“స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయిట కదా.. ఓ మూలలా కూర్చొని మూలక్కపోతే ఎంచక్కా అలా పోయి ఓ సారా ముసలయ్య గారిని కలిసి రారాదా!” అని మా ఆవిడదొకటే నస. తప్పుతుందా! వెళ్ళి కలిసాను.
మనసులోని మాట పెదాల మీదకు పూర్తిగా రాకముందే పెద్దాయన చప్పట్లు కొట్టి పియ్యేని పిలిచి నన్నప్పగించేశాడు. “అయ్యగారికివాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ ముఖ్యమైతే తప్ప రిసీవరూ బౖటికి తీయరు. ఏమిటీ విషయం?” అనడిగాడా పియ్యే. ” మా వార్దు నెంబరు పదమూడుకి నిలబడదామనుకుంటున్నాను. ముసలయ్యగారి పార్టీ సహకారం కావాలి” అన్నా టూకీగా.
“మరైతే వట్టి చేతులతో వచ్చారేమిటండీ బాబూ! మీ జాతక చక్రం..సూర్యమానం ప్రకారం వేసిందొకటి..చంద్రమానంతో వేసిందొకటి తీసుకు రావాలి. గ్రహాలు, రాశులు ఏవేవి ఎప్పుడెప్పుడే ఇళ్ళల్లో వుంటాయో..వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహమూను” అన్నాడు పియ్యే.
“అయ్యా..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికీ ఇలాగే జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రాల మీద తగని పిచ్చి. ఇంతకుముందు నాటి ఎన్నికలప్పుడు ఆశావహుల్లోని బికారీ వెధవల్నీ, పొగరుపోతు గిత్తల్నీ మినహాయించి.. జాతక యోగం ఉచ్చస్థితిలో ఉందనుకున్నవాళ్ళకే టిక్కెట్లిచ్చారు మరీ వడపోసి . ముఫ్ఫైతొమ్మిది స్థానాలకు కేవలం ముష్టి తొమ్మిది మంది మాత్రమే గెలిచారింతా చేసి. గెలుపుకీ గ్రహాలకీ లింకేమిటండీ.. కావాల్సింది ప్రజాభిమానం కానీ!
“సమయానికి సరిగ్గా గుర్తు చేసారు స్వామీ! మా ముసలయ్యగారికీ జయలలితమ్మగారి కన్నా ఇలాంటి శాస్త్రాల మీద నమ్మకాలెక్కువ. మీ ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులగారొచ్చి చూస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే..మీ మొర మా పెద్దాయనాలకించేది. మొన్నీ మధ్య ఇలాగే పాపం.. ఒకాయన ఇంటికి ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని అనవసరంగా అవకాశం చేజేతులా జార్చేసుకున్నాడు.”
“ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా..ఏ శాస్త్రంలో ఉండండీ మరీ అంత విడ్డూరంగా?!”
“మందిరముంటే కాదండీ ..అందులో వినాయకుడు..ఆంజనేయుడు లాంటి భారీ శరీరులుంటేనే దుర్దశ. ఈశాన్యంలో బరువులుంటేనే కదండీ ఊహించని ఉపద్రవాలొచ్చి పడేదీ..ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు మెంబర్లై పోదామనే!” . పియ్యే వెటకారం అర్థమవుతూనే వుంది.
‘ఇండియాకి ఇన్నేసి ఉపద్రవాలెందుకొస్తున్నాయో ఇప్పుడర్థమైంది.ఈశాన్యంలో అంత లావు హిమాలయాలు పెట్టుకుని..కుంభకోణాలనీ..ద్రవ్యోల్బణమనీ..ఇరుగుపొరుగు దేశాలతో అనవసర కయ్యాలనీ..పాపం మనం మన మన్మోహను సింగు గారి యూపీయేని నిష్కారణంగా ఆడిపోసుకుంటున్నాం..’
నా ఆలోచనల్లో నేనుండంగానే భుజం గోకి మరీ అడిగాడు పియ్యేగారు “కొంపదీసి మీ ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణంవారగా లేదు కదా! అరిష్టం. ముందే చెప్పండి బాబూ..ఆనక నన్నని లాభం లేదు”
“అమెరికా శ్వేత సౌధం తలవాకిలే దక్షిణాభిముఖంగా ఉంది మహాశయా! మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా చలాయిస్తోందా..లేదా?”
“వాదనలొద్దు కానీ..వాస్తు ప్రకారం ముందు మీ కొంపను సరి చేసుకోండి. చాలు. ముసలయ్యగారి మనస్తత్వం తెలుసే వచ్చారా మీరసలు? సరే..ముందొక సారిలా వచ్చి ఈ నీళ్ళతొట్లో మీ కిష్టమైన రంగుముక్క ఏదన్నా తగలేయండి! మీ అసలు రంగేంటో బైట పడేదుకిదో చిన్న పరీక్ష!” అంటో విసుగుదలకి దిగాడా వెధవ పియ్యే.
రంగులు మారుతున్న నామొహం వంక చూసి కాస్త తగ్గాడు. ” మీ సందేహం నాకర్థమైంది లేండి. ఈ తొట్లో ఉన్నది మీరనుకున్నట్లు మామూలు జలగ కాదు సుమండీ! దక్షిణాఫ్రికానుండి తెప్పించింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల్లో ఫలితాలు ముందే చెప్పిన ఆక్టోపస్ ‘పాల్’ లేదూ..దాని తాలూకుది”
ఈ పిచ్చి కూడా వుందా నాయనా ఈ పెద్దాయనకు! పోటీలమీద బెట్లు పెంచేందుకు మాస్ మీడియా ఆడిన నాటకంరా బాబూ అది! యుద్ధాలకి ముందే నిర్వీర్యం చేసేందుకు మృత్యుగండం ఉందని..ఓడిపోవడం ఖాయమని.. జ్యోతిష్య్లల రూపంలోశత్రురాజులను భయపెట్టే గూఢచారి వ్యూహం ఇలాంటిదేరా కన్నా!’
“కంగ్రాట్సండీ..మీరీ పరీక్షలో నెగ్గేశారు.కోయంబత్తూరు నుంచీ ఒకసారా నాడీ జోస్యం కూడా తెప్పించుకుని రడీగా ఉంచుకుంటే చాలు..మీ పనైపోయినట్లే! అన్నట్లు.. ఈ లోపల నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎలా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో డాక్టర్ దివ్యజ్ఞానం గారో నివేదిక ఇస్తారు.ఇదివరకో చిన్నారావును..ఇలాగే ‘చీ..అన్నా..రావు’గా సాగదిసింతరువాతే అతగాది జాతకం తిరగబడటం మొదలైంది” అన్నాడా పియ్యే.
” దివ్యజ్ఞానం గారిని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం ఆయనది. వాజ్ పాయి, సోనియాగాంధీ, కరుణానిధీ,నెల్సన్ మండేలా, సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ నేతల నాడులు పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘాట్టిపిండం.” అంటో ఇంతలావు కవిల చుట్టొకటి నా మొహాన ఠకీమని కొట్టి లోపలికి తారుకున్నాడా పియ్యే.
చూద్దును కదా..వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాలాధారంగా చెప్పే నాడీ జోస్యం నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా నిర్దిష్టంగా ఉంటుందని డబ్బాలు. ఇరాక్ యుద్ధం, ఇందిరాగాంధీ మరణం, రజనీకాంత్ ‘బాబా’ చిత్రం, బందిపోటు వీరప్పన్ చరిత్రం, వెస్ట్ బెంగాల్ లెఫ్ట్ పార్టీల ఫేట్, దక్షిణాది సునామీ, పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి..లాంటి అతి ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ సంఘటనలెన్నో జరగకముందే.. క్షణాలతో సహా లెక్కగట్టి మరీ జోస్యం చెప్పినట్లు కోతలు. ఆ ఫైలును చదవడం సంగతలా ఉంచి..మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తి గారి కండబలం కావాల్సొచ్చేట్లుంది.
కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు..నాడీ జోస్యాల్లాంటివసలు ఆయన వంటికి పడవు. ఈ డాక్టర్ దైవజ్ఞానం ఆయన వ్యక్తిగత జీవితం లోతుల్లోకెట్లా వెళ్ళగలిగాడబ్బా! ఈ లెక్కన చూసుకుంటే.. అణు ఒప్పందం.. ఒబామా రెండోసారి విజయాల్లాంటి వాటిని గురించి చెప్పుకున్న వన్నీడబ్బాలేగా!
ఇంకాస్సేపు కనక ఇక్కడే ఉంటే..ఈ ముసలయ్యగారి పియ్యే బల్లిశాస్త్ర పరీక్ష కూడా బలవంతంగా చేసేయించవచ్చు. గ్రహణం రోజు కాబట్టి వాకిట్లో పళ్ళెంలో రోకలి నిలబెట్టమనావచ్చు.
ఎన్నికల్లో నిలబట్టానికి ఎన్ని తిప్పలురా దేవుడా? నిజంగాభవిష్యత్తులో జరగబోయేది ముందుగా ఎవరైనా చెప్పగలరా?
ఆధార్ కార్డు ఎప్పుడొస్తుందో చెప్పమనండి!గీత దాటిన శాసనసభ్యుల మీద వేటు పడే సుముహూర్తం ఎప్పుడోఎవరికైనా తెలుసా? పండించిన పంటకు మంచి రేటు పలికేదెపుడో ముందే తెలిస్తే కష్టపడైనా సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం అన్నదాత! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని ఖచ్చితంగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా రైతుకి! వాయుగుండాలు తీరం దాటే తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ నిపుణులు. సదరు శాస్త్రవేత్తలందరికీ జ్యోతిషంలో తర్ఫీదిప్పిస్తే కనక దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ తప్పించిన్నట్లవుతుంది కదా! ఏ సర్కారీ చాకిరీ ముఖాన రాసుందో ముందే చదవ గలిగితే..ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు కుస్తీపట్లు తప్పును కదా! సూపర్ సక్సెస్ ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పుతుంది కదా? రుబ్బుడుపొత్రం చిత్రాల పాలబడి నలిగే సమయం ప్రేక్షక దేవుళ్ళకీ మిగులుతుంది కదా? పసిడి ధర ఇదిగిదిగో.. పడిపోయింది.. పడిపోయింది.. గ్యాసు ధర లది గదిగో అంతర్జాతీయంగా ఎదిగిపోతోంది.. ఎగిరిపోతోందంటో పచ్చడి మెతుకులకూ తడుముకునే బడుగుజీవిని కంగారు పెట్టేసి బంగారం కొట్ల చుట్టూ.. పెట్రోలు బంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తున్నారే! ఏ అపరాల ధర ఎప్పుడు ఎంత పెరుగుతుందో.. ఏ షేరు ధర ఏ సెకన్లో ఎంత కుంగుతుందో.. ముందే కనిపెట్టేసి ఒక ఉగాది పంచాంగంలాంటిది పంచే ఏర్పాట్లు చేస్తే..ఈ పాట్లు ఉండవు కదా! దాంతాడు తెగా.. ఒక్కరూ ఆ పని చెయ్యరు సరి కదా.. తీరా తాడు తెగింతరువాత.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనీ..మేం ముందే కనిపెట్టేసాం.. అంటో..టీవీల ముందు.. కుర్చీల్లో.. చర్చలు మొదలెడతారు!
ఏ బ్రీఫ్‌కేసు కేసు సిబిఐ వాళ్ళ దృష్టిలో పడుతుందో ..ఎవరి నోటి దురుసు వల్ల గుప్త సమాచారం బట్టబయలైపోతుందో.. ముందే కనక తెలుసుకునే అవకాశం ఉండుంటే.. యువనేతలూ..గాలి మనుషులూ వ్యవహారాన్నిలా జైళ్ళ వరకూ రానిచ్చుకునే పిచ్చోళ్ళా? సియ్యేలను, ఐయ్యేయస్సులను,అమాయక అమాతుల తరహాలోనే జ్యోతిష్యులనూ, నాడీశాస్త్రజ్ఞులనూ ఇంత పచ్చిక వాసన చూపించి ఎందుకు మచ్చిక చేసుకోరూ! రెండో వాయుతరంగాల వేలంపాటల వ్యవహారం ఐతేనేమి, సిగ్గుమాలిన బొగ్గు కుంభకోణాల గోలైతేనేమి ఇన్నేళ్ళు గడిచినా చట్టసభలనెలా కుదిపేస్తున్నాయో చూస్తున్నాంగా?ఈ ఉత్పాతాలని ముందే గ్రహించి హెచ్చరించే హస్తసాముద్రికాలు కనక వుండుంటే హస్తం వారు ఎన్నికల ముందుటేడాది కోరి కోరి ఇలా తలనొప్పులు తెచ్చుకుంటారా?
లావు లావు పుస్తకాలు చదివి ఐయ్యేయస్సులు ఐపీయెస్సులూ ఐపోయే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కాస్త బల్లిశాస్త్రమో..పాదసాముద్రికమో కుడా ఔపొసన పట్టుండక పోయేవారా నిజంగా వాటికి ప్రభావమంటూ ఉండుంటే!
వాస్తవేమిటంటే వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ చిన్న నిర్మాణశాస్త్రం. గుహలనుంచి, ఆకు కుటీరాలనుంచి, మట్టి ఇళ్ళ నుంచి కాంక్రీటు కట్టడాల దాకా ఎదిగిన మనం ఇంకా ఆ పాత పురాణాలనే పారాయణం చేస్తామంటే ఏమనుకోవాలి?చాదస్తమనుకోవాలి. వాటి ప్రకారం నగరాల్లో కాని నిజంగా నిర్మాణాలు సాగిస్తే పక్కవాడింటి మురుగునీరు మన పడకటీంట్లోకే నేరుగా పారేది. ఇంటికీ..ఇంట్లో వాళ్ళ వంటికీ లంకె పెట్టడం విడ్డూరం కాదా?మయామాతా, వరాహ మిహిరుడు, మానసారుడు..ఎవరి వాస్తు వాళ్ళదే. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహొపాధ్యాయుడిగా కీర్తి గడించారు.సురవరం సుధాకర రెడ్డి గారు 2004ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి ఎం.పీగా ఎన్నికయ్యారు! నాడీ శాస్త్రం వేదవిజ్ఞానమా? నాలుగో శతాబ్దందాకా వేదాలలో వాస్తు ఊసే లేదు. నాలుగు వేదాలలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు సంఖ్యాశాస్త్రం. 89లో పుట్టిన పాపానికే హిట్లరు 45లో నియంతగా పోయాడని జోస్యం. అదే ఏడాది పుట్టిన నెహ్రూజీ మరి 64 దాకా ఉండి శాంతిదూతగా ఎలా ఖ్యాతి గడించారో? మనకు వస్త్రలాభమని.. వాహన యోగమని.. కలహకారణమని.. కళ్యాణ ప్రాప్తి అని.. గోడమీద పురుగు లేరుకు తినే బల్లులకెలా ముందే తెలుసో?!’
చేత్తో ఏదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు పియ్యే. చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం అది గుమ్మం ముందు కూర్చునుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తుట!
ఇంకా ఇలాగే ఏవేవో చాలా శాస్త్రాలు చెప్పకొచ్చే ఉత్సాహంలో ఉన్నాడు కానీ.. నా మనోసిధ్ధి అప్పటికే పూర్తిగా మారి పోయింది. గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసా.
జరిగింది పుర్తిగా వినకుండానే మా ఆవిడ తగులుకుంది “అష్టమి.. మంగళవారం..అమావాస్య. బయలుదేరిందేమో రాహుకాలంలో..సరిగ్గా మరీ వర్జ్యం చూసుకుని! ఎదురుగా పిల్లొస్తుంది.. కాస్త కూర్చుని నెత్తి మీదిన్ని నీళ్ళు చల్లుకుని పోవయ్యా మగడా! అన్నా.. విన్నావా! పొద్దున బల్లి భుజం మీద పడ్డప్పుడే అనుకున్నాలే..ఇవాళేదో ముదనష్టం జరగబోతుందని..”అంటో. శాస్త్రపరీక్షలకూ, నివేదికలకూ,మూడుకాళ్ళ కప్పలాంటి దిష్టిబొమ్మలు గట్రాలకు ముసలయ్య గారి మనిషి నా దగ్గర పళ్ళూడగొట్టి వసూలు చేసిన అక్షరాలా అర్థపదివేల నూటపదహార్లను గురించే ఆవిడ సెటైర్లు.
“డబ్బు పోతే పోయింది..చక్కటి ఆదాయ మార్గం దొరికింది. ఆ వార్డు మెంబరుషిప్పూ పాడూ మనకొద్దు కానీ..ఇంచక్కా నువ్వూ ఓ చైనా వాస్తు బొమ్మలు అమ్మే దుకాణం మొదలెట్టు” అందావిడే మర్నాడు కాస్త వాతావరణం చల్లబడి మెదడు మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాత!
**** (*) ****
ఈ పిచ్చి ఇప్పుడు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకీ పట్టుకుంది. ఖర్మ.500 గడప దాటిన ఊళ్ళకి వాస్తు వర్తించదట. నగరాలకే వాస్తు దోేషాలోమిటో ?తిలక్ గారు ప్రార్థించినట్లు – దేవుడా రక్షించు మా రాష్ట్రాలని వాస్తు శాస్త్ర జ్ఞులనుంచి అని ప్రార్థించుకోవాలేమో?