గడ్డం ఇంటి పేరున్న వాళ్లందరికీ గడ్డాలుండాలని రూలు లేదు. దేవుడి మొక్కులకు, పెళ్లాం ప్రసవానికి, తగ్గని జబ్బులకు, క్షౌర బద్ధకానికి, పంతానికి, దేశాంతరంనుంచి అప్పుడే దిగబడ్డ్డానికి, దిగులుకి, దీక్షకు, దీర్ఘ చింతనకు, యోగులకు, బైరాగులకు, క్షురశాల దాకా తీసుకెళ్లే ఆధారం లేని ముసలి వాళ్ళకు, ముసల్మాన్ సోదరులు కొంత మందికి- గడ్డం ఒక సంకేతం.
స్వాభావికంగా శారీరక సౌందర్యానికి ఆట్టే విలువ ఇవ్వని విరాగులూ బారెడు గడ్డం పెంచుకోవడం రివాజే. సాధారణంగా దేవుడు ప్రత్యక్షమయేంత వరకు రుషులు గడ్డాలు, మీసాలు పుట్టల్లా పెంచే వాళ్లని పురాణాలు ప్రమాణాలు చూపిస్తున్నాయి. బైబిలులో చాలా పాత్రలకు గడ్డాలు తప్పని సరి. నిప్పు రాజేయడానికి రాయిని రాయితో రుద్దడం తెలుసుకున్న మానవుడు గడ్డం గీయడానికి రాయిమీద కత్తిని సాన బెట్టడం ఎప్పటినుంచి మొదలు పెట్టాడో బైటపెట్టే ఆధారాలు ఇంతవరకు బైటపడినట్లు లేవు. గుహలమీది పాత చిత్రాల్లో సైతం ఆదిమానవులకు మరీ ఆట్టే పెరిగిన గడ్డాలు, మీసాలు ఉన్న దాఖలాలు లేవు.
మన కృష్ణుడి మీసాలు వివాదాంశమైనంతగా గడ్డాలు కాలేదు. ఎందు చేతనో?! అవునూ.. రవివర్మ గీసిన చిత్రాలన్నింటిలో మగ దేవుళ్ళు (ఒక్క శివుడు మినహా) అందరూ అప్పుడే నున్నగా గీసిన చెక్కిళ్లతో కనిపిస్తారు కదా.. ఆ కాలంలోనే క్షురకర్మ విధానం స్వర్గంలో అమల్లో ఉందనా అర్థం? గడ్డాలమీద ఎవరైనా గడ్డాలూ మీసాలు పెరిగిందాకా పరిశోధనలు చేస్తే గానీ తెమిలే అంశాలు కావివన్నీ!
తెల్లవాళ్ళకు ఈ గడ్డాలంటే ఆట్టే గిట్టవు లాగుంది. పాచిమొహంతోనే ఏ ఎలక్ట్రిక్ షేవరుతోనో గడ్డం పని పట్టిస్తే గాని బాహాటంగా దర్శనమీయరు. ఒక్క ఫాదర్లు మాత్రం .. పాపం.. పెరిగిన గడ్డాలతో కనిపిస్తారు. అక్కడి మేధావులకూ ఇక్కడ మన మునులకు మల్లేనే బారెడు గడ్డాలు, మీసాలు సూచన లాగుంది. గడ్డం లేకుండా కార్ల్ మార్క్సుని గుర్తించ గలమా? అబ్రహాం లింకను అనగానే హక్కుల పోరాటంకన్నాముందు గుర్తుకొచ్చేది ఆయనగారి బారెడు నెరసిన గడ్డం.
మహా మేధావులకే కాదు మాంత్రికులకూ గడ్డాలు సంకేతమే. మన పాతాళ భైరవి మార్కు ఎస్వీరంగారావు గడ్డం ఎంత ప్రసిద్ధమో అందరికీ తెలుసు. ఏదన్నా దుష్ట ఆలోచన చేయాలంటే శకుని మామలాంటి దుర్మార్గులు ధూళిపాళలాగా మెడ ఓ వారకు వాల్చేసి గడ్డం దువ్వుకునే వాళ్ళేమో! అవునూ.. ఇన్నేసి లక్షల లక్షల కోట్లు రకరకాలుగా కుమ్మేస్తునారు కదా ఇవాళ రాజకీయ నాయకులు! ఒక్క శిబూ సెరన్ కి తప్పఈ బవిరి గడ్డాలు గట్రా మరి ఎవ్వరికీ బైటికి కనిపించడం లేదు! ఎందుకో?
యోగా గురువు రాందేవ్ బాబా భృంగామల తైలంతో పెంచే గడ్డంతో కనిపిస్తారు. రవి శంకర్, జగ్గీ వాసుదేవ్, చిన జీ అయ్యరు, సుఖబోధానంద స్వామిలాంటి ఆధునిక అధ్యాత్మిక గురువులకూ ఎవరి తరహాలో వాళ్ళకు చిన్నవో పొన్నవో గడ్డాలు ఉన్నాయి. మొన్నజరిగిన ఎన్నకల్లో మోదీగారిని అక్కడా, చంద్రబాబుగారిని ఇక్కడా విజయలక్ష్మి వరించడానికి ప్రధాన కారణం వాళ్ళ తెల్ల గడ్డాల్లో దాక్కొని ఉందేమోనని అనుమానం! రాహుల్ బాబా, మన జగనన్లని చూడండి! ఎప్పుడు చూసినా తాజ్ మహల్ పాలరాళ్ల మాదిరిగా చెక్కేసిన చెక్కిళ్ళతో తాజాగా కనిపిస్తారు. మరి ఎంత పోరితే మాత్రం విజయం ఎలా సాధ్యం?
దీర్ఘ కేశపాశాలతో ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా ఆట పట్టిస్తారో ఏ శృంగార కావ్యం చదివినా అర్థమవుతుంది. మగవాడు దానికి బదులు తీర్చుకునే ఆయుధాలే ఈ గడ్డాలు, మీసాలు. మీసాలమీద మోజు పడ్డంతగా గడ్డాలమీద ఆడవారు మోజు పడతారా? మాసిన గడ్డంతో దగ్గరికొస్తే ఈసడించుకుంటారు గదా అని సందేహమా? మొన్నటి వరకు గడ్డాలు మీసాలు ఓ నాగరిక అలంకారం అన్న సంగతి మీరు మర్చి పోయారు. నిన్నటికి అవి వికారం అయితే కావచ్చు. మళ్ళీ ఇవాళ వాటికే మంచి రోజులు వచ్చేసాయండీ! సినిమా హీరోలనుంచి చిల్లర తిరుబోతులదాకా ఎవరి ముఖారవిందాలనైనా చూడండి. అందరికీ చిరుగడ్డాలే మగతనానికి తిరుగులేని చిరునామాలు అయిపోయాయి.
మగ వాళ్లకి వద్దన్నా వచ్చేవి.. ఆడవాళ్లకి కావాలన్నా రానే రానివి ఈ గడ్డాలు, మీసాలే నండీ బాబూ! ఆధిక్యానికి తిరుగులేని ఆయుధాలని కావాలని కాలదన్నుకోవడం మగవాళ్ల తెలివి తక్కువతనం. ‘నువ్వసలు మొగాడివేనా?’ అని ఎదుటి పక్షం వాళ్ళు ఎన్నడూ సవాలు విసరకుండా ఉండాలంటే రాజకీయ నేతనే వాడు పిసరంతైనా గడ్డాలు, మీసాలు పెంచుకోవడం ఒక్కటే శరణ్యం. ఆడువారి బారు జడలకు సమాధానం గడ్డాలు, మీసాలే. తరుణంలో గడ్డం పెరగని మొగవాడిని ఏ ఆడపిల్లా పెళ్లాడటానికి చచ్చినా ఇష్ట పడదు.
ఫ్రెంచి వాళ్ళను ప్రపంచ ప్రసిద్ధం చేసింది ఈ గడ్డమేనని మర్చి పోవద్దు. యోగికైనా యోదుడికైనా ప్రపంచంలో ఎక్కడైనా గడ్డమే ట్రేడ్ మార్కు.
గడ్డం గొప్పదనాన్ని పసిగట్టలేక దాన్నొక చాదస్తంగా కొట్టి పారేస్తున్నాం. తాతయ్యలకే గడ్డాలనే పాత రోజులు పోయాయి.
ఆది దేవుడినుంచి ఆరుద్ర దాకా రకరకాల గడ్డాలు. గడ్డం లేని శివాజీని ఊహించుకోండి.. చూద్దాం. వీర బ్రహ్మేంద్రస్వామివారి కాల జ్ఞాన మహిమలన్నీ ఆయనగారి గడ్డంలో నుంచే పుట్టుకొచ్చాయి. గడ్డం ఆట్టే పెరగని లోటును దుబ్బు జుట్టుతో పూడ్చుకొన్నారు చూసారా పుట్టపర్తి సాయి బాబా. ఒక్క బుద్ద భగవానుడికి మినహా మరే ప్రబోధకుడికి గడ్డాలు లేవు చెప్పండి?! ఒక్క మత స్థాపకులకనేనా.. మత ప్రచారులకు సైతం మంగలి కత్తంటే పడదు. గమనించండి
గాంభీర్యానికి, యోగ్యతకు, అనుభవానికి, ఆలోచనకి గడ్డం తిరుగులేని బాహ్య చిహ్నం. గ్రీసు దేశంలో వీరులనుంచి వేదాంతుల వరకు అందరికీ గడ్డాలే. ప్లేటో, సోఫాక్లీసు, హోమరులకు గడ్డాలు మీసాలే గ్లామరు. టాల్ స్టాయి గడ్డం రష్యాలో నవ శకానికి నాంది పలికింది. మన గురుదేవుని జ్ఞానసంపదంతా అతగాని గుబురు గడ్డంలోనే దాగి ఉంది. నిరాండంబరం ఒక విధానంగా పెట్టుకోబట్టి గాని లేకుంటే మన మహాత్ముడూ గడ్డాలు మీసాలతో ప్రపంచాన్ని మరింతగా ఊపేసుండేవారే.
ఒక్క అలెగ్జాండరుకే గడ్డం అంటే ఎందుకో చెడ్డ కోపం. సైన్యం గడ్డాలు పెంచుకోరాదని ఆదేశించాడు. యుద్ధాల్లో శత్రువు చేతికి జుత్తు అందించాల్సొస్తుందన్న భయం కాబోలు! ప్రపంచాన్ని గడగడలాడించిన యోధుణ్ణి గడగడలాడించింది మరి గడ్డం! పీటరూ తన రాజ్యంలో గడ్డాలమీద పన్నులు విధించాడు. నెపోలియను, సీజరు గడ్డాలకు వ్యతిరేకులు అయితేనేమి. ఔరంగజేబు గడ్డాలు లేని వాళ్ళ నుంచి పన్నులు పీకాడు.
ఎంత మందికి కూడు పెడుతున్నాయో చూడండీ గడ్డాలు, మీసాలు! తిరుమల రాయునికి హుండీ ఆదాయమెంతో మగ భక్తుల గడ్డం, మీసాల మీద రాబడి అంతకు పదింతలు. క్షురకర్మ చేసే వాళ్ల నుంచి, కత్తెర సామాను తయారుచేసే పరిశ్రమల వారి దాకా ఎందరో ఈ మగవాళ్ల గడ్డాలు, మీసాల మీద ఆధారపడి దర్జాగా బతికేస్తున్నారు.
అన్నింటా సమానత్వం కావాలని నినదించే ఆడవాళ్ళు మగవాళ్ళ ఈ జుత్తుజోలికి మాత్రం రావటం లేదు. స్త్రీల సవరాలకు మగవారి స్వచ్చంద కేశపాశాలే ముఖ్యమైన దినుసులు కనక!
గడ్డాలున్నంత వాళ్లంతా యోగులు, యోగ్యులని అర్థం కాదు. సీతమ్మవారిని ఎత్తుకెళ్ళిన రావణాసురుడు బవిరి గడ్డాన్ని అడ్డం పెట్టుకున్నాడు. ఆషాఢభూతులకు బారెడు గడ్డాలు. ఆశారాం బాపూలు, నిత్యానంద స్వాములూ ఆకర్షణీయమైన గడ్డాలతోనే అమాయకులను మోసం చేసారు. తస్మాత జాగ్రత్త మరి.
క్లియోపాత్రావంటి సొగసుగత్తెలకంటే కనుముక్కు తీరులో కాస్తంత వంపు ఉంటుంది. ఆ సొంపే ప్రపంచ చరిత్రను ఎంత విచిత్రంగానైనా మలుపు తిప్పేస్తుంది. మగవాడికేముంది? గడ్డాలూ మీసాలే గతి. ఏ గడ్డంలోని ఏ నలుసు మెరుపు చరిత్రనింకో మలుపు తిప్పుతుందో.. ఎవరికి తెలుసు?
చాందసమనే కాదు రాజసం తొణికిసలాడే ఈ గడ్డానికి ఇవాళ అగ్రరాజ్యంలో ఓ ప్రత్యేక దినం ఉంది(అక్టోబరు 18). ‘ఇవాళ ఉండి.. రేపు పోయే జుత్తు మీద వృథాగా ప్రేమ ఎందుకు? గీకి పారేయండి సంపూర్ణంగా ‘ అని తెల్ల బాబులంతా వేదాంతం వెళ్ళ బెట్టి రేజర్లు బిగించే రోజు. గడ్డం విలువ గ్రహించ లేక గదా ఆ ఉద్యమమంతా! మన దగ్గర ఎన్ని ఉపయోగాలో గదా ఈ గడ్డాలు.. గుబురు మీసాల వెనక?
నిజంగా ఇక్కడ బవిరి గడ్డాలన్నీ చెక్కించి పారేస్తే? ఇంతకాలం కనిపించకుండా పోయిన ఎంత మంది దొంగ వెధవులు, దొంగనోట్ల వెధవలు, దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిన వెధవలు, దొంగతనంగా ఎర్ర చందనం దుంగల్ని దేశం దాటించిన వెదవలు, దొంగ పాసుపోర్ట్లతో దర్జా వెలగబెడుతున్నవెధవులు, దొంగ ధ్రువ పత్రాలతో సర్కారు ఉద్యోగాలు వెలగ బెడుతున్న వెధవలు, దొంగ మాటలు చెప్పి కోట్లు వసూలు చేసి బోర్డ్లు తిప్పేసిన వెధవులు, దొంగ హామీలు ఇచ్చి ఆడవాళ్లని మోసం చేసిన వెధవలు, దొంగతనంగా ఫోటోలు తీసి ఆడపిల్లల్ని వేధిస్తున వెధవలు.. అబ్బో ఇంకెంత మంది దొంగ వెధవులు అంతా ఒక్కసారే మూకుమ్మడిగా బైటపడి అల్లకల్లోలమయి పోతుందో? హుద్ హుద్ తుఫాను కన్నా ఎక్కువ ప్రమాదం కదూ అప్పుడు?!
బాగుంది. కాని ఈ రోజుల్లో గడ్డం పెంచుకొనడానికి ఎవరు ఇష్టం చూపించడం లేదు.మా ఊరిలో గడ్డాలూ చేసే మంగలికి గిరాకి లేక తిట్టు కొంటున్న్నాడు.ఎవరు చూసినా క్లీన్ షేవ్ చేసుకొని కనిపిస్తున్నారు.గడ్డాలకు మంచి రోజులు రావాలని ప్రార్తిస్తూ …