కథాకథనం

ఈ సముద్రం లోతెంతో చెప్పడం అసాధ్యం!

సెప్టెంబర్ 2014

ప్రియమైన వాకిలి పాఠకులకు!
ఈ తడవ మీకు నే పరిచయం చేస్తున్న ఈ కథంటే –
నాకు చెప్పలేనంత ఇష్టం.
అమితమైన గౌరవం.
నే సమ్మతించిన విషాదం.

ముందుగా కథాంశం గురించి :

ఎంత మోహనమని, మరెంత వ్యామోహమని!
ఎప్పట్నించి మాటేసుకునున్న సౌందర్యమనీ!? -చూపులతోటి ఇట్టే లాగేసుకుని, ఆహ్వానించినంతనే వొచ్చి, చేతుల్లోకి వాలిపోయి, మనసుని హత్తుకుపోతుంది. ఎటెటో ఎత్తుకుపోతుంది.
దివులు మబ్బుల్ని దూరం చేస్తుంది. రాను రాను తనే ఓ గొప్ప దిగులై కూర్చుంటుంది.
ఎప్పటికప్పుడే నవ వధువులా తోస్తుంది.
దాని సౌందర్యాస్వాదనలో అలసిపోయి, నిద్రలోకి జారినప్పుడు ఎద మీద ఎద వుంచి, వొద్దికగా ఒదుగుతుంది. గుండెలో గుండె గా కలసిపోతుంది. నడిచే జ్ఞాపకాల నీడౌతుంది.
దీనిపైని మోజదేమో తెలీదు కానీ, కొందరు – షికార్లకు తీసుకెళ్తారు. చిట్టడవులకీను. మరి కొందరు సీ షోర్ లకీ తీసుకుపోయి, ఇసుక తిన్నెలపై వాలి, ముఖంలో ముఖం పెట్టుకునో, పొట్టలో తల దూర్చుకునో, ప్రేమగా చెంపలకాంచుకునో… సౌదర్యోపాసన లో మునిగి తేలుతుంటారు. అదో పాషన్….అదో ఫాషన్..అదో పారవశ్యం.
అంతగా మైమరిచే అధ్బుతం దీన్లో ఏముంటుందో, పిచ్చి కాకుంటే అనుకుంటారు కానీ, చూసే వారికేమెరుక మరి?

వయసు చూసి ప్రేమించని ఆ సొగసరి నిత్య యవ్వని. సత్యమైన ప్రియురాలు. స్వఛ్చమైన జ్ఞానురాలు. ఎందరి పెళ్ళాల రుసరుసలు మోస్తుందనీ? .. మరెందరెందరు సతీ సుమతులు తమ భర్తలని ఈమెకి అప్పగించి, సమర్పించి పోయారనీ? ఇంకెందరు భార్యా మణులు ఈమెని ఇంట్లోంచి గెంటి పారేయాలని చూస్తారనీ? అయితే ఒకటి. హాని చేసే శాల్తీ కాదు.

అన్నమయ్య అన్నట్టు ..నీటి కొలది తామరలా..ఘన బుధ్ధులకు ఘనురాలు.

ఇంతకీ – ఇంత గొప్ప అతి లోక సుందరీ, జ్ఞాన ప్రదాయినీ ఎవరూ అంటే – పుస్తకం. :-)

దేవుణ్ణి ద్వేషించే నాస్తికులు సైతం పుస్తకాన్ని దైవం లా ఆరాధించడమే – పుస్తకానికి గల విశిష్ట లక్షణం. అపూర్వ దైవత్వ వైభవాన్ని సంతరించుకున్న గుణం.

ఇంతకీ ఈ కథంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఈ కథలో కథాంశమే పుస్తకం కాబట్టి. చాలా చాలా అరుదైన సబ్జెక్ట్ కాబట్టి.

ఈ కథలో హీరో, హీరోయిన్ మాత్రమే కాదు, కమిట్మెంట్, సెంటిమెంట్ – కూడా పుస్తకమే పోషిస్తుంది. చిత్రం గా అనిపించడం లేదూ కథ?!

అసలు ఏమా కథంటే:
కథ పేరు: సముద్రం, రచన: పాపినేని శివశంకర్.

* కథ మాటకొస్తే :
రచయిత ఫ్రెండ్ కి రాసిన ఉత్తరం. జస్ట్ అంతే.
ఈ లేఖ లొనే – కథా, కథలోని పాత్రలూ, వారి స్వరూప స్వభావాలు, గుణ గణాలు అన్నీ ప్రస్ఫుటమైపోతుంటాయి. కళ్ళముందు జరుగుతున్నట్టె వుంటాయి సంఘటనలు.

* కథా, అందులోని పాత్రలు గురించి తెలుసుకుందాం :
అతని పేరు వనమాలి. కానీ అతనికున్న పుస్తకాల పిచ్చి కొద్దీ పుస్తక మాలి అవుతాడు. ఆ ప్రొఫెసర్ గారికి తగ్గ పేరే అని మనమూ ఒప్పుకుని తీరతాం. – అతన్న్ని చదివాక.
తను బ్రతికున్నదే పుస్తకం కోసమన్నట్టు,పేజీలే పరమార్ధమన్నట్టు, అక్షరాలే శ్వాసకోశాలన్నట్టు, – పుస్తకమే ఊపిరిగా, పుస్తకమే జీవన సమస్తంగా,… ఇలా బ్రతికే బ్రతుకే ధన్యమన్నట్టు.. జీవాన్ని నింపుకున్న పాత్ర – పుస్తక మాలి.
ఈ భర్త గారిని గౌరవిస్తూ, పుస్తకాల గుట్టల్ని ఎప్పటికప్పుడు సర్దిపెడుతూ…అప్పుడప్పుడు విచారిస్తూ, వేదన చెందుతూ అలానే కన్ను మూసే భార్య పాత్ర – కమిలిని.
ఇంటిని పుస్తకాలతో నింపి, ఇరవై నాలుగ్గంటలూ పఠనంలోనే గడిపి , ఏం సాధించావ్? మమ్మల్నేం ఉధ్ధరించావ్? అంటూ తండ్రిని నిలదీసే పాత్రలో – కూతురు. – సరిగ్గ ఇక్కడే ‘మెట్టూ గురించిన సంఘర్షణ కు లోనౌతాడు పుస్తకమాలి.
ఇంకా, – అతని చుట్టూ భక్తి శ్రధ్ధలతో చేరిన విద్యార్ధులు, జ్ఞానాన్ని పంచుతూ ఈ ప్రొఫెసరు, ఈయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు వల్ల కళ్ళు తెరిచిన ప్రభుత్వం..ఇవన్నీ మన కళ్ళ ముందు చక చకా కదిలిపోతుంటాయి.
కానీ కదలక, మన మనసుల్లో గూడు కట్టుకుని మిగిలిపోయేది మాత్రం ఒక్కటే. – ముగింపు.
ఒక చోట ఫ్రెండ్ని అడుగుతాడు. ‘ఇలియట్ వేదన, నీ వేదన ఒకటేనా వనమాలీ? జీవన సారాంశం కోల్పోయి, డొల్లలుగా మారుతున్న మనుషులగురించేనా?’ అంటూ.
మరో సందర్భంలో -
‘నువ్వు పుస్తకాల్ని ఎక్కువ ప్రేమిస్తావా? లేక మనుషుల్నా? కొత్తగా కొన్న పుస్తకానికి నువ్వు అట్టవేస్తుంటే చూస్తున్నా. బహుశ పసిపిల్లకి తల్లి అట్లాగే దుస్తులు తొడుగుతుంది. అట్ట చిరిగిపోతే బాధపడతావు. పుస్తకం తీసుకొన్న స్నేహితుడు తిరిగి ఇవ్వకపోతే విచారిస్తావు, పెద్ద సంపద ఏదో కోల్పోయినట్టు… అంటూ అడుగుతాడు.
అందుకు పుస్తకమాలి జవాబేం చెబుతాడు?

* కథ ముగింపు:
అదేమిటన్నది, ఎవరికి వారు చదివి అనుభూతించాల్సిన సన్నివేశం గా నేభావిస్తాను.
గుండెనెగదన్నిన భావానికి కంట్లో వూరే నీరు..కన్నీరా, పన్నీరా?
దాని రుచి ఉప్పనా? తీయనా? ఎలా తెలుస్తుంది, నే చెబితే మాత్రం?
ఎవరికి వారు అనుభవించి కదూ, తెలుసుకోవాలి?

* కథ పై నా వ్యక్తిగత అభిప్రాయం :
‘ఇదీ కథ’ అంటూ మాటల్లో వివరించడవంటె- నా వరకు నాకంత సులువైన పని కాదు.
కొన్ని ప్రేమ కావ్యాలు బావుంటాయి. విషాదానంతరం కూడా తీయగా, మనసుని కలిచేస్తూ. కాలాన్ని కుదిపేస్తూ. అయితే, అన్ని ప్రేమలూ పార్వతీ దేవదాసులకి మల్లేనే వుండనవసరం లేదు. ‘పుస్తకం – వనమాలి’ లా కూడా వుంటాయి, అని తెలియచేసిన కథ ఇది.
నేను మాగజైన్ లో ప ని చేస్తున్నప్పుడు మా సంపాదకులెప్పుడూ అంటూ వుండే వారు. ‘ ప్రింటయ్యే ప్రతి అక్షరానికి ప్రాణం వుంటుందమ్మా’ అని.
అందుకే కామోసు.. పుస్తకం మనతో మాట్లాడుతుంది. మనల్ని ప్రేమిస్తుంది. బహుశా ఈ ప్రపంచంలో మనల్నెవ్వరూ ఇంతగా ప్రేమించనంతగా.
అందుకే విడిచెళ్ళాలంటే ఏడుపొస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే – ఇది మనల్ను గాయం చేసిపోయే కథ. – అని చెప్పక తప్పదు.

గాలికి కదిలే హరిత పత్రాల గల గలలది ఏ రాగమని చెప్తాం?
అపూర్వ పూల పరిమళాలకి తూకమేమని వివరిస్తాం?
ఆకాశాన్ని తునకలు చేసి పంచగలమా?
అలానే,
ఈ సముద్రానికి లోతెంతో చెప్పడం కూడా అంతే.
కష్టం. బహు కష్టం.

రచయిత గురించి :
తనకు తనే సాటి అని నిరూపించుకునే అతి అరుదయిన రచయితల్లో ఒకరు ఈ రచయిత అని మాత్రం ఖచ్చితం గా చెప్పగల్ను.
ఇలాటి విభిన్న ఇత్రివృత్తంతో, తనదైన ప్రత్యేక శైలితో, పాఠకుల హృదయాలను స్పృశించే కథలు రాయడానికి ఏ రైటర్ కయినా కావాల్సింది – మేధస్సు, కసరత్తు కాదు.
కథకు గల అసలైన కథతనం తెలిసివుండాలి. దాని గుండె చప్పుళ్ళు వినగలిగే హృదయాన్ని రచయిత కలిగి వుండాలి. అని తన కథ ద్వారా చెప్పకనే చెప్పిన రచయిత – శ్రీ శివశంకర్ గారు.
వారికి నా వినమ్ర గౌరవాభివందనాలిడుతున్నా.

కథ చదవండిక:
*******************************
సముద్రం – పాపినేని శివశంకర్. (Credit: www.kathajagat.com/)
*********************************************************************