తకు విషయం చెప్పి, వెంట తీసుకొని ఆశ వున్న గదిలోకి వెళ్లింది. వారు వచ్చిన అలికిడికి ఏ మాత్రం చలించకుండా చదువుకుంటూ వుంది ఆశ. చదువులో నిమగ్నమైపోయిన కూతురిని చూసి, ఆ యన భార్య చెప్పింది నమ్మలేదు. గది బయటకు వెళ్ళి, “నువ్వేదో భ్రమ పడ్డావు. మనుషులకు ఎక్కడైనా రెక్కలుంటాయా? ఒక్క రోజులో ఆశకు రెక్కలు ఎట్లా వస్తాయి?” అని వెళ్ళిపోయాడు.
ఆ రోజు నుంచి తల్లి తనను గుచ్చి గుచ్చి చూస్తోందని ఆశ గమనించింది. తన రెక్కల్ని దాచడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకొంది. ఆలా రెండేళ్ళు నెట్టుకు రాగలిగింది. ఒకసారి బాగా జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది ఆశ.

అనూరాధ మందులు ఇస్తూ, సపర్యలు చేస్తూ ఒక రోజు ఆశ భుజాలు తడిమి చూసింది. రెక్కలున్న విషయం నిర్ధారించుకుంది. భర్తకు చూపించింది. జ్వరంలో వున్న కూతురిని ఏమీ అడగలేకపోయారు. తల్లి అండ్రికి తన రెక్కల సంగతి తెలిసిపోయిందని ఆశ కూడా గుర్తించింది.

ఒకరోజు ఆశ ఆదమరచి నిద్రపోతుండగా అనూరాధ, ఆమె భర్తతో కలిసి ఆశ రెక్కల్ని కత్తిరించడానికి ప్రయత్నించారు. రెక్కల మీద కత్తి పెట్టారో లేదో ఆశకు మెలకువ వచ్చింది.
తన రెక్కల్ని కత్తిరించవద్దని ఏడుస్తూ ఒక్క ఉదుటున మంచం దిగి పక్క గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.

తల్లారాక, పనిమనిషి తలుపుకొడితే తలుపు తీసింది ఆశ. స్నానం చేసి, కాలేజీకి వెళ్లడానికి తయారైంది. తన బుక్సన్నీ రెండు సంచుల్లో సర్దుకొని, నాలుగైదు డ్రస్సులు ఒక సూట్కేసులో సర్దుకొంది. వాటిని చూసి ‘ఎందుకవన్నీ’ అని అనూరాధ అడిగింది.

“నాకు రక్షణ లేని ఇంట్లో నేనుండలేను. ఒకర్నొకరం అనుమానంతో చూసుకుంటూ దొంగల్లాగా బతకడం నాకిష్టం లేదు. పరీక్షలు అయ్యేదాక శ్యామల్ టీచర్ ఇంట్లో ఉంటాను. టర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను.” అని విసవిసా వీధిలోకి నడిచి, ఆటొ రిక్షా పిలిచింది. తల్లి, తండ్రి చూస్తుండగానే ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. ఆశతో ఒక్క మాట మాట్లాడలేకపోయారు.
రెక్కల్ని చూసి తామెందుకు అంత కిరాతకంగా ప్రవర్తించామా అని పశ్చాత్తాప పడ్డారు. ఆశను అదుపులో పెట్టాలని ప్రయత్నించి చివరికి తాము తప్పు చేశామని గుర్తించారు. ఆ సాయంత్రమే శ్యామల టీచర్ ఇంటికి వెళ్లి ఆశను ఇంటికి రమ్మని బతిమాలారు.

“వద్దు. మీరు నన్ను అర్ధం చేసుకోలేరు. ఈ ప్రేమ చాలు. అప్పుడప్పుడు కలుసుకుంటూ వుందాం. నేనిక్కడ సంతోషంగా వుంటానని మీకు తెలుసు. నా ఫురించి బెంగ పెట్టుకోవద్దు.” అని తల్లిని ఓదార్చింది. ఆశ ఓదారుస్తుంటే అనూరాధ గుర్తించింది. “ఆశ ఏనాడు తొందరపడి తనను ఒక్కమాటా అనలేదు. తనే ప్రతిసారీ – తను తల్లినని, తన మాట నెగ్గితీరాలని అనాలోచితంగా ప్రవర్తించానని అనూరాధ గుండెలవిసేలా ఏడ్చింది.

ఆ కన్నీళ్ళు ఆమెలోని కాఠిన్యాన్నంతా కడిగేసినట్టున్నాయి. ఆ రోజునుంచి ఆమె ఆశను అమితంగా ప్రేమించింది. ఆశ బి.ఏ.పూర్తి చేశాక ఉద్యోగంలో చేరాలనుకుంది. కానీ శ్యామల టీచర్ ఒప్పుకోలేదు. ఆశ తల్లి తండ్రి కూడా ఆశ చదువుకోవాలని చెప్పారు. వారిలో ఈ మార్పు చూసి ఆశ సంతోషపడింది. ఎం.ఎ. పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. అక్కడే ఆమెకు మురళితో పరిచయమైంది.

***

“అమ్మ నాకు జన్మనిచ్చింది. మా శ్యామల టీచర్ నాలో చైతన్యం కలిగించారు. చైతన్యం వున్నప్పుడే కదా నిజంగా జన్మించినట్టు.” అంది ఆశ. ఆ క్షణం లో ఆశలో మరికొన్ని అందాలు చూసి మురళి ఆనందంతో పొంగిపోయాడు.

శ్యామల టీచర్ని నాకింతవరకు పరిచయం చేయలేదు.” అన్నాడు మురళి.

వంట పూర్తి చేసి ఇద్దరూ చేతులు కడుక్కున్నారు.

“ఒక్క నిమిషం.” అంటూ గబగబా చేతులు తుడుచుకొంది నాప్ కిన్ తో. దాన్ని తిరిగి మురళి చేతుల్లో పెట్టి, ఫోటో ఆల్బం తీసుకొచ్చింది. మురళి కూడా గబగబా చేతులు తుడుచుకొని నాప్ కిన్ ను ఫ్రిజ్ కు తగిలించి, ఆల్బంలోకి తొంగిచూశాడు.

“ఇంతకు ముందే ఈ ఫోటో చూపించి, నాకిష్టమైన టీచర్ అని చెప్పావు కానీ, మీ మధ్య ఇంత అనుబంధం వుందని చెప్పలేదు. నాకు ఇప్పుడే శ్యామల టీచరును చూడాలని వుంది. వెళదామా” అన్నాడు మురళి.

“ఆమె లేదు. నేను ఎం.ఎ.లో వుండగా చనిపోయారు.”

“సారీ! ఆమెను గుర్తు చేసి బాధపెట్టాను.”

“అదేం కాదు. మన దగ్గర లేని వాళ్ళను గుర్తు చేసుకొని కొత్త ఉత్సాహం నింపుకోవాలి. నాకెప్పుడు దిగులు వేసినా శ్యామల టీచర్ను గుర్తు చేసుకుంటాను.”

“అవునా! అయితే ఆ ఫోటో ఇటివ్వు.”

“దేనికి” అంటూనే ఆల్బంలోంచి ఫోటొ తీసి ఇచ్చింది ఆశ.

“ఫోటో ఎన్ లార్జ్ చేయించి, లామినేషన్ చేయిస్తాను. బుక్స్ అల్మెరాలో కనిపించేట్టు పెట్టుకుందాం.”

“భలే మంచి ఐడియా.” ఆశ రెక్కల్ని చాపి మురళిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది.

***

ఎంత రెక్కలుంటే మాత్రం రాత్రి పదకొండు గంటలైంది. ఇంకా ఇంటికి రాలేదు టీచర్! మీరైనా చెప్పండి ఆశకు. ఈ భయాన్ని భరించడం క్షణక్షణానికి కష్టమవుతోంది.” ఫొటోలోని శ్యామల టీచరుకి ఫిర్యాదు చేసాడు మురళి.

అప్పుడే డోర్ బెల్ ట్రింగ్ మని మోగింది. పరుగున వెళ్ళి బోల్ట్ తీశాడు మురళి. ఎదురుగా ఆశ.

“హమ్మయ్య! ఏమైందోనని భయపడి చస్తున్నాను. ఎట్లా వచ్చావ్? ఎక్కడికెళ్లావ్. ఓల్డ్ సిటీలో కమ్యూనల్ టెన్షన్స్ మొదలయ్యాయి. నీ గురించి ఎంత ఆందోళన పడుతున్నానో, నీ కోసం స్వప్నకు, రాధికకు ఫోన్ చేశాను. నువ్వెక్కడికి వెళ్లింది వాళ్లు చెప్పలేకపోయారు.

“భార్గవి పూణేకు మకాం మారుస్తోందని చెప్పాను కదా! ఈ రోజు ఫ్రెండ్సందరికీ పార్టీ ఇచ్చింది. తొమ్మిదికంతా వస్తాననుకున్నాను. నీక్కూడా ఏదో మీటింగ్ వుందన్నావు కదా!” భుజానికున్న బ్యాగ్ అల్మె రాలో పెడుతూ అడిగింది.

“ఓల్డ్ సిటీలో టెన్షన్ గా వుందని మీటింగ్ రద్దు చేశారు. ఏడుకంతా ఇంటికి వచ్చాను. అప్పట్నుంచీ నీ కోసం ఎదురు చూస్తున్నాను.”

“ఏమన్నా చదువుకోవచ్చు కదా!” అంది కేన్ కుర్చీలో చేరగిలపడుతూ.

“నీకోసం ఎదురుచూస్తూ వంట చేశాను. ఫోన్ చేస్తావేమోనని నిన్ను తీసుకు రావొచ్చని ఎదురుచూస్తున్నాను. ఫోన్ చేయొచ్చుకదా.”

“నేను రాగలను కదా! నీ టైం పాడుచేయడం ఎందుకని ఫోన్ చేయలేదు. నేను తినే వచ్చాను. నువ్వు తిను.” డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచారు ఇద్దరు. మురళి వడ్డించుకొన్నాడు.

“రెండుమూడు నెలలుగా చూస్తున్నాను. బాగా పనులు పెట్టుకుంటున్నావు. ఇంటికి వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకుందామని కలలు కంటూ వస్తానా నువ్వు కనిపించకపోయే సరికి దిగులు వేస్తుంది. ఇక వస్తుంది. ఇక వస్తుంది అనుకుంటూ ఎదురుచూస్తుంటాను. ఉదయమే ఏదన్న మీటింగ్ వుంటే చెప్పొచ్చు కదా. నేను వచ్చి పికప్ చేస్తాను. త్వరగా ఇల్లు చేరుకుంటాం.”

“ఎందుకిలా తయారవుతున్నావ్ మురళీ. నేను పనులు కల్పించుకుంటున్నట్లు నువ్వూ ఏమైనా పనులు పెట్టుకోవచ్చు కదా!”

“నన్నంటున్నావ్. నువ్వెందుకు మారిపోయావు. నువ్వెక్కడికి వెళ్ళేదీ నాకెందుకు చెప్పడం లేదు.”

“ప్రతిదీ ఎందుకు చెప్పాలి?”

“తప్పేమిటి.”

“నాకిష్టంలేదు. కొన్నికొన్ని పనులు నేను చేసుకుంటేనే నాకు హాయిగా వుంటుంది.”

“నేను వెంట వుండడం నీకు ఇబ్బందిగా వుంటుందా?” మురళి అన్నాడు.

“ఎందుకుండదు. లేకపోతేనీకు బోర్ కొట్టకుండా నేనూ, నా ఫ్రెండ్స్ చూసుకోవాలి. అదీ కాక, నీకు నీ ఎప్పుడూ ఎవరో ఒకరికి నష్టం కలుగుతుంది. నీ ష్నేహితులు, నీ పనులు వేరే వుండాలి లేకపోతే ఎట్లా?”

“నీకూ నాకూ అంటూ ప్రత్యేకంగా ఎందుకు.. నీ ఫ్రెండ్సే నాకు ఫ్రెండ్స్.”

“అంత ఇరుకుగా జీవించవద్దు మనం. అన్నిట్ట్లో పూర్తిగా కగలిసి పోవడంలో ఎప్పుడూ ఎవరో ఒకరికి నష్టం కలుగుతుంది. నీ స్నేహితులు, నీ పనులు వేరే వుండాలి. రవిశంకర్ నీకు మంచి ఫ్రెండే కదా. ఎన్నాళ్లయింది మీరు కలుసుకొని?”

“ఇప్పుడవన్నీ ఎందుకు – నీకు ఇబ్బంది కలక్కుండా చూడ్డం కోసమే నేను నీకోసం వస్తానంటున్నాను.”

“అది నాకిష్టం లేదు. నువ్వు నాకోసం డ్రైవర్ గానో, పి.ఆర్వోగానో పనిచేయడం నాకిష్టంలేదు. నాకు రెక్కలున్నాయి. నా పనులు నేను చేసుకోగలను.”

ఆశ అభిప్రాయాలు ముందు కఠినంగా కనిపించాయి మురళికి. ఆలోచిస్తున్న కొద్దీ అందులో అర్ధం చాలా వుందనిపించింది. నిజమే ఒకరి స్వేచ్చ మరొకరికి అడ్డంకి కాకూడదు అనుకున్నాడు మురళి.

*** * ***