సిలికాన్ లోయ సాక్షిగా

లాప్ టాప్ కథ (పార్ట్-2)

మే 2014

సిలికాన్ లోయ సాక్షిగా-13

వానలో దగ్గర్లో ఎదురుగా కనబడుతున్న సైకిలు స్టేండు దగ్గిరికి పరుగెత్తాను.

“ఈ పార్కింగు లాటు లో మా కారు అద్దం పగల గొట్టి లాప్ టాప్ ఎవరో పట్టుకుపోయారు. అక్కడ టిక్కెట్టు ఇచ్చిన అబ్బాయి ఎక్కడికెళ్లాడో మీకు తెలుసా” అన్నాను గాభరాగా.

“నాకు తెలియదు. అది రెగ్యులర్ పార్కుకి సంబంధించిన పార్కింగు లాటు కాదు. ఇవేళ కాన్సర్టు బిజీ వల్ల ఎక్సెస్ పార్కింగ్ ఏర్పాటు చేసేరు “అన్నాడు అక్కడున్నతను.

“పోనీ మా కారు దగ్గర్లో ఎవరైనా తచ్చాడుతూండగా చూసేరా,” సందేహిస్తూ అన్నాను.

నిజానికి అతను కూచున్న చోటు నించి సరిగ్గా ఎదురుగా రెండు వందల గజాల్లో ఉంది మా కారు. అతను అక్కడే ఉండి ఉంటే ఖచ్చితంగా చూసి ఉండాలి.

కానీ అతను నాకేమీ పాజిటివ్ సమాధానం ఇచ్చేటట్లు కనబడలేదు. పైగా “నాకేమీ తెలియదు అన్నాడు” ఎటో చూసుకుంటూ.

బహుశా: ఇతను, పార్కింగ్ టిక్కెట్టు ఇచ్చినవాడు కలిసి దోచేసేరేమో అని నాకు బాగా రూఢిగా అనిపించింది.
వడిగా కారు దగ్గిరికి వచ్చేను. ఇంకా సూర్య అలాగే కూచుని ఉన్నాడు.

“కారుకి ఇన్సూరెన్సు రావాలంటే పోలీసు రిపోర్టు ఇవ్వాలి, నాకు ఓపిక లేదు ప్రియా, నువ్వు 911 కు కాల్ చెయ్యగలవా ” అన్నాడు హీనమైన గొంతుకతో.

తను బాగా షాక్ తిన్నాడు. అంతే గాక తనెందుకంత బాధపడ్తున్నాడో అర్థమయ్యింది. బాగ్ లో పోయింది రెండు వేల డాలర్ల ఖరీదు చేసే ఏపిల్ లాప్ టాప్. మొన్నమొన్ననే ముచ్చటపడి కొనుక్కున్నాడు పాపం.
911 కాల్ చేసేను.

“అసలు నేనెవరో, మేమెక్కడి నించి కాల్ చేస్తున్నామో వివరాలు అయ్యాక విషయం విని చాలా తాపీగా “కారు అద్దమేనా, మనుషులకి ఏమైనా హాని జరిగిందా” అనడిగింది అవతలి గొంతు.

నా సమాధానం విని “మనుషులకి ఏమీ కాకపోతే ఇదేం సీరియస్ మేటర్ కాదు గానీ, మీరు దగ్గర్లోని పోలీస్ స్టేషనుకి డ్రైవ్ చేసుకెళ్లి రిపోర్టు ఇవ్వండి” అందీ సారి ఆ గొంతు.

” దగ్గర్లో స్టేషన్ ఎక్కడుందో..” అని నేను నసుగుతూ ఉండగా, “సరే నేను మీ దగ్గర్లోని స్టేషనుకి కనెక్షను ఇస్తాను, ఫోను లో రిపోర్టు చెయ్యండి” అంది.

ఒక మగ గొంతు వినిపించిందీ సారి. “మరలా అదే తంతు. మీ కేసు అంత అర్జంటు మేటర్ కాదు కాబట్టి మీరు ఇప్పుడు నాకు ఫోను లోనే రిపోర్టు ఇచ్చెయ్యండి.” అన్నాడు.

“అదేవిటి? మా కారు కండిషన్ చూసి రిపోర్టు రాసుకోవడానికి పోలీసులెవరూ రారా’ అన్నాను.

“లేదు, ఇలాంటి చిన్న విషయాలకి ఎవరూ రారు, మీరు కావాలనుకుంటే డ్రైవ్ చేసుకొచ్చి రిపోర్టు ఇవ్వండి. అప్పుడు కూడా రిపోర్టు తీసుకోవడం తప్ప చూడడమంటూ ఉండదు” అన్నాడు.

ఇది వాళ్లకి చిన్న విషయమే కావచ్చు, కానీ మాకు చాలా పెద్ద విషయం కదా, అయినా ఓపిగ్గా “సరే చెప్తున్నాను రాసుకోండి” అన్నాను విధి లేక.

పది నిమిషాల పాటు పొద్దుట్నించీ ఏం జరిగిందీ అన్నీ అవతలి వాళ్లు రాసుకునేందుకు వీలుగా నిదానంగా చెప్పేక,”మీ తాత్కాలిక రిపోర్టు నంబరు నోట్ చేసుకోండి.

మీ అసలు రిపోర్టు మరో మూణ్ణాలుగు పని దినాల్లో ఆన్ లైను లో ఉంటుంది. నేనిప్పుడిచ్చిన నంబరు మీ ఇన్సూరెన్సు వాళ్లకి చెప్పండి. ఇక మీరు ఇంటికెళ్లిపోండి” అన్నాడు.

“మరి.. పోయిన మా లాప్ టాపు?” అన్నాను ప్రాధేయ పూర్వకంగా.

“ఎప్పుడైనా దొరికితే రికవరీకి మిమ్మల్ని పిలుస్తాం” అన్నాడు.

ఇదంతా నేను మాట్లాడుతున్నంతసేపు సూర్య అలాగే తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు.

వాళ్ల నాన్న డీలా పడిపోవడం, నేనిలా హడావిడిగా ఏదేదో చేస్తూండడం, అంతా నిధి బెంబేలుగా చూస్తూంది పాపం. మేం తిరిగి ఇంటికి వెళ్లాలంటే 70 మైళ్ల తప్పని సరి వేగం తో ప్రీవే మీద వెళ్లాలి.

ఇప్పూడా ఫ్రీవే మీంచి అద్దం లేని కారు తో వర్షం లో ఎలా డ్రైవ్ చెయ్యాలా అని బాధ పట్టుకుంది నాకు.
వచ్చేటపుడు ఎంతో అందంగా కనిపించిన ఈ వానే ఇప్పుడు శత్రువులా కనిపిస్తూ ఉంది.

గాలి వేగానికి జల్లు బాగా కొడ్తూంది. వెనక సీట్లో కూర్చున్న నిధి కి సూర్య కోటు తీసి కప్పినా ఇంకా వణుకుతూంది.

GPS లో వెతికి కారుని తక్కువ వేగంతో వెళ్లగలిగిన చిన్న రోడ్డు లోకి తిప్పాను.

ఇంటికి మరో రెండు గంటల తర్వాత చేరేం. అప్పటికి బాధ తగ్గక పోయినా కాస్త తేరుకున్నట్టు కనిపించాడు సూర్య.

***

ఆఫీసు నించి ఫోన్ చేసేడు సూర్య.

“ఇన్సూరెన్సు వాళ్లు కారు అద్దం బాగు చెయ్యించడానికి రేపు పట్టుకు రమ్మన్నారు. నువ్వు వెళ్లగలవా, నాకు ఈ వారమంతా మీటింగులున్నాయి” అని.

తనకు ఇదంతా దగ్గరుండి చేయించడం మనస్తాపంగా ఉన్నట్టు ధ్వనించింది గొంతు.

అది తప్పించడం కోసమైనా “సరే” అన్నాను.

నిధిని స్కూలుకి పంపించి వెళ్లేను.

“అద్దానికి రిపేరు రెండు గంటలు పడుతుంది, డోరు కూడా కూడా వంచి డేమేజ్ చేసేరు ఈ పక్క చూసేరా?” అన్నాడు షాఫతను.

అప్పటి వరకూ నేను గమనించనే లేదు.

“ఆ రిపేరు మేమిక్కడ చెయ్యం, మీరు మరలా మీ ఇన్సూరెన్సుతో మాట్లాడుకుని మెకానిక్కు కి చూపించుకోండి” అన్నాడు మళ్లీ.

సూర్య కి ఫోను చేసేను. యథావిధిగా మెసేజ్ కు వెళ్లింది.

భూ ప్రపంచం తిరగబడినా ఆఫీసులో ఉన్నపుడు ఫోన్లు ఎత్తడు. అదేం విచిత్రమో.

ఇక ఈ విషయాన్ని నేనే సాల్వ్ చెయ్యాల్సి ఉంది ఏదో రకంగా. రెండు గంటలు అద్దాల షాపు లాంజ్ లో కూచున్న సమయంలో ఇన్సూరెన్సు కి ఫోను చేసాను. ఫోన్లో వాళ్లడిగే వివరాలు, వాళ్లు మార్చే డిపార్ట్ మెంట్ల తతంగం అంతా ఇంతా కాదు. అక్కడున్న సమయమంతా ఫోను చెవి దగ్గిర పెట్టుక్కూర్చోవలసి వచ్చింది. మొత్తానికి ఆ దగ్గర్లో వాళ్ల ఇన్సూరెన్సు ఏక్సప్టు చేసే మెకానిక్ షాపు అడ్రస్ నోట్ చేసుకున్నాను.

నిధి స్కూలు నించి రావడానికి మరో గంట టైముంది. మెకానిక్ తో మాట్లాడి చూసి, అంతగా అయితే మరో రోజు కారు ఇచ్చి వద్దామనిపించి అట్నించటే వెళ్లాను.

“మీ కారుని మీకు మొత్తం చక్కగా బాగు చేసి ఇస్తాం మేము. నేను ఇంత క్రితం ఇదే ఇన్సూరెన్సు కంపెనీ లో పనిచేసాను. దిగులు పడకండి” అని అభయమిచ్చాడు మెకానిక్ షాపతను.

“కాకపోతే మీ ఇన్సూరెన్సు ప్రకారం మీకు డిడక్టబుల్ గా ఉన్న $250 కట్టాలి” అన్నాడు.

“అసలు రిపేరుకి ఎంతవ్వొచ్చు?” అన్నాను.

“కారు డోరుకి వంపు తీసి పెయింటు కూడా వేయాల్సి రావొచ్చు. అదీ గాక మీ కారు చుట్టూ ఉన్న చిన్న చిన్న పాటి పెయింట్ పోయినవి కూడా ఇందులో భాగంగా కవర్ చేసే అవకాశం ఉంది. అలా అయితే కారుని మొత్తంగా పెయింట్ చెయ్యిస్తాం. కారుని అయిదు రోజులు ఇక్కడే వదిలెయ్యాలి… అని మరో సారి లెక్కలేసి.. సుమారుగా అయిదు వేల డాలర్లు అవుతుంది.” అన్నాడు.

ఆ సంఖ్య విని భయపడ్డ నా మొహం చూస్తూ “అదంతా ఇన్సూరెన్సు పెట్టుకుంటుంది, మీకేం వర్రీ అవసరం లేదు.” అని అంతలోనే మాట మారుస్తూ
“ఇండియా నేను ఒక సారి వెళ్లాను. తాజ్ మహల్ ను చూడాలని అనుకున్న కోరిక మొత్తానికి తీరింది నాకు. మీరు తాజ్ మహల్ కు ఎంత దూరం లో ఉంటారు ఇండియాలో ” అన్నాడు.

“బహుశా: వెయ్యి మైళ్లు” అన్నాను.

“అబ్బో, చాలా దగ్గర” అని నవ్వి మరలా కారుని గురించి బాధ పడొద్దని చెప్పేడు.

“కారు ని గురించిన బాధ కొంచెమే, ఎంతో విలువైన లాప్ టాప్ పోయిందని చాలా బాధగా ఉంది” అన్నాను.
“అసలేం జరిగింది?” అన్నాడు.

మొత్తం విని “మీకు సొంత ఇల్లుందన్నారు కదా, హోం ఓనర్స్ ఇన్సూరెన్సు ఉందా?” అన్నాడు.

నేను తలూపగానే
“మరి ఆ ఇన్సూరెన్సు మీ లాప్ టాప్ ని కవర్ చేస్తూంది తెలియదా మీకు?” అనడిగాడు.

“అవునా, నాకు తెలియదే, అదే కంపెనీ నించే కారు ఇన్సూరెన్సు కూడా ఉంది మాకు. కారు గురించి వాళ్లతో ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడేం. నాకెవ్వరూ ఇలాంటి సలహా ఇవ్వనేలేదు ” అన్నాను.

“ఉండండి ఇప్పుడే కనుక్కుందాం, నాకో మిత్రురాలుంది, మీ ఇన్సూరెన్సు నంబరు చెప్పండి ” అన్నాడు.
“అయిదు నిమిషాల్లో” మీకు గుడ్ న్యూస్, మీకున్న హౌస్ ఇన్సూ రెన్సు మీ ఇంట్లోని సామాన్లు ఎక్కడ పోయినా కవర్ చేస్తుంది, కాకపోతే మీ డిడక్టబుల్ $500 కట్టాలట. అయినా $2000 ఖరీదు చేసే లాప్ టాప్ కదా. ఈ డీల్ పర్లేదనుకుంటా. మీరు స్థిమితంగా ఇంటికెళ్లి కొత్త లాప్ టాప్ కొనుక్కోడం గురించి ఆలోచించండి. కారు గురించి మాకు వదిలేయండి.” అన్నాడు.

అమెరికాలో ఈ మాత్రం మాట సహాయం దొరకడం చాలా సంతోషంగా అనిపించింది.

అప్పటికే రెండు మూడు రోజుల పాటు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసేడు సూర్య.

లాప్ టాప్ కొన్న ఆపిల్ షాఫుకి ఫోను చేసి అడిగేడు. వాళ్లు “మీరు థెఫ్ట్ ఇన్సూరెన్సు తీసుకోలేదు కాబట్టి ఏమీ చెయ్యలేం” అన్నారు.

ఇక లాప్ టాప్ కొన్న క్రెడిట్ కార్డు వాళ్లకి ఫోను చేస్తే “కొన్న మూడు నెలల లోపుగా, అదికూడా కొన్న మొత్తం లో నాలుగో వంతు మాత్రమే కవరేజ్ ఉంటుంది” అన్నారు.

పోలీసు వాళ్లు సరేసరి. అసలు ఫోన్లకి రెస్పాన్సు కూడా ఇవ్వలేదు.

ఇక పోయిన లాప్ టాప్ తిరిగి రాదని బాగా అర్థం చేసుకున్నాడు తను.

నాకే తెల్సిన ఈ కొత్త సంగతి సూర్యకి చెప్పాలని నా మనసు ఉరకలేసింది.

ఇంటికి వస్తూనే సూర్యకి ఫోన్ చేసాను. షరా మామూలే. మెసేజ్ పెట్టేను.”ఆపిల్ షాపు కి ఎప్పుడు వెళ్తున్నాం, కొత్త లాప్ టాప్ కొనుక్కోవడానికి? అని.

సాయంత్రం వస్తూనే” సోరీరా, నీ ఫోన్లు ఎత్తలేక పోయాను, మెసేజ్ చూసేను. లాప్ టాప్ కొనుక్కోవడానికి ఇప్పట్లో బడ్జెట్ లేదు కానీ, మరో సారి ఆలోచిద్దాం అన్నాడు.”

“సరే, మరిక ఏం చేస్తాం?!” అని, నీకు $500 ఖర్చుతో “కొత్త” లాప్ టాప్ ఇప్పిస్తే నాకేమిస్తావ్?” అన్నాను.

నా వైపు విచిత్రంగా చూసి, “నీకు అంత చీప్ గా డీల్ ఎక్కడ దొరికింది?” అన్నాడు.

విషయం అంత తేలిగ్గా చెప్పేస్తే పొద్దుట్నించి కష్టపడి మెకానిక్కు షాపుల చుట్టూ తిరిగిన నా కష్టం ఏమై పోయినట్లు!!

అందుకే చిన్నగా నవ్వి “ప్రియానా? మజాకానా?” అని అభయమిచ్చే ఫోజు పెట్టాను.

***** (అయిపోయింది) *****