లాఫింగ్ 'గ్యాస్'

కొత్త సంవత్సరంలో… కొన్ని పాత ముచ్చట్లు

జనవరి 2014

పాత యముడా? కొత్త యముడా? అన్నది ఓ పాత తెలుగు సినిమా ఫేమస్ డైలాగు. ‘పాతా?.. కొత్తా? రెండింటిలో ఏది మెరుగు?’ అన్న ధర్మసందేహం సత్యయుగంనుంచే వస్తున్నట్లున్నది!

పాత కొంత మందికి రోత. కొత్త కొంతమందికి చెత్త. పాత కొత్తలతో నిమిత్తం లేకుండా నాణ్యతను బట్టి రెండూ స్వీకరణీయమే- అని మరికొందరు మధ్యేవాదుల వాదన. ఎవరి మాటల్లో ఎంత బలముందో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా కొద్దిగా సరదాగా విచారిద్దామని ఉందీ సారికి.

కొత్తనీరు నెమ్ము చేస్తుంది. కొత్త చింతకాయకు పులుపు తక్కువ. కొత్త చెప్పుల్లో కరిచే ప్రమాదం జాస్తి . కొత్త కారు తోలడం కడు శ్రద్ధతో కూడిన వ్యవహారం. కొత్తబియ్యం ఓ పట్టాన ఉడుకు పట్టదు. తెలియని కొత్తమేళం కన్నా తెలిసిన పాతమేళమే మేలనే భయస్తులూ కద్దు. ‘కొన్ని నాళ్ళుగ ‘నిన్న’ పై నా/కున్న ప్రేమ మ్మిమ్మడించెను’ అని బాహాటంగానే తన సనాతన ప్రియత్వాన్ని చాటుకున్నారో సందర్భంలో సినారె.

ఎవరెన్ని చెప్పినా కొత్త కొత్తే. కొత్తదనంలోని కళ పాతదనానికి రాదు! కొత్తదుస్తులు, కొత్తసెల్ ఫోన్, కొత్త స్నేహితులు, కొత్తకరెన్సీ నోటు, కొత్తసినిమా, కొత్తకథానాయిక.. ఓహో.. కొత్తలోని తాజాదనాలే వేరు. కొత్త జంటసంబరం అంబరాల్లో విహరిస్తుంటుంది! నూతనత్వంమీద మోజనేదే లేకపోతే మనిషి ఈ రోజుకి ఇంత పురోభివృద్ధి సాధించుండే వాడా?! ఇదీ నవీన ప్రియుల నూతన విలాస వాదం. నిజమేనేమో!

ఫ్లాపుల భయంతో కథలు పాతవే తీసుకున్నా వాటిని కొత్త కొత్తగా తెరమీద చూపించడానికి నానా తంటాలు పడుతుంటారు చిత్ర నిర్మాతలు! సాహిత్యంలోనూ సదా కొత్తదనం కోసం కవులు, రచయితలు పడే యాతనలైతే అన్నీ ఇన్నీ కావు. భాషలకూ ఈ కొత్త పాతల జాడ్యం బాగానే అంటుకున్నట్లుంది. పూర్వం మన తెలుగులో అరసున్నాలుండేవి. అలాగని ఇప్పుడూ అరసున్నాలు వాడతామంటే మూతిని నిండుసున్నాలా చుట్టేస్తారు పిన్నలూ పెద్దలూ! బండి ‘ఱ’ లు బండరాళ్ళు ఈ కాలం రాతగాళ్లకు. ఇహ ‘అః’ లు, ‘ఌ’ అళూలు, ఙ్, ఞ్, జ్ఞ్ వగైరా అనునాసికాలు సంగతి అనుకోనవసరమే లేదు. ౘ, ౙ ల్లాంటి వర్ణాలకు ఇవాళ మిగిలింది చివరికి ‘ఛ..ఛా! జా..జా!’ అన్న చీదరింపులే. ఎంత ‘వర్ణ’సంకరం జరిగితే అంత కొత్త ఫ్యాషనుగా నడుస్తున్నది ప్రస్తుతం ట్రెండు.

‘లోతు పాతులు గల్గు ఱాతి గోడల కట్టడములెన్నొ నేల మట్టంబు గాగ
వేవేల రూకలు వెచ్చించి కట్టిన, మేడలెన్నియొ నేలమీద గూల
మేల్మి బంగారంబు మెత్తి నిల్పిన దొడ్డ గీములెన్నో బోరగిల్లి వ్రాల
రతనాలు తాపిన రచ్చ పట్టుల మాడువులు పెక్కు మట్టిలో గలిసిపోవ
పడతిరో! చూడలేదె? నీ పాడుకొంప వాని కన్నను మిన్నగా వగచుచుంటె?
విడువు మీ యికనైన నీ వెడగుదనము, పడక మానదు చుమ్మి! ఈ ప్రాతయిల్లు’

అని ఓలేటి వేంకట రామశాస్త్రిగారనే కవిపండితులు మూడు పాతికల ఏళ్ళ కిందటే ‘పాత’ ఎంత విసర్జనీయమో పద్య సహితంగా మరీ సెలవిచ్చేసారు.
పాత భారతులు తిరగేయండి! బోలెడన్ని కొత్త సంగతులు ఇలాంటివే బైట పడతుంటాయి.

ఈ ప్రకటన చూడండి!

బోస్టన్ నుంచి వెలువడే ఓ ప్రముఖ దైనందిన పత్రిక (The Christian Science Monitor, London Edition) 1973, ఏప్రియల్ పదో తారీఖు నాటి ప్రకటన ఇది. యుద్ధం వెనకున్న రాజకీయాల నలా పక్కన మూసిపెట్టి విదేశీయుల మీద తమ ముద్ర నత్యంత బలంగా వేసుకోవాలన్న పన్నాగంతో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన ‘సరికొత్త’ ప్రకటన ఎత్తుగడ! విషాద వదనంతో బుగ్గల మీద దుఃఖాశ్రువులతో హృదయ విదారకంగా రోదించే ఓ ఆడపడుచు చిత్రాన్ని ఈ ప్రకటనకు జతచేసి మరీ యుద్ద తంత్రాల్లో సైతం ప్రభుత్వాలు ఎన్ని కొత్త కుతంత్రాలు చేయచ్చో నిరూపించింది పాక్ ప్రభుత్వం.

‘వసంతం కుసుమించినప్పుడూ
హసంతులు వికసించినప్పుడూ
మందానిలం రెక్కలు విప్పినప్పుడూ
చంద్రకాంతులు చెయ్యెత్తి పిలిచినప్పుడూ
మైకంతో పరవశించి
పంచమ స్వరంతో మళ్ళీ మళ్ళీ పాడాను నేను ఒకే పాట

కాలం మారింది
గవేషణ ముగిసింది
జగత్తు కొత్త గొంతుకై నిరీక్షిస్తున్నది
శర్వాణి ముందు నా చారువాణి పలకాలిక నేడిక
జ్యోతిర్మయ గీతం విన్పించాలి నేనిక!’

అని డాక్టర్ ముదిగొండ శివప్రసాదంతటి సాంప్రదాయ వాదీ నూతనత్వం కోసం వెంపర్లాడి పోయారే! కొత్తదనంలో నిజంగా అంత గమ్మత్తు ఉందనేనా అర్థం?!
‘గమ్మత్తో.. మత్తో అదలా ఉంచు! పాతవైనంత మాత్రాన అన్నింటినీ పారవేయాలన్న సూత్రం మాత్రం శుద్ధ తప్పు’ అన్నది పాతకాపుల వాదన. పాత సారాయి, పాత చింతకాయ పచ్చడి, పాత బియ్యం, పాత సినిమా పాటల్లాంటి సరంజామా మొత్తం తెచ్చి పాతదనంలోని ఆపాత మధురానికి ఉదాహరణలంటూ మన ముందుంచుతుంటారు. మరి దానికేం జవాబు చెప్పాలి?!

‘పాత’ చింతకాయలని తెగ ఈసడించుకునే కొన్ని బౌద్ధ, జైన వాఙ్మయాల తాలూకు ‘పాత’ కథలు ఎంత అధునాతంగా ఉంటాయో తెలిస్తే షాక్ కొడుతుంది’ అంటారు సైన్సు విషయాల మీద సైతం సమగ్రావగాహన గల కొ.కు. ‘నిత్య నూతనమైన ఉపయుక్తాంశమేదైనా పాతవాటిలో ఉంటే ప్రస్తుతావసరాలకు తగ్గట్లు మెరుగులు దిద్దుకుని వాడుకోవడంలోనే విజ్ఞత ఉంది. విజయావారి సత్య హరిశ్చంద్రే ఇందుకు మన ముందున్న మంచి ఉదాహరణ. అత్యంత ప్రాచీనమైన హరిశ్చంద్రుడి సత్యవ్రత సూత్రాన్ని పింగళివారు నేటి తరాలకు అనువుగా ఎంతద్భుతంగా మలిచి చూపించారు! బాపూజీ సత్యనిష్ఠతను గూర్చి నెహ్రూజీ చెప్పిన వ్యాఖ్యానాన్ని పింగళివారు విశ్వామిత్రుని నోట కొత్తగా పలికించిన తీరు అత్యధుతం! పాత.. కొత్తలనేవి కేవలం కాల సంబంధమైన కొలమానాలు మాత్రమే సుమా!’ అని కుటుంబరావుగారంతటి మేధావి అంటే కాదని ఎలా కొట్టి పారేయడం?!

‘ఓల్డీజ్ గోల్డ్’ అన్న ఆంగ్ల సామెత ఉండనే ఉండె! పాతంతా మరీ అంత బంగారమే ఐతే కొత్త బంగారానికే మార్కెట్లో విలువెందు కెక్కువో! ఒకానొకప్పుడు ఓ గొప్ప ఆభరణంగా వెలిగి మధ్యలో మొరటై పోయినా మళ్ళీ ఫ్యాషన్ ప్రపంచంలో మకుటం లేని మహారాణిలా వెలిగి పోతున్నదిప్పుడు ఆడవారి వడ్డాణం. ఏది పాత? ఏది కొత్త? గందరగోళంగా ఉంది గదా ఈ లెక్క!

ప్రకృతి వరసను చూసినా ఇదే అయోమయ మాయ! పగటిపూట వెలిబూడిద వర్ణంలో వెలా తెలా పోయే కొండలు చీకటి పడంగానే వెన్నెల మలామాలద్దుకుని బంగారు కొండల్లాగా భాసిస్తాయి. పగటి వెల్తురులో పాలిపోయినట్లుండి నీరసంగా పారే సెలయేళ్ళు సైతం వెన్నెల బంగారు రంగుల్లో ఎన్ని రస భంగిమలు చూపిస్తాయో! ఏది ఇప్పటికి కొత్తదనిపిస్తుందో రేపటికది పాతదయి మూలబడుతుండె! ఏది ఇప్పటి మన కంటికి పాతకాలం నాటి చప్పటి దనిపిస్తుందో.. రేపటి తరాల గుండెలనది గొప్ప కొత్త ట్రెండై ఊపేస్తుండె! పాత కొత్తలనే వాటిని అందుకే ‘సాపేక్ష అపేక్ష’ సిద్ధాంతం పునాదుల మీద ఆధారపడ్డ భావజాలంగా నిర్వచించింది ఖలీల్ జిబ్రాన్.

‘దృష్టపూర్వా అపి హ్యర్థాః కావ్య రసపరిగ్రహాత్। సర్వే నవా ఇవా భాంతి మధుమాస ఇవ ద్రుమాః॥‘ అని మన వేద సంస్కృతీ ఆ సిద్ధాంతాన్నే సమర్థించడం ఆశ్చర్యం. మాఘమాసంలో ఉన్నట్లు చెట్లు చైత్రంలో కనిపించవు. వసంతలక్ష్మి మృదు పద నృత్యం తోటలోని ప్రతి అణువుకూ ఎప్పటికప్పుడు నవజీవాన్ని ధారపోసినట్లు గతంలో ఎరిగున్న అర్థాలే అయినప్పటికీ ఆయా కావ్యాలు సందర్భాన్నిబట్టి శబ్దాలకు కొత్త అర్థాలను గ్రహిస్తున్నాయి గదా. మరిక పదాలకు, శబ్దాలకు పాతవనే అపప్రథ తగిలించడం అన్యాయమవునా, కాదా!

మానుష రాగద్వేషాలు, మోద ఖేదాలు, మానావమానాలు, ఎప్పుడూ ఒకే తీరులో ఉంటాయి. కొత్తదనమల్లా వాటి భావ ప్రకటనా విధానాల్లోనే. రామాయణంలో భగీరథుడి వెంట గంగమ్మ పరుగులు పెట్టింది. వేల ఏళ్ళ తరువాత కిన్నెరసానిలో భర్తకు దూరంగా జరిగి కడలి వైపుకి సెలయేరు తరలి వెళ్ళింది. రెండు ప్రవాహాల్లోని ఉరవళ్ళు ఒకటే కావచ్చు కానీ.. అలజడుల్లో తేడా లేదూ! అలజడి కొత్తది. ఉరవడి పాతది. ఈ సూక్ష్మరహస్యం వంటబడితే ఇంకే పాతకొత్త వాదనలకూ తావే ఉండదు.

‘కంటి క్రొన్నీటి ముత్యాలు’ ‘ఏటి కడుపున దాగి తోట నిదురోయింది’ లాంటి ప్రయోగాలు ఇప్పటికీ మన స్మరణలో నలుగుతున్నాయంటే .. అవన్నీ అప్పటి కాలానికే కాదు ఇప్పటి కాలానికీ కొత్త ప్రయోగాలే కావడం కారణం. పాతదనానికి పాతవాసనే శాశ్వతంగా ఎలా ఉండిపోదో.. కొత్తదనానికి తాజాదనమూ ఎల్లప్పుడూ అలాగే నిలబడి ఉండదు. ఇది పాతది.. ఇది కొత్తదని గీతలు గీసి బరికి ఆవల ఈవల వేటిని నిలబెట్టినా అవి మన బోళాతనాన్ని మాత్రమే బైటపెడతాయి! ‘ఏడ జనిన మనోహరి జాడ లరసి/ కలగు హృదయమ్ము నెమ్మది చలన మొందు’ అన్నారు కృష్ణశాస్త్రి. శతాబ్దాల కిందట పండిత రాజు భామినీ విలాసంలో అన్న భావమూ అదేనాయ! మరి ఏది పాతభావం?! ఏది కొత్తశబ్దం?

‘వేయి సంవత్సరాల్ వెనకాల కవినోయ్/ వేయిసంవత్సరాల్ గడిచాకా కవి నేనోయ్’ అని ఓ కవి సగర్వంగా ప్రకటించుకుంటున్నాడంటే ఏమిటర్థం? పాత కొత్తల వాదానికి తాను అతీతమైన వాణ్ణననే అతిశయమేగా అది! లోకం ఊహించే పాత కొత్తలంతా పై పై చూపులకు మాత్రమే పరిమితం. పది రోజుల పాటైనా గట్టిగా కాల పరీక్షకు తట్టుకుని నిలబడలేని ప్రక్రియలకి కొత్తేమిటి? పాతేమిటి? మన వెర్రిగానీ!

మర్రిచెట్టు కింద బుర్రుమీసాలు, గుబురుగడ్డాలు పెరిగిన ఓ బ్రహ్మతేజస్వి.. చుట్టూతా చేరిన బ్రహ్మచారులకు రాత పరికరాలతో సంబంధంలేని, అచ్చక్షరమంటే ఏమిటో తెలీని సాంప్రదాయ విజ్ఞానాన్ని అనుశ్రుతంగా నూరిపోస్తూ వచ్చిన విద్యా విధానం ఒకప్పటి మనది. ఇప్పటి రెసిడెన్షియల్ విద్యా విధానానికి వేదకాలంనాడే గురుకులాల్లో బీజం పడిందంటే కాదనగలమా? మరి ఏది కొత్త? ఏది పాత? పురాణాలలో ఎక్కడ చూసినా కనిపించే బ్రహ్మసత్రాలకు నకళ్ళే ఇవాళ్టి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సదుపాయాలు. వాయు పురాణంలో అధిసీమ కృష్ణుడనే రాజు నడిపిన బ్రహ్మసత్రాలకు మోడరన్ మోడళ్ళలాగుంటున్నాయి ఇప్పటి నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలు నడిపే వసతి కళాశాలలు. పాతలోనుంచే కొత్త పుట్టుక అయినప్పుడు, ఏది కొత్త? ఏది పాత? ఎలా విభజన?!

వేటూరి ప్రభాకర శాస్త్రిగారి భాషలో వసంత దినాలంటే మలయ సమీర సౌరభ సమంచితాలు. నవ్య వార్షిక నిదాఘ దినాలంటే పరిణత చూత పోత ఫల భర పరీతవ వనాంతాలు. అవిరళ వారివాహ నివహావృత సర్వ నభో విభాగాలు- నవ శరదాగమాంబుద దినాలు. ఇహ లుకలుష వారి పూరకమలాకరాలు, పరిపూర్ణ సర్వ సస్య కలిత భూ విభాగాలు స్వచ్చనభోంతరాలు- శరవద్దివసాలు. అమిత హిమ ప్రపాత హితావృతావృత భూమి నభోవకాశాలు- నవీన వర్ష హిమకాల దినాలు. లలిత వసంత లక్షణ విలాస సమీర మనోహరాలు- శైశిర దినాలు. ఒక్క వత్సరమే రుతువుకొక తీరుగా ఇన్ని క్రొంగొత్త పోకడలు పోతున్నదే! మరే కొత్తదనానికి నిలకడనేది ఎక్కడ? ఏ పాతదనానికి కడసారిగా వీడ్కోలు పలికుతున్నదెక్కడ? కాళిదాసునుంచి కవి దాశరథి దాకా ఈ కాలచక్ర విభ్రమణానికి అద్దిన కవిత్వపు అద్దుళ్ళనింటినీ ఓ సారి విహంగ భంగిమలో వీక్షించినా చాలు.. ‘ఏది శాశ్వతమ్ము? ఏది అశాశ్వతమ్మన్న’ వైదాంతిక పరిణతి దానంతటదే తన్నుకుని వచ్చేయడానికి. ఇంతోటి క్షణభంగుర సింగారాల సింగినాదాలకా ఏది కొత్తది.. ఏది పాతది? అన్న శుష్క వివాదాలు గోల?!
కోయిల మధుర గానంలో స్నానం చేసిన ఆరామ తరులతకు నికుంజాల సుఖపారవశ్యం ఎప్పటికప్పుడు కొత్త అనుభవమే గదా! తడిసిన ఆకుల వలువలు, ఎరుపెక్కిన చిగుళ్ళ పెదాలు, కై పెక్కిన మొగ్గల బుగ్గలు, పులకించిన పూల ముఖాలు.. తాజాదనానికి సదా తాజా చిరునామాలవుతాయా కావా? వీచే ప్రతి వాయు తరంగం నవోదయానికి ఓ స్వాగత స్వరం. ఊగే ప్రతి హరిత పత్రం ప్రగతి శకటానికి ఊపే పచ్చ జెండా. పొడిచిన ప్రతి గడ్డిపరక, పూచిన ప్రతి గడ్డిపువ్వు ఈ కర్మభూమిలో క్రియాశీలతకు ఎప్పటి కప్పుడుగా రాసుకునే ఎజెండాలే అయినప్పుడు ఇక పాతదనానికి తావేముంది? కొత్తదన౦ కానిదేముంది?

సందెవేళ గూళ్ళకు చేరుకునే పక్షుల కిలకిలారావాలకు, సముద్రాల వైపుకి పరుగులెత్తే సెలయేళ్ల ఉరవళ్ళకు, గోపుర మూపురాలపై కులికే గువ్వల కువ కువలకు ప్రతిపదార్థాల కోసం పదని ఘంటువులు వెదకడం వ్యర్థం. ఎప్పటికప్పుడు కొత్తగా టీకా తాత్పర్యాలు చెప్పుకోవాల్సిన శబ్దాలు పుటల పెట్టెల్లో నిశ్శబ్దంగా పడి ఉంటాయా మన చాదస్తం గానీ!

ఎగిరే పక్షుల దారులు, ఈదే చేపల జాడలు పాత పడేవి కాదెన్నటికీ. ఉదయించే శిశువు తొలికేక, కుసుమించే పూవు తొలిరేకుకు పాతదనం అంటు సోకదెప్పటికీ. జీవుల నాడీ స్పందనల వేడి ఎప్పటికప్పుడే అప్పటి కప్పుడు ఓ కొత్త కావ్యం సృష్టించే చేవ గలిగే కవి. గాలి ఈలపాటల, నీటి అలల పల్లవుల స్వర గతులకు పాతదనమే కొత్తదనం. కొత్తదనమే పాతదనం. ‘నూత్న యుగములు, క్రొత్త గొంతుకలు సతము/వచ్చి పోవుచు నుండు ప్రభాతములటు; మేలుకొని యుండుటే రాజ్య మేలుకొనుట!’ అన్న ఆ భీమన్న వాక్కు చాలు.. ఏది కొత్తదో.. ఏది ఎంత వరకు పాతదో నిగ్గు తేల్చుకునేందుకు.

అందని ఆకాశంలో క్షణ భంగురంగా మనలేక ఒక్క పూటైనా గొప్పగా బతికి తీపి గుర్తులు వెదజల్లాలని మెరుపులన్నీ కలిసి తపస్సు చేస్తే అవనిమీద పూలుగా అవతరించమని సృష్టికర్త వరమిచ్చాట్ట. అయినా వాటికి అసంతృప్తే. కళ్లు తెరిచీ తెరవంగానే కత్తిరించేస్తున్నారు పుటుక్కుమని. ఒక పూట బతికి రేకు బట్ట కట్టినా మరో పూటకే గాలి మృత్యువుగా మారి ఎక్కడికో ఎగరేసుకు పోతున్నది. గంభీరాకృతి కోసం అందుకే మరోసారి ఘోర తపస్సుకు పూనుకున్నాయి పూలన్నీ కలసి. అందమైన దీపాలుగా అవతరించే అవకాశం దొరికిందీ సారి. అయినా పగలు సూర్యుణ్ణి చూసి ప్రాణవాయువు లూదేస్తున్నారు పాపిష్టి జనం. సగం చావు.. సగం బతుకుతో సతమతమయ్యే బతుకు వద్దని దీపాలన్నీ కలిసి మళ్ళీ తపస్సుకి కూర్చున్నాయి. శాశ్వత జీవితం.. సమ లోక స్థాపన ఈ సారి వాటి మనోవాంచితాలు. చివరికి తపస్సు ఫలించి గ్రంథాలయాల్లో పుస్తకాలుగా చిరంజీవులయ్యాయన్న ఓ చక్కని ‘మార్పు’ తత్వం చుట్టూతా కమ్మని కవిత్వమల్లారు కవి రావి రంగారావు. ‘మార్పు’ కాలగతి అనివార్య లక్షణమైనప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలను పాత కొత్తలకు గుర్తుగా ఎంచుకోవడం ఓ కాల కొలమాన విధానం.

జ్ఞానపీఠ గ్రహీత సినారె తీర్పు ప్రకారం

‘గతమనెడు వజ్రంపు గోడల
కట్టడముపై నిట్టనిలువున
శిరసు నెత్తిన స్వర్ణమయ గో
పురము.. వర్తమానము’.
‘అంత కడవెడు పాలపై ఒ
క్కింత మీగడ పేరినట్లుగ

మిగిలేది గతము’.

కొత్త నీటిని చేర్చుకొని తర/గెత్తే నదిలాగా ఏ జాతి అయినా ముందుకు సాగినంతకాలమే బతుకు ‘మూడు పూవులు ఆరుకాయలు’.

‘ప్రతి వసంతము క్రొత్తదే, ప్రతి పిక స్వ/రమ్ము క్రొత్తదే సృష్టి ప్రారంభమాది; క్రొత్తదై ప్రతి క్షణము నీ కొరకు విరియు! ’ అన్న బోయి భీమన్నగారి ఆ ముక్తాయింపులోనే ఉంది కొత్త పాతల వివాదానికి యుక్తి యుక్తమైన ముగింపు.

మూసుకున్న కళ్లతోనైనా సరే మేలుకొని ఉంటేనే కొత్త బంగారు లోకాలకి వెళ్లే పుష్పక విమానంలో చోటు దొరికేది. ఆ విమానాగమనానికి ప్రతి సంవత్సరం మొదటి తేదీనే సుముహూర్తం. ఆ భావి బంగారు కొత్త లోకాల్లోకి ఆపాత పాత మధురానుభవాలతో సహా సాగుదాం పదండి!