కథాకథనం

బికినికిల్లర్ ని గుర్తుకు తెచ్చిన కథ

నవంబర్ 2014

‘మనుషులందరూ ఒక్కటే. అందర్లో ప్రవహించేదీ రక్తమే.’ అనే మాటలతో ఏ మాత్రం ఏకీభవించబుధ్ధి కాదు. కారణం – మనుషులందు అసలైన మనుషులు వేరు కాబట్టి. కొందర్లో రక్తానికి బదులు రాక్షత్వం ప్రవహిస్తూంటుంది కాబట్టి. ఒకొక్కరిలో ఎర్ర మనిషీ, నల్ల మనిషీ కూడా రహస్యంగా దాగి వుంటారు కనక. కౄరమృగాలు, శాడిస్టులు, హంతకులు, పరమనీచులు – మనిషితోలు కప్పుకునుంటారు కనక. అందుకే కామోసు మార్క్ ట్వైన్ మనిషి కౄరత్వం గురించి ఇలా అంటాడు: of all the animals man is the Only one that is cruel.

ఎన్ని రూపాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కపటి వేషధారణలు! ఎన్ని వికృత చేష్టలు, మరెన్ని దుర్మార్గపు ఆలోచనలు, ఎన్ని గృహ హింసలు? రోజూ ఎన్ని దుర్వార్తలు వింటున్నాం? ఎందరెందరి దుష్ట దుశ్శాశనల్ను చూస్తున్నాం? నమ్మశక్యం కాని దురాగతాలు చేస్తోంది రాక్షసులు కాదు. మనుషులే! పైకి మావూలుగా, ప్రసన్నంగా, సాధారణంగా కనిపించే వీళ్ళా, ఇంతేసి దారుణాలకు ఒడిగట్టిందీ!?.. అని విస్తుబోతూ నోట మాటరానివాళ్ళమౌతాం. అంతే మరి. రూపంలో రాముళ్ళు. గుణం లోనే రావణాసురులు. లేకపోతే?, ‘మేము చాలా చెడ్డవాళ్ళం’ అని ముఖాన బోర్డ్ కట్టుకుంటారా ఏవిటీ – ఎవరైనా? ‘నాలో ఓ క్రిమినల్ వున్నాడు. నాతో జాగ్రత్త గా వ్యవహరించండి.’ అంటూ హెచ్చరికల స్టిక్కర్ అతికించుకుని తిరుగుతాడా ఎక్కడైనా? ఎంతటి విలన్ అయినా తను విలన్ గా గుర్తించబడటానికి ససేమిరా ఒప్పుకోడు. చెబితే నమ్మం కానీ, నల్ల తలల విష నాగుపాము మనుషుల్లోనే పడగలిప్పుకుని వుంటుంది. కాటు తిన్న వారికే ఆ విషయం అర్ధమౌతుంది.

వీళ్లెక్కడో వుండరు. మన మధ్యే వుంటారు. నమ్మిస్తూ, నమ్మక ద్రోహం చేస్తూ, వంచిస్తూ, నిశ్శబ్దంగా మన జీవితాల్లోకి జొరబడిపోతుంటారు. ఒక యవ్వన స్వాములోరు జన్మ సాఫల్య రహస్యాలని ఉద్బోధిస్తుంటే ‘అహా, ఇంకేముంది అపర శంకరాచార్యులు వెలిశాడంటూ అర్జెంట్ గా ఆశ్రమం కట్టించారు పెద్దలు. సకల సౌకర్యాల శయ్య మీద ఎంచక్కా ఓ భామతో రాస క్రీడలాడుతూ ఓ శుభ ముహూర్తాన సినిమా చూపించాడు. ఆ శృంగార స్వామి కోర్ట్ బోనెక్కినా కానీ, ఇంకా నమ్మడం లేదు భక్తజనాలు. తను కాషాయం కట్టింది తనువుకి కానీ తలపులకు కాదు కదా? సన్నాసి అవతారమెత్తినంత మాత్రాన, కోర్కెలు కాశీలో వదిలేయాలా? – అనే గనక స్వామి అంటే భక్త జనం వూరుకోరు. భరతం పడతారు. అందుకే సాములోరు ఇన్నాళ్ళూ తనలోని నిజ గుణాన్ని కప్పెట్టాడు. కాషాయం ముసుగు కింద.

కొంతమంది ప్రజా పాలకులు ప్రజలకి తెలీకుండా ప్రజలని దోచేస్తూ ప్రజల చేత పూజలందుకుంటుంటారు. ఇదొక అద్భుతమైన మోసం. ఇలాటి వారి నేర ప్రవృత్తిని పట్టీయడం, చేసిన నేరాలని ఋజువు చేయడం బహు అసాధ్యకరం. కత్తి మీద సాము లాటిది. ఒకవేళ పట్టుబడ్డా, ప్రజలు ససేమిరా నమ్మరు. పట్టిచ్చినవాడ్ని ఛావకొడతారు. ఐతే, ఈ గొప్పదనం ప్రజలది కాదు. అంత గొప్పగా నటిస్తున్న నేర నాయకునిది. ఈ నటన అనే ముసుగులో ప్రజల పాలిట దేవుళ్ళుగా కూడా చలామణి అయిపోవడం చూస్తుంటే…పిచ్చెక్కిపోతుంది మేధావులకి.

నేరగాని వేషం, ప్రవర్తన కూడా అంతే. అతడొక క్రియేటివ్ ఆర్టిస్ట్. అతనాడుతున్న నాటకం ముగిసే చివరి క్షణం దాకా కానీ అతనిలో దాగిన భయంకర సర్పం బయట పడదు. పడగలు విప్పుకున్నఆ నల్ల పాము విష కోరలనుండి అప్పుడిక రక్షించే దిక్కే వుండదు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ కథ చదువుతుంటే చప్పున బికిని కిల్లర్ గుర్తొచ్చాడు. ఆ సెర్పెంట్ కళ్ళ ముందు కదిలాడు. ముంబై సినిమా ప్రపంచం నుంచీ లాడెన్ వరకు విస్తరించిన చీకటి సామ్రాజ్యాధిపతి ప్రత్యక్షమయ్యాడు.

దిగ్భ్రాంతి కలిగించే సత్యమేమిటంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ కఠిన నేరగాళ్ళ తీరంతా కళ్ళక్కట్టినట్టు యాభై యేళ్ళ కిందటే తన కథలో చిత్రీకరించారు రచయిత త్రిపుర. అచ్చు ఆ పాత్రలోంచే నడచొస్తున్నారా ఈ నేర గాళ్ళంతా అనిపించేలా… అనేకానేక వికృత స్వభావాలతో, వెర్రి తలల అకృత్యాలతో, అచ్చు మంచి మనుషుల్లా.. ఇంకా చెప్పాలీ అంటే, శేషాచలపతిలా.

ఇంతకీ అసలు కథ ఏవిటో నేను వివరించడం కంటే మీరు స్వయంగా చదివి తెలుసుకుంటేనే బావుంటుంది.
రచయిత గురించి మాటల్లో చెప్పాలి అంటే, నా లాటి చిన్న వారికి అదో పెద్ద విజ్ఞాన పరీక్ష లాంటిది. ఆకాశాన్ని అద్దంలొ చూపడమా! అదెలా సాధ్యం? ఉగ్గు గిన్నెలోకి సముద్రాన్ని వొంపే ప్రయత్నమెలా చేయడం? నా వరకు నాకది కాని పనే సుమా!
ఈ పాముని చూసి, చదివాక, మీ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా కోరుతూ..
శలవు మరి!


పాము
-త్రిపుర


శేషాచలపతిరావ్ అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ “ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్” అని చెప్పాడు. అద్దంలోని శేషాచలపతిరావ్ తో. అద్దంలోని శేషా…నవ్వి “గొప్ప మజా, స్కౌండ్రల్, నీ సంగతేం చెప్పను. అవును కానీ, నీకు ఎడం పాపిడేమీ బాగులేదు . ఇవాళ కుడి పాపిడిలాగు. టై నాట్ కింద డింపుల్ బాగులేదు. షోల్డర్స్ ఇంకా స్క్వేర్ చెయ్యి.” అన్నాడు.

విండ్సర్ నాట్ కింద డింపుల్ దిద్ది, పాపిడి కుడి చేసి, మళ్ళీ బ్రష్ చేసి, బుగ్గల్లోని డింపుల్స్ ప్రాక్టీస్ చేసి అద్దం పక్కని పిన్ చేసి ఉంచిన క్లాస్ రొటీన్ చూశాడు.

“మొదటి రెండు పీరియడ్సూ ఉండాలి. మూడు, నాలుగూ స్కిప్ చెయ్యొచ్చు.”

హాస్టల్ గేటు దాటుతూ “పవర్, ట్రెచరీ, ఎడ్వంచర్. నేను నేతాజీని. హిట్లర్ని. వినండి, బుధ్ధిలేని బలం లేని బాస్టర్డ్స్…మిమ్మల్ని హతమార్చేస్తాను. పారా హుషార్…. లక్షలు లక్షలుగా క్రిముల్లాగ బ్రతుకుతున్న మిమ్మల్ని రూపురేఖలు లేకుండా చేస్తాను…” పిడికిలి బిగపట్టి, హాస్టల్ వేపు కాలేజీ వైపు చూపించి గట్టిగా చెయ్యి ఊపేడు.

జోరుగా వచ్చే రిక్షాని తప్పించుకుని హిందీలో బూతులు తిట్టేడు.

మొదటి రెండు పీరియడ్స్ స్కిప్ చెయ్యుచ్చు. దశాశ్వమేధ్ ఘాట్ కి వెళ్తాను ’ అని అనుకుంటూనే లైబ్రరీ వేపు తిరిగి, ‘అలఖ్ నిరంజన్! నిన్ను..నన్నే..నేను డిసీవ్ చెయ్యగలను తెలుసా’ అని లైబ్రరీ వేపు నడవటం మొదలుపెట్టాడు.

సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద గుట్టలు గుట్టలుగా రీబైండ్ చేసిన పుస్తకాలు పేర్లు రెజిస్టెర్లో రాసుకుటున్నాడు. నేరుగా లోపలికి పోయి బీరువాల్లో పుస్తకాల టైటిల్స్ చూడటం మొదలు పెట్టాడు అలఖ్ నిరంజన్.

చీర రెపరెపలు.

సున్నితంగా మాటలు.

కంటి చివరినుంచి చూస్తే, సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద వేళ్ళు. లేడి..జింక…డీర్.

ముఖం తిప్పి చూసేడు.

తనవేపే చూస్తుంది. ఉమాడే.

అప్రయత్నంగా కళ్ళతో నవ్వేడు అలఖ్. అప్రయత్నంగా కళ్ళతో నవ్వడం అలవాటు చేసుకున్న నిరంజన్.

హిందీలో అంది. “నా కార్డ్ మర్చిపోయాను. శనివారం త్రివేదీ సెమినార్ లో ఎస్సే సబ్మిట్ చెయ్యాలి. మీ కార్డ్ మీద ఛాసర్ మీద బుక్స్ ఏమేనా ఇప్పిస్తారా?”

ఆ క్షణం లో చిరునవ్వు మాయమయి పోయింది నిరంజన్ కళ్ళల్లో. క్షణంలో కళ్ళల్లోని నవ్వుని మాయం చెయ్యడం అలవాటు చేసుకున్న అలఖ్ కళ్ళల్లో. ఇంగ్లీషులో అన్నాడు: “కారిడార్ లోకి రండి.”

గాజు అద్దాల కిటికీ దగ్గరగా వెళ్ళి, వెనక్కి తిరిగి కోపంగా అన్నాడు. “నా కార్డ్ ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరగను. మీరెవరో నాకింకా బాగా తెలియదు. తెలియని ఆడవాళ్ళందరకీ సహాయం చేసే షివల్రస్ మనిషిని కాను.”

ఉమా కళ్ళల్లో మెరుపులాగా కోపం..

“ఇవ్వకపోతే యివ్వనని మృదువుగా చెప్పొచ్చు. గొంతుకలో అంత థండర్ అవసరం లేదు.”

విసురుగా చీర మెరుపు మాయమయింది.

మళ్ళీ తెర ఎత్తబడింది. తను అనుకోకుండానే అకస్మాత్తుగా. అయితే, తన భవిష్యత్తుకి ఆకారం తానే యిస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది తను ఎప్పుడో ఊహించి మనస్సు మారుమూలల్లో తొక్కిపడేసి ఉంచిన నాటకంలోని ఒక భాగం.
తెర ఎత్తేసింది కాలం. కాస్త ముందుగానే.అలఖ్ నిరంజన్! నిన్ను …నన్నే..నేను డిసీవ్ చెయ్యగలను తెలుసా’ అని లైబ్రరీ వేపు నడవటం మొదలుపెట్టేడు.

అయితే తను ఎప్పుడూ సిద్ధమే.

“జగదేవ్..జగదేవ్!…”

“జీ.”

“ఈ అల్మైరా తాళాలియ్యి.”

తాళాలు తీసుకుని బీరువా తెరిచి రెండు పుస్తకాలు తిరగేశాడు. జగదేవ్ అక్కడే నిలబడ్డాడు.

ఒక చివరన ఇషర్ వుడ్ నావల్ ఒకటి కనిపించింది.

“ఇదిగో! నువ్వు అన్నిరకాల మనుషులకీ తాళాలిచ్చేస్తావ్. ఎలా అడ్డదిడ్డంగా పెట్టేశారో చూడు. ఈ పుస్తకం యిక్కడేమిటి చేస్తూంది. తీసుకువెళ్ళి ఫిక్షన్లో పెట్టు. మీకు బుధ్ద్ధి రాదు. ఎన్నిసార్లు లైబ్రేరియన్ చేత తిట్ట్లు తిన్నా.”

జగదేవ్ గొణుక్కుంటూ పుస్తకం తీసుకుపోయేడు.

అల్మైరాలోంచి ఛాసర్ మీద లెగూయీ రాసిన పుస్తకం పైకి తీసేడు. కోట్ ప్రక్కకి లాగి, షర్ట్ కి, బెల్ట్ కీ మధ్య పుస్తకాన్ని తోసి, మళ్ళీ కోటు గుండీలు పెట్టాడు. ఎడం చెయ్యి అడ్డంగా పెట్టుకుని జగదేవ్ ని పిలిచి తాళాలు యిచ్చేశాడు.

కౌంటర్ దగ్గర;
“పండిట్జీ, ఇంకా కాస్త విజిలెంట్ గా ఉండాలి. పుస్తకాల దొంగలు ఎక్కువయి పోయారు. ఇవాళ నాకు కావాలసినవి ఒకటీ కనిపించలేదు. ఇస్యూకూడా అవలేదు. మీరింత ఇనె ఫిషెంట్ గా ఉంటే మేము కంప్లెయిన్ చెయ్యవలసొస్తుంది. “కోపంగా వికెట్ తోసుకుని విసురుగా పైకి వచ్చేశాడు అలఖ్ నిరంజన్.

లైబ్రరీ దగ్గర చెట్టుకింద కేంటీన్.
చెట్టుకింద బల్లమీద కూర్చుని నాలుగు సమోసాలు తిని, టీ తాగుతూ చుట్టూ ముసిరే ఎర్ర కందిరీగల్ని ఛాసర్ తో అప్పటికే ఆరు చంపేడు.

‘ఇంకో అయిదు నిమిషాల్లోపల ఉమ పైకి రావాలి…వచ్చి తీరాలి’ అనుకున్నాడు రిస్ట్ వాచ్ విప్పి చేత్తో పట్టుకున్నాడు. సాసర్ బల్లమీద ఉంచి, కప్ మాత్రం చేత్తో పట్టుకుని లైబ్రరీ వేపు తిరిగి నిలబడ్డాడు. నాలుగు నిముషాల నలభయి సెకండ్లు..నలభై ఐదు..ఏభయి…ఏభయి ఎనిమిది…అయిదు నిముషాలు.

ఉమ లైబ్రరీ మెట్లు దిగి వస్తూంది. దగ్గరగా వచ్చింది.

“హలో! మీరు రెండు సెకండ్లు ఆలస్యం చూశారా స్టాప్ వాచ్ లాగా పట్టుకుని ఎలా లెఖ్క పెట్తున్నానో ఈ సారికి క్షమించేను….రండి, మేనర్సు గురించి బాధపడితే మీకు కావాల్సిన బుక్ దొరకదు. మీ హృదయంలోని మిక్సెడ్ ఫీలింగ్స్ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా….”

ముందుకు, దగ్గరగా అడుగు వేసింది ఉమ.

“…అయినా, మీరు వప్పుకుంటారు…రండి.”

ఉమ నవ్వింది. బెంచ్ మీద కూర్చుంది.

“గులాబ్ జామున్ కూడా చేశాడు శర్మాజీ. స్వీట్స్ అంటే అసహ్యం నాకు. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళని మెషిన్ గన్ తో షూట్ చేద్దామనిపిస్తుంది. కాబట్టి సమోసాలు. ఏమంటారు. అండ్ టీ…ఇదిగో మీకు కావలసిన పుస్తకం. మన ఫ్యూచర్ అసోసియేషన్కి చిహ్నంగా యీ ఆరు కందిరీగల కళేబరాల్ని ఛాసర్ తో చంపి సిధ్ధంగా ఉంచేను…వద్దు. మీరు మాట్లాడటానికి ప్రయత్నించకండి. నేనే అంతా మాట్లాడేసిన తరువాత మీకు అవకాశం యిస్తాను…మీరు నాకు జూనియర్. మీ పేరు ఉమాడే. గౌహతిలో బి.ఏ.చదివేరు. ఇక్కడ బెంగాలీ టోలాలో అంకుల్ దగ్గర ఉన్నారు. తరువాత, నా సంగతి బెలూచిస్తాన్, జర్మనీ నా స్పిరిట్యుయల్ హోంస్. ఇంఫాల్ లో ఫోర్టీంత్ ఆర్మీలో పని చేశాను. కెప్టెన్ గా, కోర్ట్ మర్షల్ చేసేరు. కారణాంతరాల వల్ల ఇక్కడ ముప్పయి సంవత్సరాల వయస్సులో – యూనివర్సిటీలో చదవటానికి కారణాలు:
ఒక్కొక్క వేలు ముడుస్తూ చెప్పేడు.

“…ఒకటి : నాకు హోం లేదు. బంధువులు లేరు.

రెండు : ఉద్యోగాలు చెయ్యటానికి కావలసిన టెంపెరమెంట్ లేదు.

మూడు : హోటల్స్ లో ఎప్పుడూ ఉండటానికి కావలసిన డబ్బు లేదు.

నాలుగు : యూనివర్సిటీలో చదువు నా ఎస్టిమేట్ ప్రకారం చాలా చవక.”

“చూశారా…నాలుగు నిముషాల్లో, నాలుగు నెలల పరిచయం అయితేగాని తెలియని విషయాలన్నీ చెప్పేశాను. కాలానికి ఏదీ వదిలెయ్యకూడదు….”

సమోసాలు, టీ వచ్చేయి.

ఉమ తినడం మొదలు పెట్టింది.

“రిమార్కబుల్. మీరు రెండు వేళ్లతో సమోసాలని చిన్న చిన్న ముక్కలు చేసి గ్రేస్ ఫుల్ గా గా నోట్లో పెట్టుకుని అవి బాధతో ఏడుస్తాయేమో అన్న భయంతో మెల్ల మెల్లగా తినడం అలవాటు చేసుకోలేదు. ఎడ్మిరబుల్.”

సమోసాలు అయిపోయాయి.

“ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు.”

“మీరు విచిత్రమయిన వ్యక్తులు. అన్ని విషయాలు చెప్పేరు గాని మీ దగ్గర లైబ్రరీ కార్డ్ లేకుండానే యీ పుస్తకం ఎలా తెచ్చారో చెప్పలేదు.” కుడిచేతి వేళ్ళ గోళ్ళతో బెంచ్ మీద వరసగా చప్పుడు చెయ్యడం మొదలు పెట్టేడు. “హార్స్ రైడింగ్ యిన్ చండికా..చాలా కాలం క్రింద చండిక అనే ఫిల్మ్ చూశాను. అందులో గుర్రాలు పరుగెటుతుంటే యిదే చప్పుడు. చండికా ఆన్ హార్స్ బేక్..ఐదడుగుల పదకొండున్నర అంగుళాల పొడవూ, నూట ఎనభయి పౌన్ల బరువూ మనిషిని. ఈ పది ఔన్సుల బరువు పుస్తకాన్ని తేడానికి లైబ్రరీ కార్డ్ ఉండాలా?….ఇష్యూ కౌంటర్ దగ్గర పండిట్జీ బాగా తెలుసులెండి. అడిగి తెచ్చాను. మీరు నాలుగు రోజులుంచుకుని నాకు తిరిగి యిచ్చేయండి.”

ఉమ తెలివైన పిల్ల.

అంది: “నన్నొకమాట చెప్పనిస్తారా. మీరు చాలా నెర్వెస్ మనుష్యులనుకుంటాను. దాన్ని కప్పి పుచ్చడానికి ఈ విధంగ మాట్లాడతారు…అంతేనా?” ఉమ కళ్ళల్లోకి సూటిగా, తీవ్రంగా చూశాడు నిరంజన్.

“మీరు సైకాలజీ పుస్తకాలు చదివినట్టున్నారు. లేకపోతే ఎవరో అంటే విన్నారు. అంత సులభంగా లేబుల్ అంటించీకండి. మీ మంచికి చెప్తున్నా. నేను డేం..జ…ర..స్..మనిషిని.”

“శర్మాజీ?”

రూపాయినోటు యిచ్చి చిల్లర తీసుకున్నాడు.

“నన్ను మరచిపోండి. ఈ సెప్టెంబర్ వెదర్ నన్ను సరదాగా మాట్లాడటానికి ప్రోత్సహించింది. అంతే మీకింకా చిన్న వయస్సు. గుడ్ బై!” లేచి గిరుక్కున తిరిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బిర్లా హాస్టల్ వేపు నడిచిపోయాడు. అలా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవడం అలవాటయిపోయిన అలఖ్.

బ్రోచ్ హాస్టల్ దగ్గర బస్ ఎక్కేడు. ఖాళీగా ఉంది.

గోడోలియాకి రెండు టిక్కట్లు అడిగేడు.

“ఒక్కడికే రెండెందుకూ”అడిగేడు కండక్టర్.

“అది నీకవసరం లేదు. ఒకటి నాకూ, రెండోది నా స్పిరిట్ కి” అన్నాడు అలఖ్.

రూయా హాస్టల్ స్టాప్ దగ్గర అమెరెకన్స్ లా కనిపించే ఒక జంట ఎక్కేరు. అతను లావుగా, పొట్టిగా. ఆమె సన్నగా, పొడుగ్గా, అందంగా.

“లై కే క్వీన్’ అనుకున్నాడు. క్రిందటి సాయంత్రం సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఒక పెద్ద గ్రూప్ దిగిందట. ఆ గ్రూప్ లోని వాళ్లే గాబోలు అనుకున్నాడు.

కండక్టర్ తో “గేంజిస్ కి టికెట్స్” అన్నారు వాళ్ళు.

కండక్టర్ కి బోధపడ లేదు.

“గోడోలియాకి యియ్యి.” అన్నాడు అలఖ్.

వాళ్ళవేపు చూసి అన్నాడు. “మీకు యిష్టమయితే సహాయం చెయ్యగలను? నేను గూడా గేంజిస్ వేపే వెళుతున్నాను.”
థేంక్స్ తో ఉక్కిరి బిక్కిరి చేసిన తరువాత అన్నారు. “గ్రూప్ లో తిరగడం థ్రిల్లింగ్ గా ఉండదు మాకు. అందుకే ముందుగా బయలు దేరేము. లక్కీగా నువ్వు కలిసేవు.”

“నువ్వు హిందూవేనా? ఇజిప్షన్లాగో, స్పేనియర్డ్ లాగో ఉన్నావు.” అని అడిగేడు మన అమెరికన్.

పరిచయం చేసేడు. “నా పేరు జేమ్స్ ఎలియట్. ఈమె నా మిసెస్ ఎలియెట్…క్వీనీ ఎలియట్.”

‘లై కే క్వీన్!” నిజమే అనుకున్నాడు నిరంజన్.

“నేను హిందూని కాను. ముస్లిం ని. పేరు బైరాంఖాన్. మీరు గేంజిస్ చూడొచ్చు. కాని టెంపుల్స్ లోకి రానీయరు.”

“ఇదిగో యిక్కడే దిగాలి.”

క్వీనీ దిగడానికి తన చెయ్యి యిచ్చి సహాయం చేశాడు.

ముగ్గురూ దశాశ్వబేధ్ వేపు నడిచారు.

జేమ్స్, క్వీనీ దృశ్యాల్ని తాగుతున్నారు!

లస్సీ దుకాణంలో బెంచ్ మీద కూర్చున్నారు.

చోక్రాని పిలిచి “మూడు గ్లాస్ లు తీసుకురా. భంగ్ కలుపు.” అన్నాడు.

అప్పుడే కలలోంచి లేచి ప్రపంచాన్ని కొత్తకళ్ళతో చూస్తున్నట్లు చూస్తున్నాడు. జేమ్స్ గుంపులుగా రోడ్ మీద నడిచే ఇండియన్ ప్రజల్ని, టాంగాల్ని, ఎక్కాల్నీ.

క్వీనీ మధురమైన స్వరంతో. “నువ్వు యూనివర్సిటీలో చదువు తున్నావా?” అని అడిగింది.

“ఇక్కడ యూనివర్సిటీలో యిడియట్స్ తప్ప ఎవరూ చదవరు. నేను తోళ్ళ వర్తకం చేస్తాను. యూనివర్సిటీ డైరీలో ముసలి ఆవులు బేరానికొస్తే కొనడానికి వచ్చేను. నాది మీర్జాపూర్ హెడ్ క్వార్టర్స్.”

ఛోక్రా లస్సి తెచ్చి టేబుల్ మీద పెట్టాడు.

“ఇందులో భంగ్ వేయించేను. చాలా థ్రిల్లింగ్ డ్రింక్” అని జేమ్స్ చెవిలో ఏదో అన్నాడు. జేమ్స్ మొదట షాక్ అయి, తరువాత ఏమనాలో తెలియక నవ్వేడు.

లస్సీ మెల్లగా తాగేరు ముగ్గురూ.

జేమ్స్ ఎంతయిందో అడిగి, జేబులోంచి వాలిట్ తీసి, మెల్లగా కూడ బలుకుతూ లెక్క పెట్టి యిచ్చేడు. వాలిట్ లావుగా, నోట్లతో వానాకాలం కప్పలాగుంది.

“పదండి గేంజిస్ దగ్గరకు పోదాం.”

ఘాట్ వేపు నడిచేరు.

వెల్లువతో గంగానది బురద నీరు ఉరకలేస్తూ ప్రవహిస్తూంది. విజృభించి మెట్ల మీద కెరటాలు పగిలి సుడిగా వెనక్కి తిరుగుతున్నాయి.

“క్రాస్ చేద్దామా”

వయులెంట్ గా ఉన్నట్లుంది. అవేనా బోట్స్? చాలా ఫ్లిమ్సీ గా కనిపిస్తున్నాయి.” అన్నాడు జేమ్స్.

“ఏం భయం లేదు. ఇంతకంటే వరద ఎక్కువ వున్నప్పుడు కూడా తీసుకుపోతారు యీ పడవ వాళ్ళు. పోనీ డౌన్ స్ట్రీమ్ పోదామా?”
జేమ్స్ ముఖంలో భయం. “వద్దు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. క్వీనీ కూడా ఉంది.”

థ్రిల్ల్స్ కావాలి నీకు. కవర్డ్.

“సరే. నీకేమేనా బనారస్ బ్రొకేడ్స్ కావాలా?” అడిగేడు క్వీనీని.

క్వీనీ ముఖంలో సంతోషం. “చాలా కొందామని ఉంది. ఆ దుకాణాలకి తీసుకువెళ్ళు…ప్లీజ్!”

విశ్వనాధ్ గల్లీలోకి తీసుకు వెళ్తూ ఆగేడు అలఖ్.

జేమ్స్ తో అన్నాడు : “ఇక్కడ జేబుదొంగలు ఎక్కువ. మీ దగ్గర వాలిట్ వుంచడం మంచిది కాదు. ఇక్కడ జేబు కొట్టే వాళ్ళందరూ నాకు తెలుసు. వాలిట్ నా దగ్గరుంచితే ఏ భయమూ లేదు.”

జేమ్స్ తొందరగా కోట్ లోపలి జేబులోంచి వాలిట్ తీసి అలఖ్ కి యిస్తూ “ముందే చెప్పినందుకు చాలా థేంక్స్.” అన్నాడు.
గల్లీ లోకి వెళ్లారు.

చాలా రద్దీగా ఉంది. క్వీనీ దుకాణాల్లో వేళ్ళాడగట్టిన చీరెల్ని, కంచు, యిత్తడి సామానుల్ని ఆశ్చర్యంగా చూస్తూంది.
జేమ్స్ పొట్టి కాళ్ళతో వెనుక నడుస్తున్నాడు.

దుకాణాల సేఠ్లు కాకులాగ పిలుస్తున్నారు.

బీహారీ పల్లెటూరు గుంపొకటి గొడవ చేస్తూ ముందు నడుస్తుంది.

ఆబోతు ఎదురుగా రంకెవేస్తూ వేగంగా దూసుకుంటూ పరుగెత్తుతూ వచ్చింది.

బీహారీ గుంపు అరుచుకుంటూ చెదిరిపోయి వెనక్కీ ముందుకూ గోల పెడుతూ పరుగెడ్తూంటే…

‘రన్’ అని గట్టిగా అరిచి, ఇద్దరి చేతులూ పట్టుకుని పరుగెత్తేడు. “వాట్ ద హెల్ యీస్ ద మేటర్ నౌ” అంటూ పొట్టికాళ్ళ జేమ్స్ చెయ్యి విదిలించుకుంటూ అడిగేడు.

“శ్… హిందూ ముస్లిం రయట్” క్వీనీ చెయ్యి పట్టుకుని పరిగెత్తుతూనే అన్నాడు.

బీహారీ మూక మధ్య జొరబడ్డారు.

క్వీనీ చెయ్యి కూడా వదిలి అలఖ్ ఇంకా వేగంగా ముందుకు దూసుకుపోయి గల్లీలోంచి పైకి పోయాడు.

చౌక్ లోంచి కట్ చేసి యింకో చిన్న గల్లీలో జొరబడి ‘సంగం’బార్ చేరుకున్నాడు.

గట్టిగా వూపిరి బిగించి ఒక నిముషం నిలబడ్డాడు. పేంట్ జేబులో చెయ్యి పెట్టి బరువుగా, డబ్బుగా ఉన్న వాలిట్ ని సంతృప్తిగా తడిమేడు. వాలిట్ పైకి తీసి, నోట్లు పైకి లాగి, వాలిట్ ని కాలవలో విసిరేశాడు. బార్ లోపల అడుగు పెట్టేడు. సగం బార్ నిశ్శబ్దంగా ఉంది. హాల్ అద్దంలో జుత్తు దువ్వుకుని, రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. జేబులో నోట్లు మళ్ళీ చూసుకున్నాడు. అరవయికి పైగా పది రూపాయల నోట్లు అద్దంలో చూస్తూ, కుడికన్ను గట్టిగా మూసి నాలిక పైకి పెట్టి మళ్ళీ లోపలకి మడిచి, ఎడం చెయ్యి చూపుడువేలు పెదవుల మీద నిలువుగా నిలిపి మెల్లగా అన్నాడు. “ఎవరికి చెప్పొద్దు…సక్కర్స్.”

బార్ లో నిశ్శబ్దం. బూత్స్ లో తొంగి చూస్తే ఎవరూ లేరు. పక్క గదిలో బెనర్జీ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు. కునుకు తీస్తున్నాడు బెనర్జీ, డెస్క్ మీద ముఖం పెట్టుకుని. చప్పుడు చెయ్యకుండా డెస్క్ మీద తాళాలు తీసి, వెనక గదిలోకి వెళ్ళి బీరువా తెరిచాడు, క్రింద అరలో కారూస్ జిన్ బాటిల్ తీశాడు. బెనర్జీ దగ్గరకు వచ్చాడు. డెస్క్ మీద వంగి బెనర్జీ వీపు మీద గట్టిగా చరిచాడు. ఉలిక్కిపడి కోపంగా, బాధగా, భయంగా, అర్ధం లేని అరుపులు అరుస్తూ లేచాడు బెనర్జీ.

కళ్ళు రెపరెపలాడించి శేషాచాపతిని చూసి బెంగాలీలో అన్నాడు :
“అబ్బ ఎంత దెబ్బ కొట్టేవు రావు బాబూ. ఇంత మిట్ట మధ్యాహ్నం వచ్చేవేమిటి. ఎవరూ లేరు కుర్రాళ్ళు!”

“నువ్వు యిలా తలుపులు తీసిపెట్టి కునుకు తీస్తుంటే లిక్కర్ స్టోర్ అంతా ఖాళీ అవుతుంది ఒక గంటలోనే. ఐస్ ఉందేమో చూడు.” బెనర్జీ లోపలికి వెళ్ళాడు ఐస్ కోసం.

అలఖ్ అక్కడే సోఫాలొ కూర్చుని బాటిల్ మూత తీసేడు.

బెనర్జీ ట్రే లో ఐస్, వైన్ గ్లాసుకు, నిమ్మకాయలు పట్టుకొచ్చాడు. గ్లాసులలో మూడు పెగ్ లు జిన్ పోసి, ఐస్ ముక్కలు వేసి బెనర్జీ కొకటి యిచ్చి, తను సిప్ చెయ్యడం మొదలు పెట్టేడు.

బెనర్జీ గడగడ తాగేసి గ్లాస్ ఖాళీ చేసి మాట్లాడటానికి గొంతు సవరించుకుంటుంటే, “మాట్లాడొద్దు. నన్ను వదిలి నీ పని నువ్వు చూసుకో – అంటే, మళ్ళీ ముఖం డెస్క్ మీద పెట్టి పడుకో.” అన్నాడు అలఖ్.

బెనర్జీ కళ్ళు మూసుకునే చిరునవ్వు నవ్వి తిరిగి సమాధిలోకి వెళ్ళిపోయాడు…

కుడి జేబులో ఆరు వందల రూపాయలు, ఎడం జేబులో ఉమాడేకి జాగా, సెంటిమెంటల్ మూడ్ లోకి పోవచ్చు.

“….బాల్యం…బాల్యపు అనుభూతులు…బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారిలాంటి ‘యధార్ధం’ గుండెల్లో బలమైన వ్రేళ్ళతో పాతుకుపోయి స్థిరపడ్డకొలదీ, …నా వెనుకనె నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో…జీవితానికి అర్ధం లేదు. అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ, నా పూర్ణ శక్త్రి వెనక్కి…వెనక్కి
పరుగెడుదామనుకుంటాను…తిరిగీ, నా బాల్యం లోకి..క్షణానికీ, క్షణానికీ, క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బ్రతకడం…. … …”
పవర్, ట్రచరీ…

జిన్ కైపు ఎక్కిస్తూంటే వాచాలత్వం, దెబ్బలాడడం సోపానాలు స్కిప్ చేసి సెంటిమెంటల్ మూడ్ లో ప్రవేశించి అందులోంచి మెల్లగా జరిగి, కళ్ళ నీళ్ళ ప్రవాహం లో పడ్డాడు.

సాయంకాలం ఏడు గంటలకు యింకా కొంచెం మత్తు ఉండగానే, మెల్లగా తూలుకుంటూ హాస్టల్ చేరుకున్నాడు శేషాచలపతి.
బట్టలన్నీ విప్పేసి నగ్నంగా మంచం మీద పడుకొని, పది నిముషాల తరువాత చల్లటి నీరుతో ముఖం కడుక్కుని, అద్దంలో చూసుకుంటూ, “ఎలా ఉంది. అలఖ్ నిరంజన్, యీ దినం?” అని అడిగేడు అద్దంలోని శేషాచలపతిని.

“రేపు నీ పేరు సాల్వడార్ డాలీ. ఏం చేస్తావో” అని అద్దంలోని శేషాచలపతి విషపు నవ్వు ఒకటి మధురంగా నవ్వేడు.

** – **