లాఫింగ్ 'గ్యాస్'

మైండ్ బ్లాక్

డిసెంబర్ 2014

“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో.. వాడే పండుగాడు” అని ‘పోకిరీ’ లో మహేష్ బాబు డైలాగ్. ఆ డైలాగును బట్టి మైండు బ్లాకుకి మహేష్ బాబే ఆద్యుడు అని పౌరాణిక, చారిత్రక, జానపద నేపథ్యాలను ఆట్టే పట్టించుకోని ఆయన అభిమాన సందోహం కేరింతలు కొడితే కొడుతుండవచ్చు గాక .. వాస్తవానికి ఈ ‘మైండు బ్లాకు’కీ అన్నింటిలోలాగా బ్రహ్మదేవుడే ఆద్యుడు. బ్రహ్మాండ పురాణం నిండా దీనికి ఎన్నో ప్రమాణాలున్నాయి కూడానూ.

వేద వేదాంగాలను సృష్టించిన అలసటలో బ్రహ్మదేవుడు కాస్త మాగన్నుగా కన్ను మూసిన వేళ ఆ తాళపత్ర గ్రంధాలన్నీ ప్రళయ జలాల్లో జారిపడిన కథ ఓ సారి గుర్తు చేసుకుంటే మైండు బ్లాకు ఆది మూలాలు బైట పడతాయి. నీటి పాలైన వేద సాహిత్యాన్ని హిరణ్యాక్షుడు నోట కరచుకు పోయాడన్న విషయం బోధ పడగానే ముందుగా బ్ర్హహ్మాజీలో కలిగిన మానసిక వికారం ‘మైండు బ్లాక్’. బిడ్డ అచేతునడై అవస్థలు పడుతోంటే ఏ తండ్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండి పోగలడు! మత్సావతారం ఎత్తడం.. ఆనక ఆ హిరణ్యాక్షుని సంహరణ.. వేదాల ఉద్ధరణ.. ప్రస్తుతానికి మనకవన్నీ అప్రస్తుతాంశాలే గానీ.. మైండు బ్లాకు వరకు ప్రస్తావనార్హమే!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే పనిగా పెట్టుకున్న భగవంతుడూ మత్సావతారం నుంచి కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారాల మీదుగా రామద్వయావతారాలు, కృష్ణావతారాది మిగతా అవతారాలు వెరసి మొత్తం దశ అవతారాలు ఎత్తినా .. చివరికి ప్రస్తుతం నడుస్తున్న కలియుగం నాలుగో పాదంలో ధర్మదేవత కుంటి కాలితో కాదు సరి గదా.. కనీసం కాలి ముని వేళ్ల మీదైనా నడిచే యోగం కనిపించడం లేదు. ఇప్పుడు ఏ అవతారమెత్తి ధర్మోద్ధరణ చేయాలో అంతు బట్టకే భగవంతుడు గుళ్ళో బెల్లం కొట్టిన రాయిలా పడి ఉన్నాడని దేవుడంటే పడని నాస్తికుల వాదన. భగవంతుడంతటి వాడికే తప్పని ఈ మైండు బ్లాకు మానవ చరిత్రను ఇంకెంతగా ప్రభావితం చేసిందో చర్చించడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

క్షీర సాగర మధనం ఫలితంగా పుట్టిన హాలాహలం సేవించడంతో పరమ శివుడికి మైండు బ్లాకయితే.. అమృతం పంపకాల ప్రహసనంలో జగన్మోహిని సమ్మోహనాస్త్రంతో రాక్షసాధముల మైండ్లు బ్లాకయ్యాయి. ఒంటికి వెలి బూది పట్టించి, మంచు కొండలమీద పులి చర్మం కప్పుకుని యుగాల బట్టీ యోగ ముద్రలో మునిగి ఉన్నా మెదడుకి ఏమీ కాలేదు కాల రుద్రుడికి. కానీ గిరి పుత్రిక పార్వతీ దేవి సపర్యల నెపంతో సన్నిధానంలో చేరి సమయం చూసి విరి చూపులు విరజాజుల్లో కలిపి చేసిన మన్మధ ప్రయోగానికి మాత్రం మహేశ్వరుడికి మైండు బ్లాకయింది. కాబట్టే ఓ వంక గిరిజాకుమారి పాణి గ్రహణం చేస్తూనే మరో వంక నుంచి సృష్టి ప్రేరకుడైన మన్మధుడి మీద.. పాపం.. ఆగ్రహ జ్వాలలు కురిపించింది! పార్వతమ్మ కలగ చేసుకుని పరిస్థితులను చక్కబెట్ట బట్టి సరిపోయింది కానీ లేకపోతే రుద్రమూర్తి గారి మైండు బ్లాకు మూలకంగా సృష్టి మొత్తం సహారా మాదిరి ఎండి పోయుండేది కాదూ!

రామాయణం రాయక ముందు వాల్మీకులవారు వట్టి కిరాతకుడే! క్రౌంచ పక్షుల జంట మిథున భంగం కంట బడ్డాక కదా మైండుకి ‘మా నిషాద’ శ్లోకం తట్టి అనుష్టుప్ చందస్సులో అమర కావ్యం సృష్టించిందీ! పిట్టల పుణ్యమా అని ఒక మహనీయుడు మైండు బ్లాకు గండం నుండి బైట బడి మనకో మర్యాదా పురుషోత్తముడి కథను సంస్కృతీ సాంప్రదాయాల వరవడి కింద అందించాడు!

ఆ రామాయణం మాత్రం?! ఆరు కాండల ఉద్గ్రంథ రాజమే కావచ్చు కానీ ఏకమొత్తంగా చూస్తే బోలెడన్ని మైండు బ్లాకుల కథా గుచ్చం! విశ్వామిత్రుల వారు వచ్చారన్న ఆనందం క్షణకాలం నిలవలేదు పాపం దశరథ మహారాజులవారికి. నూనూగు మీసాలైనా రాని పెద్ద కొడుకు రామచంద్రుణ్ని యజ్ఞ యాగాదుల సంరక్షణార్థం పంపించమని ముని కోరిన ఉత్తర క్షణంలో మహారాజుకి కలిగిన చిత్త సంక్షోభం పేరు ఇవాళ్టి ఇంగ్లీషు భాషలో మైండు బ్లాకే! వశిష్టుల వారు కలగ జేసుకుని పరిస్థితులని చక్కబెట్టక పోయుంటే కకైమ్మ కథ వరకూ దశరథుడి వ్యథ అసలు కొన సాగేదే కాదు! ‘ఎవరు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైడు బ్లాంకవుద్దో ఆవిడ పేరే కైకమ్మ’ అని నిజానికి కైక చెప్పుకోవాల్సిన రామాయణం కోట్ ‘పోకిరీ’లో మహేష్ బాబు కొట్టేసినట్లుంది.

కాలి బొటన వేలుకు కాస్త ఎదుర్రాయి తగిలితేనే ప్రాణం పోయినట్లుంటుంది. మరి ఏక మొత్తంగా ఏడు తాడి చెట్లను ఒకే వేటుతో కూల్చిన రాంబాణం తగిలితే! ఎన్ని తలకాయలు ఉంటేనేమి.. మైండు బ్లాకవడం ఖాయం. రావణాసురుడికి చావుకు ముందు కలిగిన అనుభవం ఇలాంటిదే! ఆ రోజుల్లో ఇప్పట్లో లాగా.. పోస్టుమార్టమ్స్ గట్రా గొడవలు లేవు. ఉండుంటే బాణం దెబ్బ బొటన వేలుకి తగిలినందుకు కాదు.. ప్రాణం అక్కడే ఉందని రాముడికి ఎలా తెలిసిందబ్బా అన్న సందేహం వల్లే రావణాసురుడి మరణం సంభవించిందని తేలుండేది.

కృష్ణ పరమాత్ముడి కథ అంతకన్నా విచిత్రం. రేపల్లె తాలూకు గొల్ల భామల్నుంచి.. మధురా నగరి కంస మహారాజులవారి వరకూ ఎందరి మైండ్లనో దిమ్మతిరిగే రేంజిలో దెబ్బకొట్టిన లీలా వినోది శ్రీ కృష్ణ పరమాత్ముడు. ఓ మామూలు వేటగాడి పుల్ల బాణం దెబ్బకే ఉత్తి పుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు! భక్తి భావం తగ్గించుకుని కాస్త ఓపిగ్గా మరింత లోతుల్లోకెళ్ళి గాని వెదగ్గలిగితే.. చావు పుట్టుకలకు అతీతమైన ఆ భగవదంశ అంతటితో పరిసమాప్తమవడానికి ముఖ్య కారణం అంతకుముందు యాదవ కులంలో పుట్టిన ముసలమూ.. అది సృష్టించిన కలకలమూ.. దాని కారణంగా కృష్ణయ్య మెదడు బొత్తిగా స్థంభించడంగా అర్థమవుతుంది! ఐ మీన్ దిసీజాల్ బికాజాఫ్ మైండ్ బ్లాక్!

కురుక్షేత్రం రణక్షేత్రం మధ్యలో బంధుమిత్రులందరినీ చూసిన పాండవ మధ్యముడికీ కలిగింది మైండు బ్లాకే! వేళకి భగవంతుడు రథ సారథి రూపంలో దగ్గరుండి కర్తవ్యబోధ చేసుండక పోతే అర్జునుడి బుద్ధిస్థబ్దత వల్ల పాండవులు ఆరంభించకముందే ఆ యుద్ద్జం ఓడి ఉండేవాళ్లు!

జూదమంటేనే ఒక బుద్ధి తక్కువ వ్యవహారం కదా. ధర్మరాజుది మహా జూద వ్యసన బుద్ధి. శకునితో పాచికలాటకని కూర్చున్న తరువాత ఓటమి మీద ఓటమి కారణంగా పెద్దన్నగారి బుద్ధి మరీ మందగించింది. ఆ చిత్త స్థంభనంలోనే రాజ్యాన్ని, అన్నదమ్ముల్ని, చివరికి కట్టుకున్న భార్యని సైతం ఫణంగా పెట్టి చిక్కుల్లో పడింది. మైండు బ్లాకు కాకపోతే ఆడకూతుర్నెవరన్నా మరీ అంత నీచంగా ఆటల్లో ఫణంగా పెడతారా!

పూరీ జగన్నాథ స్వామి విగ్రహాన్ని నిర్మించిన మహాశిల్పి ఎవరో కానీ.. ఆ మహానుభావుడికీ ఈ మైండు బ్లాకు జబ్బు దండిగా ఉన్నట్లే లెక్క. అంత అత్యద్భుతమైన కళాఖండాలని మలిచే శిల్పికి ఏ మైండు ఫ్రీజ్ వ్యాధో లేకపోతే అలా అర్థాంతరంగా వదిలేసి పోడు గదా!

బమ్మెర పోతనామాత్యుడు భాగవతం రాసుకుంటూ పద్యం మధ్యలో సరైన పదం తట్టక తన్నుకులాడినట్లు పుక్కిట పురాణాలు చెబుతున్నాయి. మైండు బ్లాకుని వదిలించుకోవడానికి ఆయనా వేళ కాని వేళ నదీ స్నానానికని వెళ్ళడం.. ఆ సందులో భగవంతుడే స్వయంగా పోతనగారి వేషంలోనే దిగొచ్చి తన పద్యం తానే పూరించుకుని పోవడం మనకు తెల్సిన కథే. దివిలోని దేవుణ్నీ భువికి దింపించిన మైండు బ్లాకుని అందుకే మనమంత చులకనగా చూడ వద్దనేది.

యథావాక్కుల అన్నమయ్య అని మరో మహానుభావుడు ఉన్నాడు. సర్వేశ్వరుని మీద శతకం రాస్తూ తన ప్రజ్ఞ మీదున్న అపారమైన విశ్వాసంతో ఓ విచిత్రమైన పంతం పట్టాడు. రాసిన పద్యంలో ఎక్కడైనా దోషం గాని ఉన్నట్లు రుజువైతే తరువాతి పద్య రచనకు పునుకోడుట సరిగదా.. గండ కత్తెరతో అక్కడికక్కడే తల నరుక్కుని చస్తాడుట!’ దోష పరీక్షకు అతగాడు ఎన్నుకున్న విధానం మరీ చిత్రం. పద్యం పూర్తయిన వెంటనే దాన్ని ఏటి వాలుకు వదిలేస్తాడు. ఏటికి ఎదురీది తిరిగి ఆ తాటాకు తన దగ్గరికి వస్తేనే.. తదనంతర పద్యం రచన ప్రారంభమయేది. విచిత్రం ఏమిటంటే ఏట్లో వేసిన పద్యం తాటాకులన్నీ అలాగే తల్లి నెత్తుకుంటూ వచ్చే పిల్లల్లాగా బుద్ధిగా కవిగారిని చేరుకుంటూనే వచ్చాయి క్రమం తప్పకుండా! ఓ పోకిరీ పద్యం మాత్రం వరస తప్పించింది. ఆ పద్యం ఎంతకూ తిరిగి రాక పోయే సరికి ..ఇహనేం.. కవిగారు.. శపథం ప్రకారం.. గండ కత్తెర బైటికి తీసారు. కవీ.. కావ్యమూ రెండూ అర్థాంతరంగా ఖతమవుతాయనుకున్న చివరి క్షణంలో ఓ పిల్లవాడు ఆ పద్యమున్న తాటాకుతో పరుగెత్తుకుంటూ వచ్చి కవిగారిని, శతకాన్ని రక్షించాడు. ఆ వచ్చింది సాక్షాత్తూ సర్వేశ్వరుడేననీ.. యథావాక్కులవారి తాత్కాలిక మేథో బంధనం వల్ల ఏర్పడ్డ దోషాన్ని స్వయంగా నివారించి తన వంతు సాహిత్యసేవ చేయడానికి అలా వేంచేసాడని మరో కథనం. ఎంత యథావాక్కుల వారికైనా మైండ్ బ్లాకు గండం ఎదురవక తప్పదు. మధ్య మధ్యలో ఏ అదృశ్య శక్తుల లీలా విలాసాల వల్లనో కథలిలా ముందుకు కదులుతుంటాయి.. అలా కదలాలని గనక రాసి పెట్టుంటే!

అందుకు విరుద్ధంగా తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యంలో ఓ కవిగారు ఏకంగా భగవంతుడి బుద్ధి మాంద్యం వల్ల కష్టాల పాలయ్యాడు. రాజు గారు మంచి పద్యాలకి అగ్రహారాలు పురస్కారంగా ఇస్తున్నారని తెలిసి ఓ శివ భక్తుడికి బాగా ఆశ పుట్టింది. ‘ఇన్నాళ్ళుగా నిత్య ధూప దీప నైవేద్యాలతో నీకు కంచిగరుడ సేవ చేస్తున్నానే! నాకీ ఆగర్భ దారిద్ర్యం వదలదా?’ అంటూ నిత్యం కొలిచే పరమేశ్వరుడితో పోట్లాట పెట్టుకుని దేశం వదిలి పోబోతుంటే .. భక్తుడి విశ్వాసాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక రాజుగారికి వినిపించి మంచి పురస్కారం అందుకోమని ఒక పద్యం చెప్పాడు పరమ శివుడు. తీరా అది కాస్తా రాజుగారి సమక్షంలో పెను వివాదానికి దారి తీసింది. రాజాశ్రయంలోని ఓ కవిగారా పద్యంలోని దోషాన్ని ఎత్తి చూపించడం వల్ల.. కుష్టవ్యాధికీ గురవ్వాల్సి వచ్చింది. పార్వతీదేవి కేశ పాశ పరిమళ వర్ణనల్లోని దోషాన్ని గురించి ఆ రచ్చ. భగవంతుడికీ కొన్ని సందర్భాల్లో మైండు బ్లాకయే అవకాశం ఉందని ఈ కథను బట్టి మనం తెలుసుకునే సత్యం.

రామచంద్రుని మీద కీర్తనలు కట్టే కంచర్ల గోపన్నకీ ఈ మైండు బ్లాకు బాధలు తప్పినట్లు లేదు. మంది సొమ్ముతో మందిరం నిర్మించినందుకు తానీషా ప్రభువు గోల్కొండ చెరలో బంధించాడు గోపన్నను. అప్పట్నుంచే గోపన్నకి బుధ్ధి స్థబ్దత బాధలే ర్పడ్డట్లనిపిస్తోంది. రవి వీరెల్లి నవంబరు ‘వాకిలి’ సంపాదకీయంలో వెలిబుచ్చినట్లు కవికి మైండు బ్లాకుకి మించిన చెర మరేముంటుంది? గోల్కొండ చెర కన్నా భావ స్థబ్దత చెర నుంచి బయట పడేందుకే ఆ రామ దాసుడు ఎక్కువగా పెనుగులాడినట్లు స్పష్టం. ‘ఇక్ష్వాకు కుల తిలక.. యికనైన పలుకవె రామచంద్రా! నన్నురక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా!’ అంటూ ఆ దాసు వేడుకున్నది బహుశా బుద్ధి బాధలనుంచీ విముక్తి కోసమే అయి ఉండాలి. మధ్య మధ్యలో ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా/ ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా!’అని లెక్కలూ గట్రా తీయడమూ, ‘ఏటికి చల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా! నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా’ అంటూ వాపోవడం .. వగైరా చెష్టలన్నీ ఆ బుద్ధి మాంద్యం నుంచీ బైట పడేందుకు చేసిన విఫల యత్నాలుగానే భావించాలి.

మహానుభావుడు అన్నమయ్య! శ్రీ వేంకటేశుని మీద ముప్పై రెండు వేల కీర్తనలు ఎలా గట్టాడో.. మధ్య మధ్యలో ఎన్ని విధాలుగా ఈ మైండు బ్లాకు గండం నుంచి గట్టెక్కాడో ఆ ఏడుకొండల వాడికే ఎరుక!

త్యాగరాజయ్యరు స్వామివారి మానసిక స్థభ్దతా కాస్త అధిక మోతాదులోనే ఉండేదంటారు చరిత్ర కారులు. ఆయన అదో రకమైన ట్రాన్సులోకి వెళ్లిన మూడ్ చూసి మరీ చుట్టూ మూగేవారుట భక్తగణం. ఆ క్షణంలో ఆ వాగ్గేయకారుని నోటినుంచి రాలిన ముత్యాలను కాగితాల మీదకు ఏరి పోయడమే వారి పని. అలా ఏరి దాచిన ముత్యాల కోవ లోనివే పంచ రత్న మాల వగైరా పంచదార కోవా బిళ్ళలు. పారవశ్యంలోనుంచి బైటికి వచ్చిన ఉత్తర క్షణంనుంచి త్యాగరాజయ్యరుకి ఉడిపి కాఫీ హోటలయ్యరికీ మధ్య ఆట్టే తేడా ఉండేది కాదనే వారూ కొందరున్నారు. మామూలుగా కవులందర్నీ వేదించే మానసిక స్థబ్దత ఆయన్నీ వదిలింది కాదనడానికి ‘మరుగేలరా ఓ రాఘవ.. మరుగేల చరాచర రూప పరా-త్పర సూర్య సుధాకర లోచన’ అన్న ఒక్క కీర్తనే మచ్చుక్కి చాలు. మరుగయిందని అంతగా ఆ సంగీత మూర్తి ఆర్తి చెందింది చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనుణ్ణి గురించా.. పరాకు చిత్తగించి చిరాకెత్తించే బుద్ధి సూక్ష్మతను గురించా? ఆలోచించాలి విజ్ఞులు!

పౌరాణిక పద్యాలను వూరికే చేంతాళ్ళకు మల్లే చెడలాగి పాడు చేస్తుంటారని షణ్ముఖి.. పీసపాటిలాంటి పద్యనాటక కళాకారుల మీద బోలెడన్ని అభాండాలున్నాయి ఆ రోజుల్లో. ఎన్నో చిత్రాల్లో ఘంటసాలవంటి గాయకులు ఆ రాగాల హోరును తగ్గించి పాడారు. చిత్రాలు కాబట్టి ఆ గాయకులకి మేథో స్థంభన ఇబ్బంది తక్కువ. నాలుగు రకాలుగా పాడి మంచి ముక్కల్నన్నింటినీ ఏరి జత చేస్తే వినసొంపుగానే ఉంటుంది ఏ ‘జండాపై కపిరాజు’ పద్యమైనా. నేరుగా వేదికలమీద సంభాషణల రూపంలో పద్యాలు పాడాల్సిన అగత్యం స్టేజీ నాటక కళాకారులది. ఎక్కడ తప్పు దొర్లినా వెంటనే ప్రేక్షకులు చెప్పులకు పని చెప్పేవాళ్ళు. భయంకరమైన ప్రతిస్పందన వచ్చి పడే ప్రమాధం అనుక్షణం అలా నాటక కళాకారులను వెంటాడుతుంటుంది కనకనే.. తరువాతి పదం బుర్రలో మెదిలే దాక బుర్రా సుబ్రహ్మణ్యం లాంటి అత్యుత్తమ కళాకారులు సైతం అంతలా గొంతు చించుకుంటూ పద్యాలు సాగదీసి మరీ ఆలపించించేది. మతి స్థబ్దత మాయ రోగానికి నాటకాల వాళ్ళు కనిపెట్టిన అతి చక్కని మందు ఆరున్నొక్క రాగంలో శృతిని తెగిందాకా లాగడం!

‘పదండి ముందుకు.. పదండి ముందుకు.. పోదాం పోదాం పై పైకి’ అంటో కవులందరినీ తెగ తొందర పెట్టే శ్రీ శ్రీ నీ ముందుకు కదలనీయకుండా బ్రేకు లేసింది మైండు బ్లాకే. చలాన్ని అరుణాచలానికి తరిమిందీ ఈ మైండు బ్లాకే. ఆరుద్రను సినిమాలకు దూరం చేసినా, ఆదుర్తిని కడదాకా సాగనీయక దెబ్బ తీసినా ఆ పాపమంతా ఈ మైండు బ్లాకు సైంధవుడిదే నంటారు తెలిసీ తెలియని వాళ్ళు! ఆత్రేయలాంటి ఎందరో మహానుభావులు డబ్బు కళ్ళ జూడందే మైండు బ్లాకు నుంచి ససేమిరా బైటకొచ్చే వాళ్ళు కాదంటారు ఇంకొందరు. ఈ జబ్బుబారిన పడి డబ్బు వృథా కాకూడదనే సినిమా వాళ్ళు ఒక్క రచయిత మైండు మీదనే ఎప్పుడూ ఆధార పడరు. ఆఫీసు బాయ్ దగ్గర్నుంచి.. ఫైనాన్సియర్ తాలుకు ఫియాన్సీ దాకా ఎవరైనా ఏ దశలోనైనా నిరభ్యంతరంగా కథా నిర్మాణంలో వేళ్లూ కాళ్లూ పెట్టే వెసులుబాటు చిత్రసీమలో గగ్గయ్యగారి కాలం నుంచీ ఉంది అందుకే.

విక్రమార్కుడికి కథలు చెప్పే బేతాళుడికి ఈ మైండు బ్లాక్ ప్రాబ్లం లేదు. భోజరాజుకి కథలు చెప్పే సాలభంజికలకూ ఈ మైండు బ్లాకు జబ్బు రాలేదు. మొగుళ్ళు ఇంట లేనప్పుడు రాజుగారి పడగ్గదికని బైలు దేరిన ఇల్లాళ్ళను ‘సప్తశతి’లో చిలక ..’ హంస వింశతి’లో హంస రక రకాలుగా కథలు.. కబుర్లు చెప్పి పాప కూపంలో పడకుండా రక్షించాయి. మనుషులకు మల్లే పశు పక్ష్యాదులకు మైండు బ్లాకు జబ్బు లేకపోవడం అదృష్టం.

విశ్వనాథ వారికీ ఈ బుద్ధి సంకోచ రుగ్మత ఆట్టే తగిలినట్లు లేదు. వేయి పడగలు నుంచి.. రామాయణ కల్ప వృక్షం వరకూ ఆ మొండి మనిషి సృష్టించిన బౌండు సైజు సాహిత్యం చాలు మైండు బ్లాకుకి ఆయన బెండయ్యే టైపు కానే కాదని తెలుసుకోడానికి.

గురజాడ వారి గిరీశం తరహా పాత్రల్ని చూడండి. ఎలాంటి ఉపద్రవాన్నుంచైనా అప్పటికప్పుడు ఏవేవో తడికలల్లి తప్పించుకునే టేలంట్ పుష్కలంగా ఉంటుంది.. ఖర్మ. మధురవాణి వంటి నీతిమంతులు టైముకి ఎంటరవక పోయుంటే ఒక్క బుచ్చమ్మ అనేముంది.. సౌజన్యారావు పంతులూ చివర్లో ‘డ్యామిట్ .. కథ అడ్డం తిరిగింది’ అని ఘొల్లు మనాల్సొచ్చేది.

గీరీశం .. ఆషాఢభూతుల్లాంటి ‘బ్లాక్ మైండెడ్‌’ ఫెలోస్ కి ఈ మైండ్ బ్లాక్ రోగం రాకపోవడం ఒక రకం దురదృష్టమైతే .. ఎన్ని దఫాలుగా దగా పడ్డా.. రాజకీయ చదరంగంలో పెద్ద పాము నోట పడకుండా తప్పించుకోడం రాని ఆమ్ ఆద్మీ పెను బుద్ధి మాంద్యం మరో పెద్ద దురదృష్టం.

రావి శాస్త్రి లాగానో.. కారా లాగానో రాయడం రాక పోతేనేమి! రాజకీయ నేతాశ్రీలను చూడండి.. ఏ మైండు బ్లాకులూ ఈ నక్క మార్కు రాయని భాస్కరుల బెండు తీయలేకుండా ఉన్నాయి. అదొక్కటే బాధాకరం ఈ ఎపిసోడ్ మొత్తానికీ!

***** (*) *****