చిన్నప్పటి అమాయకపు కలల ప్రపంచాలనూ, ప్రేమించిన మనుషులనూ, ప్రోది చేసుకున్న విశ్వాసాలనూ, ఒక్కటొక్కటే పోగొట్టుకుని, జీవితమొక నిస్సార ప్రయాణం గా మారిపోయిన తరుణంలో నీ ఎదుట వాలిన రంగుల సీతాకోక చిలుకని చూస్తే నీకేమనిపిస్తుంది ?
బహుశా, నిన్ను విడిచి ఏ దిగంతాలకావలకో వెళ్ళిపోయిన నీ మనిషి ‘నా కొరకు విలపించ వలదు’ అంటూ నీకై పంపిన కుశల సందేశమేమో?
ఈ నల్లని విషాద రూపాన్ని విడిచి రాగలిగితే వన్నెల రూపం ఒకటి నీ కోసం వేచి వుంటుందనీ, ఆ రూపాన్ని స్వప్నిస్తూ సాగమనీ వర్ణమయ ప్రకృతి, ఆ సీతాకోకని నీ ముందు అలా నిలిపిందేమో?
ఒక సీతాకోక చిలుక తన ముందు వాలగానే, అనాదిగా మనిషి లో ఎందుకింత ఈ పులకింతల జడి వాన!
బహుశా, తన గొంగళి పురుగు జన్మని వొదిలి, ఒక రంగుల సీతాకోక చిలుకగా పునర్జన్మించాలని స్వప్నించడం వల్లనేమో!
లోకపు ఏ కల్లా కపటాలూ ఎరుగని ఒకానొక పసి ప్రాయంలో ఒక వన్నెల సీతాకోక చిలుకలా తాను గడిపిన ఆ బంగారు కాలాన్ని లిప్త పాటైనా ఆ సీతాకోక చిలుక తన ముందు నిలిపినందుకేమో!
బహుశా, అందుకే అప్పుడెప్పుడో విలియం వర్డ్స్ వర్త్ తన To A Butterflyలో తన ముందు వాలిన సీతాకోక చిలుకని ప్రాధేయ పడ్డాడు –
“float near me ; do not yet depart
Dead times revive in thee”
[నా చెంతనే విహరించు / అప్పుడే నను విడిచి వెళ్ళకు / గతించిన కాలాలు పునర్జన్మిస్తాయి]
బహుశా, అందుకే మన కాలం తెలుగు కవయిత్రి విమల, ‘స్వప్నించడం మరిచిపోయినపుడల్లా దయగా వొచ్చి వాలే సీతాకోక చిలుక’ ని కవిత్వమై పలవరిస్తోంది తన ‘సీతాకోక చిలుకలు’ కవితలో!
తెలుగు కవిత్వంలో విప్లవ కవిత్వానికి ఒక కొత్త రూపాన్ని యిచ్చిన అతి కొద్ది మంది కవులలో విమల ఒకరు. తన ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ లోని కవిత్వమే అందుకు దాఖలా!
ఆమె స్వయంగా విప్లవోద్యమం లో పాల్గొన్న కవయిత్రి. అందులో భాగంగా చాలా కాలం పాటు అజ్ఞాత జీవితం గడిపిన కవయిత్రి. ఇప్పటికీ ఉద్యమాల గురించి వ్రాయడం కన్నా ఉద్యమాలలో పాలు పంచుకోవడానికే ఇష్టపడే అరుదైన కవయిత్రి.
విప్లవ కవిత్వం చాలా పెళుసుగా, మొనాటనీతో నిండి పోయి వుంటుందని తెలుగు సాహిత్యంలో ప్రచారం జరిగిన కాలంలో, సామాన్యులైన ప్రజల పట్ల గొప్ప ప్రేమతో విప్లవోద్యమాలలో వున్న కవులు అత్యంత సున్నిత మనస్కులనీ, జీవితంలోని చిన్న చిన్న అంశాలలో కూడా ఒక అద్భుతమైన సౌందర్యాన్ని దర్శించే వారనీ చాటి చెప్పింది విమల కవిత్వం! అందుకే, తెలుగు సాహిత్యంలో చాలా మంది కవులు విమల కవిత్వానికి అభిమానులు!
సీతాకోక చిలుకలు
నేను స్వప్నించడం మరిచి పోయినపుడల్లా
నా కళ్లపై దయగా వొచ్చి వాలుతుందొక సీతాకోకచిలుక
ఒక కలని కాసింత కవిత్వాన్ని కానుకగా యిచ్చి పోతుందివిశ్వాసాల సారంగినీ, వెన్నెల జెండానీ
వైతరణీ నది ఒడ్డునే పోగొట్టుకుని
నేనొక ఒంటరి సర్వ సంగ పరిత్యాగ సూఫీ భిక్షుకినై నడిచి వెళ్ళే వేళ
నా ముంజేతిపై వాలిన సీతాకోక చిలుక
ఇంద్ర ధనుస్సుల రెక్కల్ని అల్లార్చుతూ
ప్రియాతి ప్రియమైన చిర కాల నేస్తం వలె
నాతో సంభాషణ కలుపుతుందినీలాల సముద్రం వొడ్డున వగలు పోయే అలల్ని
వినీలాకాశంలో హొయలు హొయలుగా తేలిపోయే మేఘాల్ని
అట్లా నిర్వ్యాపకంగా, మౌనంగా చూస్తున్నపుడు
ఎక్కడి నుండో వొచ్చి నా పెదవులపై
మధువు కుమ్మరించి వెడుతుందో సీతాకోక చిలుకజీవన సౌరభం నశించి నపుడల్లా
సంపెంగ పూల పొదలపై వాలిన సీతాకోక చిలుకల గుంపులు
నా బతుకు పుస్తకంలో రంగు రంగుల అక్షరాల్లా వొచ్చి వాలతాయిఅనంత ప్రకృతిలో మనుషుల అల్పత్వపు చీకటి
నన్ను భయపెట్టినపుడల్లా
శకునాలు చెప్పే మంత్రగత్తె వలె
ఒక సీతాకోక చిలుక శిరసున వజ్రదారియై వాలి
దారంతా వెలుగు కిరణాల్ని జల్లి పోతుందికాలం చెక్కిలిపై నేను కవిత్వం రాసేటపుడు
నా నెమలి పింఛపు కలంపై ఎక్కడి నుంచో
సుతారంగా వొచ్చి వాలుతుందొక సీతాకోక చిలుక
నేనొక సీతాకోకల దీవిని వెతుక్కుంటూ బయల్దేరాను
గడచిన జన్మలో నేనే ఒక సీతాకోక చిలుకనేమో
నా గుండెలపై పదిలంగా సీతాకోక చిలుకల పచ్చబొట్లు
నా ఊహలకు రెక్కల్ని సకల వర్ణాల్ని ఒసగిన
సీతాకోక చిలుకల్ని వెతుక్కుంటూ బయల్దేరాను ఈ వేళ!(“మృగన” కవితా సంకలనం నుండి )
మనిషి స్వప్నించడం ఆగిపోయిందంటే, జీవించడం ఆగిపోయిందనే కదా! లేక ఒకమృత ప్రాయ జీవితాన్ని గడుపుతున్నాడనే కదా! అట్లాంటి స్థితి లోకి వెళ్లినపుడల్లా ఒక సీతాకోక చిలుక వొచ్చి కళ్ళ పై వాలుతుంది అని మొదలు పెట్టింది ఈ కవితని. అంతే కాదు – కేవలం ‘నా కళ్లపై వొచ్చి వాలుతుంది’ అనకుండా ‘దయగా వొచ్చి వాలుతుంది’ అంటోంది!
ఇంతకీ, తను ఈ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది?
“విశ్వాసాల సారంగినీ, వెన్నెల జెండానీ
వైతరణీ నది ఒడ్డునే పోగొట్టుకుని
నేనొక ఒంటరి సర్వ సంగ పరిత్యాగ సూఫీ భిక్షుకినై”
విప్లవ కవయిత్రి, ఎప్పుడో ‘గరుడ పురాణం’ లో ఉటంకించిన ‘వైతరణీ నది’ ప్రస్తావన చేయడం కొంత ఆశ్చర్యంగా అనిపించినా విప్లవ కవిత్వానికి పునాది రాయి వేసిన ‘మహాప్రస్థానం’ లోని ప్రతీకలు జ్ఞాపకం చేసుకుంటే అది పెద్ద విషయం అనిపించదు.
‘విశ్వాసాల సారంగి’ అనడంలో ఒక విశేషం వుంది. సంగీత వాయిద్యాలలో ‘సారంగి’ది ఒక ప్రత్యేక స్థానం అంటారు. మిగతా సంగీత వాయిద్యాలతో పోల్చినపుడు, ‘సారంగి’ తో సంగీత ప్రదర్శన బహు కష్టతరం అని కూడా అంటారు. అంతే గాక, విభిన్న మానవ గాత్రాలకు సారంగి సంగీతం చాలా దగ్గరగా ఉంటుందని కూడా అంటారు.
ముందే ప్రస్తావించినట్టు, విమల చాలా కాలం పాటు విప్లవోద్యమంలో పని చేసిన కవయిత్రి. అందుకే వైతరణీ నది ఒడ్డునే పోగొట్టుకుని ‘సర్వ సంగ పరిత్యాగ సూఫీ భిక్షుకినై నడిచి వెళుతున్నాను అంటోంది.
“నీలాల సముద్రం వొడ్డున వగలు పోయే అలల్ని / వినీలాకాశంలో హొయలు హొయలుగా
తేలిపోయే మేఘాల్ని / అట్లా నిర్వ్యాపకంగా, మౌనంగా చూస్తున్నపుడు” సీతాకోక చిలుక ఇంత మధువు గుమ్మరించి వెళుతుంది అంటోంది. “మనుషుల అల్పత్వపు చీకటి భయపెట్టినపుడు శిరసున వాలి దారంతా వెలుగు కిరణాల్ని వెదజల్లుతుంది” అంటోంది.
“స్వప్నించడం మరిచిపోయినపుడు కళ్ళ పైన దయగా వాలి ఒక కలని కానుకగా యిస్తుంది” అని సీతాకోక చిలుక పైన కవిత ప్రారంభించిన కవయిత్రి, చివరికి వొచ్చేసరికి, “గడచిన జన్మలో నేనే ఒక సీతాకోక చిలుకనేమో / నా గుండెలపై పదిలంగా సీతాకోక చిలుకల పచ్చబొట్లు” అని చెప్పి, “నేనొక సీతాకోకల దీవిని వెతుక్కుంటూ బయల్దేరాను” అంటుంది. అంటే, గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందినట్టు, ఒక స్వప్నమే తానుగా, తన కవితగా మారిపోయిందన్న మాట !
వర్డ్స్ వర్త్ అయినా, మన విమల అయినా, వాళ్ళ కవితలలో ప్రస్తావించిన సీతాకోక చిలుక, కేవలం సీతాకోక చిలుక మాత్రమేనా?
జీవితం పట్ల నిబద్ధతతో కూడిన ప్రేమ ఉన్న విమల గారి ప్రతి అక్షరం మనకు స్ఫూర్తినిస్తూ పోరాట మార్గాన్ని సూచించే దిక్సూచి. మీ పరిచయ వ్యాసం ఎప్పట్లానే చాలా బాగుంది సార్. ధన్యవాదాలు.
కవిత బాగుంది విజయకుమార్ గారు
అవి సీతాకోక చిలుకలుకావు
జీవితాన్ని జీవింప చేసే రంగు రంగు
జీవితాసలు ఆసేయాలు
విమలగారు అనుభూతి కవిత్వం వ్రాశారన్నదే ఓ కొత్త విషయం నాకు. నిజంగా అద్భుతంగా ఉందండీ కవిత, చకచక్కటి ఉపమానాలు చదువుతుంటేనే రంగుల తోటలో తిరిగుతోన్న అనుభూతి కలిగింది. మీ వ్యాఖ్యానం అదనపు శోభ. ధన్యవాదాలు.