కవిత్వం

బంధం

జనవరి 2015

పుట్టింది మొదలు ఘడియ ఘడియనూ
ముడిపెడుతూ జీవనదిలా సాగుతూ పోయేది
ఈ దారమే!

అవ్యక్తంగా మొదలైన జీవితానికి
అమ్మ దిష్టి పూస కట్టినా,
కంట నలుసుతీసేందుకు
వేడి ఆవిరి ముద్దయ్యే
అమ్మ కొంగైనా,
ఈ దారమే!

మెడకు చుట్టుకున్నా
ఇంకొకరి మెడకు చుట్టినా
ఈ దారమే!

గుప్పెడంత
గూట్లో
రగులుతూ వెలుగు
నింపే వత్తీ ఇదే!

***

ఇది దారమే కాదు-
తీయని బాధ కూడా!

భావాల
మధ్య పెనవేసుకునేదీ
అహంభావాల కుదుపుల్లో
నలిగి చిద్రమౌతున్నదీ కూడా ఇదే!

పోగులు పోగులై విడిపోయే
ఈజ్ఞాపకాల దారాన్ని
ఏ వూపిరితో నేసాడో కానీ,
పిగిలిపోతున్నపుడల్లా
గుండెను
కుట్టుకుంటునే వస్తోంది.

ఏ రాట్నం మీదదో
ఏ నేతగాడి చేతిదో
తెలియదు!

ఈ ప్రయాణం పొడవునా
వీలుంటే ఆపైనా,
ఘడియ ఘడియకూ
అతుకు వెయ్యాలని
ప్రయత్నిస్తూ
అతక లేక దుఃఖిస్తూ…